చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
Advertisement

మారుతున్న జీవన శైలి, వాతావరణ కాలుష్యం, ఇతర కారణాల వల్ల ఇటీవలి కాలంలో చర్మ సమస్యలు విజృంభిస్తున్నాయి. రకరకాల సమస్యలు, వ్యాధుల నుంచి ఏకంగా చర్మ కేన్సర్ వరకూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి, శరీర ఉష్ణోగ్రత సమంగా ఉండటానికి, శరీరాన్ని బయటి సమస్యల నుంచి రక్షించడానికి తోడ్పడేది చర్మమే. మరి అలాంటి చర్మం పనితీరు, దానికి వచ్చే సమస్యలు, వ్యాధులు, రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను తెలుసుకుందాం..

శరీరానికి రక్షణ ఇచ్చేది చర్మమే

 వాస్తవానికి చర్మం మన శరీరాన్ని పూర్తిగా కప్పి ఉండి నిరంతరం రక్షిస్తుండే రక్షణ కవచం. అలాంటి మన శరీరంలో అతి పెద్ద అవయవం కూడా చర్మమే. ఇది జుట్టు, గోళ్లు, గ్రంథులు, నరాలగ్రహకాలతో కూడిన సమీకృత వ్యవస్థ. ఒక యుక్త వయసు వ్యక్తి శరీరం మీద ఉండే మొత్తం చర్మం బరువు 2.7 కిలోలు. ఇది సుమారు 1.7 చదరపు మీటర్ల మేర విస్తరించి ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వియా హెల్త్‌ సిస్టం శాస్త్రవేత్తలు నిర్ధారించారు. చర్మంపై పొరలో ఉండే కణజాలం ఎప్పటికప్పుడు కొత్తగా మారుతుంటుంది. దాదాపు 27 రోజుల కోసారి చర్మం పైపొర కొత్త కణజాలం ఏర్పడుతుందని అమెరికాలోని క్లీవ్ క్లినిక్ వైద్య నిపుణులు వెల్లడించారు.

చర్మం పనేంటి?.. ఎలా పనిచేస్తుంది?

శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే చర్మం.. శరీరంలోకి నీటిని చొచ్చుకు పోనివ్వకుండా వాటర్‌ ప్రూఫ్ గా పనిచేస్తుంది. అలాగే ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. చర్మంలో కెరాటిన్, ఫైబ్రొస్ ప్రొటిన్, లిపిడ్స్, ఇతర ఖనిజాలు, రసాయనాలు చర్మంపై ఉండటం వల్ల ఇది వాటర్‌ ప్రూఫ్ లా పనిచేస్తుందని అమెరికాకు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ తెలిపింది.శరీరంలోని వ్యర్థాలను, అదనంగా ఉండే లవణాలను చర్మం విసర్జిస్తుంది. రక్తం చర్మం ద్వారా ప్రవహించినప్పుడు చర్మంలోని గ్రంధులు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. 

చర్మంలోని మెలనిన్, కెరోటిన్ లే రంగుకు కారణం..

 మెలానిన్, కెరోటిన్, హిమోగ్లోబిన్‌ ల కారణంగా చర్మానికి, వెంట్రుకలకు రంగు వస్తుంది. చర్మంలోని పైపొరలో మెలనిన్ ఉంటుంది. ఇది ఎంత ఎక్కువగా ఉత్పత్తి అయితే.. చర్మం రంగు అంత నల్లగా ఉంటుంది. తక్కువగా ఉత్పత్తి అయితే చర్మం తెల్లగా ఉంటుంది. కొందరి చర్మంలో మెలనిన్, కెరోటిన్ లు పూర్తిగా ఉత్పత్తి కావు అందువల్ల వారి చర్మం, వెంట్రుకలు పూర్తి తెల్లగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితినే ఆల్బినిజం అంటారు. దీనికితో బాధపడుతున్న వ్యక్తులను ఆల్బిడోలుగా పిలుస్తుంటారు.

