ఆసక్తి గొలిపే రోబోలు... అన్ని పనులు చేసిపెట్టే మర మనుషులు!
Advertisement
మర మనుషులు (రోబో) అసలైన మనుషుల ఆశలకు ఓ ప్రతిరూపంలా మారుతున్నాయి. మన జీవితాన్ని మరింత సౌకర్యవంతం చేస్తున్నాయి. మరి ఇలాంటి ఆసక్తికరమైన రోబోల సంగతులు తెలుసుకుందాం.

రోబోలు ఇంట్లో ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతాయి. చిన్నారులతో ఆడుకుంటాయి. పెట్స్ ను చూసుకుంటాయి. యజమానులు ఏం ఆదేశిస్తే అది చేసిపెడతాయి. రోబో సినిమా చూసే ఉంటారు. రజనీకాంత్ సృష్టించిన చిట్టి తిరిగి అతడినే శాసించే స్థాయికి చేరుకోవడంతో అప్పుడు రజనీనే స్వయంగా దాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాడు. ఇలా రోబోల పనితీరు గురించి చెప్పిన సినిమాలు చాలానే ఉన్నాయి.

ఆసుస్ జెన్ బో

ఆసుస్ కంపెనీ రూపొందించిన ఈ జెన్ బో రోబో అయితే ఇంట్లో పనులకు చక్కగా సాయపడుతుంది. ఈ రోబోలో ఎన్నో కెమెరాలు, సెన్సర్లను అమర్చడం వల్ల దానంతట అదే ఇల్లంతా కలియతిరుగుతుంది. దీని  టచ్ స్క్రీన్ భావాలను కూడా వ్యక్తీకరిస్తుంది. స్పీకర్లు, మైక్రోఫోన్లు మన మాటలకు స్పందించేందుకు వీలు కల్పిస్తాయి. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వాళ్లను కనిపెట్టుకుంటుంది. వారికి ఏదైనా అయితే వెంటనే సంరక్షకులను అప్రమత్తం చేస్తుంది. పాటలు పాడడం, డాన్స్ చేయడం ద్వారా చిన్నారులను ఊర్రూతలూగిస్తుంది. దీని ధర 600 డాలర్లు (మన రూపాయిల్లో సుమారు 40వేలు). అంటే ఓ ఖరీదైన స్మార్ట్ ఫోన్ ధర అంత.

సాఫ్ట్ బ్యాంకు పెప్పర్representative image
ఇది హ్యుమనాయిడ్ రోబో. చక్రాల సాయంతో నడుస్తుంది. కెమెరా, సెన్సార్లు తలలో అమర్చి ఉంటాయి. ఛాతీ భాగంలో టచ్ స్క్రీన్ ఉటుంది. మాట్లాడుతుంది. మన భావాలను అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా మనతో ప్రవర్తిస్తుంది. మూడీగా ఉంటే గుర్తించి వినోదాన్ని అందిస్తుంది. దీని ధర 1,98,000 యెన్ లు (మన రూపాయిల్లో రూ.1.12 కోట్లు). ప్రస్తుతం ఇది జపాన్ కే పరిమితం. ప్రస్తుతం ఇంటి పనుల్లో సాయంగా పనికివస్తున్న ఈ చిట్టిని సాఫ్ట్ బ్యాంకు త్వరలో దుకాణాల్లోనూ సహాయకుడిగా ఉండేందుకు అనువుగా మెరుగులు దిద్దుతోంది.

జిబో


ఇది ప్రపంచంలోనే తొలి ఫ్యామిలీ రోబో. పరిమాణంలో చాలా చిన్నది. దీని ధర 750 డాలర్లు (రూపాయిల్లో 51,000). ఇది మాట్లాడుతుంది. స్క్రీన్ సాయంతో భావాలను వ్యక్తీకరిస్తుంది. దీనిలో ఉన్న కెమెరాలు, మైక్రోఫోన్ల సాయంతో చిన్నారులను ఆడిస్తుంది. పెద్ద వయసు వారిపై ఓ కన్నేసి ఉంచి వారిని సమయానుకూలంగా హెచ్చరిస్తుంటుంది. చేయవల్సిన పనులను గుర్తు చేస్తుంది. ఒంటరి వారికి ఓ తోడులా పనిచేస్తుంది.

