ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఆగే స్టేషన్లు... స్టేషన్లలో సమస్త సదుపాయాలు ఇవే...!
22-11-2017 Wed 11:32

భాగ్యనగరంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రాకపోకలను సులభతరం చేస్తూ ఎల్ అండ్ టీ మెట్రో రైళ్లు కూత పెట్టేశాయి. ప్రధాని మోదీ పచ్చజెండా ఊపడంతో మియాపూర్ నుంచి నాగోల్ వరకు ప్రయాణించేందుకు మార్గం అందుబాటులోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు మార్గాలు, వాటిలో రైలు ఎక్కడెక్కడ ఆగేదీ, ఆయా స్టేషన్లు, సౌకర్యాలు, అత్యాధునిక వ్యవస్థలు, ఇతర విశేషాల సమాహారం ఈ కథనం...
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మూడు కారిడార్లు. నిడివి 71 కిలోమీటర్లు. మూడు మార్గాల్లో కలిపి 66 అల్ట్రా మోడర్న్ రైల్వే స్టేషన్లు ఉంటాయి.
కారిడార్ 1 : మియాపూర్ నుంచి ఎల్ బీ నగర్ వరకు.
కారిడార్ 2 : జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి ఫలక్ నుమా వరకు
కారిడార్ 3 : నాగోలు నుంచి శిల్పారామం వరకు

కారిడార్ 1
మియాపూర్ నుంచి ఎల్ బీ నగర్ వరకు 29 కిలోమీటర్ల మార్గంలో స్టేషన్లు 27. మియాపూర్, జేఎన్ టీయూ కాలేజీ, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, బాలానగర్, మూసాపేట్, భరత్ నగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, నాంపల్లి, గాంధీ భవన్, ఉస్మానియా మెడికల్ కాలేజీ, మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్), మలక్ పేట, న్యూ మార్కెట్, మూసారాంబాగ్, దిల్ షుక్ నగర్, చైతన్యపురి, విక్టోరియా మెమోరియల్, ఎల్బీనగర్.
కారిడార్ 2

కారిడార్ 3
నాగోల్ నుంచి శిల్పారామం వరకు మార్గం కారిడార్ 3 కింద ఉంటుంది. 28 కిలోమీటర్ల ఈ మార్గంలో 23 స్టేషన్లు ఉంటాయి. నాగోల్, ఉప్పల్, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్స్, ప్యారడైజ్, రసూల్ పుర, ప్రకాష్ నగర్, బేగంపేట, అమీర్ పేట, మధురానగర్, యూసఫ్ గూడ, రోడ్డు నంబర్ 5 జూబ్లిహిల్స్, జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ టెంపుల్, మాధాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ, శిల్పారామం.
స్టేషన్, మెట్రో మార్గం