చర్మం మూడు పొరలను కలిగి ఉంటుంది..

1. బాహ్య చర్మం (ఎపిడెర్మిస్)2. మధ్య చర్మం (డెర్మిస్)3. అంత: చర్మం (హైపో డెర్మిస్)

ఎపిడెర్మిస్.. (పైపొర)

ఎపిడెర్మిస్ అనేది చర్మంలో అన్నింటికన్నా పైన ఉండే పొర. మిల్లీమీటర్లో పదోవంతు మందంగా ఉండే ఈ పొరలో రక్తనాళాలు, గ్రంథులు వంటివేవీ ఉండవు. 40 నుంచి 50 వరసల్లో కెరాటినోసైట్లు అనే కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కెరాటినోసైట్లు కేరాటిన్ ప్రొటీన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఒక పీచులా ఉండే వాటర్ ప్రూఫ్ ప్రోటీన్. గోళ్లు, వెంట్రుకల్లోనూ ఈ ప్రొటీన్ ఉంటుంది. ఇక ఎపిడెర్మిస్ లో మెలానోసైట్ కణాలు కూడా ఉంటాయి. ఇవి మెలనిన్ అనే ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తాయి. మన చర్మానికి రంగు వచ్చేది ఈ మెలనిన్ తోనే. చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉంటే చర్మం నల్లగా ఉంటుంది. మెలనిన్ తక్కువగా ఉంటే.. తెల్లగా ఉంటుంది.

డెర్మిస్.. (మధ్య చర్మం)

చర్మంలో ఎపిడెర్మిస్ పొర కింద ఉండే పొరను డెర్మిస్ అంటే మధ్య చర్మంగా పిలుస్తారు. ఇందులో మళ్లీ రెండు ఉప పొరలు ఉంటాయి. వీటిల్లో ఒకటి వదులు కణజాలంతో, మరొకటి బిగుతుగా ఉండే కణజాలంతో ఉంటుంది. ఈ రెండు పొరలకు కూడా సాగే లక్షణం ఉంటుంది. మన చర్మానికి రక్తం సరఫరా అయ్యే నాళాలు, స్పర్శను గ్రహించే నాడుల చివర్లు ఈ పొరల్లోనే ఉంటాయి. చెమటను గ్రహించే గ్రంధులు, ఆయిల్ గ్రంధులు, వెంట్రుకల కుదుళ్లు వంటివన్నీ ఈ పొరల్లోనే ఉంటాయి.

హైపో డెర్మిస్.. (చర్మం కింది పొర)

చర్మంలో అన్నింటికన్నా కింద ఉండే పొరను హైపో డెర్మిస్ అంటాం. మన చర్మానికి బలాన్ని, ఆధారాన్ని ఇచ్చేది ఇదే. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొవ్వు పొర. ఈ పొరలో చర్మానికి రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్త నాళాలు, శోషరస నాళాలు, ఉంటాయి. బయట చల్లగా ఉన్నప్పుడు శరీరంలో లోపలి వేడి బయటికి వెళ్లకుండా.. బయట వేడిగా ఉన్నప్పుడు ఆ వేడి శరీరంలోపలికి ప్రసరించకుండా.. ఈ కొవ్వు పొర ఒక ఇన్సులేషన్ గా పనిచేస్తుంది. అంతేకాదు.. మన చర్మం ముడుతలు పడకుండా నున్నగా ఉండడానికి కారణం కూడా ఈ హైపో డెర్మిస్ పొరే. మన వయసు పెరిగిన కొద్దీ చర్మం కింద కొవ్వు నిల్వ ఉండకుండా తగ్గిపోయి చర్మం ముడుతలు పడుతుంటుంది.

జాగ్రత్త పడకుంటే ఎన్నో వ్యాధులు..

