ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
Advertisement

ఏదో ఒక కొత్త తరహా యాప్ వస్తుంటుంది. మనం ఇన్ స్టాల్ చేస్తూ వెళుతుంటాం. దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. ఫోన్ పనితీరు దెబ్బతినడంతోపాటు మన వ్యక్తిగత అంశాలూ ప్రమాదంలో పడతాయి. మన బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డుల వివరాలు వంటివీ పరుల పాలయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల కొన్ని రకాల యాప్ లకు దూరంగా ఉండడమే ఉత్తమం. గూగుల్ ప్లేస్టోర్ లో రోజూ కొన్ని వేల సంఖ్యలో కొత్త యాప్ లు పుట్టుకొస్తున్నాయి. అందువల్ల అన్నింటినీ గూగుల్ సంస్థ ట్రాక్ చేయలేదు. ఒక వేళ వినియోగించాల్సి వచ్చినా.. కాస్త పేరున్న, రక్షణపరంగా ఉత్తమమైనవిగా రేటింగ్ ఉన్న వాటిని ఇన్ స్టాల్ చేసుకోవడం బెటర్. మరి ఎలాంటి యాప్ లతో ప్రమాదం, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో చూద్దాం...

వాతావరణ (వెదర్) వివరాల యాప్స్ తో ప్రమాదం

 ఉష్ణోగ్రతలు, వర్షం పడే అవకాశాలు, గాలిలో తేమ వంటి వివరాలు కచ్చితంగా అందిస్తామంటూ చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రఖ్యాత యాప్ లు మినహా మిగతావన్నీ ఫోన్ పనితీరును దెబ్బతీసేవేనని, వాటితో భద్రతకూ ముప్పు ఉంటుందని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా రకాల యాప్స్ లో అంతర్గతంగా ట్రోజాన్లు అనే వైరస్ లు ఉంటున్నాయి. మనం యాప్ ను ఇన్ స్టాల్ చేసేటప్పుడే లొకేషన్, మెస్సెజెస్, కాల్ లాగ్ డేటా వంటి చాలా రకాల పర్మిషన్లు అడుగుతుంటాయి. మనం పర్మిషన్ ఇచ్చేయడంతో.. అవి డేటాను సేకరిస్తూ, హ్యాకర్లకు చేరవేస్తుంటాయి. అందువల్ల మనకు అంతగా వాతావరణ వివరాలు తెలుసుకోవాలనుకుంటే నేరుగా ఫోన్ లోని ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్ లో సులువుగా తెలుసుకునే అవకాశం ఉంది. 

సోషల్ మీడియా యాప్స్ తో ఫోన్ స్లో

 ఇప్పుడంతా ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ట్వీటర్ వంటి ఎన్నో సోషల్ మీడియా అకౌంట్లను వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఫోన్లో వాటన్నింటి యాప్స్ ను ఇన్ స్టాల్ చేస్తూ ఉంటాం. అయితే ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ తో భద్రతా పరమైన ప్రమాదం పెద్దగా లేకపోయినా.. వాటి వల్ల ఇతర సమస్యలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్ వంటి యాప్స్ చాలా ఎక్కువ మెమరీని వినియోగించుకుంటూ, ఎక్కువ మొత్తంలో బ్యాటరీని వినియోగించుకుంటూ ఉంటాయి. సోషల్ మీడియా యాప్స్ నిరంతరం బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ.. ఇంటర్నెట్ కు కనెక్ట్ అవుతూ.. డేటా సింక్రనైజేషన్ కు ప్రయత్నిస్తాయి. దీనివల్ల ఫోన్ బాగా స్లో అవుతుంది. తక్కువ ప్రాసెసర్, ర్యామ్ సామర్థ్యమున్న ఫోన్లు అయితే వీటి వల్ల తరచూ ల్యాగ్ అవుతూ ఉంటాయి కూడా.

ఫోన్ ఆప్టిమైజర్ యాప్ లు దండగ

స్మార్ట్ ఫోన్ లో జంక్ ఫైల్స్ ను, అనవసరపు డేటాను, బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్ లను తొలగించి.. ఫోన్ లో మెమరీని ఫ్రీ చేస్తామని, వేగంగా పనిచేసేలా చేస్తామని పేర్కొంటూ ఎన్నో రకాల యాప్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాస్తవంగా చెప్పాలంటే అలాంటి యాప్ ల వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. పైగా ఫోన్ స్లో అవడంతో పాటు మన వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఎక్కువ. అంతేగాకుండా వాటి వల్ల అనవసరపు యాడ్స్ ను భరించాల్సి ఉంటుంది. 

స్మార్ట్ ఫోన్ లో ఇన్ బిల్ట్ గా వచ్చే బ్రౌజర్లతో సమస్యలు

 మనం స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసినప్పుడు ఇన్ బిల్ట్ గా ఇంటర్నెట్ బ్రౌజర్లు వస్తుంటాయి. అవి చాలా వరకు పాపులర్ కాకపోవడంతోపాటు చాలా స్లోగా పనిచేస్తుంటాయి. ఫోన్ లో ఏదైనా ఇంటర్నెట్ లింక్ ను క్లిక్ చేయగానే దాదాపుగా ఇన్ బిల్ట్ గా వచ్చిన బ్రౌజర్ లో ఓపెన్ అయ్యేలా సెట్టింగ్ ఉంటుంది. అయితే ఏ బ్రౌజర్ తో ఓపెన్ చేయాలనే ఆప్షన్ కూడా వస్తుంటుంది. అందువల్ల సెట్టింగ్స్ లో డీఫాల్ట్ ఇంటర్నెట్ బ్రౌజర్ ను మార్చుకుంటే బెటర్.

