సీలింగ్ ఫ్యాన్లకూ బ్లూటూత్ రిమోట్, బెడ్ లైట్.. ఫ్యాన్ కొనేముందు ఇవి తెలుసుకోండి!
Advertisement

మనం ఫ్యాన్ లేకుండా కొంత సేపు కూడా ఉండలేం. చివరికి చలికాలంలోనూ తక్కువ వేగంతో అయినా ఫ్యాన్ పెట్టుకోనిదే నిద్ర కూడా పట్టదు. చాలా మంది ఇళ్లలో ఏదో ఒక ఫ్యాన్ బిగించుకుంటుంటారు. వాటితో వచ్చే గాలి, కరెంటు వినియోగం వంటి అంశాలను పెద్దగా పట్టించుకోరు. కొందరు బాగా వేగంగా తిరిగే ఫ్యాన్ అయితే చాలనుకుంటారు, మరికొందరు తక్కువ ధరలో లభిస్తుందా? లేదా? అన్నది మాత్రమే చూస్తారు. ఫ్యాన్ల నుంచి వచ్చే గాలి, ధరతో పాటు వాటి నాణ్యత, కరెంటు ఖర్చును కూడా పరిశీలిస్తే.. ఎలాంటి ఫ్యాన్ తీసుకోవడం మంచిదో తెలుస్తుంది. అత్యంత తక్కువ విద్యుత్ తో బాగా గాలిని ఇచ్చే సూపర్ ఫ్యాన్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. నేరుగా రిమోట్, బ్లూటూత్ రిమోట్ లతో వేగం పెంచుకోవడం, తగ్గించుకోవడం వంటివి చేయగలిగే ఫ్యాన్లూ వచ్చాయి. మరి ఆ వివరాలు ఏమిటో ఒకసారి చూద్దాం.. 


ఎలా పనిచేస్తాయి?
సీలింగ్ ఫ్యాన్లుగానీ, టేబుల్ ఫ్యాన్లుగానీ నేరుగా ఎలాంటి చల్లదనాన్నీ ఇవ్వవని అందరికీ తెలిసిందే. కానీ అవి గాలిని గదిలో అన్ని వైపులా వీచేలా చేయడంతో.. సాధారణంగా మనలోంచి నిత్యం విడుదలయ్యే వేడి చల్లబడుతుంది. అదే సమయంలో మనకు పట్టిన చెమట వెంటనే ఆరిపోతూండడంతో.. హాయి గొలిపే అనుభూతి కలుగుతుంది. అంతే తప్ప ఫ్యాన్ నేరుగా ఎలాంటి చల్లదనాన్నీ ఇవ్వదు.

ఎవరు కనిపెట్టారు?
జర్మన్-అమెరికన్ అయిన ఫిలిప్ హెచ్.డీహెల్ అనే శాస్త్రవేత్త 1882లో సీలింగ్ ఫ్యాన్లను రూపొందించారు. చిత్రమైన విషయం ఏమిటంటే అప్పటికే మోటార్లు అందుబాటులో ఉన్నాయి. అలా కుట్టు మిషన్ కోసం రూపొందించిన ఒక మోటార్ ను వినియోగించుకుని ఫిలిప్ సీలింగ్ ఫ్యాన్ ను తయారు చేయడం గమనార్హం. దాదాపు ఇదే సమయంలో అమెరికాకు చెందిన షులేర్ స్కాట్స్ వీలర్ అనే శాస్త్రవేత్త అటూ ఇటూ తిరుగుతూ గాలి వీచే టేబుల్ ఫ్యాన్ ను తయారు చేశారు.