 ఇటీవలి కాలంలో చర్మ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా మంది మొటిమలు, మచ్చలు, పులిపీర్లు, చర్మం నల్లబడడం, కమిలిపోవడం, పొడిబారి పొలుసులుగా రాలిపోవడం, చర్మంపై తీవ్రంగా పగుళ్లు వంటి సాధారణ సమస్యలకు తోడు సొరియాసిస్, బొల్లి, టినియా వర్సికలర్, చర్మ కేన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మారుతున్న జీవన శైలి, కాలుష్యం, జన్యుపరమైన సమస్యలు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మ జీవులు, అతినీలలోహిత కిరణాలు, రేడియేషన్ కు గురికావడం వంటివి చర్మ సమస్యలు, వ్యాధులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా యువత అయితే మొటిమలు, మచ్చలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి సులువుగా బయటపడొచ్చు.

పులిపీర్లు (వాట్స్)

సాధారణంగా చాలా మందికి పులిపీర్లు ఉంటాయి. వైరల్ ఇన్ ఫెక్షన్లు, పలు ఇతర కారణాల వల్ల పులిపీర్లు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎక్కువగా చేతులు, కాళ్ల మీద చిన్న మొటిమలాగా ఏర్పడతాయి. తరువాత కొంత పెద్దగా మారుతాయి. ఇందులోనూ పాపిలోమా వైరల్ ఇన్ ఫెక్షన్ తో వచ్చే ఈ పులిపీర్లు పెరిగే కొద్ది రక్త నాళాలపై ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గజ్జి..

దీన్ని డెర్మటైటిస్ అని కూడా అంటారు. ఇది వేళ్ల మధ్య, కాళ్లు, చేతుల మూలల్లో ఎక్కువగా వస్తుంటుంది. ఇది వైరస్ వల్ల వస్తుంది. ఒకరినుంచి మరొకరికి వ్యాప్తి చెందే అంటువ్యాధి. వైద్యుల సలహా మేరకు తగిన మందులు వాడితే త్వరగా తగ్గిపోతుంది.

మొటిమలు

 ఇది సాధారణంగా అందరిలో కనిపించే సమస్య. యుక్త వయసు అమ్మాయిలు, అబ్బాయిల్లో మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇవి వస్తుంటాయి. ముఖంపై, ఛాతీ మీద, వీపు మీద మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువ.

బొల్లి

 ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న చర్మ వ్యాధుల్లో బొల్లి ఒకటి. ఈ వ్యాధి సొకితే చర్మానికి రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. దానివల్ల చర్మం రంగు మారిపోతుంది. వ్యాధి సోకిన చోట చర్మం పూర్తి తెల్లగా.. మిగతా చోట్ల సాధారణ రంగులో ఉంటుంది. ఈ వ్యాధి రోగ నిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. చర్మ కణాలు పనిచేయకుండా చేయడంతోపాటు వాటి మరణానికి కారణం అవుతుంది. లైట్  ట్రీట్ మెంట్ (కాంతి చికిత్స) ద్వారా బొల్లి సమస్యను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

సొరియాసిస్..

 ఇది కూడా ఒక రకమైన చర్మ వ్యాధి. మోకాళ్లు, మోచేతులు వంటి చోట్ల ఎక్కువగా వస్తుంటుంది. వ్యాధి సోకిన ప్రాంతాల్లో చర్మం ఎర్రగా మారడం, మంట పుట్టడం వంటి లక్షణాలు ఉంటాయి. దాదాపు మూడు శాతం మంది ప్రజలు సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు అంచనా.

మచ్చలు..

మచ్చలు ప్రతి ఒక్కరి శరీరంపై ఉంటాయి. పరిమాణంలో తేాడాలు, ఎరుపు, నలుపు, గోధుమ రంగులలో ఉంటాయి. చాలా వరకు మచ్చలు ఆవ గింజంతా పరిమాణం నుంచి నాలుగైదు సెంటీమీటర్లంత పెద్దగా కూడా  ఉంటాయి. కొంత మందిలో పుట్టుకతోనే మచ్చలు పెద్దగా ఉంటాయి. అయితే చిన్న పరిమాణంలో ఉన్న మచ్చలు క్రమేపీ పెద్దగా మారుతుండటం, అవి రంగు మారుతుంతడడం, నొప్పిగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే మాత్రం ఏదైనా సమస్య తలెత్తుతున్నట్టు భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

పంజా విసురుతున్న చర్మ కేన్సర్లు..

