రుణం కావాలా...? పీ2పీ వేదికలో దరఖాస్తు చేసుకుంటే నేరుగా బ్యాంకు ఖాతాలో జమ ...!

12-10-2017 Thu 12:53

అప్పు అవసరం లేని వారు ఈ రోజుల్లో తక్కువ మందే ఉంటారు. అవసరం వున్నా.. లేకపోయినా బదులు ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉండే వారు ఎందరో. అవసరంలో అప్పు ఇచ్చే నాథుడు కనిపించక ఎన్నో తంటాలు పడే వారూ ఉన్నారు. ఈ క్రమంలో సులభంగా రుణం పొందే అవకాశం ఉన్న పీర్ టు పీర్ లెండింగ్ గురించి తెలుసుకోవాల్సిందే మరి. అంతేకాదు, చేతిలో డబ్బులు దండిగా ఉంటే అప్పు ఇవ్వడం ద్వారా నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకూ ఇదే మార్గం.


పీటుపీ లెండింగ్
రుణం కోరుకుంటున్న వారిని, అదే సమయంలో రుణం ఇవ్వాలనుకుంటున్న వారినీ కలపడమే పీర్ టు పీర్ లెండింగ్ కాన్సెప్ట్. అధిక వడ్డీ ఆదాయం కోరుకునే వారు ఈ వేదికల ద్వారానే రుణాలను ఆఫర్ చేస్తుంటారు. రుణం ఇచ్చే వ్యక్తి నిర్దేశించిన నిబంధనలకు, రుణం ఆశిస్తున్న వ్యక్తి కట్టుబడితే సులభంగా రుణం పొందేందుకు ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. పీటుపీ లెండింగ్ ను క్రౌండ్ ఫండింగ్ అని, సోషల్ లెండింగ్ అనే పేర్లతోనూ చెప్పుకుంటారు.

పీటుపీ వేదికలు
representational imageఇలా రుణ గ్రహీతలు, రుణ దాతల మధ్య అనుసంధానానికి ఎన్నో పీటుపీ లెండింగ్ వేదికలు ఏర్పాటయ్యాయి. ఆన్ లైన్ వెబ్ సైట్లు, యాప్స్ రూపంలోను ఇవి ఈ విధమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఉదాహరణకు వివాహ సంబంధం కుదిర్చే విషయంలో ఇరువైపుల వారిని బ్రోకర్ కలిపిన మాదిరిగానే వీటి పని కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. మన దేశంలో పీటుపీ లెండింగ్ వ్యవస్థ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. సంప్రదాయ రుణ వ్యవస్థతో పోల్చుకుంటే పీటుపీ రుణాల మార్కెట్ పరిమాణం కూడా చాలా తక్కువే.

ఎవరికి...?
ఉదాహరణకు మీ దగ్గర మిగులు నిధులు ఉన్నాయి. వాటిపై మంచి వడ్డీ ఆదాయం పొందాలనుకుంటున్నారు. దీంతో పీటుపీ ప్లాట్ ఫామ్ లో నమోదు చేసుకుని అదే వేదికగా మీరు కోరుకుంటున్న వడ్డీని చెల్లించే వారికి రుణాన్ని ఆఫర్ చేయవచ్చు. అదే సమయంలో రుణాన్ని ఆశించేవారు బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా సులభంగా ఆన్ లైన్ మాధ్యమం ద్వారానే రుణాన్ని పొందడానికి కూడా ఈ సాధనం ఉపయోగపడుతుంది.
 
రుణం ఇచ్చే ముందు ఏం చూస్తారు?
representational imageసాధారణంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చే ముందు రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు చూడడం సాధారణంగా జరిగే ప్రక్రియ. పీటుపీ విధానంలో క్రెడిట్ స్కోరు ఒక్కటే క్రైటీరియా కాదు. ఇతర మార్గాల ద్వారా సమాచార సేకరణ కూడా జరుగుతుంది. సామాజిక మాధ్యమాల్లో వారి ప్రొఫైల్, ఈ కామర్స్ సైట్లలో కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపుల తీరు ఎలా ఉంది? చేస్తున్న ఉద్యోగం.. తదితర వివరాల ఆధారంగా రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది.

