మీ స్మార్ట్ ఫోన్ తరచూ వేడెక్కుతోందా...? వీటిని ఫాలో అయితే కూల్..!

07-10-2017 Sat 15:11

దాదాపుగా అందరూ స్మార్ట్ ఫోన్లను వాడేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వాడే వారిలో ఎక్కువ మందికి ఎదరయ్యే సమస్య ఫోన్ తరచూ వేడెక్కడం. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, ఇలా వేడెక్కడం ఫోన్ కు మంచిది కాదు. వాడే వారికీ మంచిది కాదు. అందుకే ఈ విషయంలో ఏం చేయాలన్న దానిపై నిపుణుల సూచనలు తెలుసుకుంటే ఫోన్ ను కూల్ గా ఉంచుకోవచ్చు.

వేడి ఎందుకు ఉత్పన్నం అవుతుంది?ఫోన్ కు సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రెండూ రెండు కళ్లలాంటివి. ఈ రెండింటి మధ్య కూర్పు సరిగ్గా ఉండాలి. ఇది సరిగ్గా లేకపోతే ఫోన్లోని ప్రాసెసర్ అధిక క్లాక్ వేగంతో తిరగాల్సి వస్తుంది. దాంతో ఫోన్లో వేడి ఉత్పన్నం అవుతుంది. ఈ రెండింటి మధ్య ఆప్టిమైజేషన్ సరిగ్గా జరిగితే వేడి సమస్య దాదాపు ఎదురుకాదు. ఇప్పుడు చాలా వరకు స్మార్ట్ ఫోన్లు అధిక సామర్థ్యం ఉన్న ప్రాసెసర్, హై ఎండ్ హార్డ్ వేర్ సౌకర్యాలతో వస్తున్నాయి. వీటి వల్ల వేడి సమస్య ఎదురవుతోంది.

ముఖ్యంగా అధిక సామర్థ్యం ఉన్న స్నాప్ డ్రాగన్ 652, స్నాప్ డ్రాగన్ 810 తరహా ప్రాసెసర్లున్న ఫోన్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఎంత మేర విద్యుత్ ఫోన్లో వినియోగమవుతుందన్న అంశం ఆధారంగా ఎంత వేడెక్కుతుందన్నదీ ఆధారపడి ఉంటుంది. గ్రాఫిక్ సామర్థ్యాలు దండిగా ఉన్న గేమ్ ను ఆడుతున్నారనుకోండి... సెంట్రల్, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ నుంచి అధిక శక్తి అవసరం అవుతుంది. దాంతో వేడి జనరేట్ అవుతుంది. ఇలా వేడి పెరిగిపోతే ప్రాసెసర్ వేగం నిదానిస్తుంది. వేడెక్కినప్పుడు వెంటనే ఫోన్ ను వాడడం ఆపేసి కూల్ అయిన తర్వాతే వాడుకోవాలి. ఫోన్లోని కొన్ని ఫంక్షన్లకు అధిక బ్యాటరీ శక్తి అవసరం. కనుక వాటిని వాడే సమయంలో వేడెక్కడం సాధారణంగా జరిగేదే.

పేలి పోతాయా?
representational imageకారు, బైక్ ఎక్కువ దూరం నడిపినా, గ్రైండర్, మిక్సర్ ఎక్కువ సమయం పని చేయించినా వేడెక్కడాన్ని గమనించొచ్చు. అంతెందుకు ల్యాప్ టాప్, టీవీ కొంత సమయం వాడిన తర్వాత వాటిపై చేయి పెట్టి చూసినా స్వల్పంగా వేడి తెలుస్తుంది. వేడెక్కడం అనే సమస్య ఒక్క మొబైల్ ఫోన్లకే పరిమితం కాదు. మొబైల్ లో వేడి ఉత్పన్నం కావడానికి ప్రాసెసర్, బ్యాటరీ, సిగ్నల్స్ సరిగా లేకపోవడం, వాతావరణ పరిస్థితులు ఇలా ఎన్నో అంశాలు కారణం అవుతాయి. ఈ విధమైన వేడితో స్మార్ట్ ఫోన్లు పేలే అవకాశాలు దాదాపుగా ఉండవు. బ్యాటరీలో లోపం మినహాయిస్తే.