 ఇటీవలి కాలంలో చర్మ కేన్సర్లతో బాధపడుతున్నవారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం, అతినీలలోహిత కిరణాల ప్రభావానికి గురికావడం, సరైన పరిశుభ్రత పాటించకపోవడం, రేడియేషన్ వంటి కారణాల వల్ల చర్మ కేన్సర్లు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు తమ జీవిత కాలంలో సాధారణ చర్మ కేన్సర్ వ్యాధి బారిన పడుతున్నట్టు అంచనా. ముఖ్యంగా తెల్లని చర్మం ఉన్న వారు సూర్యరశ్మి ప్రభావానికి ఎక్కువగా లోనవుతారని.. తద్వారా కేన్సర్ ప్రమాదం పెరుగుతుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ (ఏఏడీ) వెల్లడించింది. అమెరికాలో అయితే ప్రతి ఐదుగురిలో ఒకరు సాధారణ చర్మ కేన్సర్ బారిన పడుతున్నారని తెలిపింది. చర్మ కేన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తించినట్లైతే దాదాపు 98 శాతం వరకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయొచ్చని స్పష్టం చేసింది.1. అక్టీనిక్ కెరాటోసిస్ (ఏకే)2. బేసల్ సెల్ కార్సినోమా (బీసీసీ)

3. స్వ్కామోస్ సెల్ కార్సొనోమా (ఎస్ సీసీ) 

దీన్నే పొలుసుల కేన్సర్ అని అంటారు. శరీరంపై ఎక్కడ పడితే అక్కడ ఈ తరహా కేన్సర్ వస్తుంది. చిన్న మొటిమ రూపంలో మొదలై శరీరం లోపలి వరకు వ్యాపిస్తుంది.

4. మెలానోమా కేన్సర్

స్కిన్ కేన్సర్ నిర్ధారణ, పరీక్షలు..

చర్మానికి కేన్సర్ ను నిర్ధారించడంలో మొదటి పని వైద్య పరీక్షలు చేయించుకోవడం. శరీరంపై ఉండే మచ్చల పరిమాణం, రంగులో తేడాను అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అత్యంత ప్రమాదకరమైన మెలానోమా కేన్సర్ ను గుర్తించడానికి వైద్యులు ‘ఏబీసీడీఈ’ పద్ధతిని కనిపెట్టారు.మన చర్మంపై ఈ రకమైన సమస్యలు కనబడితే అది కేన్సర్ అయి ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మచ్చలు నొప్పిగా ఉండడం కూడా కేన్సర్ లక్షణమే. అయితే ఈ సమస్యలు కేవలం కేన్సర్ లక్షణాలు మాత్రమే కాదు. పలు ఇతర కారణాల వల్ల కూడా.. ఈ తరహా సమస్యలు వస్తాయి. అందువల్ల వైద్యులను సంప్రదించి.. తగిన వైద్య పరీక్షలు చేయించుకుని.. సమస్య ఏమిటనేది నిర్ధారించుకోవడం మంచిది.

చర్మ కేన్సర్లకు పలు రకాల చికిత్సలివీ..

ఫస్ట్ స్టేజ్ కేన్సర్లు, మెలనోమా కాని కేన్సర్లకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయొచ్చని మేయో క్లినిక్ వైద్యులు చెబుతున్నారు. అయితే చర్మంపై ఉన్న గాయాలు, వాటి పరిమాణం, లోతు, వాటి స్థానం ఆధారంగా శస్త్రచికిత్సను నిర్వహిస్తారు.
Thu, Mar 29, 2018, 05:06 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View