60లోకి అడుగు పెట్టారా...? మీకున్న హక్కులు, ప్రయోజనాలు ఇవిగో!
Advertisement
నేడు మనది యువ భారతం. కానీ, 2050 నాటికి మన దేశంలో వృద్ధులు చెప్పుకోతగ్గ సంఖ్యకు చేరుకోనున్నారు. యునెస్కో అంచనా ప్రకారం ప్రపంచంలో 60 ఏళ్లకు పైనున్న వారి సంఖ్య 2005లో 59 కోట్లు. 2025 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందంటున్నారు. 2050 నాటికి ప్రపంచ వృద్ధుల జనాభా 200 కోట్లను దాటుతుందంటున్నారు. మన దేశంలో చూస్తే 2001లో 7.2 కోట్ల మంది వయసుపైబడిన వారున్నారు. 2025 నాటికి మన దేశ జనాభాలో వృద్ధులు 18 శాతం దాటిపోతారన్న అంచనాలున్నాయి.

చిన్నారుల ఆలనా పాలనా తల్లిదండ్రులు చూసుకుంటారు. ఆ తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత వారి బాగోగులు ఎవరు చూడాలి...? కన్నవారు నిర్లక్ష్యం చూపితే వారి పరిస్థితి ఏం కాను...? తమను కని పెంచి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులను పెద్ద వయసులో ఆదరించి, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యతను పిల్లలు విస్మరిస్తే ఎలా..? తప్పదు అటువంటి సందర్భాల్లో సీనియర్ సిటిజన్లు తమ హక్కులను కాపాడుకోవాల్సి వస్తుంది. వృద్ధుల సంక్షేమ, ఆలనా పాలనకు సంబంధించి ప్రత్యేక చట్టం ఉంది. వారికంటూ హక్కులున్నాయి. ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

వృద్ధాప్యంలో ఎదుర్కొనే సమస్యలు
representational image60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులు పదవీ విరమణ పొందడం, ఆ తర్వాత వారికి నెలనెలా పింఛను, ఉచిత వైద్య సదుపాయాలు ఉంటాయి. కానీ, మిగిలిన వారి పరిస్థితి ఏంటి...? ఇలా ఏ రక్షణ లేని వారికి ఆర్థికపరమైన అవసరాలు తీర్చుకోవడం కష్టమవుతుంది. వృద్ధాప్యంలో విశ్రాంతి లేకుండా ఏదో ఒక ఉద్యోగమో, ఉపాధి అవకాశమో చూసుకోక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. వచ్చే ఆదాయం కూడా అవసరాలకు సరిపోకపోవచ్చు. ఆ సమయంలో శారీరక, మానసిక పరమైన బలహీనతలు, అనారోగ్య సమస్యలతో వైద్య వ్యయాలు పెరుగుతాయి.

రాజ్యాంగపరమైన, చట్టపరమైన రక్షణ
పనిచేసుకునేందుకు, విద్య పొందేందుకు హక్కుంది. ఎటువంటి ఉపాధి లేకపోతే, వయో భారం, అనారోగ్యం వంటి సమస్యలు ఎదురైనప్పుడు ప్రజా సాయం కోరే హక్కులు రాజ్యాంగం ప్రకారం వృద్ధులకు ఉన్నాయి. వయోభారం మీదపడిన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. ఈ బాధ్యతలన్నవి ఒక్కో మతంలో ఒక్కో రకంగా నిర్వచించారు.

హిందూ చట్టాలు
representational imageహిందువుల్లో తల్లిదండ్రుల సంక్షేమ బాధ్యత సాధారణంగా కుమారులపైన ఉండడం చూస్తుంటాం. తల్లిదండ్రులు పెద్ద వయసుకు వచ్చి... తమ సొంత అవసరాలను తీర్చుకోలేని స్థితిలో ఉంటే  అప్పుడు వారి సంతానం వారి సంక్షేమ బాధ్యతను చూడడం తప్పనిసరి. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ - 1956 కింద తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత పిల్లలపైన ఉంటుంది. తల్లిదండ్రుల సంక్షేమ బాధ్యత కేవలం కుమారులకే కాదు, కుమార్తెలపైనా సమానంగానే ఉంటుంది. వారు చూడకపోతే తల్లిదండ్రులు ఈ చట్టం కింద తమను చూడాలని కోరవచ్చు.