స్టేషన్ స్వరూపం

అమీర్ పేట స్టేషన్ దేశంలోనే అతిపెద్దది
నగరంలో మూడు ఇంటర్ చేంజ్ స్టేషన్లలో అమీర్ పేట ఇంటర్ చేంజ్ స్టేషన్ కు ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఇది దేశంలోనే అతిపెద్దది. 40 మీటర్ల వెడల్పు, 142 మీటర్ల పొడువుతో ఉంటుంది. స్టేషన్ కు నలువైపులా 8 లిఫ్ట్ లు, 16 ఎస్కలేటర్లు, మెట్ల మార్గాలున్నాయి. స్టేషన్ ప్రాంగణమంతా పూర్తిగా ఎయిర్ కండీషనింగ్ తో ఉంటుంది. గ్రానైట్ ఫ్లోరింగ్, షాప్ లు, వినోద కేంద్రాలు, మూడు అంతస్తులతో విమానాశ్రయాన్ని తలపిస్తుంది. ఇంటర్ చేంజ్ స్టేషన్లలో ఎక్కువ రద్దీ ఇక్కడే ఉంటుందని అంచనా. దాంతో ఏక కాలంలో 40వేల మంది ప్రయాణికుల రద్దీ తట్టుకునే విధంగా డిజైన్ చేశారు.
టికెటింగ్ వ్యవస్థ
రైలు టికెట్లను స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన కౌంటర్ల నుంచి తీసుకోవచ్చు. టికెట్ల కోసం సమయం వృథా కాకుండా వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేశారు. ఈ వెండింగ్ మెషిన్ నుంచి సైతం టికెట్ పొందొచ్చు. దీనికి తోడు ప్రతీ సారి టికెట్ తీసుకోవాల్సిన ఇబ్బంది లేకుండా నిరంతరం ప్రయాణించే వారి సౌకర్యార్థం స్మార్ట్ కార్డులు కూడా ఉంటాయి. ఈ స్మార్ట్ కార్డును రీడ్ చేసే మెషిన్లు ప్రవేశ మార్గం వద్ద ఉంటాయి. గేట్ దగ్గర ఈ కార్డును చూపిస్తే మెషిన్ రీడ్ చేస్తుంది. ఆ తర్వాత గేట్ తెరుచుకుంటుంది. ప్రయాణం ముగిసి తిరిగి బయటకు వెళ్లే సమయంలోనూ కార్డును రీడర్ దగ్గర చూపించాలి. దాంతో మీ ప్రయాణానికి తగిన చార్జీ కార్డు నుంచి డెబిట్ అవుతుంది.
టికెట్ కొనుగోలు చేస్తే ప్రయాణికుడికి ప్లాస్టిక్ టోకెన్ ను ఇస్తారు. దాన్ని ఆటోమేటిక్ కలెక్షన్ గేట్ దగ్గర రీడర్ పై ఉంచితే వెళ్లేందుకు గేట్ తెరుచుకుంటుంది. తిరిగి ఆ టోకెన్ ను వెంట తీసుకుని వెళ్లాలి. ప్రయాణం ముగిసి తిరిగి స్టేషన్ నుంచి బయటకు వెళ్లాలంటే గేట్ తెరుచుకునేందుకు గాను టోకెన్ ను ఆటోమేటిక్ కలెక్షన్ గేట్ వద్ద బాక్స్ లో వేయాలి. ప్రయాణం ముగిసింది కాబట్టి టోకెన్ బయటకు రాదు. టికెట్ కొనుగోలు చేసిన తర్వాత 29 నిమిషాల్లోపు స్టేషన్ లోకి ప్రవేశించాలి. 29 నిమిషాల సమయం దాటితే ఆ టికెట్ చెల్లుబాటు కాదు. స్టేషన్ లో షాపింగ్ చేసేందుకు వీలుగా దుకాణాలు కూడా ఉంటాయి. స్టేషన్ల ప్రవేశ మార్గం వద్ద బ్యాగులను స్కానింగ్ చేసే యంత్రాలు, స్టేషన్ లోపల, పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు కూడా ఉంటాయి. అగ్ని ప్రమాదం జరిగితే తక్షణమే బయటకు వెళ్లేందుకు అత్యవసర మార్గాలు, అగ్ని నిరోధక యంత్రాలు ఉంటాయి. స్టేషన్ల వద్ద భద్రతగా పోలీసులతోపాటు ఎల్ అండ్ టీ రక్షణ సిబ్బంది కూడా ఉంటారు.
పది నిమిషాలకో రైలు
రైళ్లు అధిక ఫ్రీక్వెన్సీతో నడుస్తాయి. పెద్దగా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రతీ మార్గంలోనూ ప్రతి 10 నిమిషాలకో రైలు నడుస్తుంటుంది. రద్దీనిబట్టి అవసరమైతే ప్రతీ 5 నిమిషాలకూ సర్వీస్ నడిపే అవకాశం ఉంది. అలాగే, రద్దీ పెరిగితే ప్రతి మూడు నిమిషాలకో రైలు, ప్రతీ రెండు నిమిషాలకో రైలు చొప్పున నడిపేలా ప్రణాళిక ఉంది. అలాగే, ప్రారంభంలో రైలుకు మూడు కోచ్ లే ఉంటాయి. రద్దీ పెరిగితే ప్రతీ రైలుకు గరిష్టంగా ఆరు కోచ్ లు ఏర్పాటు చేస్తారు. ప్రతీ స్టేషన్ లో రైలు 20 సెకన్ల పాటు ఆగుతుంది. ఇంటర్ చేంజ్ స్టేషన్లలో మాత్రం ప్రతీ రైలు రెండు నిమిషాల పాటు ఆగుతుంది. ఆరు కోచ్ లు ఆగేందుకు సరిపడా పొడవుతో స్టేషన్ల నిర్మాణం ఉంటుంది. 140 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు తో ఉంటాయి. రైలు కోచ్ లను స్టెయిన్ లెస్ స్టీల్, అల్యూమినియంతో తయారు చేయించారు. దీనివల్ల ట్రాక్ లపై, పిల్లర్లపై పెద్ద లోడ్ పడదు. ప్రతీ కోచ్ లోపల ఎల్ సీడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దీనిలో రూట్ మ్యాప్ కనిపిస్తుంటుంది. అలాగే, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రస్తుత స్టేషన్, రాబోయే స్టేషన్ల సమాచారం అనౌన్స్ మెంట్ రూపంలో వినిపిస్తుంటుంది. అంగవైకల్యం కలిగిన వారు ప్రయాణించేలా వారికి ప్రత్యేక స్థలం కేటాయించారు. ప్రతీ రైలునూ రోజూ బ్యాక్టీరియా రహితంగా శుభ్రం చేస్తారు.
అత్యాధునిక టెక్నాలజీల వినియోగం