పేరులేని సంస్థల యాంటీ వైరస్ లతో ప్రమాదం

 మన స్మార్ట్ ఫోన్ ను వైరస్ లు, ట్రోజాన్లు, మాల్ వేర్ల నుంచి రక్షించుకునేందుకు యాంటీ వైరస్ యాప్ లను ఇన్ స్టాల్ చేస్తూ ఉంటాం. గూగుల్ ప్లే స్టోర్ లో కొన్ని వందల రకాల యాంటీ వైరస్ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు ఊరూ పేరులేని సంస్థలకు చెందిన యాప్ లే. ఆకర్షణీయమైన లోగోలు, పేర్లతో ఉండే ఈ యాంటీ వైరస్ యాప్ లతో ప్రమాదం చాలా ఎక్కువ. అలాంటి వాటిల్లో ట్రోజాన్లు ఉంటాయి. అవి మన ఫోన్ లోని సమాచారాన్ని, వ్యక్తిగత డేటాను తస్కరిస్తాయి. కొందరు హ్యాకర్లు ఆకర్షణీయమైన పేర్లతో, లోగోలతో యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్లను తయారు చేసి.. గూగుల్ ప్లేస్టోర్ లో పెడుతున్నారు. వాటిని డౌన్లోడ్ చేసుకున్నారో అంతే సంగతి.

అదనపు సౌకర్యాలున్న ఇంటర్నెట్ బ్రౌజర్లతో జాగ్రత్త

 కేవలం ఇంటర్నెట్ ను బ్రౌజ్ చేయడంతోపాటు వీడియోలు, ఆడియోను నేరుగా స్ట్రీమ్ చేయడం వంటి అదనపు సౌకర్యాలున్న ఇంటర్నెట్ బ్రౌజర్లతో చాలా సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి యాప్ లకు మన ఫోన్ కు సంబంధించిన చాలా పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల ఈ యాప్ ల ద్వారా కీలకమైన వ్యక్తిగత డేటా, కాల్ డేటా, ఎస్సెమ్మెస్ లు వంటి సమాచారం చోరీకి గురయ్యే అవకాశం ఎక్కువ. దీనితోపాటు ఇలాంటి యాప్ లలో విపరీతంగా యాడ్స్ వస్తుంటాయి. దాని వల్ల మన డేటా వేస్ట్ కావడమే కాకుండా.. ఫోన్ చాలా స్లో అవుతూ ఉంటుంది.

ర్యామ్ ఇంప్రూవ్ మెంట్ యాప్స్ తో లాభం సున్నా..

 మీ ఫోన్ లో ర్యామ్ ను పెంచుతామంటూ కొన్ని రకాల యాప్స్ గూగుల్ ప్లేస్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. వేరే ఇతర యాప్ లను ఉపయోగించినప్పుడు, వెబ్సైట్లు బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి యాప్ లకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తూ.. ఇన్ స్టాల్ చేసుకునేలా ఊరిస్తుంటాయి. వాస్తవానికి ఇలాంటి యాప్ లు కేవలం ఆప్టిమైజర్లు మాత్రమే. అవి ఫోన్ లో క్యాచీని, ఇతర తాత్కాలిక ఫైళ్లను క్లీన్ చేస్తాయంతే. అంతేతప్ప వాటితో ఫోన్ లో ర్యామ్ పెరగడం వంటివేవీ ఉండవు. అసలు ఫోన్ లో ఇచ్చిన ర్యామ్ కు మించి సామర్థ్యాన్ని పొందడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఇలాంటి యాప్స్ కేవలం యాడ్స్ (ప్రకటనల) ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి, మన ఫోన్ లోని డేటాను తస్కరించడానికి మాత్రమే తయారు చేస్తుంటారు.

లై డిటెక్టర్లు పనిచేయవు.. అవి జస్ట్ ఫర్ ఫన్

 మన వాయిస్ ను బట్టి మనం నిజం చెబుతున్నామో, అబద్ధం చెబుతున్నామో చెప్పగలమంటూ గూగుల్ ప్లేస్టోర్ లో కొన్ని రకాల యాప్స్ ఉన్నాయి. అవేవీ వాస్తవానికి లై డిటెక్టర్ గా పని చేయలేవు. కేవలం సరదా కోసం రూపొందించేవి మాత్రమే. ఇది తెలిసి కూడా కొందరు సరదాగా అలాంటి యాప్స్ ఇన్ స్టాల్ చేస్తుంటారు. వీటివల్ల సరదా ఏమోగానీ మన ఫోన్ పనితీరు దెబ్బతింటుంది.
Fri, Mar 16, 2018, 05:04 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View