కలియుగంలో మనం ఎక్కడున్నాం...? ఈ యుగాంతం ఎప్పుడు...? ఉగాది ఎప్పుడు మొదలైంది?
Advertisement
కలియుగే, ప్రథమ పాదే, జంబూద్వీపే, భరతవర్ష, భరతఖండే... వేద పండితులు ప్రతి కార్యక్రమంలో భాగంగా చెప్పే సంకల్పంలో ఈ మాటలు వినిపిస్తుంటాయి. మనం ప్రస్తుతం కలియుగం ప్రథమ పాదంలో ఉన్నామన్న విషయం తెలుసుకదా. కానీ, చాలా మందికి అర్థం కాని విషయాలు... అసలు కలియుగం ఎప్పుడు మొదలైంది? ఎంత కాలం కొనసాగుతుంది...? జనవరి 1న కొత్త సంవత్సరం మొదలవుతుంటే... హిందువులకు కొత్త సంవత్సరం ఉగాదిరోజే ఎందుకు ప్రారంభం అవుతోంది...? వీటి గురించి పలువురు పండితులు రాసిన పుస్తకాలు, వనరుల ఆధారంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

representative imageహిందూ కేలండర్ కు ఖగోళ శాస్త్రమే ఆధారం. నక్షత్రాలు, గ్రహాల స్థితిగతులు, వాటి గమనాన్ని గురించి తెలిపేదే ఖగోళ శాస్త్రం. భూమి తన చుట్టూ తాను ఒక్కసారి తిరిగి వస్తే ఒక రోజు అవుతుంది. అదే భూమి చుట్టూ చంద్రుడు ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే దాన్ని ఒక మాసంగా, భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి వస్తే దాన్ని ఒక సంవత్సర కాలంగా పరిగణిస్తున్నారు. ఇది కేవలం హిందువులు చెప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు అందరూ అంగీకరించే విషయం. ఇలా గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా హిందువులు ఒక సంవత్సరంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం పరిగణించే రోజు, వారం, పక్షం, మాసం, రుతువు, ఆయనం, సంవత్సరం, పుష్కరం, శకం, యుగం, కల్పకం ఇవన్నీ కూడా ఖగోళ శాస్త్రం ఆధారంగా నిర్ణయించుకున్నవే. కానీ, ఇంగ్లిష్ గ్రెగోరియన్ కేలండర్ గ్రహాల గమనం ఆధారంగా ఏర్పాటైనది కాదు. కాలానికి ఓ లెక్క కోసం ఏర్పాటు చేసుకున్న కేలండర్ మాత్రమే. నిజానికి కాలం అనంతం.

ఉగాది అంటే...?
తెలుగు సంవత్సరాది ఏటా చైత్రమాసం, శుక్ల పక్షం, పాడ్యమి తిథితో మొదలవుతుంది. దీన్నే యుగాది లేదా ఉగాదిగా చెబుతారు. తెలుగు సంవత్సరాదే కాదు హిందూ సంవత్సరాది కూడా ఈ రోజే. ఈ రోజే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. 2017 మార్చి 28 నుంచి హేవళంబి సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నట్టు లెక్క (ఉగాది పండుగ 28 లేదా 29వ తేదీలో ఓ రోజు జరుపుకున్నప్పటికీ). బ్రహ్మ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే సృష్టి మొదలు పెట్టాడని బ్రహ్మపురాణం చెబుతోంది. అందుకే దీన్ని యుగాది అని చెబుతారు. యుగాదే కాలకమ్రంలో ఉగాదిగా స్థిరపడిందనే ఒక నమ్మకం ఉంది.

representative imageఉగాది అంటే ఉగ ఆది. ఉగ అంటే నక్షత్ర గమనం, ఆది అంటే ప్రారంభం. నక్షత్ర గమనం మొదలవుతున్నట్టు అర్థం. ఆ విధంగా చూసుకుంటే కొత్త  సంవత్సర ప్రారంభానికి ఉగాది అని సంభాషించడం ఆచరణీయంగానే ఉంది. యుగాది అంటే యుగము ఆది. యుగము అనగా ద్వయము. ఉత్తరాయణం, దక్షిణాయణం కలిస్తే సంవత్సరం. ఇవి ఒక్కోటీ ఆరు నెలల పాటు ఉంటాయి. ఈ రెండు ఆయణాలే యుగంగానూ చెబుతారు.  ప్రముఖ ఖగోళ గణిత శాస్త్రవేత్త, భారతీయులు గర్వించతగ్గ ఆర్యభట్ట సైతం ఉగాది నుంచే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుందని చెప్పినట్టు తెలుస్తోంది.

