టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..

04-03-2018 Sun 18:29

ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ప్రజలు బాధపడుతున్న సమస్య మధుమేహం (షుగర్). ఇందులో రెండు రకాలు ఉంటాయని ఇప్పటివరకు అందరికి తెలుసు. ఒకటి వంశపారంపర్యం, జన్యుపరంగా వచ్చే టైప్-1 డయాబెటిస్ కాగా.. రెండోది మన జీవన శైలి, బహిర్గత కారణాలతో వచ్చే టైప్-2 డయాబెటిస్. కానీ మధుమేహం వచ్చేందుకు గల కారణాలు, ఇతర అంశాలను విశ్లేషించిన స్కాండినేవియా శాస్త్రవేత్తలు.. మధుమేహంలో ఐదు రకాలను ప్రతిపాదించారు. దానివల్ల మధుమేహం నిర్ధారణ నుంచి.. చికిత్స వరకు చాలా సులువుగా ఉంటుందని వారు చెబుతున్నారు. మరి ప్రస్తుతం మధుమేహంలో ఉన్న రకాలు.. కొత్తగా శాస్త్రవేత్తలు చెబుతున్న రకాలు, కారణాలు ఇతర అంశాలను పరిశీలిద్దాం..


 రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు పరిమితికి మించి ఎక్కువగా ఉండడాన్నే మధుమేహంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీనిని రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి టైప్-1, రెండోది టైప్-2 డయాబెటిస్.
టైప్-1 డయాబెటిస్: రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు తోడ్పడే ఇన్సూలిన్ అసలు ఉత్పత్తి కాకపోవడం టైప్-1 డయాబెటిస్ గా చెప్పవచ్చు. శరీరంలో ఇన్సూలిన్ ను ఉత్పత్తి చేసేది పాంక్రియాస్ గ్రంథి. అయితే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటుగా పాంక్రియాస్ గ్రంథిలోని కణాలపై దాడి చేయడం వల్ల ఇన్సూలిన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఈ సమస్యకు జన్యు పరమైన కారణాలు ఎక్కువగా ఉంటాయి. టైప్-1 డయాబెటిస్ చాలా వరకు చిన్న వయసులోనే మొదలవుతుంది.
టైప్-2 డయాబెటిస్: ఈ తరహా మధుమేహంలో శరీరంలో ఇన్సూలిన్ ఉత్పత్తి తగ్గిపోవడమే కాకుండా.. అసలు ఇన్సూలిన్ ను శరీరం వినియోగించుకోలేక పోతుంది. అంటే ఇన్సూలిన్ ఉత్పత్తి అవుతున్నా కూడా.. శరీరంలోని కణాలు దానికి స్పందించని స్థాయిలో నిరోధకత సమస్య తలెత్తుతుంది. మారుతున్న మన జీవన శైలి, ఊబకాయం, పలు రకాల వ్యాధుల వంటివి టైప్-2 డయాబెటిస్ కు కారణమవుతాయి. సాధారణంగా ఇది మధ్య వయసులో అంటే 40 - 45 ఏళ్ల వయసులో మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కొత్త ప్రతిపాదనలు ఏమిటి?

 స్కాండినేవియన్ శాస్త్రవేత్తలు మధుమేహం అంశంపై స్వీడన్, ఫిన్లాండ్ దేశాల్లో విస్తృతంగా పరిశోధన చేశారు. వారు గుర్తించిన, ప్రతిపాదిస్తున్న అంశాలతో ‘ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలాజిల్’ జర్నల్ లో వ్యాసం కూడా ప్రచురితమైంది. దాని ప్రకారం.. శాస్త్రవేత్తలు ఐదు రకాల మధుమేహాన్ని ప్రతిపాదించారు. అందులో ఒకటి టైప్-1 తరహా మధుమేహం కాగా.. మిగతా నాలుగు టైప్-2 మధుమేహంలో ఉప వర్గాలుగా చెప్పవచ్చు. వీటిని క్లస్టర్లుగా పేర్కొన్నారు.

మధుమేహంలోని ఐదు రకాలు ఇవే..

క్లస్టర్-1: దీనిని ‘సీవర్ ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ (రోగ నిరోధకత వ్యవస్థ పొరపాటు కారణంగా వచ్చే తీవ్రమైన డయాబెటిస్)గా పేర్కొన్నారు. పాంక్రియాస్ వ్యాధి నిరోధక వ్యవస్థ దాడి చేయడం కారణంగా.. శరీరంలో ఇన్సూలిన్ ఉత్పత్తి కాదు. ఊబకాయం వంటి సమస్యలేమీ లేకున్నా చిన్న వయసులోనే వచ్చే మధుమేహం ఇది. దీనికి జన్యుపరమైన అంశాలు కారణమవుతాయి.

