ఐటీ చట్టంలో మార్పులు... స్వచ్చందంగా వెల్లడించకుంటే అంతా పోయినట్టే! బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే వచ్చే చిక్కులేంటి...?
Advertisement

నల్లధనంపై పోరును కేంద్ర సర్కారు మరింత తీవ్రతరం చేసింది. ఇప్పటికే పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం... వాటిని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు అవకాశమిచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఖాతాల్లో డిపాజిట్ చేస్తున్న వారి ముక్కు పిండి మరీ పన్నులు రాబట్టుకునేందుకు ఆదాయపన్ను (ఐటీ) చట్టంలో మార్పులు తీసుకువస్తోంది. 

ఒకవైపు నల్లధనం కలిగిన వారికి మరో అవకాశం ఇస్తూనే... మరోవైపు మధ్యతరగతి వారు సైతం బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తే పన్ను కట్టాల్సిన పరిస్థితి కల్పించేలా సవరణలతో కూడిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో చట్ట సవరణలు, పన్ను నిబంధనలు, జరిమానాలు, బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ల ద్వారా వచ్చే చిక్కుల గురించి తెలుసుకుందాం...

గరీబ్ కల్యాణ్ యోజన

లెక్కలు చూపలేని, ఆదాయ మూలాలు తెలియజేయలేని స్థితిలో భారీగా నగదును కలిగిన వారికి కేంద్ర సర్కారు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద వెల్లడించే ఆదాయం మొత్తం విలువలో 30 శాతం పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ 30 శాతంపై 33 శాతం సర్ చార్జ్ చెల్లించాలి. అంటే మొత్తం 40 శాతం. దీనికి అదనంగా జరిమానా కింద 10 శాతం కట్టాలి. ఉదాహరణకు రూ.50 లక్షల ఆదాయం వెల్లడించే వారు 25 లక్షల రూపాయలను పన్ను, జరిమానా రూపంలో కోల్పోతారు. అలాగే, వెల్లడించిన ఆదాయం మొత్తంలో మరో 25 శాతాన్ని అంటే రూ.12.5 లక్షలను ప్రభుత్వం పేర్కొనే ప్రత్యేక అకౌంటులో నాలుగేళ్ల పాటు ఉంచాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లించదు. నాలుగేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.

representative image

స్వచ్చందంగా వెల్లడించకుంటే అంతా ప్రభుత్వపరమే!

ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే గరీబ్ కల్యాణ్ యోజన కింద 50 శాతం పన్నుతో బయటపడే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని కాదనుకుని తమ దగ్గర ఉన్న నల్లధనం గురించి బయటకు చెప్పలేని వారు తదనంతర పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. ఇలాంటి వారు ఆదాయపన్ను శాఖ దాడుల్లో దొరికిపోతే నిండా మునిగినట్టే. ఎందుకంటే ప్రభుత్వం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 115బీబీఈ నిబంధనకు ప్రతిపాదించిన సవరణ ప్రకారం... ఐటీ దాడుల్లో ఎవరైనా లెక్కల్లో చూపని భారీ ఆదాయంతో పట్టుబడితే వారి మొత్తం విలువలో 85 శాతం ప్రభుత్వ పరం అవుతుంది. చివరికి మిగిలేది 15 శాతమే. 

బయటకు వెల్లడించని నగదు, పెట్టుబడులు, ఆస్తుల విలువలో 60 శాతాన్ని పన్నుగా వసూలు చేస్తారు.  ఈ 60 శాతం పన్నుపై 25 శాతం సర్ చార్జ్ ఉంటుంది. అంటే ఇక్కడికి  75 శాతం అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా తమ ఆదాయం, ఆస్తుల వివరాలను దాచిపెట్టినందుకు ఆదాయపన్ను శాఖ అధికారులు 10 శాతం జరిమానా విధించే అధికారం ఉంది.  సెక్షన్ 271ఏఏసీ వారికి ఈ అధికారాన్ని ఇస్తోంది. ఆ విధంగా మొత్తం 85 శాతం వసూలు చేస్తారు.

