దంపతులిద్దరికీ ఒకటే బీమా పాలసీ... ఎంత వరకు లాభం..?

18-01-2018 Thu 10:38

జీవిత బీమా పాలసీ అవసరం ఏ మేరకో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, వీటిలోనే భార్య, భర్త ఇద్దరికీ కలిపి బీమా రక్షణనిచ్చే సింగిల్ పాలసీలు నేడు బాగా ఆదరణ పొందుతున్నాయి. వీటినే జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ గా పేర్కొంటున్నారు. ఇద్దరిలో ఒకరు మరణిస్తే మరొకరికి పరిహారం చెల్లించడం, ఇద్దరూ మరణించినా పరిహారం చెల్లించడం ఇందులో బెనిఫిట్. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే ఇది ఎంత వరకు లాభమన్న విషయం సులువుగా అర్థమవుతుంది.


జీవిత బీమా అంటే కుటుంబంలో ఆర్జించే వ్యక్తి కోసమే అని గతంలో అనుకునేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా దీని ప్రాధాన్యత కూడా పెరిగిపోయింది. భార్యా భర్త లిద్దరూ ఏదో ఒక ఉద్యోగం చేస్తుండడంతో ఇద్దరికీ బీమా అవసరం ఏర్పడింది. వీరిలో ఎవరు దూరమైనా గానీ కుటుంబానికి బీమా పాలసీ రూపేణా ఆర్థిక భద్రతకు ఢోకా రాకుండా చూసే లక్ష్యంతో జాయింట్ లైఫ్ పాలసీలు వచ్చేశాయి. కుటుంబంలో భర్త స్థానం ఎంత విలువైనదో భార్య స్థానం కూడా అంతే విలువైనదన్న విషయాన్ని మనందరం అంగీకరించాల్సిన విషయమే.

సౌకర్యాలు, ప్రయోజనాలు
representational imageభార్యా భర్త లిద్దరూ సంపాదనాపరులైతే కుటుంబానికి కచ్చితంగా వారి ఆర్జనతో ముడిపడిన అవసరాలు ఉంటాయి. రుణాలు, జీవన విధానం అనేవి వారికొస్తున్న సంపాదనను బట్టే నిర్ణయించుకోవడం జరుగుతుంది. సాధారణ, మధ్యతరగతి కుటుంబాల్లో భార్య, భర్త ఇద్దరిలో ఎవరు మరణించినా గానీ పడే ప్రభావం గణనీయంగానే ఉంటుందంటున్నారు బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల డిజైన్ హెడ్ రితురాజ్ భట్టాచార్య.నిపుణుల సూచన ఏమిటంటే యుక్త వయసులో ఉన్న దంపతులకు కూడా జాయింట్ లైఫ్ కవర్ అవసరమేనంటున్నారు. చిన్న పిల్లలు కలిగి ఉండి, రుణాలు తీసుకుని ఉంటే జాయింట్ లైఫ్ పాలసీ తీసుకోవడం ప్రయోజనకరమంటున్నారు.

 ఈ పాలసీ ప్రీమియానికి చెల్లించే మొత్తం కంటే అనుకోనిది జరిగితే అందే పరిహారం గణనీయంగా ఉండడం ఇందులోని ఆకర్షణీయత. మరో కోణంలో చూస్తే పిల్లలకు తల్లి అవసరం ఎంతో ఉంటుంది. వారు పెద్దయ్యే వరకు పిల్లల సంక్షేమాన్ని చూసే తల్లికి ఏదైనా జరిగితే వారి పరిస్థితి ఏం కావాలి? ఆ పిల్లల సంక్షేమ బాధ్యతలు చాలా పెద్దవి. అందుకే గృహిణులకు సైతం జాయింట్ లైఫ్ సాలసీ అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.

జాయింట్ లైఫ్ టర్మ్ పాలసీ / విడిగా టర్మ్ పాలసీ
representational imageభార్యాభర్తలు ఇరువురూ ఆర్జనా పరులైతే తమ వార్షిక ఆదాయ స్థాయికి అనుగుణంగా నిర్ణీత మొత్తంలో టర్మ్ పాలసీ ఎవరికి వారే తీసుకోవచ్చు. లేదా ఇద్దరూ కలసి జాయింట్ లైఫ్ టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. వీటిలో ఏది తీసుకోవాలన్నది నిర్ణయించుకునే ముందు లాభ, నష్టాలు తెలుసుకోవడం అవసరం.

జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ దంపతులిద్దరికీ ఒకే తరహా నియమాలు, నిబంధనలకు లోబడి ఉంటుంది. విడిగా వేర్వేరు పాలసీలు తీసుకుంటే అప్పుడు వాటి నిబంధనలు వేర్వేరుగా ఉండొచ్చు.ఈ పాలసీల్లోనూ పలు రకాలున్నాయి. కొన్ని జాయింట్ లైఫ్ పాలసీల్లో ఒకరు మరణిస్తే పరిహారం చెల్లించిన తర్వాత ఆ పాలసీ అంతటితో ముగిసిపోతుంది. ఈ తరహా పాలసీ తీసుకుంటే కొంత ప్రతికూలత ఉంది. ఎందుకంటే ఇద్దరిలో ఒకరు మరణిస్తే మిగిలి ఉన్న వారికి కవరేజీ లేకపోవడం అన్నది పెద్ద ప్రతికూలత.

40 ఏళ్లు దాటిన తర్వాత ఇలా జరిగితే ఆ వయసులో విడిగా పాలసీ తీసుకోవాల్సి వస్తే ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి రావచ్చు. కనుక జాయింట్ లైఫ్ పాలసీలో దంపతుల్లో ఎవరు మరణించినా పరిహారం చెల్లించడంతోపాటు మిగిలిన వారికి బీమా కవరేజీ కొనసాగే పాలసీనే తీసుకోవాలి. ఇద్దరిలో ఎవరు చనిపోయినా పరిహారం చెల్లించడంతోపాటు మిగిలిన వారి పేరిట ఉన్న కవరేజీ కొనసాగాలి. అలాగే, ఇద్దరూ మరణించినా వారిపేరిట ఉన్న మొత్తం కవరేజీని చెల్లించాలి. ఈ తరహా పాలసీలతో ప్రయోజనం ఉంటుంది. కొన్ని పాలసీలు జీవిత భాగస్వాముల్లో ఒకరు మరణిస్తే మరొకరికి పరిహారంలో కొంతమేర చెల్లించి, మిగిలిన మొత్తాన్ని 60 నెలల కాలంలో చెల్లించే తరహా సదుపాయాలు కూడా ఉన్నాయి.

ఉదాహరణకు రాజేష్, సావిత్రి దంపతులు. వీరు కోటి రూపాయలకు జాయింట్ లైఫ్ కవరేజీ తీసుకున్నారు. ఐదవ ఏట రాజేష్ మరణించాడనుకోండి. కంపెనీ రూ.కోటిని నామినీకి చెల్లిస్తుంది. బీమా మొత్తంలో 1.75 శాతం మొత్తాన్ని ప్రతీ నెలా ఐదేళ్ల పాటు చెల్లించడం కూడా జరుగుతుంది. అంటే ఈ రూపంలో రూ.కోటి పాలసీపై ప్రతీ నెలా రూ.1,75,000 చెల్లించడం జరుగుతుంది. దీంతో రూ.కోటి బీమా పరిహారానికి అదనంగా మరో కోటీ ఐదు లక్షల మేర ప్రయోజనం కలుగుతుంది. ప్రతీ నెలా నిర్ణీత మొత్తం చెల్లించే సమయంలో దంపతుల్లో మిగిలిన ఉన్న వారు కూడా మరణించినట్టయితే పరిహారం నామినీలకు చెల్లించడం జరుగుతుంది.

representational imageఉదాహరణకు ఓ జంట జాయింట్ లైఫ్ పాలసీ తీసుకుందనుకుందాం. రూ.50 లక్షలకు వార్షిక ప్రీమియం రూ.13,000 అనుకోండి. విడిగా వీరు ఎవరికి వారే పాలసీ తీసుకుంటే ఇంచు మించు ఇంతే మొత్తం ప్రీమియం ఉంటుంది. ఒకవేళ జాయింట్ లైఫ్ పాలసీ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా మనస్పర్థలు వచ్చి, దంపతులు విడిపోతే, విడాకులు తీసుకుంటే అప్పుడు ఎలా ఉంటుందంటే తీసుకున్న పాలసీ ప్రీమియాన్ని ఫస్ట్ హోల్డర్ (భర్త) చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. ప్రీమియంలో తగ్గింపు ఉండదు.