ఎంత ప్రదేశానికి ఎంత సామర్థ్యమున్న ఫ్యాన్ అవసరం?
సాధారణంగా వేగంగా తిరిగే ఫ్యాన్ కావాలంటూ కొనుగోలు చేస్తుంటాంగానీ.. గది వైశాల్యం ఎంత ఉంటే, ఎంత పరిమాణంలోని ఫ్యాన్ అవసరమన్నది చాలా మంది పట్టించుకోరు. మరి ఎంత ప్రదేశానికి ఏ ఫ్యాన్ అవసరమో చూద్దామా..
సాధారణ ఫ్యాన్లు
సాధారణంగా మనం కొన్నేళ్లుగా సీలింగ్ ఫ్యాన్లు వినియోగిస్తున్నాం. కాస్త పెద్ద పరిమాణంలో ఉండే ఈ ఫ్యాన్లలో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాన్ లోపలి కాయిల్ స్థాయిని బట్టి అతి తక్కువగా రూ.400 నుంచి అత్యధికంగా రూ.2,000 వరకు ఈ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి.
బీఈఈ 5 స్టార్ రేటెడ్ ఫ్యాన్లు
దాదాపు రెండు మూడేళ్లుగా బీఈఈ 5 స్టార్ రేటింగ్ సీలింగ్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ ఫ్యాన్లకంటే మరింతగా మెరుగుపర్చిన మోటార్లతో, విద్యుత్ ను సమర్థవంతంగా వినియోగించుకునేలా వీటిని అభివృద్ధి చేశారు. వివిధ కంపెనీలు ఈ 5 స్టార్ రేటెడ్ ఫ్యాన్లను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. వీటి ధరలు రూ.1,800 నుంచి రూ.4,500 వరకు ఉన్నాయి.
సూపర్ ఫ్యాన్లతో ఎంతో ఆదా
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల సీలింగ్ ఫ్యాన్లతో పోలిస్తే అత్యుత్తమ పనితీరు కనబరిచే సూపర్ ఎఫిషియెంట్ సీలింగ్ ఫ్యాన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటినే సూపర్ ఫ్యాన్ లుగా పిలుస్తున్నాం. వీటి ధరలు ఓ మోస్తరుగా ఎక్కువగా ఉన్నా.. వాటి పనితీరు విద్యుత్ ఆదాతో పోల్చితే ధర పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. వాటి నుంచి వీచే గాలి కూడా సాధారణ ఫ్యాన్లతో సమానంగానే ఉంటుంది కూడా. మోడల్ ను, రిమోట్ సౌకర్యాన్ని బట్టి సూపర్ ఫ్యాన్లు రూ. 2,800 నుంచి రూ.5,500 వరకు లభిస్తాయి.
కాపర్ కాయిల్ ఉంటేనే బెటర్
సీలింగ్ ఫ్యాన్లలో ఉండే కాయిల్ దేనితో తయారైందనేది చాలా ముఖ్యం. కొన్నేళ్లుగా చాలా తక్కువ ధరకు సీలింగ్ ఫ్యాన్లు లభిస్తున్నాయి. వాటిలో అల్యూమినియం కాయిల్ ను వినియోగిస్తున్నారు. దానివల్ల ఫ్యాన్ నాణ్యత తక్కువగా ఉండడంతో పాటు త్వరగా చెడిపోతాయి. అవి తిరిగే సామర్థ్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. పెద్దగా పేరు లేని కంపెనీలు తక్కువ ధరలో విక్రయించేందుకు ఈ తరహా ఫ్యాన్లను తయారు చేస్తుంటాయి. కాపర్ కాయిల్ ఉన్న ఫ్యాన్లు నాణ్యమైనవి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. వీటి తిరిగే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఫ్యాన్ల ధర ఎక్కువగా ఉంటుంది. దాదాపు అన్ని పేరున్న కంపెనీలు పూర్తిగా కాపర్ కాయిల్ తోనే ఫ్యాన్లు తయారు చేస్తాయి.

