ఇంటి రుణంతో ఎన్నో విధాలుగా పన్ను ఆదా... వేతన జీవులు తెలుసుకోవాల్సిన పన్ను విషయాలు...

02-02-2018 Fri 12:34

ఇంటి రుణంతో సొంతిల్లు కల సాకారం చేసుకోవడమే కాదు, వేతన జీవులు, ఆదాయపన్ను పరిధిలో ఉన్న వారు భారీగా పన్ను ఆదా చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. అందుకే ఇంటి రుణాన్ని ఎన్నో విధాలు ప్రయోజనం కలిగించే ఉపకరణంగా చూడాల్సి ఉంటుంది.


అసలుపై
ఇంటి రుణం తీసుకున్న తర్వాత ప్రతీ నెలా నిర్ణీత మొత్తం చెల్లిస్తుండాలి. ఇలా చెల్లించే మొత్తం రెండు భాగాలుగా చూడాలి. ఇందులో కొంత వడ్డీకి, మిగిలినది అసలు రుణానికి జమ అవుతుంది. ఇలా అసలుకు జమ అయ్యేదాన్ని ప్రిన్సిపల్ గా పేర్కొంటారు. ఇలా అసలు రుణానికి జమ అయ్యే మొత్తాన్ని ఓ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద అనుమతించిన రూ.1.5 లక్షల గరిష్ట పరిమితి మేరకు ఆదాయం మినహాయింపు కింద చూపించుకోవచ్చు. ఉదాహరణకు ఓ ఆర్థిక సంవత్సరంలో ఇంటి రుణం ప్రిన్సిపల్ కు రూ.1.5 లక్షలు అంతకంటే ఎక్కువే జమ చేశారనుకోండి. అప్పుడు బేసిక్ ఎగ్జంప్షన్ రూ.2.5 లక్షలు, ఇంటి రుణానికి చేసిన రూ.1.5 లక్షలు కలిపి మొత్తానికి రూ.4 లక్షలపైనా పన్ను ఉండదు.

వడ్డీపైనా పన్ను ఆదా
ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులకూ పన్ను మినహాయింపులు ఉన్నాయి. అయితే, రుణం తీసుకుని సమకూర్చుకున్న ఇంట్లో నివసిస్తూ ఉండాలి. ఇలా అయితే గరిష్టంగా ఓ ఏడాదిలో రూ.2 లక్షల వరకు వడ్డీ రూపంలో చేసే చెల్లింపులపై పన్ను కట్టక్కర్లేదు. ఈ ప్రయోజనం పొందాలంటే రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలోపు ఇల్లు సమకూర్చుకోవాలి. కట్టిన ఇల్లయినా లేక నిర్మాణం చేసుకున్నా గడువు ఇదే. ఈ కాల వ్యవధిలోపు సాధ్యం కాకపోతే పన్ను మినహాయింపు రూ.30,000కే పరిమితం అవుతుంది.

మొదటి సారి ఇంటి కొనుగోలుదారులు అయితే నిబంధనల మేరకు అదనంగా మరో 50,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఇంటిని అద్దెకు ఇస్తే అద్దె ఆదాయంలో మున్సిపల్ పన్నులు పోను మిగిలిన మొత్తంలో ప్రామాణిక తగ్గింపు, వడ్డీ చెల్లింపులను నష్టంగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఇంటి అద్దె రూ.5 లక్షలు వస్తుందనుకోండి. ప్రామాణిక తగ్గింపు 30 శాతం అంటే రూ.3.5 లక్షలను నష్టంగా పరిగణిస్తారు. ఇందులో రూ.2 లక్షలను ఇతర ఆదాయం కింద పన్ను మినహాయింపుగా పొందొచ్చు. మిగిలిన రూ.1.5 లక్షలను తదుపరి ఎనిమిది సంవత్సరాల్లో ఎప్పుడైనా చూపించి పన్ను మినహాయింపు పొందొచ్చు.

భాగస్వామితో కలసి తీసుకుంటే ప్రయోజనం
ఇంటి రుణాన్ని భార్యా, భర్తలు కలసి తీసుకుంటే ఇద్దరూ వేర్వేరుగా అంతే మొత్తం పన్ను మినహాయింపులు పొందొచ్చు. వడ్డీ రూపేణా చేసే చెల్లింపులపై చెరో రూ.2 లక్షలు చూపించుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగం చేస్తున్న కుమారుడు, కుమార్తె కూడా ఉంటే బ్యాంకు రుణాన్ని మూడు భాగాలుగానూ చేస్తుంది. అప్పుడు ముగ్గురూ చెరో రూ.2 లక్షల చొప్పున పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంటుంది.

ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్ అయితే రేటు ఎక్కువే ఉంటుంది. అదే నిర్మాణంలో ఉన్న దాన్ని బుక్ చేసుకుంటే కొంచెం ధర తగ్గుతుంది. రుణం తీసుకుని ఇలా నిర్మాణంలో ఉన్న వాటిని కొనుగోలు చేసినట్టయితే, కొనుగోలు తేదీ నుంచి నిర్మాణం పూర్తయి చేతికి అందే లోపు చేసే వడ్డీ చెల్లింపులను పన్ను మినహాయింపు కింద చూపించుకోవచ్చు. ఇంటి నిర్మాణం పూర్తయిన లేదా మీ చేతికి అందిన ఆర్థిక సంవత్సరం నుంచి ఐదు సమాన వాయిదాల్లో చూపించుకునేందుకు అవకాశం ఉంది. అయితే, ఇలా గరిష్ట మినహాయింపు ఒక్కో వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షలుగానే ఉంటుంది.

పనిచేస్తున్న సంస్థ నుంచి లేదా సహచర ఉద్యోగి నుంచి రుణం తీసుకున్నా లేక ప్రైవేటు వ్యాపారి నుంచి రుణం పొందినా వాటికి చేసే వడ్డీ చెల్లింపులపైనా మినహాయింపునకు చట్ట ప్రకారం అర్హత ఉంది. కాకపోతే రుణం ఇచ్చిన వారి నుంచి ఓ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వస్తుంది. రుణం అసలుకు చేసే చెల్లింపులకు మాత్రం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉండదు.

ఇంటి రిపెయిర్ కు, నిర్వహణకు అయ్యే ఖర్చులను, ఇంటిపై వచ్చే ఆదాయం నుంచి మినహాయించి చూపించుకునే అవకాశం లేదు. అయితే, ఇంటి మరమ్మతులు, నిర్వహణకు చేసే ఖర్చులను అద్దె ఆదాయంలో 30 శాతం వరకు ప్రామాణిక తగ్గింపు కింద చూపించుకోవచ్చు. ఒకవేళ రెండో ఇల్లు ఉంటే దాన్ని అద్దెకు ఇవ్వడం ఆదాయపన్ను కోణంలో ప్రయోజనం. అద్దెకు ఇవ్వకపోయినా సరే చట్టం ఆ ఇంటికి మార్కెట్ ప్రకారం ఎంత అద్దె ఉందో దానిపై పన్ను చెల్లించాలని చెబుతోంది. అద్దె ఆదాయంపై పన్ను చెల్లించడమే ఉత్తమం.

టీడీఎస్
పనిచేస్తున్న సంస్థ ఉద్యోగి వేతనం పన్ను చెల్లించేంత ఉంటే ఆ మేరకు టీడీఎస్ రూపంలో మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుంది. అయితే, ఇలా చేస్తే ఫామ్ 16ను ఉద్యోగికి జారీ చేస్తుంది. దీంతో పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన బాధ్యత తీరిపోయిందనుకోవద్దు. తప్పకుండా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. ఐటీ రిటర్నుల దాఖలుకు తుది గడువు అయిన జూలై 31లోపు ఆ బాధ్యత నిర్వహించకపోతే, ఆలస్యంగా అయినా రిటర్నులు వేయవచ్చు. 2017-18 సంవత్సరపు రిటర్నులను 2019 మార్చి 31లోపు దాఖలు చేసుకోవచ్చు.

వడ్డీ ఆదాయం
బ్యాంకు ఖాతాలు ఎన్ని ఉన్నా వాటన్నింటిలోని బ్యాలన్స్ మొత్తంపై వడ్డీ రూపంలో ఒక ఏడాదిలో రూ.10,000 ఆదాయం మించితే దానిపై పన్ను చెల్లించాలి. రూ.10,000లోపు ఉంటే దానిపై పన్ను కట్లక్కర్లేదు గానీ, ఆ ఆదాయాన్ని రిటర్నుల్లో ఇతర ఆదాయం కింద చూపించాల్సి ఉంటుంది.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
2 years ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
4 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
4 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
4 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
4 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
4 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
4 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
4 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
4 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
4 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
4 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
4 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
4 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
4 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
4 years ago
..more