ప్రముఖ పీటుపీ వేదికలు
క్యాపిటల్ ఫ్లోట్, లెండెన్ క్లబ్, ఐలెండ్, ఫెయిర్ సెంట్, క్రెడి ఫయబుల్, రుపాయ ఎక్చేంజ్, లెండ్ బాక్స్, ఐటుఐ ఫండింగ్, ఐలెండ్, లెండింగ్ కార్ట్ తదితర సంస్థలు పీటుపీ లెండింగ్ సేవలు అందిస్తున్నాయి.

ఆర్ బీఐ కొత్త నిబంధనలు
పీటుపీ వేదికల ద్వారా వ్యాపారం విస్తరిస్తుండడంతో వీటిని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్ సీ) మాదిరిగానే ఆర్ బీఐ నియంత్రణ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో పీటుపీ సంస్థల విషయంలో ఆర్ బీఐ నిబంధనలు ఇలా ఉన్నాయి.

రుణం తీసుకునేది ఎలా...?
representational imageరుణం కోరుకునే వారు, రుణం ఇవ్వాలనుకునేవారు పీటుపీ ప్లాట్ ఫామ్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రారంభంలో కొంత ఫీజు చెల్లించాల్సి రావచ్చు. తమ పేర్లను నమోదు చేసుకునే సమయంలోనే కేవైసీ డాక్యుమెంట్లు (నివాస చిరునామా, ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా తదితర వివరాలు) కూడా ఇవ్వాలి. ఫీజు చెల్లించిన తర్వాత, పీటుపీ సంస్థ వారి గుర్తింపు, ఇతర అర్హతలను పరిశీలిస్తుంది. ఇదే సమయంలో రుణం తీసుకోవాలని దరఖాస్తు చేసుకునే వారి రిస్క్ ఫ్రొఫైల్ ను పీటుపీ అంచనా వేస్తుంది. రుణం తీసుకోవాలనుకునే వారి శాలరీ స్లిప్పులు, కంపెనీ హెచ్ఆర్ నుంచి లేఖ, క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్, బ్యాంకు స్టేట్ మెంట్, సామాజిక మాధ్యమంలో ఐడీ తదితర వివరాలను  సేకరిస్తాయి. వీటన్నింటి ఆధారంగా ప్రతీ రుణ గ్రహీత రిస్క్ ప్రొఫైల్ ను సూచిస్తూ పీటుపీ వేదికలు ఓ రేటింగ్ ఇస్తాయి. దీంతో ఓ వ్యక్తికి రుణం ఇవ్వడం వల్ల రిస్క్ తక్కువగా ఉంటుందని రేటింగ్ సూచిస్తే సంబంధిత వ్యక్తి తక్కువ వడ్డీకే సులభంగా రుణం పొందొచ్చు. రిస్క్ ఎక్కువగా ఉన్నట్టు రేటింగ్ సూచిస్తే వడ్డీ రేటు పెరిగిపోతుంది.

బ్యాంకులో ఎస్క్రో ఖాతా తెరిచి దాని ద్వారా రుణాలను అందించాల్సి ఉంటుంది. పీటుపీ సంస్థ భాగస్వామ్యంతో ఇది జరుగుతుంది. పీటుపీ వేదికలో రుణాలను ఆశించే వారి రేటింగ్ ను గమనించి, వాటి ఆధారంగా తమకు ఆమోదం ఉన్న వడ్డీ రేటు చెల్లించగలిగే వారికి రుణాలను ఆఫర్ చేస్తారు. రుణదాతల్లోనూ భిన్న రకాలు ఉంటారు. రిస్క్ (రుణం వసూలులో ఉన్న రిస్క్) తక్కువ ఉన్న వారికే రుణాలను ఇచ్చే వారు, రిస్క్ ఎక్కువున్నా సరే వడ్డీ ఆదాయం అధికంగా ఆశించే వారు, అన్ని రకాల రిస్క్ కేటగిరీల వారికి రుణాలను ఆఫర్ చేసేవారు ఉంటారు.

