మరణానంతరమూ జీవనం... అవయవాల్లో ఏవి దానం చేయవచ్చు... ఎంత మందికి ప్రాణం పోయొచ్చు?
26-11-2017 Sun 15:04

తోటి వారి ప్రాణం నిలబెట్టడమన్నది ఓ గొప్ప కార్యం. రోగి ప్రాణాల్ని కాపాడే వైద్యుడిని సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడితో పోల్చింది అందుకే. వైద్యుడనే కాదు ఏ విద్య తెలియని సామాన్యుడు సైతం మానవత్వంతో మరణం అంచుల్లో ఉన్నవారికి మరో జీవితం ప్రసాదించొచ్చు. అంతటి అద్భుత అవకాశం కేవలం అవయవదానంతోనే సాధ్యం. ఇంతటి విశిష్టత కలిగిన అవయవదానం విషయమై సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నమే ఇది.
అవయవ మార్పిడి ఎందుకు చేయాలి?

ఇతర అవయవాల కంటే కూడా వయసు పైబడుతున్న కొద్దీ వీటి సామర్థ్యం క్షీణిస్తూ వెళుతుంది. అంటే మిగిలిన శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది. కానీ వీటి సామర్థ్యం పడిపోతుంది. ఇలా పూర్తిగా క్షీణించిపోయిన అవయవాన్ని మార్చడం ద్వారా ఆ వ్యక్తి జీవిత కాలం పెంచొచ్చు. వయసు రీత్యానే కాకుండా ఒక్కోసారి కొన్ని రకాల వ్యాధులు, సమస్యల కారణంగా ఏదైనా అవయవం దెబ్బతినే పరిస్థితి రావచ్చు.అయితే, కొన్ని రకాల చికిత్సలతో అవయవ మార్పిడి చేయకుండా తాత్కాలికంగా పని మందగించిన అవయవాన్ని పనిచేయించొచ్చు.
ఉదాహరణకు మూత్ర పిండాల పనితీరు దెబ్బతింటే అందుకు డయాలసిస్ చికిత్స ఒకటి. కానీ, డయాలసిస్ చికిత్సతో మిగిలిన శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. డయాలసిస్ చేయించుకునే వారికి కార్డియో వాస్క్యులర్ (గుండె జబ్బులు) వ్యాధుల ముప్పు అధికంగా ఉంటుంది. ఎందుకంటే డయాలసిస్ ప్రక్రియ రక్తంలో యాంటీ ఆక్సిడెంట్లను తగ్గించేస్తుంది. మన శరీరంలో హానికారకాలపై పోరాడేందుకు యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో కీలకం. అందుకే చాలా కేసుల్లో అవయవాల పనితీరు క్షీణించిపోతే ఉన్న మార్గం అవయవమార్పిడి ఒక్కటే. అంటే ఆరోగ్యవంతుడైన వ్యక్తి నుంచి అవయవాన్ని స్వీకరించి అవసరం ఉన్న వారికి అమర్చడం. దీన్నే ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ గా పేర్కొంటారు. జీవించి ఉన్న లేదా చనిపోయిన వ్యక్తి అవయవ దాత అయి ఉండొచ్చు. వీరిని డోనర్ గా చెబుతారు. తీసుకునే వారిని రిసీపెంట్ అంటారు.
ఎవరు దానం చేయవచ్చు...?

* మూత్ర పిండాలు * ఊపిరితిత్తులు * గుండె * కళ్లు * కాలేయం * పాంక్రియాస్ * కార్నియా* చిన్నపేగు * చర్మ కణజాలం * ఎముక కణజాలం * గుండె కవాటాలు * నరాలు * ఇయర్ డ్రమ్స్ * వంటివి దానం చేయచ్చు.
కేన్సర్ పేషెంట్లు సైతం అవయవదానం చేయవచ్చు కానీ, కేన్సర్ ఏ రకం, వైద్య కండిషన్ ఏంటన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కేన్సర్ బాధిత దాత నుంచి అవయవం స్వీకరించిన వారికి కేన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసిన రోగులకు వారి శరీరం కొత్త అవయవాన్ని తిరస్కరించకుండా ఉండేందుకు గాను రోగ నిరోధక వ్యవస్థను అణచి ఉంచే (శరీరంలోకి కొత్తగా ఏదైనా చొరబడినప్పుడు అది అవయవం కానీయండి లేదా బ్యాక్టీరియా, వైరస్ కానీయండి దానిపై ఫైట్ చేసి మనల్ని కాపాడడమే రోగ నిరోధక వ్యవస్థ విధి) మందులను ఇస్తారు.
దీంతో దాత నుంచి సేకరించిన అవయవంలో ఏవైనా కేన్సర్ కణాలుంటే రోగ నిరోధక వ్యవస్థ వాటిపై పోరాడలేదు. దీంతో కేన్సర్ కణాల విస్తరణ రిస్క్ ఉంటుంది. కనుక కేన్సర్ రోగుల నుంచి అవయవదానానికి మొగ్గు చూపరు. అలాగే, అనారోగ్యం అన్నది ఏదో ఒక అవయవానికి సంబంధించినదై, మరోదానిపై దాని ప్రభావం లేకపోతే దానానికి ఇబ్బంది లేదు.
ఏ విధమైన అనారోగ్యం, వ్యాధి, ఇన్ఫెక్షన్ అవయవదానానికి అడ్డంకా, కాదా? అన్నది వైద్యులు నిర్ణయిస్తారు. ఒక వ్యక్తి మరణం తర్వాతే దానం అంశం వస్తుంది. కనుక చనిపోక ముందు ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, వ్యాధుల సమాచారం ఆధారంగా తగిన పరీక్షల తర్వాత అవయవాలు దానానికి అర్హమైనవా, కావా? అన్నది వైద్యులు నిర్ధారిస్తారు.