కాయిల్ మందం, పరిమాణాన్ని బట్టి ఫ్యాన్ వేగం
ఫ్యాన్ లో ఉండే కాయిల్ (తీగ) మందం, ఎంత పరిమాణంలో ఉందనే దానిని బట్టి ఫ్యాన్ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కాయిల్ మందం ఎక్కువగా ఉంటే ఫ్యాన్ ఎక్కువ కాలం మన్నుతుంది. తిరిగే సామర్థ్యం కూడా బాగుంటుంది. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల వంటి వాటితో పెద్దగా ఇబ్బంది ఉండదు.
రెక్కల విషయంలో జాగ్రత్త
సీలింగ్ ఫ్యాన్ ను అమర్చేటపుడుగానీ, శుభ్రం చేసేటప్పుడు, మరమ్మతు చేసేటప్పుడుగానీ దాని రెక్కల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సీలింగ్ ఫ్యాన్ రెక్కల అమరికలో ఏ మాత్రం తేడా వచ్చినా ఫ్యాన్ పనితీరు దెబ్బతింటుంది. గాలి కూడా సరిగా రాదు. రెక్కలు కనీసం 12 నుంచి 15 డిగ్రీల కోణంలో వంగి ఉండాలి. సమతలంగా ఉంటే గాలి రాదు. మరీ ఎక్కువ కోణంలో వంగి ఉంటే ఫ్యాన్ మోటార్ పై భారం పడి త్వరగా పాడవుతుంది.
ఫ్యాన్ రెగ్యులేటర్ కూడా కీలకమే..
సీలింగ్ ఫ్యాన్లకు మొదట్లో సాంప్రదాయ ఎలక్ట్రిక్ రెగ్యులేటర్లు వచ్చాయి. ఐదారు అంగుళాల పొడవు, నాలుగు అంగుళాల వెడల్పుతో చిన్న పెట్టెలా ఉండేవి. కొన్నేళ్ల కింద ఇళ్లలో అమర్చుకున్న ఫ్యాన్లకు సంబంధించి ఇప్పటికీ అలాంటి రెగ్యులేటర్లు ఉన్నాయి. చాలా తక్కువ ధరలో లభించే ఈ సాంప్రదాయ రెగ్యులేటర్లు కూడా కొంత విద్యుత్ ను ఉపయోగించుకుంటాయి. అయితే వీటిలో ఫ్యాన్ వేగాన్ని తగ్గించేందుకు వాడే రెసిస్టర్లు వేడెక్కి త్వరగా దెబ్బతినడంతో ఫ్యాన్ సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అనంతరం చిన్నగా స్విచ్ బోర్డులో పట్టేలా ఉండే ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో రెసిస్టర్లకు బదులుగా కెపాసిటర్లు వినియోగిస్తారు. ఇవి విద్యుత్ ను వినియోగించుకోవు. ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లలో నాబ్ టైప్, స్టెప్ టైప్ అని రెండు రకాలు ఉన్నాయి.
ఏసీ ఉండగా ఫ్యాన్ వేసుకుంటే బెటర్
సాధారణంగా ఏసీ పెట్టుకున్నప్పుడు ఫ్యాన్ వేసుకోవడం అనవసరం అని భావిస్తుంటారు. కానీ ఏసీ నడుస్తున్నప్పుడు ఫ్యాన్ వేసుకోవడం వల్ల లాభాలు చాలా ఉన్నాయి. సాధారణంగా గదిలో ఏసీకి దగ్గరగా కూర్చున్నవారికి ఎక్కువ చల్లగా ఉంటుంది. దూరంగా కూర్చున్నవారికి కాస్త తక్కువ చల్లదనం అందుతుంది. అదే కాస్త పెద్ద గది అయితే ఈ తేడా మరింత ఎక్కువగా ఉంటుంది. అదే ఫ్యాన్ వేసుకుంటే ఏసీ చల్లదనం గది నిండా సమానంగా పరుచుకుని.. గదిలో ఉన్నవారందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది.
టేబుల్-పెడస్ట్రల్ ఫ్యాన్లు, వాల్ మౌంట్ ఫ్యాన్లు
చిన్నగా ఉండి ఎక్కడికైనా తీసుకెళ్లి వినియోగించుకునేలా అందుబాటులో ఉన్నవే టేబుల్ ఫ్యాన్లు, పెడస్ట్రల్ ఫ్యాన్లు. చిన్న చిన్న గదులు, క్యాబిన్లు, సీలింగ్ ఫ్యాన్లు అమర్చుకోలేని చోట్లలో వినియోగానికి ఇవి అనుకూలం. ఏదైనా ఓ చోటుకు ప్రత్యేకంగా, ఎక్కువగా గాలి వీచాలనుకున్న సందర్భాల్లో ఉపయోగపడతాయి. వీటినే గోడకు అమర్చడానికి వీలుగా రూపొందించిన వాల్ మౌంట్ ఫ్యాన్లు అంటారు. వీటి విద్యుత్ వినియోగం మోటార్ సామర్థ్యాన్ని బట్టి 45 వాట్ల నుంచి 150 వాట్ల వరకు ఉంటుంది.
Wed, Feb 22, 2017, 02:23 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View