60లలో సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఎక్కడ...?
Advertisement

జీవితం చివరి రోజుల్లో సంతోషంగా గడిపేయాలని అందరూ కోరుకుంటారు. గృహస్థాశ్రమంలో కుటుంబ బాధ్యతలు, పిల్లల కోసం నిరంతరం ప్రతీ నిమిషం శ్రమపడిన వారు కాస్త విశ్రాంతిని కోరుకుంటారు. తీర్థయాత్రలకో, చక్కని పర్యాటక ప్రదేశాలకో వెళ్లాలని ఉంటుంది. బంధువుల ఇంటికో, స్నేహితుల దగ్గరకో ట్రిప్ వేయాలని ఉంటుంది. ఈ అవసరాలన్నింటికీ డబ్బు ప్రధానం. సంపాదించే రోజుల్లో రూపాయి రూపాయి కూడబెట్టిన దాన్ని, విశ్రాంత జీవనంలో నిరంతరం రాబడులను ఇచ్చే పథకాల్లో పెట్టుకోవడం ద్వారా అవసరాలను తీర్చుకోవచ్చు... ఆకాంక్షల్ని పూర్తి చేసుకోవచ్చు.


representational imageపోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం (పీఓఎంఐఎస్)
ప్రస్తుతం భద్రతతో కూడిన మెరుగైన రాబడినిచ్చే పథకాల్లో ఇది ఒకటి. ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై ప్రతీ నెలా స్థిరమైన రాబడిని ఆదాయంగా అందుకోవచ్చు. ఒక్కరు రూ.4.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జాయింట్ ఖాతా అయితే రూ.9 లక్షలకు అవకాశం ఉంటుంది. వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. అంటే రూ. ఒక లక్ష ఇన్వెస్ట్ మెంట్ పై వడ్డీ రూపంలో ప్రతీ నెలా రూ.633 రూపాయలు వస్తాయి. నెలలో ఏ తేదీన ఇన్వెస్ట్ చేశారో, ఆ తర్వాత నుంచి నెలా నెలా అదే తేదీన వడ్డీ ఆదాయాన్ని చెల్లిస్తారు. కాల వ్యవధి ఐదేళ్లు. ఒకవేళ ఐదేళ్లలోపు అవసరం ఏర్పడి డబ్బును వెనక్కి తీసుకుంటే కొంత నష్టపోవాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత ఉపసంహరణకు అనుమతిస్తారు. ఏడాది నుంచి మూడేళ్లలోపు వెనక్కి తీసుకుంటే డిపాజిట్ మొత్తంలో 3 శాతం కోసేసుకుని మిగిలిన మొత్తం తిరిగిస్తారు. మూడేళ్ల తర్వాత కాల వ్యవధి ముగిసే లోపు తీసుకుంటే 1 శాతం కోత ఉంటుంది. ఏ పోస్టాఫీసులో అయినా ఈ పథకం కింద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు మార్చుకోవచ్చు. మైనర్ల పేరిట కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనిపై వచ్చే ఆదాయానికి ఆదాయపన్ను మినహాయింపులు లేవు. వ్యక్తి తన వార్షిక ఆదాయంలో భాగంగా చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే పోస్టాఫీసులో టీడీఎస్ కింద మినహాయించుకోవడం ఉండదు.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్
60వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన వారు ఎవరైనా సరే ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ముందస్తు పదవీ విరమణ తీసుకున్న వారు 55 ఏళ్లకే చేరొచ్చు. అత్యధిక రాబడినిచ్చే హామీతో కూడిన ప్రభుత్వ పథకం ఇది. విడిగానూ లేదా జీవిత భాగస్వామితో కలసి ఉమ్మడిగా ఖాతా ప్రారంభించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడులకు సెక్షన్ 80సి కింద ఆదాయపన్ను మినహాయింపులున్నాయి. ఈ పథకంలో 8.4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. నెలనెలా కాకుండా ప్రతీ మూడు నెలలకోసారి వడ్డీ ఆదాయాన్ని చెల్లిస్తారు. కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ముందస్తుగా కావాలంటే ఏడాది తర్వాత నగదును వెనక్కి తీసుకోవచ్చు. ముందుగా తీసుకునేట్టు అయితే ఏడాది తర్వాత 1.5 శాతం, రెండేళ్ల తర్వాత 1 శాతం డిపాజిట్ మొత్తం నుంచి మినహాయించి ఇస్తారు.

representational imageరిస్క్ తీసుకుంటే ఇవి...
ఆయుర్దాయం క్రమంగా పెరుగుతోంది. సగటున 77 ఏళ్ల పాటు జీవిస్తున్నారు. కొందరు 90 వరకు కూడా. కనుక 60 ఏళ్ల తర్వాత చాలా కాలం పాటు జీవించి ఉండే అవకాశం ఉంది. కాబట్టి 70 ఏళ్ల వరకు స్వల్ప రిస్క్ తో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని కొందరు నిపుణులు పేర్కొంటుంటారు. మ్యూచువల్ ఫండ్స్ లో మంత్లీ ఇన్ కమ్ ప్లాన్స్ రిటైర్ అయిన వారికి అనువైనవే. వీటిలో స్వల్ప రిస్క్ ఉంటుంది. పెట్టుబడుల్లో 15-20 శాతాన్ని ఈక్విటీలోనూ, మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెడతారు. ఈక్విటీలలో పెట్టిన కొద్ది శాతం పెట్టుబడులతో సంప్రదాయ పథకాలతో పోలిస్తే మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది. 12 నుంచి 18 శాతం మధ్య రాబడులను ఆశించొచ్చు.