రైలులో సాంకేతిక సమస్య ఏర్పడితే ఈ కేంద్రం నుంచే సరిచేసే ఏర్పాట్లు ఉన్నాయి. ట్రాక్ లో సమస్యలు తలెత్తితే మాత్రం సిబ్బంది అక్కడికి వెళ్లి సరిచేస్తారు. అన్ని మార్గాల్లోనూ కంప్యూటర్ బేస్డ్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఉప్పల్ లోని సెంట్రలైజ్డ్ ఆపరేషన్ సెంటర్ అన్ని మార్గాల్లో విద్యుత్ సరఫరా, ట్రాక్షన్ సిస్టమ్ ఎక్విప్ మెంట్ ను ‘సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఆక్విజిషన్’ తో పర్యవేక్షణ, నియంత్రిస్తూ ఉంటుంది. అంటే ఈ కేంద్రం నుంచే ఒక్క మీటతో మెట్రో అంతటా ఏదైనా నియంత్రించగలరు. కరెంటు సరఫరా ఉన్నట్టుండి నిలిచిపోతే రైళ్లు ఆగే పనిలేకుండా మెట్రో మార్గంలో పెద్ద పెద్ద జనరేటర్లను ఏర్పాటు చేశారు. అలాగే, ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీ) సురక్షిత రైలు ప్రయాణానికి వీలుగా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థలన్నీ మెట్రో రైళ్ల రాకపోకలను దాదాపు ఎటువంటి అంతరాయాలు లేకుండా, జాప్యం జరగకుండా, ప్రమాదాలు లేకుండా చూసేందుకే.
మెట్రో వ్యవస్థకు గుండెవంటిది
ప్రతీ స్టేషన్, పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు రికార్డు చేస్తున్న దృశ్యాలను ఉప్పల్ లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అనుక్షణం గమనిస్తూ ఉంటారు. సందేహం వస్తే వెంటనే భద్రతా సిబ్బందికి ఆదేశాలు వెళ్లిపోతాయి. ఈ సెంటర్ లో ఏర్పాటు చేసిన అతిపెద్ద తెరపై రైళ్ల కదలికలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. వాటిని గమనిస్తూ ఇక్కడి నుంచే ట్రెయిన్ ఆపరేటర్లకు కావాల్సిన సహకారం, ఆదేశాలు అందిస్తుంటారు. ప్రతీ కారిడార్ కు ఓ రంగు కేటాయించారు. స్క్రీన్ పై ఆయా కారిడార్ కు సంబంధించి ప్రతీ కదలిక కేటాయించిన రంగులో బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ సెంటర్ మెట్రో వ్యవస్థకు గుండెతో సమానమని సిబ్బంది చెబుతుంటారు. మెట్రో రైలుకు ఉప్పల్ లో ప్రధాన డిపో ఏర్పాటు చేశారు. ఇక్కడ రైళ్లకు మరమ్మతులు చేసేందుకు వర్క్ షాపులు కూడా ఉన్నాయి. మరో రెండు డిపోలను ముందస్తు నిర్వహణ వ్యవహారాల కోసం కేటాయించారు.
పర్యావరణ అనుకూల ఏర్పాట్లు
ఎల్ అండ్ టీ మెట్రో రైలుకు మరో విశిష్టత ఉంది. పర్యావరణ పరంగా అత్యంత అనుకూల రవాణా వ్యవస్థ ఇది. విద్యుత్ ను వినియోగించుకుంటూ రైళ్లు నడుస్తాయని తెలిసిందే. ఈ రైళ్ల గమనం నుంచి తిరిగి 41 శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రైళ్లకు ఎలక్ట్రో డైనమిక్ బ్రేకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో రైళ్లు ప్రతీ స్టేషన్ లో ఆగేందుకు బ్రేక్ వేసినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మెట్రోకు కావాల్సిన విద్యుత్ లో 41 శాతం తిరిగి ఉత్పత్తి అవుతుంది. దేశంలోని ఇతర మెట్రోలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. దీన్ని విద్యుత్ గ్రిడ్ కు అనుసంధానించి తిరిగి వినియోగిస్తారు. అలాగే, నీటి వినియోగం కూడా తక్కువే. ఇందుకోసం తక్కువ ధార వచ్చేలా ఫిట్టింగ్స్ ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా వర్షపు నీటిని ఒడిసి పట్టే చర్యలు కూడా ఉన్నాయి. స్టేషన్ల పై కప్పు నుంచి పగటి సమయంలో ఎక్కువ వెలుగు వచ్చేలా ప్లాన్ చేశారు. ఎల్ఈడీ లైట్ల వాడకంతో విద్యుత్ వినియోగం తగ్గించే చర్యలూ తీసుకుంటున్నారు. మెట్రో పైకప్పులపై సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా 14 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
ఇంటర్నెట్ ఆధారిత నిఘా
మెట్రోలో ఇంటర్నెట్ ఆధారిత సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ ఏర్పాటు. మెట్రో అంతటా మొత్తం వెయ్యి సీసీ కెమెరాలు ఉంటాయి. స్టేషన్ బయట, స్టేషన్ లోపట, రైలు ఎక్కే చోట, మహిళల కోచ్ లలో ఇలా అన్ని ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఇవి అధిక రిజల్యూషన్ కలిగిన కెమెరాలు. ఎక్కువ ఏరియాను కవర్ చేసేలా ఉంటాయి. ఈ కెమెరాలు తీస్తున్న వీడియోలను భద్రతా సిబ్బంది అనుక్షణం వీక్షిస్తూ ఉంటారు. అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తారు. అంతేకాదు, సీసీకెమెరాలే అనుమానాస్పద వస్తువుల సమాచారాన్ని తెరపై హైలైట్ చేసి చూపిస్తాయి.
మెట్రో రైలు పిల్లర్లకు యూనిక్ నంబర్లు