ముస్లిం చట్టాలు
వృద్ధులైన తమ తల్లిదండ్రుల పోషణను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని ముస్లిం చట్టం ముల్లా కూడా చెబుతోంది. కుమారుడు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదరికంతో బాధపడుతున్న తల్లిదండ్రులను తప్పకుండా చూసుకోవాలి.  

క్రిస్టియన్లు, పార్సీలు
క్రిస్టియన్లు, పార్సీల్లో తల్లిదండ్రుల సంక్షేమానికి సంబంధించి ఎటువంటి వ్యక్తిగత చట్టాలు లేవు. వీరు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద తమ సంరక్షణ చూడాలంటూ దరఖాస్తు చేసుకోవచ్చు.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్
1973కు ముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద తల్లిదండ్రుల సంక్షేమానికి సంబంధించి ఎటువంటి నిబంధన లేదు. 1973లో సెక్షన్ 125ను ప్రవేశపెట్టారు. సీఆర్సీపీసీ అన్నది లౌకిక చట్టం. అందరికీ వర్తిస్తుంది. అన్ని మత వర్గాలకూ అమలవుతుంది. కుమార్తెలు (వివాహమైనా సరే) కూడా తల్లిదండ్రుల పోషణను చూడాల్సి ఉంటుంది.

తల్లిదండ్రుల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007
representational imageతల్లింద్రులు, వృద్ధుల సంక్షేమ నిర్వహణ చట్టం కింద కేసుల సత్వర విచారణకు గాను మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రతీ జిల్లాలో వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని నిర్దేశిస్తోంది. వృద్ధులు ఈ చట్టం కింద, లేదంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 125 కింద తమ పోషణ చూడాలని కోరుతూ పిటిషన్ వేసుకోవచ్చు. ఒకవేళ అప్పటికే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద కోర్టులో పిటిషన్ వేసుకుని ఉంటే, దాన్ని ఉపసంహరించుకున్న తర్వాతే తల్లిదండ్రుల నిర్వహణ, సంక్షేమ చట్టం కింద క్లెయిమ్ చేసుకునేందుకు ఉంటుంది. ఈ చట్టంలోని క్లాజు 5(1), క్లాజు 4 కింద వృద్ధాప్యంలో అడుగు పెట్టిన వారు మెయింటెనెన్స్ కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. 60 ఏళ్లు, ఆపైన ఉన్న వారందరూ చట్టప్రకారం వృద్ధులుగానే పరిగణించబడతారు. ఇక్కడ మెయింటెనెన్స్ అంటే ఆహారం, వస్త్రాలు, నివాసం, వైద్యసాయం.

ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు?
తల్లిదండ్రులు అంటే... సొంత తల్లిదండ్రులు లేదా దత్తత తీసుకున్న వారు, సవతి తల్లిదండ్రులు. సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏళ్లు ఉండాలి కానీ, తల్లిదండ్రులకు ఈ విధమైన వయసు పరిమితి లేదు. ఇంకా ఈ చట్టం కింద తాతలు, బామ్మలు, అమ్మమ్మలు (తల్లి, తండ్రి పేరెంట్స్). 60 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా వస్తారు. తాము సొంతంగా పోషణావసరాలను తీర్చుకోలేని వారే ఈ చట్టం కింద మెయింటెనెన్స్ కోరవచ్చు.