గేమ్స్ తో ప్రాసెసర్ కు హాని
గేమ్స్ ను ఎక్కువ సమయం పాటు ఆడుతూ ఉంటే ఫోన్ సీపీపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. హెవీ మల్టీటాస్క్ చేయయడం వల్ల, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే గేమ్స్ ను అరగంటకు మించి వాడిన సందర్భాల్లోనూ ఫోన్ వేడెక్కిపోవడాన్ని గుర్తించొచ్చు. అందుకే ఎక్కువ సమయం ఉండే గేమ్స్ ను ఎంచుకోవద్దు.

డిజైన్
ఇప్పుడు వస్తున్న మొబైల్స్ స్లిమ్ గా ఉంటున్నాయి. ఫోన్లో ఖాళీ స్థలం లేకుండా, లోపలి వేడి బయటకు వెళ్లేలా డిజైన్ చేయకపోవడం కూడా ఫోన్ తొందరగా వేడెక్కడానికి ఓ కారణం.

బ్యాటరీ
బ్యాటరీ చార్జింగ్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ నెగటివ్ గా స్టోర్ అవుతాయి. తిరిగి ఆ శక్తిని వాడుతున్న సమయంలో పాజిటివ్ గా మారతాయి. ఈ రెండూ ఏక కాలంలో చేయడం వల్ల ఎలక్ట్రాన్స్ వేగంగా కదులుతూ ఫోన్ వేడెక్కుతుంది.

బలహీన సిగ్నల్స్
representational imageసిగ్నల్స్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు మొబైల్ ఆటోమేటిక్ గా అధిక సిగ్నల్స్ కోసం సెర్చ్ చేస్తుంటుంది. ఇది బయటకు కనిపించదు. సిగ్నల్స్  అన్నవి వైఫై లేదా మొబైల్ సిగ్నల్స్ ఏవైనా కావొచ్చు. కనుక నెట్ వినియోగం లేని సమయంలో వీటిని ఆఫ్ చేయాలి.

చుట్టుపక్కల ఉష్ణోగ్రత
వేసవిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే సమయాల్లో ఫోన్లు వేడెక్కే సమస్య మరింత అధికమవుతుంది. బయట వేడికి తోడు ఫోన్లోని ప్రాసెసర్ వేడి కూడా తోడవడమే ఇందుకు కారణం.

అన్ని ఫోన్లలోనూ...?
ఐఫోన్, శాంసంగ్ వంటి టాప్ బ్రాండ్ ఫోన్లలోనూ హీటింగ్ సమస్య ఉంది. కెమెరా ఎక్కువగా వాడుతున్నప్పుడు, గేమ్స్ వాడుతున్నప్పుడు, నాలుగైదు యాప్స్ ఓపెన్ చేసినప్పుడు, మొబైల్ డేటా ఆన్ చేసినప్పుడు సాధారణంగా ప్రాసెసర్ పై లోడ్ పడుతుంది. దాంతో ప్రాసెసర్ అధిక శక్తితో పనిచేయడం వల్ల ఈ విధంగా వేడి పుడుతుంది. కనుక అవసరం లేనప్పుడు ఇవన్నీ ఆఫ్ చేసేయాలి. దీంతో వేడి కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ అన్నీ ఆఫ్ చేసినాగానీ ఫోన్  40 డిగ్రీలకు పైనే వేడితో ఉంటే అందులో లోపం ఉన్నట్టే. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ ఆప్టిమైజేషన్ సరిగా చేయలేదని అర్థం. లేదా బ్యాటరీ సమస్యగా అనుమానించాలి.

యాప్స్ ఓపెన్ చేసి మరవడం
representational imageసాధారణంగా అవసరమైన యాప్ ను ఓపెన్ చేసి, వాడిన తర్వాత బ్యాక్ బటన్ సాయంతో ఫోన్ హోమ్ పేజీకి వెళుతుంటారు. యాప్స్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేయం. దీంతో అవి బ్యాక్ గ్రౌండ్ లో పనిచేస్తుంటాయి. వీటి కోసం ప్రాసెసర్ అధిక శక్తితో పనిచేయాల్సి ఉంటుంది. వీటి కోసం ప్రాసెసర్ అధిక శక్తితో పనిచేయాల్సి ఉంటుంది. అందుకే వేడి జనరేట్ అవుతుంది. కనుక యాప్స్ ను వాడిన వెంటనే క్లోజ్ చేయాలి.

నివారణ?
ల్యాప్ టాప్, డెస్క్ టాప్ కంప్యూటర్లలో  లోపలి వేడిని బయటకు పంపించేందుకు ఫ్యాన్లు ఉంటాయి. మొబైల్ లో ఇటువంటి ఏర్పాట్లు ఉండవు. అందుకే ఫోన్లలో వేడి ఎప్పుటికప్పుడు వెంటనే బయటకు వెళ్లదు. దాంతో ఆ వేడి తెలుస్తుంది.