జరిమానా భారీగా పెంపు

సోదాలు, జప్తులకు సంబంధించి పన్ను, జరిమానా నిబంధనలను కూడా కేంద్రం కఠినతరం చేసింది. ఇందుకోసం సెక్షన్ 271ఏఏబీకి సవరణ ప్రతిపాదించింది. ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాలు, జప్తుల సమయంలో రుజువులు చూపలేని ఆస్తులు, నగదు బయటపడిందనుకోండి. సెక్షన్ 115బీబీఈ కింద పన్ను, సర్ చార్జ్ కి తోడు... 271ఏఏబీ కింద లెవీ కూడా విధిస్తారు. అంటే ఒకవేళ నల్లధనాన్ని కలిగి దాన్ని స్వచ్చందంగా వెల్లడించకుంటే... అది దాడుల సందర్భంగా బయటపడితే 30 శాతం జరిమానా విధించే అధికారం తాజా సవరణలతో ఐటీ అధికారులకు లభిస్తుంది. ఇది కూడా తాను పన్ను ఎగవేసినట్టు అంగీకరిస్తేనే! ఒకవేళ తాను పన్ను ఎగ్గొట్టినట్టు ఒప్పుకోకుండా ఆకాశ రామన్న కథలు చెబితే 60 శాతం జరిమానా విధించే అధికారం అధికారులకు ఉంటుంది.

representative image

ఉదాహరణకు...

సెక్షన్ 115బీబీఈ: పన్ను 60 శాతం. ఈ పన్నుపై 25 శాతం సర్ చార్జ్. పన్ను సర్ చార్జ్ పై 3 శాతం సెస్... మొత్తం కలుపుకుంటే 77.25 శాతం. దీనిలో ఏ విధమైన మినహాయింపులు లేవు.  ఉదాహరణకు రూ.5 లక్షల విలువ మేర పెట్టుబడులు, నగదు, ఇతర ఆస్తులు బయటపడ్డాయనుకుంటే... దీని మొత్తంలో 77.25 శాతం సుమారు రూ.3,86,250ను అధికారులు వసూలు చేస్తారు.

271ఏఏసీ: ఆదాయపన్ను శాఖ అధికారి తన దాడుల సందర్భంగా ఆదాయం, ఆస్తులను సెక్షన్ 115బీబీఈ కింద పరిగణిస్తే... 60 శాతం పన్నుపై 10 శాతం పన్ను విధించే అధికారం ఉంది. అంటే పైన చెప్పుకున్నట్టు రూ.5 లక్షల మొత్తంపై 60  శాతం పన్ను రూ.3,00,000 కాగా, దీనిపై రూ.30,000వేలను జరిమానా రూపంలో వసూలు చేస్తారు. మొత్తం కలుపుకుంటే రూ.4,16,250 (83.25 శాతం) వరకు ప్రభుత్వానికి వెళ్లిపోతుంది. మిగిలేది రూ.84 వేలు. అదే గరీబ్ కల్యాణ్ యోజన కింద చెప్పేస్తే రూ.5లక్షల్లో రూ.2.5 లక్షలు అయినా మిగులుతాయి. 

representative image

తప్పించుకునే మార్గం లేనట్టే...

లెక్కల్లో చూపని ఆదాయం ఉండి, దాన్ని నోట్ల రద్దు ప్రకటన తర్వాత బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసి ఉంటే... దాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం కింద చూపించి నిర్ణీత రేటు ప్రకారం పన్ను చెల్లించి బయటపడే మార్గాలకు సెక్షన్ 115బీబీఈ చెక్ పెడుతుందని నిపుణులు అంటున్నారు. ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల మేరకు పన్ను చెల్లింపు దారులు ఆదాయం తక్కువ చూపించినట్టు (అండర్ రిపోర్టింగ్) తేలితే పన్ను మొత్తంపై 50 శాతం జరిమానాగా విధించవచ్చు.