రివర్స్ ఆక్షన్
representational imageఇక్కడ రుణదాతలే రిస్క్ కేటగిరీల ఆధారంగా అభ్యర్థులకు రుణాలను ఆఫర్ చేస్తారు. ఉదాహరణకు శ్రీరామ్ రుణం కోసం పీటుపీ వేదికలో దరఖాస్తు చేసుకున్నాడని అనుకుందాం. అప్పుడు అతడి రిస్క్ రేటింగ్ చూసి రుణాన్ని ఇచ్చేవారు ముందుకు వస్తారు. ఇందుకోసం బిడ్ వేస్తారు. శ్రీరామ్ ప్రతిపాదనకు ముగ్గురు రుణదాతల నుంచి బిడ్లు వచ్చాయనుకోండి. వీటిలో దేనికి ఓకే చెప్పాలి, లేదా మూడింటినీ తిరస్కరించాలా? అన్నది శ్రీరామ్ ఇష్టమే. శ్రీరామ్ వీటిలో ఒక దాన్ని ఎంచుకున్నాడనుకోండి. అప్పుడు ఇరువురి మధ్య అధికారికంగా అగ్రిమెంట్ జరుగుతుంది. సంతకాలు పూర్తయిన తర్వాత రుణం మొత్తాన్ని ఎస్క్రో ఖాతాకు బదిలీ చేస్తారు. రుణదాత కోరిక మేరకు ఎస్క్రో ఖాతా నుంచి అప్పుడు శ్రీరామ్ ఖాతాకు రుణం జమ అవుతుంది. ఆ తర్వాత నుంచి క్రమానుగత ఈఎంఐలను శ్రీరామ్ అదే ఎస్క్రో ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. చెల్లింపులు ఆలస్యమైతే జరిమానాలు కూడా ఉంటాయి.

పీటుపీ వేదికలు రుణం తీసుకుంటున్న వారి నుంచి ఇచ్చిన వారి పేరు మీద పోస్ట్ డేటెడ్ చెక్కులను తీసుకునేందుకు సాయం చేస్తాయి. రుణం తిరిగి వసూలులోనూ సాయపడుతున్నాయి. అంతేకానీ, రుణం ఇస్తున్న వారికి హామీదారులుగా ఉండవు. రుణానికి సంబంధించిన రిస్క్ ఏదైనా అది ఇచ్చిన వారే స్వయంగా భరించాల్సి ఉంటుంది. ఇరు పార్టీల మధ్య సంప్రదింపులు, సమాచారం, ఒప్పందాలు, రుణం జారీ, తిరిగి వసూలు ఈ తరహా సేవలను పీటుపీ వేదికలు అందించడం వరకే పరిమితం అవుతాయి. వారి నుంచి వసూలు చేసే ఫీజులే వీటికి మిగిలే ఆదాయం. రుణం తీసుకున్న వారు ఎగ్గొడితే ఇచ్చిన వారు ఆ మేరకు నష్టాన్ని భరించాల్సి వస్తుంది. అధిక రిస్క్ కేటగిరీ వారికి రుణం ఇస్తే అధిక అదాయం వస్తుంది. కానీ, డిఫాల్టింగ్ రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది. ఈ రిస్క్ నేపథ్యంలో రుణదాతల విలువను కాపాడేందుకు కొన్ని పీటుపీ వేదికలు ప్రొటెక్షన్ ఫండ్ అంటూ నిర్వహిస్తున్నాయి.

ఎవరికి, వడ్డీ రేటు ఎంత
representational imageపీటుపీ వేదికల ద్వారా తీసుకునే రుణాలపై వడ్డీ రేటు 12 శాతం నుంచి 36 శాతం వరకు ఉంటుంది. రిస్క్ రేటింగ్ ఆధారంగా ఎంతన్నది తుదిగా ఖరారవుతుంది. సాధారణంగా వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్) తీసుకుంటే 12 శాతం నుంచే రుణం లభించే పరిస్థితి ఉంది. అయితే, పర్సనల్ లోన్స్ అందరికీ సులభంగా రావు. ఉద్యోగులు వారి ప్రొఫైల్ ఆధారంగానే ఉంటుంది. మంచి ఉద్యోగంలో ఉన్న వారికి 11.5 శాతానికి కూడా పర్సనల్ లోన్స్ ను బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. ఉద్యోగులు కాని ఇతర ఆదాయ వర్గాల వారికి పీటుపీ రుణం తీసుకునేందుకు ఓ చక్కని వేదికగా చెప్పుకోవచ్చు. అలాగే, అత్యవసరంగా రుణం అవసరమైన వారు ఇతరత్రా మార్గాల్లో రుణం వచ్చే అవకాశం లేని వారు సైతం వడ్డీ ఎక్కువైనా ఉన్న మార్గం పీటుపీని ఆశ్రయించడమే.