మెయింటెనెన్స్ చూడాల్సిన బాధ్యత ఎవరిపై..?
representational imageపెద్ద వారైన పిల్లలు, మనవలు, మనవరాళ్లపై సంక్షేమ బాధ్యత ఉంటుంది. పిల్లల్లేని వారు, కనీసం మనవళ్లు, మనవరాళ్లు కూడా లేకుంటే బంధువుల నుంచి మెయింటెనెన్స్ కోరవచ్చు. అయితే, ఆ బంధువు సంక్షేమం కోరుతున్న వ్యక్తి ఆస్తులను కలిగి ఉండాలి. లేదా సంక్షేమం కోరుతున్న వ్యక్తి మరణానంతరం వారి ఆస్తులను వారసత్వంగా పొందే హక్కు కలిగి ఉండాలి. అలాంటి హక్కు కలిగినవారికే సంక్షేమ బాధ్యత ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మంది బంధువులు ఇందుకు అర్హులైతే వారందరూ సమాన వాటాగా మెయింటెనెన్స్ భరించాల్సి ఉంటుంది. నెలకు గరిష్టంగా రూ.10,000 చెల్లించాలని ఈ చట్టం చెబుతోంది. సంక్షేమం కోరుతున్న వ్యక్తి అవసరాలను బట్టి ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. సాధారణ జీవనం గడిపేందుకు తోడ్పడడమే మెయింటెనెన్స్ ఉద్దేశ్యం.

ఎవరిని ఆశ్రయించాలి..?
ప్రతీ జిల్లాలో ఉండే మెయింటెనెన్స్ ట్రైబ్యునల్ ముందు దరఖాస్తు ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. తాము నివసించే జిల్లాలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎవరైనా ఓ వ్యక్తి తాను స్వయంగా పిటిషన్ ను దాఖలు చేసుకోలేని స్థితిలో ఉంటే వారి తరఫున ఎవరైనా గానీ, స్వచ్చంద సంస్థ అయినా గానీ పిటిషన్ ను ఫైల్ చేయవచ్చు. లేదా మెయింటెనెన్స్ ట్రైబ్యునల్ తనంతట తానే సుమోటోగా తీసుకుని పరిహారం కోసం ఆదేశించవచ్చు. న్యాయవాదులతో ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపించరాదు. పేరెంట్స్ లేదా సీనియర్ సిటిజన్లు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మెయింటెనెన్స్ అధికారి సేవలను పొందవచ్చు.

ఆదేశాల అమలు
representational imageమెయింటెనెన్స్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆ కాపీ ఒకదాన్ని పరిహారం కోరుతున్న వ్యక్తికి ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ట్రైబ్యునల్ ఆదేశించిన నెల రోజుల్లోపే సంబంధిత పరిహారాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. చెల్లించడంలో విఫలమైతే దాన్ని వసూలు చేసేందుకు వారంట్ జారీ అవుతుంది. గరిష్టంగా ఒక నెల లేదా ఆ పరిహారం చెల్లించేంత వరకూ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ప్రతీ నెలా పోషణ భత్యం చెల్లించకపోతే మూడు నెలల్లోపే ట్రైబ్యునల్ ను ఆశ్రయించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు లేదా పెద్దల సంరక్షణ బాధ్యత కలిగిన వారు ఉద్దేశపూర్వకంగా వారిని వదిలేస్తే రూ.5వేల జరిమానా లేదా మూడు నెలల పాటు జైలు శిక్ష లేదా రెండూ విధించేందుకు అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత
అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం నుంచి పాక్షికంగా గానీ, పూర్తి స్థాయిలో గానీ నిధులు పొందుతున్న ఆస్పత్రులలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వారి కోసం బెడ్స్ ను అందుబాటులో ఉంచాలి. ప్రతి జిల్లా ఆస్పత్రిలో వీరి కోసం ప్రత్యేక సదుపాయాలు ఉండాలి. ప్రతి జిల్లాలో కనీసం ఒకటి అయినా వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలి. కనీసం 150 మందికి అది ఆశ్రయం కల్పించే సామర్థ్యం కలిగి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సైతం వృద్ధాశ్రమాల ఏర్పాటుకు రాష్ట్రాలకు కొంతమేర నిధుల సాయాన్ని అందిస్తోంది.  