వాణిజ్య మంత్రం
ఎల్ అండ్ టీ మెట్రో రూ.15,000 కోట్లకు పైగా వ్యయంతో కూడిన ప్రాజెక్టు. రైళ్ల నిర్వహణ, ఇతర వ్యవస్థల నిర్వహణకు భారీ వ్యయం అవుతుంది. ఈ ఖర్చులను ప్రయాణికుల టికెట్ల ద్వారానే రాబట్టుకోవాలంటే చార్జీలు సామాన్యులకు అందుబాటులో ఉండనే ఉండవు. వందల రూపాయల్లో టికెట్ చార్జీని నిర్ణయించాల్సి వస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ మెట్రోకు మూడు కారిడార్ల పరిధిలో 17 చోట్ల వాణిజ్య కార్యకలాపాలకు గాను అదనపు స్థలాలను కేటాయించింది. వీటిలో వాణిజ్య సముదాయాలను నిర్మించడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. చార్జీల ద్వారా 50 శాతం, షాపింగ్ కేంద్రాల నుంచి 45 శాతం, ప్రకటనల రూపంలో 5 శాతం ఆదాయం సమకూర్చుకునే ప్రణాళికకు అనుమతి ఉంది.
మెట్రో మస్కట్

రైలు చార్జీలు
మెట్రో రైలులో ప్రయాణ చార్జీలు 10 రూపాయలతో మొదలై గరిష్టంగా 60 రూపాయల వరకు ఉండేలా ప్రారంభంలో ఖరారు చేశారు. మొదటి రెండు కిలోమీటర్ల ప్రయాణానికి 10 రూపాయలు, 4 కిలోమీటర్ల ప్రయాణానికి 15 రూపాయలు, 6 కిలోమీటర్ల దూరానికి 25 రూపాయలు, 8 కిలోమీటర్లకు 30 రూపాయలు, 10 కిలోమీటర్లకు 35 రూపాయలు, 14 కిలోమీటర్లకు 40 రూపాయలు, 18 కిలోమీటర్లకు 45 రూపాయలు, 22 కిలోమీటర్లకు 50 రూపాయలు, 26 కిలోమీటర్లకు 55 రూపాయలు, 26 కిలోమీటర్లపైన దూరానికి 60 రూపాయలు ప్రయాణ చార్జీగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఓ ప్రయాణికుడు తన వెంట 10కిలోల బరువుగల లగేజీ వరకే ఉచితంగా తీసుకెళ్లగలరు. అంతకు మించితే చార్జీ ఉంటుంది. ఎల్ అండ్ టీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మెట్రో రైలు సంస్థ ఏటా 5 శాతం లేదా అంతకంటే ఎక్కువ మేర ప్రయాణ చార్జీలను పెంచొచ్చు. దీనికి ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, అత్యంత రద్దీ సమయాల్లో టికెట్ చార్జీలు 25 శాతం పెంచే ప్రతిపాదన కూడా ఒకటుంది. ప్రారంభంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రైళ్లను నడుపుతారు. మూడు కారిడార్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు రైళ్లను నడిపే ప్రతిపాదన ఉంది. రద్దీ ఉంటే రైళ్ల ప్రయాణ సమయాలు మరికాస్త ముందే మొదలై, అర్ధరాత్రి తర్వాత కూడా కొనసాగే అవకాశాలు లేకపోలేదు.
More Telugu Articles