ఇక మిగులు నిధులు ఉండి, వాటిని ఆదాయ వనరుగా మార్చుకోదలిచిన వారు పీటుపీ వేదికల్లో లెండర్లు (రుణ దాతలు)గా నమోదు చేసుకుని రుణాలు ఇచ్చుకోవచ్చు. వడ్డీ ఆదాయం పొందొచ్చు. నిజానికి మన చుట్టూ వడ్డీ వ్యాపారాలు చేసే వారు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. తెలిసిన వారికి బదులిచ్చి వడ్డీ వసూలు చేసుకోవడం అన్నది మన దేశంలో ఎన్నో ఏళ్ల నుంచీ ఉన్నదే. కాకపోతే దీన్ని కాస్త సురక్షితమైన వేదికగా చేసుకునేందుకు పీటుపీ వేదికలు పుట్టుకొచ్చాయి. ఇక్కడ రుణ గ్రహీతలు, రుణదాతలకు తెలియక్కర్లేదు. ఒకరి పరిచయం, మరొకరికి అవసరం లేదు. వారి క్రెడిట్ రిస్క్ ఇక్కడ ప్రామాణికం. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఫీజులు ఉండొచ్చు. ప్రాసెసింగ్ ఫీజు రుణంలో ఒక శాతం వరకు ఉంటుంది. రుణదాతలు, రుణ గ్రహీతల్లో ఎవరిని అనుమతించాలి, అనుమతించకూడదన్నది పీటుపీ సంస్థల ఇష్టమే.

ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగానూ
representational imageడీమోనిటైజేషన్ తర్వాత చిన్న మధ్య స్థాయి వ్యాపార సంస్థలకు రుణాలు లభించడం కష్టమైంది. దీంతో పీటుపీ లెండింగ్ కు డిమాండ్ పెరిగింది. సాధారణ పెట్టుబడి సాధనాలతో పోలిస్తే పీటుపీ వేదికగా పెట్టుబడి పెట్టడం ద్వారా (రుణాలివ్వడం) అధిక రాబడులను అందుకోవాలనుకునే వారి సంఖ్యా పెరుగుతోంది. అందుకే ఇదొక ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగానూ మారిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా...
ప్రపంచ వ్యాప్తంగా పీటుపీ లెండింగ్ వ్యాపారం 2002లో కేవలం 19 కోట్ల రూపాయలు. కానీ, 2015 చివరికి ఇది రూ.38,300 కోట్లకు పెరిగిపోయింది. అటు రుణ గ్రహీతలకు, ఇటు రుణదాతలకు రెండు వర్గాల వారి అవసరాలు తీర్చే వ్యవస్థ కావడమే. ఆస్ట్రేలియా, అర్జెంటీనా, కెనడా (ఆంటారియో), న్యూజిలాండ్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, అమెరికాలోనూ పీటుపీ వ్యాపారంపై అక్కడి నియంత్రణ సంస్థల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇజ్రాయెల్, జపాన్ లో నిషేధం అమల్లో ఉంది. ఈ ప్రపంచంలో అతిపెద్ద పీటుపీ లెండింగ్ మార్కెట్ చైనాదే. వందల కొద్దీ సంస్థలు ఇక్కడ పనిచేస్తుండగా, వాటిపై ఎటువంటి నియంత్రణలు అమల్లో లేవు.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
2 years ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
4 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
4 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
4 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
4 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
4 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
4 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
4 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
4 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
4 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
4 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
4 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
4 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
4 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
4 years ago
..more