ఖగోళ శాస్త్రం ప్రకారం వెర్నాల్ ఈక్వినాక్స్ తర్వాత వచ్చే పాడ్యమి ఉగాది అవుతుంది. ఈక్వినాక్స్ అంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే క్రమంలో భూమధ్య రేఖ సూర్యుడి మధ్య రేఖకు వచ్చిన సమయంగా పేర్కొంటారు. కనుక ఈక్వినాక్స్ రోజున భూగోళ వ్యాప్తంగా పగలు, రాత్రి ఇంచుమించు సమానంగా ఉండే రోజు అని చెబుతారు. వెలుతురు, చీకటి సమానంగా ఉండే రోజు అని కూడా పేర్కొంటారు. వెర్నాల్ ఈక్వినాక్స్ ఈ ఏడాది మార్చి 20న వచ్చింది.

శాలివాహన శకం
కాలగమనాన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉమ్మడిగా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటూ ఆంగ్లేయులు పరిచయం చేశారు. నిజానికి హిందువులకు కలిశకం, విక్రమశకం, శాలివాహన శకం అంటూ ఉన్నాయి. ప్రస్తుతం శాలివాహన శకం నడుస్తోంది. క్రీస్తు శకం, శాలివాహన శకం ఒక్కసారే మొదలయ్యాయని చెబుతారు. క్రీస్తు శకానికి సమాంతర కాలంగానే శాలివాహన శకాన్ని పేర్కొంటారు.

60 వసంతాలకు ఓ మారు కాలచక్రం మొదలు
representative imageమన కాలమానం ప్రతీ అరవై సంవత్సరాలకు ఒకసారి పూర్తవుతుంది. ప్రభవనామ సంవత్సరంతో మొదలై, అక్షయనామ సంవత్సరంతో ముగుస్తుంది. మళ్లీ ప్రభవనామ సంవత్సరంతో ప్రారంభం అవుతుంది. ఈ కాల చక్రంలో అరవై వసంతాలు ఉంటాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్ధివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిళింబి లేదా హేవళంబి లేదా హేమలంబ, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ.

కలియుగం ఎప్పుడు మొదలైంది...?
ద్వాపరయుగంలో శ్రీకృష్ణావతారం పూర్తయిన అనంతరం ఉగాది నుంచి కలియుగం ప్రారంభం అయింది. క్రీస్తు పూర్వం 3,102 సంవత్సరం ఫిబ్రవరి 18న అంటే 5,118 ఏళ్ల క్రితం కలియుగం ప్రారంభమైనట్టు పండితులు చెబుతారు.

కలియుగం ఎప్పటి వరకు...?
పురాణాల ప్రకారం కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిస్తే ఒక మహాయుగం. 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగానికి సమానం. ఇందులో కృతాయుగంలో 17,28,000, త్రేతాయుగంలో 12,96,000, ద్వారపయుగంలో 8,64,000, కలియుగంలో 4,32,000 సంవత్సరాలున్నట్టు. కలియుగంలో 4,32,000 సంవత్సరాల్లో ప్రస్తుతం మనం 5119వ సంవత్సరంలో ఉన్నట్టు. దీన్ని ప్రథమ పాదంగా చెబుతారు.

representative imageనిజానికి కలియుగం అంతంతో సృష్టి కూడా ముగుస్తుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే 71 మహా యుగాలు (ఒక్కో మహాయుగం 43,20,000 సంవత్సరాలు) కలిస్తే  ఒక మన్వంతరం పూర్తయినట్టు. ఇలాంటి 14 మన్వంతరాలు బ్రహ్మదేవునికి ఒక పగలుతో సమానం. దీన్నే కల్పం అంటారు. ఒక్కో మన్వంతరంలో భూమండలాన్ని ఒక్కో మనువు పాలిస్తుంటాడు. వీరిని బ్రహ్మదేవుడు నియమిస్తాడు. ప్రస్తుతం ఏడవ మన్వంతరం అయిన వైవస్వతం నడుస్తోంది. ఒక మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి గనుక... కలిగయుగంలో 28వ మహాయుగం నడుస్తోంది. ఇలా 14 మన్వంతరాలు పూర్తయిన తర్వాత బ్రహ్మదేవుడు సృష్టిని ఆపేస్తాడు. దాంతో ప్రళయం వచ్చి సమస్త ప్రాణీ అంతరించిపోతుంది. ఆ ప్రళయానంతరం వచ్చే 14 మన్వంతరాల కాలం బ్రహ్మకు రాత్రి కాలం. దాంతో ప్రశాంత నిద్రలో ఉంటాడు. ఈ 28 మన్వంతరాలతో బ్రహ్మదేవుడికి ఒక రోజు పూర్తవుతుంది. ఆ తర్వాత ఆయన మళ్లీ సృష్టిని మొదలు పెడతాడని చెబుతుంటారు. ప్రస్తుతం శ్వేతవరాహ కల్పం నడుస్తోంది. ఈ కల్పం బ్రహ్మదేవునికి 51 సంవత్సరంలోని కల్పంగా చెబుతారు. బ్రహ్మదేవునికి, ఆయన సృష్టి కార్యక్రమానికి ఇలా 100 కల్పాల కాలం ఆయుర్దాయంగా పేర్కొంటారు. మరి ఈ లెక్కన ఏడవ మన్వంతరంలోని 28వ మహాయుగంలోని కలియుగంలో ఉన్నాం గనుక ఈ యుగంతో సృష్టి కూడా ముగుస్తుందనడానికి లేదని అర్థం అవుతోంది. నిజానికి ఇవన్నీ మనుష్యులగా మన లెక్కలేనని తెలుసుకోవాలి.