representative imageఅమేజాన్ ఎకో

ఇది రోబో కంటే తక్కువ. గాడ్జెట్ కంటే ఎక్కువ వంటిది. ఇది అమెరికా మార్కెట్లోకి ఇప్పటికే అడుగు పెట్టేసింది. సంగీతాన్ని వినిపిస్తుంది. ఇంట్లో లైట్లు, వాషింగ్ మెషిన్లు ఇలా ఎన్నింటినో ఆపరేట్ చేయగలదు. ఇంటిని స్మార్ట్ గా మార్చేస్తుంది. వాతావరణం గురించి తెలియజేస్తుంది. ఫ్రెంచ్ ఓపెన్ స్కోరు ఎంతో కూడా చెప్పేయగలదు. వెంట కారులో తీసుకెళితే ట్రాఫిక్ సమాచారం కూడా చెబుతుందట. రోబోలాంటి ఈ గాడ్జెట్ ను అమేజాన్ నిరంతరం అభివృద్ధి పరచడంపై దృష్టి సారించింది.

డైసన్ 360 ఐ.

ఇది బ్రిటన్ ప్రజలకు చేరువలో ఉన్న రోబో. పేరు డైసన్ 360ఐ. దీని ధర 1,50,000 యెన్ లు (రూపాయల్లో రూ.85.5లక్షలు). దీనిలో ఉన్న కెమెరాలు, లేజర్ల సాయంతో ఇంట్లో ఫ్లోర్ ను స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత నేలపై ఒక్క మచ్చ కూడా లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేస్తుంది.

కురి

మేఫీల్డ్ రోబోటిక్స్ అనే సంస్థ దీన్ని రూపకర్త. ఇదో ఇంటెలిజెంట్ రోబో. అరమీటరు ఎత్తు, ఆరు కిలోల బరువు ఉండే ఇది ఓ చక్కని సహాయకారిగా పనిచేస్తుంది. లేజర్ ఆధారిత సెన్సార్, కెమెరాలతో ఉంటుంది. ఓసారి ఇంటిని ఆసాంతం మ్యాప్ చేసేసుకుంటే ఇక ఆ తర్వాత ఎక్కడ ఏది ఉందో తేలిగ్గా గుర్తుంచుకుంటుంది. దానంతట అదే చార్జింగ్ స్లాట్ పైన కూర్చుని రీచార్జ్ అవుతుంది. ఇంట్లో చిన్నారులతో కలసి డ్యాన్స్ చేస్తుంది. మాటలను అర్థం చేసుకుని అందుకు తగినట్టు స్పందిస్తుంది. మాట్లాడలేకపోయినా తల ఆడిస్తూ సైగలు, శబ్ధాల ద్వారా భావాలను తెలియజేస్తుంది.  

మిలో రోబో

అమెరికాకు చెందిన హ్యుమనాయిడ్ తయారీ కంపెనీ రోబోకైండ్ మిల్ రోబోను రూపొందించింది. ఆటిజంతో బాధపడుతూ ఏ పనులూ చేసుకోలేని చిన్నారుల సాయం కోసం ఈ రోబోను రూపొందించారు. పిల్లలకు మెలకువలను నేర్పడంలో పెద్దలకు సాయ పడుతుంది. రోబో కళ్ల వెనుక కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల చిన్నారుల ప్రవర్తనకు అనుగుణంగా స్పందిస్తుంది.

ఎక్సో జీటీ

క్యాలిఫోర్నియాలోని రిచ్ మండ్ కేంద్రంగా పనిచేసే ఎక్సో బయోనిక్స్ కంపెనీ ఎక్సో జీటీ పేరుతో ఓ రోబోను తయారు చేసింది. పక్షవాతం, వెన్నెముకకు గాయం కారణంగా సొంతంగా నడవలేని పరిస్థితుల్లో ఉంటే... అటువంటి వారి కోసం ఈ రోబో సూట్ ఉపకారిగా ఉంటుంది. టైటానియం, అల్యూమినియం , బ్యాటరీతో పనిచేసే మోటర్లను ఇందులో అమర్చారు. దీని సాయంతో రోగులు నడవడం సాధ్యపడుతుంది.
 
డెకా రోబో

రోబోటిక్ టెక్నాలజీకి బయోనిక్ అవయవాలు మరింత వన్నె తెచ్చాయనే చెప్పుకోవచ్చు. అవయవాలు లేకుండా జన్మించిన వారు, ప్రమాదాల్లో కోల్పోయిన వారికి డెకా రోబో చేయి మంచి ఉపకారి అని చెప్పుకోవచ్చు. అమెరికా డిఫెన్స్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ దీన్ని రూపొందించింది. ఇటువంటి వారు డెకా రోబో చేయి సాయంతో వస్తువులను పట్టుకోవడం సాధ్యమవుతుంది.

