పేమెంట్ బ్యాంకులు ఎలా పనిచేస్తాయ్? వాటివల్ల ఉపయోగం ఏమిటి?
Advertisement

మనం ఇన్నాళ్లూ చూసిన సంప్రదాయ బ్యాంకులు వేరు... ఇప్పుడు వస్తున్న బ్యాంకులు వేరు... పేమెంట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల పేరుతో మన ముందుకు వస్తున్న కొత్త బ్యాంకుల వల్ల ప్రయోజనాలు ఏవైనా ఉన్నాయా? అవి ఏ విధంగా పనిచేస్తాయన్న విషయాలు చూద్దాం.


మన దేశంలో బ్యాంకులు, బ్యాంకు శాఖలు విస్తృతంగా ఉన్నప్పటికీ, ఈ సేవలు అందని వారు ఇప్పటికీ ఉన్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉండి ఉండొచ్చు. బ్యాంకు శాఖలు మండల కేంద్రాల వరకు వెళ్లి ఆగిపోయాయి. మరి పల్లెలకు ఎప్పుడొస్తాయ్ బ్యాంకులు? అని ప్రశ్నిస్తే సమాధానం కష్టమే. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేందుకు పేమెంట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సాయపడతాయని ఆర్ బీఐ భావిస్తోంది.

ప్రారంభమైన బ్యాంకులు
ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు తమ కార్యకలాపాలను ఆరంభించాయి. ఆదిత్య బిర్లా నూవో కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. వొడాఫోన్ ఎంపెసా ఇలా 11 సంస్థలకు లైసెన్స్ లు ఇవ్వగా మూడు సంస్థలు వద్దని వెనక్కి వెళ్లిపోయాయి.

బ్యాలన్స్ లపై వడ్డీ
బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఉంచాలన్న నిబంధన ఉంది. సేవింగ్స్ ఖాతాలోని నగదు నిల్వలపై 4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు (యెస్, కోటక్) మాత్రం రూ.25,000కు పైన బ్యాలన్స్ ఉంచితే 6 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. కానీ పేమెంట్స్ బ్యాంకుల్లో కనీస నగదు ఉంచాలన్న నిబంధన ప్రస్తుతానికైతే లేదు. ఖాతాలోని డిపాజిట్లపై ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు 7.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇది బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ కావడం గమనార్హం. ఇండియాపోస్ట్ రూ.25,000 వరకు నగదు నిల్వలపై 4.5 శాతం, ఆపై రూ.50,000 వరకు 5 శాతం, ఆపై రూ.1,00,000వరకు 5.5 శాతం వడ్డీని అందిస్తోంది. కానీ, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు మాత్రం ప్రభుత్వరంగ బ్యాంకుల మాదిరిగా 4 శాతం వడ్డీనే ఆఫర్ చేస్తోంది.

