అప్పుల నుంచి ముందుగా బయటపడడం ఎలా?
Advertisement

ఒకప్పుడు అప్పు తీసుకోవడం అంటే అది అత్యవసర పరిస్థితి! తినడానికి లేకపోయినా ఒక పూట తిని సర్దుకునేవారు తప్పిస్తే అప్పు తీసుకునేందుకు సాహసం చేసేవారు కాదు. కానీ, నేడు అప్పు తీసుకోవడం చాలా సాధారణమైపోయింది. పైగా అది అవసరమా? కాదా? అన్న విచక్షణ కూడా ఉండడం లేదు. ఆర్థిక శాస్త్రం ప్రకారం అప్పు చేసి పప్పు కూడు ఎప్పుడూ హానికరమే. అందుకే అప్పుల నుంచి బయపడడం ఎలా అన్నది తెలుసుకుందాం.


అప్పు తీసుకునే అవసరం నిజానికి లేకపోయినా, దాన్ని నివారించే అవకాశం ఉన్నా... సిింపుల్ గా రుణం తీసేసుకుంటున్నారు. కానీ, వీలైనంత వరకు రుణానికి దూరంగా ఉండాలన్నది నిపుణుల సలహా. అత్యవసర పరిస్థితి ఎదురై, చివరికి ఏ అవకాశం లేని పరిస్థితుల్లోనే రుణమార్గంలో వెళ్లాలని సూచిస్తున్నారు.

రుణం ఎందుకు?
రుణం తీసుకునే వారిని మూడు రకాలుగా పేర్కొంటారు. అత్యవసర పరిస్థితులలో తీసుకునే వారు ఒక రకం. అవసరం లేకపోయినా గొప్పతనం చూపించుకునేందుకు అప్పు తీసుకునే వారు రెండో రకం. ఇక మూడో వర్గం వారు సంపన్నులు. లాభం పొందేందుకే ఈ ఉన్నత వర్గం వారు రుణం తీసుకుంటుంటారు. రుణాలను పెట్టుబడులుగా పెట్టి అధిక లాభాన్ని పొందుతుంటారు. అంటే రుణంపై చెల్లించే వడ్డీ కంటే దాన్ని పెట్టుబడిగా పెట్టి పొందే లాభం అధికంగా ఉంటుంది. దీంతో వడ్డీ పోను నికరంగా లాభపడతారు. అందుకే ఉన్నత వర్గం వారు తీసుకునే రుణాలు వారికి ఎప్పుడూ ఉపయోగకరంగానే ఉంటాయి. వీరిని, అత్యవసరాల్లో తీసుకునే వారిని మినహాయిస్తే విలాసాల కోసం రుణం తీసుకునే వారే ప్రమాదంలో పడుతుంటారు.

representational imageరుణ భారం తీరేదెలా?
రుణం నుంచి బయటపడాలంటే  దాన్ని చెల్లించడమే! ఎగ్గొటడ్డం కాదు. రుణ వాయిదాలను నెలనెలా ఈఎంఐగా చెల్లిస్తుంటారు. మరి తొందరగా తీరిపోవాలంటే వాయిదా మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. దాంతో నిర్ణీత గడువు కంటే ముందే రుణం తీరిపోతుంది. ప్రతీ నెలా రూ.8,000 చెల్లించాల్సి ఉంటే... సాధ్యమైనంత వరకు దానికి అదనంగా చెల్లిస్తూ వెళ్లాలి. ఇలా చెల్లించేందుకు అదనపు నిధులు లేవనుకోండి. అప్పుడు పొదుపును పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ప్రతీ నెలా ముందుగా రుణ వాయిదాలు చెల్లించిన తర్వాతే ఖర్చులు మొదలు పెడితే ఇది సులభమే అవుతుంది. ఉదాహరణకు నెల వేతనం రూ25వేలు, ఖర్చు 20,000 ఉందనుకోండి. రుణ వాయిదా రూ.5వేలు చెల్లిస్తుంటే, ఇకపై వేతనం వచ్చిన వెంటనే ముందు రూ.8,000 రుణ వాయిదాగా చెల్లించేయాలి. ఆ తర్వాత 17,000లోనే సర్దుకోవాలి. ఇందుకోసం ఖర్చు చేసే అలవాట్లలోమార్పులు చేసుకోవాలి. వస్తున్న వేతనంలో ఖర్చులు, రుణాల చెల్లింపులు ఏవైనా గానీ 75 శాతం లోపునకు పరిమితి చేసుకునేవారు ఎప్పుడూ సమస్యల్లో చిక్కుకోరని నిపుణుల విశ్లేషణ.