 ఒకవేళ కావాలని పన్ను ఎగ్గొట్టడానికి ఆదాయం తప్పుగా చూపించినట్టు తేలితే పన్నుపై 200 శాతం వరకు జరిమానా విధించవచ్చు. ఈ నిబంధనను అవకాశంగా తీసుకుని ప్రస్తుతం తమ వద్దనున్న నల్లధనాన్ని అండర్ రిపోర్టింగ్ ఆదాయంగా పేర్కొని 50 శాతం జరిమానాతో తప్పించుకునేందుకు వీలు పడదంటున్నారు నిపుణులు. ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులోని సవరణలు ఈ లోపాలను పరిహరించేవిగా పేర్కొంటున్నారు. అంటే అండర్ రిపోర్టింగ్, మిస్ రిపోర్టింగ్ జరిమానాలను అలాగే కొనసాగిస్తూ, సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే ఏది విధించాలన్నది పన్ను శాఖ అధికారుల నిర్ణయానికి పరిమితమై ఉంటుందని తెలుస్తోంది.

ఉదాహరణకు ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు డిపాజిట్ చేసి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించి దాన్ని ప్రస్తుత ఏడాది ఆదాయంగా చూపించాడని అనుకుందాం. అండర్ రిపోర్టెడ్, మిస్ రిపోర్టెడ్ ఆదాయంగా దీన్ని పరిగణిస్తారా..? అన్నదానిపై నిపుణులు ఏమంటున్నారంటే... స్వచ్చందంగా ఆదాయం వెల్లడించినట్టయితే పన్ను ఉండదని, అయితే, ఆ ఆదాయానికి సోర్స్ (ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రూపంలో వచ్చింది) అన్నది చెప్పలేకుంటే దాన్ని లెక్కల్లో చూపనిది, తప్పుగా చూపించిన ఆదాయంగానే పరిగణిస్తారని వారు చెబుతున్నారు.

కేంద్ర రెవెన్యూ శాఖ సెక్రటరీ హస్ముఖ్ అదియా దీనిపై స్పందిస్తూ... రూ.10లక్షలకు పైన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసి ఉంటే, అది వారి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో పేర్కొన్న ఆదాయంతో సరిపోలకపోతే దాన్ని పన్ను ఎగవేత గానే పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఆదాయపన్నుతోపాటు సెక్షన్ 270ఏ కింద 200 శాతం జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.

జరిమానాతోనే ఆగిపోదు... విచారణ కూడా తప్పదు

గరీబ్ కల్యాణ్ యోజన కింద వెల్లడించే ఆదాయానికి మూలాల గురించి అడగమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, అదే సమయంలో నల్లధన నియంత్రణ చట్టం, మనీ లాండరింగ్, ఫెమా తదితర చట్టాల నుంచి మినహాయింపు ఉండదని పేర్కొంది. అంటే సంబంధిత ఆదాయం అక్రమ మర్గాల్లో సంపాదించినది, నిబంధనలకు పాతరేసి కూడబెట్టిందయి ఉంటే ఈ చట్టాల కింద విచారణ ఎదుర్కోవాల్సి రావచ్చు. దీనికి తోడు బినామీ ప్రాపర్టీ యాక్ట్ కూడా ఉండనే ఉంది. దాన్ని ఇటీవల కేంద్రం మరింత కఠినంగా మార్చింది. కనుక ఈ సాధక బాధకాలన్నింటినీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

representative image

సామాన్యుల పరిస్థితి...?

సామాన్యులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు నిపుణులు. ఇప్పటికే ఏటా ఆదాయపన్ను రిటర్నులు ఫైల్ చేసే వారు, పన్ను చెల్లించేవారు అయితే, వారి వద్ద స్వల్ప మొత్తంలో లెక్కల్లో చూపని ఆదాయం ఉంటే నిశ్చింతగా దాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం కింద చూపించుకోవచ్చు. ఉదాహరణకు శ్రీనాథ్ ఏటా రూ.4 లక్షల వేతనాన్ని ఆర్జిస్తున్నాడు. రూ.2.5 లక్షలకు పన్ను మినహాయింపు ఉంది. మరో రూ.1.50 లక్షలకు పలు పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా శ్రీనాథ్ పన్ను భారం తప్పించుకుంటూ రిటర్నులు ఫైల్ చేస్తున్నాడు. నోట్ల రద్దు నాటికి అతడి వద్ద  సుమారు లక్ష రూపాయలు ఉందనుకుందాం. దీంతో వార్షిక వేతనం రూ.4 లక్షలకుతోడు, తన దగ్గరున్న ఆదాయం ప్రస్తుత ఏడాదిలో వడ్డీ రూపంలో, ఇన్వెస్ట్ మెంట్స్ పై వచ్చిన ఆదాయంగా పేర్కొని శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించడం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

రూ.2.50 లక్షలు దాటితేనే...