విడిగా ఎవరికి వారు పాలసీ తీసుకుంటే ఈ తరహా సందర్భాల్లో ఏ ఇబ్బంది ఉండదు. లేదంటే జాయింట్ లైఫ్ పాలసీలో దంపతులు భవిష్యత్తులో విడిపోతే పాలసీని స్ప్లిట్ చేసేవి ఉంటే వాటితో ఉపయోగకరమే. ఈ తరహా రైడర్లు ఉన్నాయా అని బీమా పాలసీని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది.సాధారణంగా విడిగా భార్యా భర్తలు ఎవరికి వారే టర్మ్ లైఫ్ పాలసీ తీసుకుంటే చెల్లించే ప్రీమియం కంటే... జాయింట్ లైఫ్ పాలసీ ప్రీమియం తక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు బజాజ్ అలియాంజ్ ఐసెక్యూర్ పాలసీ రూ.కోటి బీమాను 30 ఏళ్ల కాలానికి తీసుకుంటే 30 ఏళ్ల వ్యక్తి రూ.11,960 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే 27 ఏళ్ల మహిళ అయితే రూ.కోటి బీమాకు చెల్లించాల్సిన ప్రీమియం రూ.9,750. వీరిద్దరూ కలసి ఉమ్మడిగా జాయింట్ లైఫ్ పాలసీ తీసుకుంటే రూ.కోటికి గాను ప్రీీమియం కింద రూ.20,069గా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రూ.1,641 ఆదా చేసుకోవచ్చు. బడ్జెట్ టైట్ గా ఉంటే జాయింట్ లైఫ్ పాలసీ తీసుకోవడం ప్రయోజనం.

కొన్ని జాయింట్ లైఫ్ పాలసీల్లో దంపతుల్లో ఎవరు పెద్ద అయితే వారి వయసును ఆధానంగా ప్రీమియం ఖరారు చేస్తున్నాయి. కొన్ని భార్య, భర్త ఇద్దరి వయసును పరిగణనలోకి తీసుకుని ప్రీమియంను నిర్ణయిస్తున్నాయి. భార్యా, భర్తల మధ్య వయసు అంతరం 8 ఏళ్లు అంతకంటే ఎక్కువే ఉంటే జాయింట్ లైఫ్ కంటే విడిగా టర్మ్ పాలసీలు ఎంచుకోవడం మంచిదని నిపుణుల సూచన.

ఆన్ లైన్ లో కోట్
జాయింట్ లైఫ్ పాలసీలను చాలా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. వేటిలో ఎంత ప్రీమియం ఉందనేది ఆన్ లైన్ లో చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కంపెనీలు తక్కువ ప్రీమియానికే జాయింట్ లైఫ్ పాలసీలను అందిస్తున్నాయి. జాయింట్ లైఫ్, లేదా విడిగా రెండు పాలసీలు తీసుకునే విషయంలో సంశయాలు అక్కర్లేదు. ఎవరికి వారు వారి వ్యక్తిగత అవసరాలు, ఆర్థిక అవసరాలు, కుటుంబ బాధ్యతల ప్రకారం దీనిపై నిర్ణయం తీసుకోవాలి.

గృహిణికి టర్మ్ ప్లాన్
representational imageఇంటి ఇల్లాలి కోసం జీవిత బీమానిచ్చే టర్మ్ పాలసీలు లేవు. కేవలం జాయింట్ లైఫ్ పాలసీల్లోనే కొన్ని ఈ ఆప్షన్ ఇస్తున్నాయి. టర్మ్ పాలసీలు వేతన జీవులు, ఆదాయపన్ను చెల్లింపుదారులకే పరిమితం. ఇతరులు తీసుకునేందుకు అవకాశం లేదు. మరి సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలను తీసుకుంటే రూ.లక్ష బీమాకే ఏటా రూ.5,000 వరకు చెల్లించాల్సిన పరిస్థితి. గృహిణులకు తక్కువ ప్రీమియానికే తగినంత జీవిత బీమా కవరేజీని జాయింట్ లైఫ్ టర్మ్ పాలసీలు అవకాశం కల్పిస్తున్నాయి.

పీఎన్ బీ మెట్ లైఫ్ మేరా టర్మ్ ప్లాన్ ఈ తరహాదే. భార్యా భర్తలు ఇద్దరికీ కవరేజీని ఆఫర్ చేస్తోంది. ఇది పూర్తిగా టర్మ్ పాలసీయే. ఫస్ట్ హోల్డర్ ఎంపిక చేసుకున్న బీమా మొత్తంలో సగం మేర జీవిత భాగస్వామికి బీమా లభిస్తుంది. ఉదాహరణకు రూ.50 లక్షలకు పైగా జీవిత బీమా కవరేజీ ఎంపిక చేసుకుంటే అప్పుడు జీవిత భాగస్వామికి కూడా కవరేజీ ఆప్షన్ కనిపిస్తుంది. గృహిణి అయితే రూ.25 లక్షలకే బీమా పరిమితం. సంపాదించే మహిళలు అయితే జీవిత భాగస్వామి తీసుకునే మొత్తలో సగం మేర జాయింట్ లైఫ్ లో కవరేజీ పొందొచ్చు. ఉదాహరణకు వంశీ రూ.కోటి జాయింట్ లైఫ్ పాలసీ తీసుకుంటే అప్పుడు అతని జీవిత భాగస్వామికి రూ.50 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
2 years ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
4 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
4 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
4 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
4 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
4 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
4 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
4 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
4 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
4 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
4 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
4 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
4 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
4 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
4 years ago
..more