చార్జీలు
ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు మన దేశంలో ప్రారంభమైన మొట్టమొదటి పేమెంట్స్ బ్యాంకు. ఇందులో ఉచితంగానే ఖాతా ప్రారంభించొచ్చు. నగదు రూపంలో ఉపసంహరణలపై 0.65 చార్జీ వసూలు చేస్తుంది. ఆన్ లైన్ లావాదేవీలపై 0.5 శాతం చార్జీ విధిస్తోంది. అంటే రూ.1,00,000 రూపాయలను ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు నుంచి ఉపసంహరించుకుంటే రూ.650 చార్జీ రూపంలో చెల్లించుకోవాలి. మన దేశంలో ఏ బ్యాంకు కూడా నగదు ఉపసంహరణలపై ఈ మేర చార్జీలు వసూలు చేయడం లేదు. గరిష్టంగా ఒక రోజులో రూ.49,990 వరకే బ్యాంకింగ్ పాయింట్ వద్ద నగదు డిపాజిట్ చేయగలరు. గరిష్ట బ్యాలన్స్ 1,00,000. మొదటి సారి కనీసం 100 డిపాజిట్ చేయాలి. ఇది వెనక్కి తిరిగి రాదు. ఎయిర్ టెల్ మొబైల్ కస్టమర్ వారి నంబరే అకౌంట్ నంబర్ గా ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు ఆన్ లైన్ డెబిట్ కార్డు (వర్చువల్) జారీ చేస్తోంది. ఫిజికల్ రూపంలో కార్డును అందించడం లేదు. ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు పూర్తి చార్జీలకు ఈ లింక్ https://www.airtel.in/assets/pdf/Schedule-of-Charges.pdf చూడొచ్చు.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు తన సొంత ఏటీఎంలు, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంల నుంచి చేసే లావాదేవీలపై చార్జీలు వసూలు చేయడం లేదు. ఇతర ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకుంటే ఆర్ బీఐ నిబంధనల మేరకు వ్యవహరిస్తోంది. అంటే మెట్రోల్లో 3, నాన్ మెట్రోల్లో ఒక నెలలో 5 లావాదేవీలు ఉచితం. ఆపై ప్రతీ లావాదేవీపై చార్జీ రూ.20. డెబిట్ కార్డును ఉచితంగానే అందిస్తోంది. ఏడాదికి రూ.100 చార్జీ మాత్రం వసూలు చేస్తోంది. అలాగే, తపాలా శాఖకు వెళ్లి ఒక నెలలో చేసే నగదు జమలు నాలుగు వరకే ఉచితం. ఆపై ప్రతీ లావాదేవీపై రూ.20 చార్జీ చెల్లించుకోవాలి. ఆరు నెలల్లోపు ఖాతా మూసివేస్తే రూ.250 చార్జీ వసూలు చేస్తోంది. ఆన్ లైన్ లో చేసే లావాదేవీల (ఎన్ఈఎఫ్టీ, ఐఎంపీఎస్) పై రూ.2.50 నుంచి 5.50 వరకు చార్జీ ఉంటుంది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంకు మాత్రం ఆర్ బీఐ నిబంధనల మేరకు మిగిలిన బ్యాంకుల్లో నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో అవే అమలు చేస్తోంది. కాకపోతే ఆన్ లైన్ లావాదేవీలపై చార్జీలు వేయడం లేదు. డెబిట్ కార్డును కూడా ఆఫర్ చేస్తోంది. ఈ కార్డుపై రూ.100 వార్షిక చార్జీలున్నాయి. ఏటీఎంలలో మెట్రోల్లో అయితే ఒక నెలలో 3, నాన్ మెట్రోల్లో అయితే 5 లావాదేవీలపై చార్జీ లేదు. ఆ తర్వాత ప్రతీ లావాదేవీపై రూ.20 చార్జీ చెల్లించుకోవాలి. లావాదేవీల వివరాలతో స్టేట్ మెంట్ కావాలంటే రూ.50 తీసుకుంటోంది. దీన్ని ఇంటికే పంపించాలంటే డెలివరీ చార్జీలు అదనం. రూ.100 తీసుకుని 10 చెక్కులను కూడా అందిస్తోంది. పేటీఎం వ్యాలెట్లన్నీ ఇప్పుడు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కిందకు మారాయి. ఇది ఇంతకుముందు మాదిరే పనిచేస్తుంది. కాకపోతే దీన్ని పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతాగా మార్చుకుంటే నగదు నిల్వలపై వడ్డీ లభిస్తుంది.  
 
ఇంటి వద్దకే సేవలు
కోరుకుంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ప్రతినిధులు ఇంటి వద్దకే వచ్చి లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తారు. నగదు జమ, ఉపసంహరణలపై రూ.15-35 వరకు చార్జీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ కు దేశవ్యాప్తంగా 10 లక్షల అవుట్ లెట్లు ఉన్నాయి. ఇవన్నీ బ్యాంకింగ్ అవుట్ లెట్లుగా వ్యవహరిస్తాయని ఎయిర్ టెల్ లోగడ తెలిపింది. తపాలా శాఖకు దేశ్యాప్తంగా సుమారు 1.55 లక్షల తపాలా కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో 89 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవే. వీటి ద్వారా మారుముూల ప్రాంతాల ప్రజానీకానికి ప్రభుత్వ ప్రయోజనాలను నేరుగా అందిస్తామని చెబుతోంది. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ పీఓఎస్ ద్వారా సేవలు అందిస్తామని అంటోంది. పేటీఎంకు ఈ విధమైన పంపిణీ వ్యవస్థ లేదు.

ఏ తరహా సేవలు
సంప్రదాయ బ్యాంకులు అందించే నగదు జమలు, ఉపసంహరణలు, ఆన్ లైన్ లో నగదు బదిలీలు, స్వీకరణలు తరహా సాధారణ సేవలను పేమెంట్స్ బ్యాంకులు కూడా ఆఫర్ చేస్తున్నాయి. వీటికి అదనంగా మొబైల్ బిల్లుల చెల్లింపులు, డీటీహెచ్, విద్యుత్ బిల్లులు, డేటా కార్డు, గ్యాస్, ఇన్సూరెన్స్, నీటి బిల్లు తదితర చెల్లింపుల సేవలు అందిస్తాయి. బీమా పథకాలు, మ్యూచుల్ ఫండ్ పథకాలు, రుణాలకు పంపిణీదారులుగా వ్యవహరించనున్నాయి.  