ఇప్పటికే బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసిన సాధారణ వ్యక్తులు ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే ఆదాయపన్ను శాఖ నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో రూ.2.50 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో నగదు జమ చేసిన ఖాతాల వివరాలనే పంపించాలని బ్యాంకులను, పోస్టాఫీసులను కోరింది. నగదు జమలకు ఆధారాలు సమర్పించాలని ఐటీ శాఖ ఆయా వ్యక్తులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి , ఆ లోపు డిపాజిట్ చేసిన వారు  నిశ్చింతగా ఉండవచ్చు. వీరి సమాచారాన్ని బ్యాంకులు ఐటీ శాఖకు పంపించవు.  

వంశీ నెల వేతనం లక్ష రూపాయలు. ప్రతీ నెల అతడి ఖాతాలో వేతనం జమ అవుతూ ఉంటుంది. ఆ మొత్తాన్ని అతడు కార్డు ద్వారా డ్రా చేసి ఖర్చు చేస్తుంటాడు. ఇలా నెలనెలా కొంత నగదు రూపంలో మిగులుతూ వస్తోంది. ఈ మొత్తం రూ.3 లక్షలకు చేరింది. అది పెద్ద నోట్ల రూపంలో ఇంట్లోని బీరువాలో ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలన్నది అతడి ప్రశ్న...?

రూ.3 లక్షలను సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్ చేస్తే కచ్చితంగా ఐటీ శాఖకు ఆ సమాచారం వెళ్లడం, నోటీసు రావడం జరుగుతుంది. నెలనెలా వేతనంలో మిగులు అని చెప్పి దాన్ని నిరూపించడం కష్టం కనుక... వంశీ రూ.2.45 లక్షల వరకు తన సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్ చేసుకోవడం సూచనీయం. మిగిలిన రూ.55 వేలను తన భార్య ఖాతాలో డిపాజిట్ చేయించుకోవడం వల్ల ఐటీ శాఖ నోటీసులు, వివరణల బాధ తప్పుతుంది. ఈ సమస్య మళ్లీ రాకుండా ప్రతీ నెలా వేతనంలో మిగులను పన్ను ఆదాకు వీలు కల్పించే ఇన్వెస్ట్ మెంట్స్  వైపు మళ్లించడం నయం. 

representative image

చిన్న దుకాణాదారుల పరిస్థితి ఏంటి...?

ఉదాహరణకు ఓ ఫ్యాన్సీ దుకాణాదారుడు లేదా గిఫ్ట్ షాపు నిర్వాహకుడు లేదా మరొక వ్యాపారో కావచ్చు. గిఫ్ట్ షాపు నిర్వాహకుడి వద్ద నోట్ల రద్దు నిర్ణయం నాటికి రూ.5 లక్షల నగదు ఉందనుకోండి. దాన్ని అతడు తన షాపు పేరిట ఉన్న కరెంటు ఖాతాలో నిశ్చితంగా జమ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సమాచారం ఐటీ శాఖకు వెళుతుంది. ఐటీ శాఖ నోటీసు జారీ చేస్తే ఖాతా పుస్తకాలు, సంబంధిత నగదుకు ఆధారాలు చూపిస్తే సరిపోతుంది. 

ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నగదు డిపాజిట్, ఆదాయపన్ను శాఖ నిబంధనలు, సవరణల విషయంలో సందేహాలు ఉంటే ట్యాక్స్ నిపుణులను లేదా చార్టర్డ్ అకౌంటెంట్లను, ఫైనాన్షియల్ ప్లానర్లను సంప్రదించడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

Tue, Nov 29, 2016, 03:05 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View