ఎనిమిది మందికి ప్రాణం

ఆస్పత్రుల్లో పేర్లు నమోదు...
అవయవదానం స్వీకరించే వారి పేర్లతో దాదాపు అన్ని ఆస్పత్రులు డేటా బేస్ నిర్వహిస్తున్నాయి. అవయవదానానికి సమ్మతించిన వారు దానానికి హామీనిస్తూ ఆస్పత్రులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే జీవన్ దాన్ సంస్థలో పేర్లను నమోదు చేసుకోవాలి. ఇలా హామీనిచ్చిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. ఎందుకంటే మరణానంతరం వారు ఆ దానానికి సమ్మతించాల్సి ఉంటుంది కనుక. అలాగే, మొత్తం శరీరాన్ని వైద్య పరీక్షల కోసం దానం చేయడానికి అంగీకరిస్తే మరణానంతరం ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు గాను ముందే ఓ వ్యక్తిని నియమించుకోవాల్సి ఉంటుంది.
చట్టప్రకారం...
అవయవదానం సురక్షితమేనా?
దాతల్లో హెచ్ఐవీ, హెపటైటిస్, కేన్సర్, ఇన్ఫెక్షన్ కారకాలు ఉన్నాయా, లేవా అన్నది వైద్యులు నిర్ధారించిన తర్వాతే అవయవదానం చేయాలా, వద్దా అన్నది తేలుస్తారు. దానానికి ముందుకు వచ్చిన వారికి వైద్య సమస్యలు ఉంటే వాటినీ పరీక్షిస్తారు. బ్లడ్ గ్రూప్, రోగ నిరోధక వ్యవస్థ స్థితి, స్వీకర్తతో సరిపోలుతుందీ, లేనిదీ తదితర అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటారు.
పిల్లలు సైతం
అవయవదానం చేయవచ్చు. బ్రెయిన్ డెత్ అయిన పిల్లల అవయవాలను వాటి అవసరం ఉన్న చిన్నారులకు మార్పిడి చేసే చికిత్సలు కూడా జరుగుతున్నాయి. కాకపోతే తమకంటే చిన్నగా ఉన్న అవయవాలే వారికి సరిపోతాయి.
బ్రెయిన్ డెత్

కార్డియాక్ డెత్ (గుండె ఉన్నట్టుండి పనిచేయకుండా పోవడం) కారణంతో మరణించిన వారి అవయవాలు మరొకరికి దానం చేసేందుకు అన్ని వేళలా పనికిరావు. ఎందుకంటే గుండె పనిచేయకుండా ఆగిపోవడం, శ్వాస ప్రక్రియ నిలిచిపోవడం వల్ల ప్రాణం పోతుంది. దీంతో శరీర భాగాలకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ ఆగిపోతుంది. కనుక కార్డియాక్ డెత్ అయిన తర్వాత నిమిషాల వ్యవధిలోనే శరీర అవయవాలు దెబ్బతినడం మొదలవుతుంది. కనుక నిమిషాల వ్యవధిలోనే అవయవ సమీకరణ చేయాల్సి ఉంటుంది.
అటువంటి సందర్భాల్లోనే వారి అవయవాలు పనికొస్తాయి. చాలా తక్కువ కేసుల్లోనే ఇది సాధ్యమవుతుంది. ఆస్పత్రిలోనే కార్డియాక్ డెత్ జరిగితే, లేదా ఆస్పత్రి సమీపంలోనే ఉంటేనే సాధ్యపడుతుంది. పైగా ఇంత సత్వరం సమీకరించిన కీలక అవయవాలకు తగిన మ్యాచ్ అయ్యే స్వీకర్తను గుర్తించడం, అవయవ మార్పిడి చేయడం ఇదంతా సమయంపై ఆధారపడి ఉంటుంది. అయితే, గుండె ఆగిపోవడం వల్ల మరణించిన వారి శరీర కణజాలాలను 12 నుంచి 24 గంటల్లోపు దానం చేయవచ్చు.