వసంత రుతువుతో...
వసంత రుతువుతో ఉగాది మొదలవుతుంది. చెట్లు చిగురించి ప్రకృతి సరికొత్తదనాన్ని సంతరించుకోవడం కనిపిస్తుంది. సూర్యుని చుట్టూ భూమి కొంచెం వంగి తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఆరు రుతువులు ఏర్పడ్డాయి. వసంతరుతువు (చైత్రం, వైశాఖ మాసాలు), గ్రీష్మ రుతువు (జ్యేష్ఠ, ఆషాడ మాసాలు), వర్ష రుతువు (శ్రావణ, భాద్రపద మాసాలు), శరదృతువు (ఆశ్వయుజ, కార్తీక మాసాలు), హేమంత రుతువు (మార్గశిర, పుష్య మాసాలు), శిశిర రుతువు (మాఘం, ఫాల్గుణం).

ఉగాది పచ్చడి
representative imagerepresentative imageతీపి, చేదు, కారం, ఉప్పు, పులుపు, వగరు వీటన్నింటి కలయికే ఉగాది పచ్చడి. సంతోషం, కష్టాలు, బాధలు, సమస్యలు, అపజయాలు ఇలా అన్నింటి సమన్వితమే జీవితం కనుక... ఆరు రుచులతో నూతన సంవత్సరాదిన శరీరాన్ని సిద్ధం చేసుకోవడం ఉగాది పచ్చడి విశిష్టతగా చెబుతారు. మామిడి తరుగు, బెల్లం, ఉప్పు, మిరియాల పొడి లేదా మిరపకాయలు, వేప పువ్వు వీటితో పచ్చడి చేస్తారు. ప్రాంతాలకు అనుగుణంగా వీటిలో చింతపండు పులుసు, జీడిపప్పు, అరటి పండు ముక్కలు, పంచదార ఇలా భిన్న రకాలను కూడా కలుపుకోవడం ఆచరణలో ఉంది.

పంచాంగ శ్రవణం
representative imageసంవత్సర గమనాన్ని సంపూర్ణంగా తెలియజేసేదే పంచాంగం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఇవే పంచ అంగాలుగా పంచాంగం రూపుదిద్దుకుంది. కాలగమనాన్ని పండితులు ఇందులో వివరంగా పేర్కొంటారు. ఉగాది పర్వదినాన పండితులు పంచాంగ పఠనం చేస్తారు. ఆ సంవత్సరంలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయో వివరిస్తారు. వీటిని వినడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయని శాస్త్ర ప్రమాణం. ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగ పఠనాన్ని వినడం మంచిదని చెబుతారు.

ఇతర రాష్ట్రాల్లోనూ...
ఉగాదిని తెలుగు, కన్నడ ప్రజలు ఒకే రకంగా జరుపుకుంటారు. దీన్ని మహరాష్ట్రలో గుడి పడ్వాగా, తమిళనాడులో పుత్తాండు, కేరళలో విషు, పశ్చిమబెంగాల్ లో బైశాఖ్, సిక్కులు వైశాఖీగానూ జరుపుకుంటారు. ఈజిప్టు, పర్షియన్ సంప్రదాయల్లోనూ ఈ రోజును నూతన సంవత్సర ప్రారంభ దినంగా పరిగణిస్తుంటారు.
Tue, Mar 28, 2017, 04:53 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View