ఎల్ జీ రోలింగ్ బాట్

ఇది ఇంట్లో ఉంటే చాలు... యజమాని ఎక్కుడున్నా నిశ్చింతగా ఉండవచ్చు. వైఫై ఆధారిత సెక్యూరిటీ రోబోగా పనిచేస్తుంది. ఇంట్లో ఆ మూల నుంచి ఈ మూల వరకు కలియతిరుగుతుంది. ఎప్పుడైనా పని మీద బయటకు వెళితే... ఇంట్లో కాపలాగా ఎవరినీ ఉంచనవసరం లేదు. దీని ద్వారా ఇంటి దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు.
 
వంట మాస్టర్ రోబో

ఈ రోబోను తెచ్చుకుంటే నోరూరించే వంటకాలను చేసి పెడుతుంది. కానీ, ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదు. 2017లో వస్తుందని అంచనా. మోలే రోబోటిక్స్ దీని రూపకర్త. రెండు రోబో చేతులను కిచెన్ లో అమర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెరైటీ వంటలను ఓసారి చేసి దీనికి చూపిస్తే చాలు... ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ వెరైటీ అంటే ఆ వైరైటీని నిమిషాల్లో సిద్ధం చేసి పెడుతుంది. దీన ధర 50వేల పౌండ్లు ఉండవచ్చని (రూపాయిల్లో రూ.41 లక్షలు) అంచనా.

హోండా అసిమో

ఈ హ్యూమనాయిడ్ రోబోను హోండా సంస్థ రూపొందించింది. నాలుగు అడుగుల ఎత్తు, 54 కిలోల బరువుతో ఉండే ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. చిన్న సందేశాలతోనే సులువుగా పనులు చేసేస్తుంది. ఇంగ్లిష్, జపానీస్, చైనీస్ భాషల్లో మాట్లాడుతుంది. 2020 నాటికి జపాన్ లో పర్యాటకులకు ఇది సాయకారిగా నిలుస్తుందని హోండా సంస్థ ఆశిస్తోంది.

రోబోలు ఎలా పనిచేస్తాయి...?representative image
రోబోల పనితీరు మనిషి భౌతిక లక్షణాలను అనుకరించేలా రూపొందిస్తారు. ఉక్కు బాడీ, సెన్సార్లు, విద్యుత్తు, కంప్యూటర్ ప్రోగ్రామ్ తదితర ఫీచర్లతో ఇవి ఉంటాయి. అన్ని రోబోలూ మనిషి ఆకారాన్ని పోలి ఉండవు. మానవ రూపాన్ని పోలి ఉన్న వాటిని హ్యూమనాయిడ్ రోబోలని పిలుస్తారు. కొన్ని నిర్దేశిత  చర్యలను రోబోలు వాటంతట అవే చేసేలా కంప్యూటర్ ప్రోగ్రామ్ ను రూపొందిస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ప్రొగ్రామ్ ను మార్చడం ద్వారా రోబో పనితీరును శాసించవచ్చు. రోబోలను బయటి నుంచి నియంత్రించేలా లేదా అంతర్గతంగానే నియంత్రించేలా చేస్తారు.

రోబోలు కదిలేందుకు వీలుగా చక్రాలు లేదా కాళ్లు లేదా ఇతర పరికరాలను ఏర్పాటు చేస్తారు. మన శరీరంలో జాయింట్ల మాదిరిగా ఎన్నో భాగాలను కలపడం ద్వారా రోబో నిర్మాణం పూర్తవుతుంది. రోబోను కదిలించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ మోటార్లు, సోలెనాయిడ్లను వాడతారు. కొన్నింటిలో హైడ్రాలిక్ లేదా న్యూమాటిక్ వ్యవస్థలను ఉపయోగిస్తారు. ఇవి బ్యాటరీ సాయంతో పనిచేస్తాయి. రోబోల్లో సెన్సార్ వ్యవస్థ, కెమెరాల అమరిక ఉంటుంది. రోబోలను ముట్టుకుంటే కందిపోయే, అచ్చమైన మనిషి శరీరం అనిపించే రీతిలో సిలికాన్ బాడీతో రూపొందించడం కూడా జరిగింది.