సాఫ్ట్ వేర్ అప్ డేట్స్
మొబైల్ ఫోన్లలోని సాఫ్ట్ వేర్ అప్ టు డేట్ లో ఉంచుకోవడం అవసరం. కొన్ని ఫోన్లలో సాఫ్ట్ వేర్, హర్డ్ వేర్ సరిగా ఆప్టిమైజ్ కావు. దీంతో కంపెనీలు సాఫ్ట్ వేర్ ను మార్చి అప్ డేట్స్ గా ఇస్తుంటాయి. వీటిని ఇన్ స్టాల్ చేసుకుంటే వేడి సమస్య పరిష్కారం కావొచ్చు. సెట్టింగ్స్ లో ఎబౌట్ ఫోన్ లో సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ ఉంటుంది.

అవసరం లేని వాటిని డిజేబుల్ చేయాలి
representational imageఫోన్లో లొకేషన్ బటన్ ఎప్పుడూ ఆఫ్ లో ఉంచుకోవడం మంచిది. అవసరమైనప్పుడు ఆన్ చేసి, అది పూర్తయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆన్ లో ఉంటే జీపీఎస్ సిగ్నల్స్ కోసం ఫోన్ ఎప్పుడూ సెర్చ్ చేస్తూనే ఉంటుంది. దీంతో బ్యాటరీ వినియోగం తగ్గుతుంది. అలాగే, బ్లూటూత్ ఆప్షన్ ను కూడా ఆఫ్ లో ఉంచుకోవాలి. ఇది ఆన్ లో ఉన్నా సమీపంలోని డివైజెస్ కోసం అన్వేషించడం వల్ల హీటింగ్ సమస్య రావచ్చు.

వేడెక్కకుండా ఈ యాప్
గ్రీనిఫై greenify అనే ఒక యాప్ ఉంది. ఇందులో మంచి ఆప్షన్లు ఉన్నాయి. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఇందులో సెట్టింగ్స్ సెలక్ట్ చేసుకుంటే ఏదైనా అప్లికేషన్ మీరు వాడి మరో అప్లికేషన్ లోకి వెళ్లారనుకోండి. అంతకుమందు వాడిన అప్లికేషన్ ను ఈ యాప్ బ్యాక్ గ్రౌండ్ లో గుర్తించి క్లోజ్ చేసేస్తుంది. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ ఓపెన్ చేసి ఉంటే ఎక్కువ డేటాను, బ్యాటరీ శక్తిని తీసుకుంటుంటాయి. గ్రీనిఫై యాప్ ఉంటే ఫోన్లో బ్యాక్ గ్రౌండ్ లో ఓపెన్ చేసి ఉన్న వీటిని కూడా క్లోజ్ చేసేస్తుంది. దీంతో బ్యాటరీ లైఫ్ మెరుగుపడుతుంది. ప్రాసెసర్ పై లోడ్ తగ్గి వేడి సమస్య కూడా ఏర్పడదు. బ్యాక్ గ్రౌండ్ లోని అన్ని యాప్స్ కాకుండా మీరు ఎంపిక చేసిన యాప్స్ ను మాత్రమే క్లోజ్ చేసే సౌకర్యం కూడా ఉంది. ఉదాహరణకు మీరు తరచూ మెయిల్ బాక్స్ చెక్ చేసుకుంటున్నారనుకోండి. బ్యాక్ గ్రౌండ్ లో అది క్లోజ్ చేయవద్దనుకుంటే దాన్ని గ్రీనిఫై క్లోజ్ చేయదు. ఇవన్నీ యాప్ సెట్టింగ్స్ లో చేసుకోవాల్సి ఉంటుంది.

యాప్ నోటిఫికేషన్లు
యాప్ నోటిఫికేషన్లు కూడా ప్రాసెసర్ పై ఒత్తిడిని పెంచేవే. కనుక యాప్ నోటిఫికేషన్ల సమయాన్ని వెంటనే కాకుండా ఎక్కువ సమయం విరామం ఉండేలా సెట్ చేసుకోవాలి. లేదంటే ఏకంగా నోటిఫికేషన్లను పూర్తిగా ఆఫ్ చేసుకోవడం మంచిది. దీంతో యాప్స్  తెర వెనుక ఓపెన్ కాకపోయినా పనిచేయకుండా, ప్రాసెసర్ పై ఒత్తిడి పెంచకుండా ఉంటాయి. నోటిఫికేషన్లను ఆపేస్తే మాత్రం యాప్ కు సంబంధించి ఏ సందేశం వచ్చినా తెలియదు.