 క్లస్టర్-2: ఇది ‘సీవర్ ఇన్సూలిన్ డిఫిసియెంట్ డయాబెటిస్ (ఇన్సూలిన్ ఉత్పత్తి అతి తక్కువగా ఉండే తీవ్రమైన డయాబెటిస్)’. ఈ తరహా మధుమేహంలోనూ ఇన్సూలిన్ ఉత్పత్తి అతి తక్కువగా ఉంటుంది. ఊబకాయం వంటివి లేకున్నా.. చిన్న వయసులోనే ఈ సమస్య తలెత్తుతుంది. అయితే ఇందులో వ్యాధి నిరోధక వ్యవస్థ పాంక్రియాస్ గ్రంధిపై దాడి చేయడం వంటివేమీ ఉండవు. కానీ పాంక్రియాస్ గ్రంధి కణాల్లోనే స్వతహాగా లోపాలు ఉండి.. అవి తగినంతగా ఇన్సూలిన్ ను ఉత్పత్తి చేయలేకపోతాయి. దీనికి జన్యు పరమైన అంశాలు కారణమయ్యే అవకాశముంది.

క్లస్టర్-3: దీనిని ‘సీవర్ ఇన్సూలిన్ రెసిస్టెంట్ డయాబెటిస్ (ఇన్సూలిన్ కు నిరోధకత కారణంగా వచ్చే తీవ్రమైన డయాబెటిస్)’గా చెప్పవచ్చు. అధిక బరువు, ఊబకాయం ఉన్నవారికి వచ్చే మధుమేహం ఇది. వారిలో ఇన్సూలిన్ తగిన మోతాదులో తయారవుతున్నా.. శరీర కణాలు దానిని వినియోగించుకోవు. ఇది మన జీవనశైలి మార్పులు, ఊబకాయం, కొన్ని రకాల వ్యాధుల వల్ల వస్తుంది. 

క్లస్టర్-4: ఇది ‘మైల్డ్ ఒబేసిటీ రిలేటెడ్ డయాబెటిస్ (ఊబకాయం కారణంగా వచ్చే డయాబెటిస్)’. ఊబకాయం, అధిక బరువు కారణంగా వచ్చే స్వల్ప స్థాయి మధుమేహం ఇది. క్లస్టర్-3 డయాబెటిస్ తరహాలో ఇది తీవ్రంగా కాకుండా స్వల్ప స్థాయిలో ఉంటుంది. బరువు తగ్గిపోవడం, తగిన చికిత్స చేయించుకుంటూ ఔషధాలు వినియోగించడం వల్ల దీనిని పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. 

క్లస్టర్-5: దీనిని ‘మైల్డ్ ఏజ్ రిలేటెడ్ డయాబెటిస్ (వయసు పెరగడం కారణంగా వచ్చే మధుమేహం)’గా పేర్కొన్నారు. ఇది దాదాపుగా క్లస్టర్-4 డయాబెటిస్ తరహాలోనే స్వల్ప స్థాయిలో ఉంటుంది. అయితే దీనిలో ఊబకాయం లేకున్నా కూడా.. వృద్ధాప్యం దరి చేరడం కారణంగా మధుమేహం వస్తుంది. సాధారణంగా 45-50 ఏళ్లు వయసు దాటాక ఈ సమస్య తలెత్తుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడితే నియంత్రణలో ఉంచుకోవడం సులభమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అన్నింటికీ ఒకే తరహా చికిత్స అయితే ఎలా?

తగిన చికిత్స అందించేందుకు వీలవుతుంది..

మధుమేహాన్ని ఇలా ఐదు రకాలుగా వర్గీకరించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని, ప్రత్యేకమైన కారణాన్ని గుర్తించి దానికి తగినట్టుగా చికిత్స అందించవచ్చని ఓహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ కేథలీన్ వైన్ చెప్పారు. అయితే ప్రస్తుతమున్న డయాగ్నసిస్ (వ్యాధి నిర్ధారణ) విధానం అలాగే ఉంటుందని... అందులో ఉప వర్గాలకు అనుగుణంగా డయాగ్నైజ్ చేస్తారని తెలిపారు. ఈ సరికొత్త విధానంపై అంతర్జాతీయ శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారని.. మరింతగా పరిశోధన చేసి దీనిని అమలు చేసే అవకాశముందని వెల్లడించారు.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
2 years ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
4 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
4 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
4 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
4 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
4 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
4 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
4 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
4 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
4 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
4 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
4 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
4 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
4 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
4 years ago
..more