రోబో సృష్టి

మొదటిసారిగా రోబోను గ్రీక్ మ్యాథమ్యాటీషియన్ ఆర్చిటాస్ క్రీస్తు కంటే ముందు (బీసీ) 350 కాలంలో రూపొందించినట్టు చెబుతారు. ఎగిరే చెక్క పరికరం ఇది. గాల్లో 300 మీటర్ల మేర ఇది ప్రయాణించేది. ఆర్చిటాస్ తాను రూపొందించిన రోబోకు స్టీమ్ ఇంజన్ ను అమర్చి ఉండవచ్చని నమ్ముతారు. అయితే, ఇది ఎక్కువ కాలం పాటు అందుబాటులో లేకపోవడంతో దీని నిర్మాణం గురించి పెద్దగా తెలియలేదు. ఆ తర్వాత 200 (బీసీ) కాలంలో సెసిబస్ అనే మరో గ్రీకు వ్యక్తి ఆటోమేటడ్ వాటర్ క్లాక్ ను, కదిలించే చేతులతో రూపొందించాడు. హ్యుమనాయిడ్ రోబోను మొదటి సారిగా 1928లో లండన్ లోని మోడల్ ఇంజనీర్స్ సొసైటీ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు.

ఆధునిక రోబోలు

ప్రస్తుతం చూస్తున్న అడ్వాన్స్ డ్ రోబోలకు ఆద్యుడు ఇంగ్లండ్ కు చెందిన విలియమ్ గ్రే వాల్టర్. 1948లో ఆయన తొలి ఎలక్ట్రానిక్ అటానమస్ రోబోను తయారు చేశారు. ఆ తర్వాత నుంచి రోబోల విషయంలో విస్తృతమైన పరిశోధనలు జరిగాయి.  

మొబైల్ రోబోలు

మొబైల్ రోబోలన్నవి ఒక లొకేషన్ కే పరిమితం కాకుండా పనిచేసేవి. ఇందుకు ఉదాహరణ ఆటోమేటెడ్ గైడెడ్ వెహికల్. స్వయం చోదక వాహనం అన్నమాట. మిలటరీలోనూ మొబైల్ రోబోల వాడకం ఉంది.

representative imageఇండస్ట్రియల్ రోబోలు

ఆటోమేటిక్ గా నియంత్రణ కలిగినవి. బహుళ విధాలుగా పనిచేసేవి. ఒకే ప్రదేశంలో స్థిరంగా లేదా మొబైల్ రూపంలోనూ పనిచేస్తాయి. ఒకటి లేదా ఎన్ని చేతులు అయినా ఉండవచ్చు. ఏక కాలంలో పలు రకాల పనులు చేసే విధంగా వీటిని రూపొందిస్తారు. పరిశ్రమల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంది. వస్తు తయారీ, తయారైన వస్తువులను ఒక చోట నుంచి మరో చోటకు తరలించడం తదితర పనుల కోసం వీటిని వాడుతుంటారు.

ఆటోమొబైల్ పరిశ్రమలోనూ రోబోల వినియోగం ఎక్కువగా ఉంది. వెల్డింగ్, పెయింటింగ్ తదితర పనులకు వీటిని ఉపయోగిస్తున్నారు. ప్రతీ పది మంది కార్మికులకు ఓ రోబో చొప్పున వినియోగం ఉంది. అలాగే వస్తువుల ప్యాకింగ్ లో, ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీలో, వేర్ హౌస్ లు, కంటెయినర్ పోర్టులలోనూ రోబోల వాడకం ఉంది. గనుల తవ్వకాల్లో, ప్రపంచ వ్యాప్తంగా ల్యాబొరేటరీల్లో పరిశోధనలకు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. పండ్ల తోటల్లో పండ్లు తెంపేందుకు, కాయలు కోసే పనులకు ఉపయోగిస్తున్నారు.

ఎడ్యుకేషనల్ రోబో

విద్యా సంస్థల్లో రోబోలను ఉపయోగించుకోవడం 1980ల నుంచే మొదలైంది. లెక్కలు, ఫిజిక్స్, ప్రొగ్రామింగ్, ఎలక్ట్రానిక్స్ గురించి విద్యార్థులు నేర్చుకునేందుకు రోబోలు సాయపడతాయి. పాఠశాలలు, కాలేజీ విద్యార్థుల మధ్య రోబోల తయారీపై పోటీలు పెట్టడం కూడా చూస్తూనే ఉన్నాం.