ఆదాయపన్ను
సాధారణ వ్యక్తులకు రూ.2.50 లక్షల ఆదాయానికి పన్ను ఉండదు. అదే సీనియర్ సిటిజన్లకు అయితే రూ.3లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంది. 80 ఏళ్లు దాటిన వయో వృద్ధులుకు రూ.5 లక్షల వరకూ పన్ను లేదు. వృద్ధాప్యంలో ఆరోగ్య అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దృష్ట్యా ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియం 30,000 వరకూ పన్ను నుంచి మినహాయింపు ఉంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు సెక్షన్ 80డీడీబీ కింద రూ.60,000 వరకూ, సూపర్ సీనియర్లు రూ.80,000 వరకూ వైద్య చికిత్సా వ్యయాలపై పన్ను మినహాయింపు పొందవచ్చు.

ప్రయాణ రాయితీలు
representational image60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా దేశీయ మార్గాల్లో ప్రయాణాలపై 50 శాతం తగ్గింపునిస్తోంది. 60 ఏళ్లు దాటిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు దాటిన మహిళలకు 50 శాతం రైల్వే టికెట్ చార్జీల్లో రాయితీ ఉంది. రైలులోని అన్ని తరగతుల్లో ఈ సదుపాయం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ రవాణా వ్యవస్థలకు చెందిన బస్సు సర్వీసుల్లోనూ సీనియర్ సిటిజన్లకు రాయితీలు ఉన్నాయి. బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు సీట్ల రిజర్వేషన్లలోనూ కోటా ఉంది.

ఇతర సదుపాయాలు
బ్యాంకు డిపాజిట్లలో అరశాతం అదనపు వడ్డీ లభిస్తుంది. బ్యాంకుల్లో వడ్డీ ఆదాయం ఏడాదిలో రూ.10,000 దాటితే మూలం వద్ద పన్ను కోత అంటూ 10 శాతం మినహాయిస్తుంటారు. పన్ను వర్తించేంత ఆదాయం లేకుంటే సీనియర్ సిటిజన్లు బ్యాంకుకు డిక్లరేషన్ ఇస్తే పన్ను కోత ఉండదు. ఇందుకోసం ఫామ్ 15హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా వారికి ఇది ఫామ్ 15జీ. పోస్టాఫీసులో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. నేషనల్ ఇన్సూరెన్స్ వరిష్ట మెడిక్లెయిమ్ పాలసీని 60-80 ఏళ్ల వయసు వారికి ఆఫర్ చేస్తోంది. ఆస్పత్రి పాలైతే గరిష్టంగా రూ.లక్ష వరకు బీమా కవరేజీ, క్రిటికల్ ఇల్ నెస్ లో రూ.2 లక్షల కవరేజీ లభిస్తుంది. ఎల్ఐసీ వరిష్ట పెన్షన్ బీమా యోజన పేరుతో పెట్టుబడిపై 8 శాతం వడ్డీ రేటు ప్రకారం ప్రతీ నెలా పింఛను అందిస్తోంది. ఈ వడ్డీ రేటు పదేళ్ల పాటు స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో వడ్డీ రేట్లు తగ్గినా ఎల్ఐసీ 8 శాతం వడ్డీపైనే పింఛను అందిస్తుంది. ఒకరు ఇందులో గరిష్టంగా 7.5లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. 60 ఏళ్లు పైబడ్డ వారు తమ కేసును ప్రాధాన్యమైనదిగా పరిగణిస్తూ విచారించాలని కోర్టుకు లేఖ రాసుకునే అవకాశం ఉంది.
Fri, May 19, 2017, 12:59 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View