ఈక్విటీల్లో ఎంత మేర పెట్టుబడులు పెడతాయన్న ఆధారంగా మంత్లీ ఇన్ కమ్ ప్లాన్లను అగ్రెస్సివ్, కన్జర్వేటివ్ అని రెండుగా విభజించారు. అగ్రెస్సివ్ పథకాల్లో ఈక్విటీల్లో 30 శాతం వరకూ, కన్జర్వేటివ్ పథకాల్లో 20 శాతం వరకే ఇన్వెస్ట్ చేస్తారు. పేరును చూసి ప్రతీ నెలా ఆదాయం వస్తుందనుకోవద్దు. కాకపోతే ఫండ్ రాబడుల నుంచి తరచుగా డివిడెండ్ రూపంలో చెల్లింపులు జరుగుతుంటాయి. చెల్లించాలన్న గ్యారంటీ ఉండదు.

representational imageబ్యాంకుల్లో మంత్లీ ఇన్ కమ్ ప్లాన్లు
బ్యాంకులు సైతం మంత్లీ ఇన్ కమ్ ప్లాన్లను అందిస్తున్నాయి. కాకపోతే వీటిలో రాబడి చాలా తక్కువ. ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే దానిపై ప్రతీ నెల వడ్డీని చెల్లిస్తాయి బ్యాంకులు. ఏడాదిలో వడ్డీ ఆదాయం రూ.10వేలు దాటితే టీడీఎస్ మినహాయిస్తాయి. 12 నెలల నుంచి 120 నెలల కాలానికి డిపాజిట్ చేసుకోవచ్చు. వడ్డీ రేటు 6-7 శాతం మధ్యలో ఉంది. సీనియర్ సిటిజన్లకు అరశాతం అదనంగా ఇస్తున్నాయి.
 
యాన్యుటి పెన్షన్ ప్లాన్స్
ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే పెన్షన్ ప్లాన్లు ఇవి. కోరుకున్న ఆప్షన్ ను బట్టి నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, వార్షికంగా ఓ సారి చెల్లింపులు ఉంటాయి. వీటిలోనూ ఇమీడియెట్ యాన్యుటీ, డిఫర్డ్ యాన్యుటీ అని రెండు రకాలున్నాయి. తక్షణమే పెన్షన్ కోరుకునే వారి కోసమే ఇమీడియెట్ యాన్యుటీ ప్లాన్లు. పెట్టుబడి మొత్తాన్ని బట్టి చెల్లింపులు ఉంటాయి. డిఫర్డ్ యాన్యుటీ అనేది చిన్న వయసులోనే ఉండి, కొన్నేళ్ల పాటు నెలవారీ ఆదాయం అవసరం లేని వారు ఎంచుకోవాల్సినవి. వారు పేర్కొన్న గడువు వరకు నెలవారీ చెల్లింపులు ఉండవు. ఆ తర్వాత నుంచి ప్రారంభం అవుతాయి.

representational imageయాన్యుటీ ఫర్ లైఫ్: పెన్షన్ ప్లాన్ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నంత వరకు పెన్షన్ చెల్లింపులు జరుగుతాయి. మరణిస్తే చెల్లింపులు నిలిచిపోతాయి. ఎటువంటి బాధ్యతలు లేని వారికి ఇవి అనువైనవి.
ఏటేటా పెరగాలంటే: ఏటేటా పెన్షన్ మొత్తం పెరగాలని కోరుకునే వారికి ఇంక్రీజింగ్ యాన్యుటీ ప్లాన్లు ఉన్నాయి. ఏటా నిర్ణీత శాతం పెరుగుతూ వెళుతుంది.
జాయింట్ లైఫ్: పాలసీదారుడు జీవించి ఉన్నంత వరకు అతనికి పెన్షన్ చెల్లింపు జరుగుతుంది. మరణిస్తే, జాయింట్ లైఫ్ ఆప్షన్ తీసుకుని ఉంటే అప్పుడు జీవిత భాగస్వామికి జీవితాంతం చెల్లింపులు జరుగుతాయి. ఎల్ఐసీ జీవన్ అక్షయ్-6, ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీలు యాన్యుటీ ప్లాన్లను అందిస్తున్నాయి.

ప్రధాన మంత్రి వయ వందన యోజన
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2017 మే 4న ప్రారంభించింది. పదేళ్ల కాల వ్యవధిగల ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా 8 శాతం రాబడిని అందుకోవచ్చు. రూ.65 వేల నుంచి రూ.7.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.

పెట్టుబడుల కోసం...
సాధారణంగా 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఇక ఇన్వెస్ట్ మెంట్స్ అవసరం లేదనుకుంటారు. కానీ, ఇది సరైన ఆలోచన కాదన్నది నిపుణుల అభిప్రాయం. వృద్ధాప్యంలో కూర్చుని తింటే ఉన్న నిధి కాస్తా కరిగిపోతుంది. కనుక కొంత మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లించాలని సూచిస్తారు. కాకపోతే రిస్క్ తక్కువ ఉండే వాటిని ఎంచుకోవడమే మంచిది. పైన చెప్పుకున్న వాటిలో మ్యూచువల్ ఫండ్స్ మంత్లీ ఇన్ కమ్ ప్లాన్లు ఇందుకు అనువైనవే. వీటిలో డివిడెండ్ ఆప్షన్ కు బదులు గ్రోత్ ఆప్షన్ ఎంచుకోవాలి. అలాగే ఈక్విటీల్లో 35 శాతం వరకు పెట్టుబడులు పెట్టే బ్యాలన్స్డ్ ఫండ్స్ కూడా పరిశీలించొచ్చు. 
Fri, Jun 09, 2017, 02:03 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View