సమాచారం ఇలా...
మరణం లేదా బ్రెయిన్ డెత్... ఆస్పత్రిలో ఈ తరహా కేసులు నమోదైనప్పుడు ఆ సమాచారం ఆర్గాన్ ప్రొక్యూర్ మెంట్ విభాగాలకు వెంటనే వెళ్లిపోతుంది. అప్పుడు ఆ వివరాల ఆధారంగా సంబంధిత వ్యక్తి అవయవదానానికి అంగీకరించి ఉన్నారా లేదా చెక్ చేస్తారు. సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవ సేకరణకు ఆమోదం తీసుకోవడం, వారిని ఒప్పించడం వంటివి జరుగుతాయి. అంగీకారం లభిస్తే ఆ తర్వాత వేగంగా ఏర్పాటు చేస్తారు.
ఎంత సమయం పాటు

- మూత్రపిండాన్ని దాత నుంచి తీసుకుని ఎవరికైతే ప్రవేశపెడతామో వారిలో అది 9 ఏళ్ల పాటు పనిచేస్తుంది.
- జీవించి ఉన్న వారు ఊపిరితిత్తుల నుంచి కొంత భాగాన్ని దానం చేయవచ్చు కానీ అది తిరిగి మళ్లీ ఏర్పడదు.
- పాంక్రియాస్ లో కొంత భాగం దానం చేసినప్పటికీ దాతలో మిగిలి ఉండే పాంక్రియాస్ చక్కగానే పనిచేస్తుంది. అలాగే, పేగుల్లోనూ కొంత భాగం దానం చేయడం వల్ల పనితీరుకు విఘాతం కలగదు.
- కాలేయంలో కొంత భాగాన్ని నిక్షేపంలా దానంగా ఇవ్వొచ్చు. అలా ఇచ్చినది తిరిగి నిర్మితమవుతుంది. తిరిగి కణాల వృద్ధి జరిగి, కణజాలం నిర్మితమయ్యే అవకాశం ఉన్న ఏకైక అవయవం కాలేయమే.
- కార్నియా అన్నది కంటిపై ఉండే పారదర్శక పొర. కంటి ప్రాథమిక దృష్టిలో భాగం ఇది. ప్రమాదం కారణంగా లేదా ఇన్ఫెక్షన్, వ్యాధి కారణంగా కంటి చూపు పోయిన వారికి కార్నియాను రీప్లేస్ చేయమడం వల్ల కంటి చూపు తిరిగి వస్తుంది.
- కాలిన గాయాల బాధితులకు చర్మం మార్పిడి చేయాల్సి వస్తుంది.
- గుండె బైపాస్ సర్జరీ చేయించుకునే వారికి దాతల నరాలను ఉపయోగిస్తుంటారు.
- రక్తం, రక్తంలో ప్లేట్ లెట్స్, మూల కణాలు దానంగా ఇవ్వతగినవే.
- సాధారణగా ఆస్పత్రుల్లో మరణించిన సందర్భాల్లో ఎక్కువగా అవయవదానానికి వీలవుతుంది. వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు కనుక. బ్రెయిన్ డెడ్ అయిన కేసుల్లో ఈ చాన్సెస్ మరింత ఎక్కువ.
- మన దేశంలో ఉన్న రికార్డుల ప్రకారం ఏడాదిన్నర వయసున్న బేబీ, 83 ఏళ్ల వయసున్న మహిళ (అతి తక్కువ, అతి పెద్ద వయసులో) అవయవదానం చేయడం జరిగింది.
- తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అవయవదానానికి గాను జీవన్ దాన్ ట్రస్ట్ వద్ద నమోదు చేసుకున్న వారి సంఖ్య 2017 నవంబర్ 26 నాటికి 10,557 మంది.
- నాగార్జున, ఫరాఖాన్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాంకా చోప్రా, మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, పుల్లెల గోపీచంద్ తదితర ప్రముఖులు అవయవదానానికి ముందుకు వచ్చినవారే.
- మరణం తర్వాత జీవించి ఉండే అవకాశం కేవలం అవయవదానంతోనే సాధ్యం!
More Telugu Articles