రెండు రుణాలు తీసుకుని ఉన్నారనుకోండి. అప్పుడు వడ్డీ రేటు ఎక్కువ పడుతున్న రుణాన్ని తీర్చివేయాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డుపై రుణం తీసుకుని ఉంటే పర్సనల్ లోన్ తీసుకుని అయినా దాన్ని తీర్చేయాలి. ఎందుకంటే క్రెడిట్ కార్డుపై వడ్డీ రేటు 30 శాతానికిపైనే ఉంటుంది. పర్సనల్ లోన్ అయితే, 14 శాతం వడ్డీ రేటుకే వస్తుంది. పర్సనల్ లోన్ అనే కాదు, తక్కువ వడ్డీకి తెలిసిన వారి దగ్గర రుణం లభించినా తీసుకుని అధిక వడ్డీ రుణాలను వదిలించుకోవాలి. లేదంటే మీ దగ్గర బంగారం ఉండుంటే దాన్ని విక్రయించి అయినా రుణాలు తీర్చేయాలి. ఒకవేళ ఆ ఆభరణాలతో విడదీయరాని అనుబంధం ఉంటే వాటిని తనఖాగా పెట్టి సన్నిహితుల వద్ద రూపాయి వడ్డీకి రుణాలు పొందే అవకాశం ఉంటే దాన్ని వినియోగించుకుని అధిక వడ్డీతో కూడిన రుణాలు తీర్చేయాలి. వాస్తవానికి ఇక్కడ రుణం నుంచి విముక్తం కావడంపై మాట్లాడుకుంటున్నాం. కానీ, రుణం తీర్చేందుకు మరో రుణం ప్రస్తావన తేవడంపై సందేహం కలగొచ్చు. కానీ, వీలుంటే సాధ్యమైనంత వరకూ మరో రుణం తీసుకోకుండా ఇప్పుడున్న రుణభారాన్ని దించేసుకుంటే మంచిదే. ఖర్చులు తగ్గించుకుని, రుణ చెల్లింపులు పెంచుకోలేని వారు, అధిక రుణ భారం తప్పించుకునేందుకే తక్కువ వడ్డీ రేటుతో వచ్చే మరో రుణం తీసుకోవచ్చన్నది నిపుణుల సూచన.

representational imageపెట్టుబడులు సైతం
కొందరు ఒకవైపు భారీగా రుణభారంలో ఉన్నప్పటికీ మరోవైపు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్టీపై పెట్టుబడులు పెడుతుంటారు. కొందరైతే అప్పు చేసి మరీ పెట్టుబడులకు మళ్లిస్తుంటారు. అయితే, ప్రతీ నెలా చెల్లించగల పరిమితిలోపే రుణం తీసుకుని ఉంటే ఇటువంటివి ఏవీ అడ్డంకులు కావు. కానీ, భారీగా రుణ భారంలో ఉన్న వారు వాటిని చెల్లించకుండా పెట్టుబడులకు నిధులు మళ్లించడం సరికాదు. పైగా రుణంతో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక రాబడులు అందుకోవడం సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు. అందుకే అధిక రుణ భారంలో ఉన్న వారు పెట్టుబడులు తగ్గించుకుని రుణ చెల్లింపులు పెంచుకోవాలి. ఇక మీ దగ్గర ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉండుంటే వాటిని రద్దు చేసి రుణం చెల్లించేయవచ్చు. లేదా జీవిత బీమా పాలసీ ఉంటే దానిపై రూపాయి కంటే తక్కువకే రుణ సదుపాయం ఉంది.

చెడు తిండి అలవాట్లతో బరువు పెరిగిపోతారు. అలాగే, నగదు నిర్వహణ సరిగ్గా నిర్వహించడం తెలియని వారు అప్పుల్లో చిక్కుకుంటారు. బరువు తగ్గాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. రుచులకు కాకుండా ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి. అలాగే, రుణాల నుంచి బయటపడాలంటే ఆర్థిక క్రమశిక్షణ అలవరచుకోవాలి. అప్పుల నుంచి బయటపడాలి. వేతనంలో 45 శాతానికి పైగా రుణ చెల్లింపులకు వెళుతుంటే అది ఆందోళనకరమేనని రుణ  ఊబిలో చిక్కుకున్నట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా విచక్షణారహిత ఖర్చులకు వేతనంలో 25 శాతానికి పైగా వెళుతుంటే అది ప్రమాద హెచ్చరికగా భావించాలని సూచిస్తున్నారు.
Sun, Jul 09, 2017, 12:02 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View