మిలటరీ రోబోలుrepresentative image

కొన్ని దేశాలు తమ సైన్యంలో రోబోల సేవలను వినియోగిస్తున్నాయి. కొన్ని రకాల స్వతంత్ర చర్యలను అవి చేపట్టే విధంగా వాటిని రూపొందిస్తున్నారు. అయితే, వీటిని శత్రుదేశాల సైనికులు తమ స్వాధీనంలోకి తీసుకుని తిరిగి అవి ఏ దేశానికి చెందినవో ఆ దేశ సైనికులపైనే పోరాటానికి వినియోగిస్తే ఎలా? అన్న ఆందోళన ఉంది. మిసైల్స్, బాంబుల జారీ పనులను వీటికి అప్పజెబితే ఇక స్వయం వినాశనం కొనితెచ్చుకున్నట్టేనన్న భయాలు కూడా ఉన్నాయి.

representative imageఅంతరిక్షంలోకి...

అంతరిక్షంలోకి రోబోలను పంపడం 1960ల నుంచే అమల్లో ఉంది. టెలీరోబోలు అనేవి వాటంతట అవి ఆపరేట్ చేయలేవు. సమీపంలో ఓ వ్యక్తి ఉండి నియంత్రించేవి. ప్రమాదకరమైన విధుల నిర్వహణలో భాగంగా ప్రాణాలు రక్షించుకునేందుకు మనుషులకు బదులు టెలీ రోబోలను ఆ పనులకు ఉపయోగిస్తుంటారు.

ఇళ్లల్లో పనులకోసం

ఇంట్లో నేల తుడవడం దగ్గర నుంచి వస్తువులను అందించడం తదితర పనులు చేసిపెట్టే రోబోల గురించి తెలిసే ఉంటుంది. నేడు ఎక్కువ మంది ఉధయం లేచింది మొదలు, రాత్రి నిద్రించే వరకు ఎన్నోపనుల్లో మునిగి తేలుతున్నారు. మహిళలు సైతం ఉద్యోగాలు చేయడానికే ఆసక్తిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ చేసే రోబోలను చాలా దేశాల్లో ఉపయోగిస్తున్నారు. మన దేశంలో మిలా గ్రో, ఫిలిప్స్, యూరేకా ఫోర్బ్స్, ఎక్స్ లెంట్ రెడీమెయిడ్, ఓ డస్టర్ ఇలా చాలా రకాల ఫ్లోర్ క్లీనర్లు లభిస్తున్నాయి.  

హాస్పిటల్స్ లో


హాస్పిటల్స్ లో సర్జరీ సమయాల్లో, ఫార్మసీల్లో సాయపడేందుకు వీలుగా రోబోలు ఉపయోగిస్తున్నారు. అలాగే, రోగులకు సాయంగా ఉండేవి కూడా ఉన్నాయి.

పరిశోధనలు

మనుషులకు మరింతగా సాయపడేలా రోబోలను తయారు చేయడంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధాప్యం మీద పడిన వారికి సహాయకారిగా వుండే రోబోలను డిజైన్ చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. అమెరికాలో 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 13 శాతం కాగా, జపాన్ లో 20 శాతం మంది ఉన్నారు. అందుకే ఈ దేశాల్లో వృద్ధుల రోజువారీ పనులకు తోడ్పడే వాటిని రూపొందించే పనులు జరుగుతున్నాయి.

రోబోల చిరునామా...?representative image

ఈ ప్రపంచంలో ఉన్న రోబోల్లో సగం ఆసియాలోనివే. యూరోప్ లో 32 శాతం, నార్త్ అమెరికాలో 16 శాతం, ఆస్ట్రేలియాలో ఒక శాతం, ఆఫ్రికాలో ఒక శాతం ఉన్నాయి.

రోబోలు ఏ స్థాయికి...?

2019 నాటికి రోబో బ్రెయిన్ ఆవిష్కరణ సాధ్యమేనని ఓ శాస్త్రవేత్తల టీమ్ ప్రకటించింది. 2050 నాటికి మేధోపరంగా రోబోలు విజయం సాధిస్తాయన్న అంచనాలు ఉన్నాయి.  ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో కీలక పాత్ర పోషించనుంది. కంప్యూటర్లు, రోబోలు స్వతంత్రను సాధించగలవా? అన్న అంశంపై కూడా శాస్త్రవేత్తల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ ఇలాంటివి సాద్యమైతే వచ్చే ముప్పుపై కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి.
Fri, Jan 06, 2017, 01:56 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View