మొబైల్ పేమెంట్స్...
పేటీఎం బ్యాంకు కొత్త తరహా సేవలు అందించేందుకు పరిశోధన చేస్తోంది. మొబైల్ ద్వారానే మారుమూల ప్రజలనూ చేరుకుని, వారికి ఆర్థిక సేవలు అందించే యోచనలో ఉంది. మొబైల్ వేదికగా అన్ని లావాదేవీలకు వీలు కల్పించే ప్రణాళికలతో పేమెంట్స్ బ్యాంకులు ఉన్నాయి. గ్రామీణ ప్రజానీకం సులభంగా నగదు పంపుకునేందుకు ఈ వేదికలు ఉపయోపడనున్నాయి. ఇప్పటి వరకు పేమెంట్స్ బ్యాంకులు మూడు ప్రారంభం కాగా, వాటి మధ్య ఎటువంటి పోటీ మొదలు కాలేదు. బ్యాంకులతోనూ ఇవి పోటీ పడడం లేదు. ఆర్ బీఐ నుంచి అనుమతి పొందిన మిగిలిన సంస్థలు కూడా పేమెంట్స్ బ్యాంకు సేవలు ప్రారంభిస్తే... పోటీ తీవ్ర స్థాయికి చేరుతుంది. దాంతో కస్టమర్లను కాపాడుకునేందుకు భిన్న సేవలు, సదుపాయాలపై ఇవి దృష్టి పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

నగదు లావాదేవీలను తగ్గించాలన్నది కేంద్ర సర్కారు ప్రగాఢ ఆకాంక్ష. దీన్ని పేమెంట్స్ బ్యాంకులు సాకారం చేయగలవు. వీధిలోని కిరాణా షాపులు, చిన్న వర్తకులను సైతం తమ గేట్ వేతో అనుసంధానించగలిగితే అప్పుడు నగదుకు బదులు మొబైల్ నుంచే డిజిటల్ చెల్లింపు చేయడానికి వీలవుతుంది. డీమోనిటైజేషన్ సమయంలో ఇదే జరిగింది. పేమెంట్స్ బ్యాంకు లైసెన్స్ పొందిన వాటిలో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఎంపెసా, ఆదిత్య బిర్లా నువో (ఐడియా సెల్యులర్ తో కలసి) ఈ మూడూ కూడా ప్రముఖ టెలికం కంపెనీలు. వీటికి దేశవ్యాప్తంగా లక్షలాది అవుట్ లెట్లు ఉన్నాయి. ప్రతీ వీధిలోనూ, ప్రాంతంలోనూ కనీసం ఓ ఔట్ లెట్ అయినా ఉంది. ఇవి పేమెంట్స్ బ్యాంకులుగా మారితే ఖాతాదారులకు సౌకర్యమే. బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పనిచేస్తున్నాయి. కానీ పేమెంట్స్ బ్యాంకు రిటైల్ అవుట్ లెట్లు రాత్రి 9 - 10 గంటల వరకూ కూడా తెరిచి ఉంటాయి. బ్యాంకులు నెలలో రెండు, నాలుగో శనివారాలు పనిచేయవు, సెలవు రోజుల్లో పనిచేయవు. కానీ ఈ ఔట్ లెట్లు మాత్రం ఆదివారం సహా నెలలో అన్ని రోజులూ పనిచేసేందుకు సిద్ధంగా ఉంటాయి.  

సవాళ్లు
2015లో 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంకు లైసెన్స్ లు జారీ చేయగా, వాటిలో మూడు సంస్థలు మాకొద్దంటూ తప్పుకున్నాయి. మిగిలిన వాటిలో వొడాఫోన్ ఎంపెసా, ఆదిత్య బిర్లా నువో (ఐడియా) రెండింటికీ లైసెన్స్ లు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండూ విలీనం కానున్నాయి. ఎస్ బీఐ, రిలయన్స్ తో కలసి లైసెన్స్ పొందింది. ఇవి సేవలను ఎప్పుడు ప్రారంభించేదీ ఇంకా ప్రకటించలేదు. పేమెంట్స్ బ్యాంకు సేవలు ప్రారంభించడం సులువే. కానీ, దేశవ్యాప్తంగా రిటైల్ దుకాణాలతో టై అప్ అవడం, తమ గేట్ వే ఆధారంగా చెల్లింపుల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం, బ్యాంకింగ్ సేవలు అందించడం అన్నది అంత సులభం కాదు. అందుకే చివరికి నాలుగైదు సంస్థలే ఈ సేవలు అందించగలవని విశ్లేషణ.

పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఆన్ లైన్ లావాదేవీలపై చార్జీలు వసూలు చేయడం లేదు. కనీస నగదు నిల్వలు కూడా అక్కర్లేదు. కేవలం చెక్ బుక్కులు, డెబిట్ కార్డు వార్షిక నిర్వహణ రుసుం రూపంలో ఆదాయమే. పైగా క్యాష్ బ్యాక్ ఆఫర్లకు ఇది పెట్టింది పేరు. ఖాతాల్లోని నగదు నిల్వలను సంప్రదాయ ఇన్వెస్ట్ మెంట్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేయాలి. రుణాలు ఇచ్చేందుకు అవకాశం లేదు. ఎన్ బీఎఫ్ సీ, బ్యాంకుల తరఫున రుణాలు, క్రెడిట్ కార్డుల విక్రయం అన్నది కూడా అంత సులభం కాదంటున్నారు పరిశీలకులు. సరైన కస్టమర్లను గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు. కస్టమర్ తో బలమైన సంబంధాలు ఉన్నప్పుడే ఈ విధమైన క్రాస్ సెల్లింగ్ విజయవంతం అవుతుందన్నది వారి అభిప్రాయం. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఉత్పత్తుల విక్రయానికి అనుమతి ఉండగా, వీటిపై సెబీ, ఐఆర్డీఏ నియంత్రణల నేపథ్యంలో ఇష్టారీతిలో వ్యవహరించడానికి లేదు. ఈ అంశాల నేపథ్యంలో పేమెంట్స్ బ్యాంకులు ప్రస్తుత నమూనాలో నిలదొక్కుకోవడం అన్నది అంత సులభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎయిర్ టెల్ ఆన్ లైన్ లావాదేవీలపై రూ.లక్షకు 650 చార్జీ వసూలు చేస్తోంది. ఇంత భారీ చార్జీలతో కస్టమర్లు చేరడం కష్టమే.

ఆ వెసులుబాటు లేదు
బ్యాంకులు సేవింగ్స్, కరెంటు ఖాతాల్లోని నగదు డిపాజిట్లు, ఇతర ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో సేకరించిన నిధులను చక్కగా రుణాలుగా ఇచ్చుకోవచ్చు. రుణాలపై వాటికి 4-10 శాతం నికర వడ్డీ ఆదాయం లభిస్తోంది. క్రెడిట్ కార్డు రుణాలపై 30 శాతం వరకు ఆదాయాన్ని పొందుతున్నాయి. మైక్రో ఫైనాన్స్ సంస్థలు కూడా 25 శాతం వడ్డీ రేట్లను వసూలు చేసుకుంటున్నాయి. కానీ, పేమెంట్స్ బ్యాంకులు మాత్రం ఖాతాల్లోని డిపాజిట్ల మొత్తాన్ని రుణాలు ఇచ్చుకునేందుకు అవకాశం లేకపోగా, వాటిలో 75 శాతం ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లులపైనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వీటిపై 2-4 శాతం మించి రాబడులు రావు. వ్యయాలు తీసేసిన తర్వాత వాటికి ఒక శాతానికి మించి మిగలకపోవచ్చని నిపుణుల విశ్లేషణ. అయితే, తొలుత ఈ విధమైన నమూనానే ఉన్నప్పటికీ కొంత కాలానికి ఆర్ బీఐ నిబంధనలను సడలించవచ్చని, వీటికీ బ్యాంకు సేవల లైసెన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు
పది సంస్థలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటుకు అనుమతులను పొందాయి. వాటిలో ఈక్విటాస్ హోల్డింగ్స్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కార్యకలాపాలు ప్రారంభించేశాయి. జలంధర్ కు చెందిన ‘క్యాపిటల్’ లోకల్ ఏరియా బ్యాంకు సైతం ఎప్పటి నుంచో ప్రాంతీయ బ్యాంకుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇవి సంప్రదాయ బ్యాంకుల మాదిరిగానే పనిచేస్తాయి. ఎంత మేరకైనా డిపాజిట్లు స్వీకరించొచ్చు. రుణాలు ఇచ్చుకోవచ్చు. కాకపోతే చిన్న రుణాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. చిన్న వ్యాపారులు, చిన్న, సన్నకారు రైతులు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, పెన్షన్ పథకాలను ప్రమోట్ చేయవచ్చు. భారీ స్థాయి వాణిజ్య బ్యాంకులు, వీటికి మధ్య తేడా ఏమీ లేదు. కాకపోతే వీటి కార్యకలాపాలన్నీ చిన్నగా ఉండాలి. అంటే గ్రామీణ, చిన్న పట్టణాల్లోని ప్రజలు, పేద వర్గాలు లక్ష్యంగా సేవలు అందించేందుకు వీటిని ఉద్దేశించారు. అందుకే ప్రారంభించే శాఖల్లో కనీసం 25 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండాలన్న నిబంధనను విధించారు.
Tue, Jun 27, 2017, 11:58 AM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View