ఫోన్లో యాప్స్ ఓపెన్ చేసి ఉంచితే ప్రాసెసర్ పై ఎక్కువ లోడ్ పడుతుందని చెప్పుకున్నాం కదా... అలాగే, యాప్స్ క్లోజ్ చేసి ఉన్నా గానీ కొంత మేర ప్రాసెసర్ పై లోడ్ ఉంటుంది. ఎందుకంటే ఇవి యాక్టివ్ గా ఉండాలి కాబట్టి. నచ్చిన ప్రతీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే ఫోన్ పై లోడ్ ను పెంచుతుంది. అందుకే రోజు వాడే యాప్స్ కాకుండా అప్పుడప్పుడు వాడేవాటిని మాత్రం డిలీట్ చేసేసుకోండి.

డేటా వాడకం
3జీ, 4జీ డేటా ను గంటల తరబడి ఫోన్లో ఉపయోగించినా వేడి పెరుగుతుంది. సీపీయూ ఎక్కువగా పనిచేయడం వల్ల ఇలా జరుగుతుంది. అందుకే కనీసం అరగంటకోసారి కొంత సమయం విరామం ఇవ్వడం మంచిది.

2జీనే బెటర్!
స్మార్ట్ ఫోన్లో డేటా అవసరమైనప్పుడు నెట్ వర్క్ టైప్ ను 3జీ లేదా 4జీకి మార్చుకోవాలి. మాట్లాడేప్పుడు కూడా 2జీ నెట్ వర్క్ నే సెలక్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే 2జీ సిగ్నల్స్ బలమైనవి. దీంతో సిగ్నల్స్ కోసం మీ ఫోన్చే సెర్చ్ చేసుకునే బాధ తగ్గుతుంది. దాంతో ప్రాసెసర్ కూల్ గా ఉంటుంది.

చార్జింగ్ సమయంలో
representational imageఫోన్ ను చార్జ్ చేస్తున్న సమయంలో చదునుగా ఉన్న చోట ఉంచాలి. దీంతో ఫోన్లోని వేడి బయటకు వెళుతుంది. ఫోన్ వెనుక భాగంలో ప్లాస్టిక్ ప్యానల్ ఉంచడం వల్ల ఫోన్లోని వేడి బయటకు వెళ్లే అవకాశం ఉండదు.

అయినా వేడెక్కుతోందా....?
పైన చెప్పినవన్నీ చేసినా ఫోన్ వేడెక్కుతుందంటే అది బ్యాటరీ వల్ల అయినా లేక ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ మధ్య ఆప్టిమైజేషన్ సరిగా లేకపోవడం అయినా కారణం కావచ్చు. ముందు ఫోన్లోని డేటాను జాగ్రత్తగా బ్యాకప్ తీసుకుని సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. దీంతో ఫోన్ కొన్నప్పుడు ఏ స్థితిలో ఉందో తిరిగి అక్కడికే వెళుతుంది. ఫోన్లోని డేటా, యాప్స్, సెట్టింగ్స్ అన్నీ డిలీట్ అవుతాయి. దీంతో వేడి సమస్య తగ్గొచ్చు. అయినా వేడెక్కే సమస్య అలాగే ఉంటే మాత్రం ఫోన్ ను కంపెనీ కస్టమర్ సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లి చెక్ చేయించాలి. దాన్ని రీప్లేస్ చేయాలని కోరొచ్చు. వారంటీ తీరిపోయి సమస్య పరిష్కారం కాకపోతే ఫోన్లో కస్టమర్ రామ్ ఇన్ స్టాల్ చేసుకుని ట్రై చేయొచ్చు. ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ వల్లే వేడి సమస్య అయి ఉంటే కస్టమ్ రామ్ ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత అది పరిష్కారం అవుతుంది.

వేడెక్కితే వాడొద్దు
ఫోన్లో ఆప్టిమైజేషన్ సరిగా లేకపోవచ్చు, చార్జింగ్ లో ఉండొచ్చు, లేదా హెవీ గేమ్స్ ఆడటం కావచ్చు, ఎక్కువ సమయం పాటు నెట్ బ్రౌజింగ్, వీడియో వాచింగ్, కెమెరా ఇలా ఏ అంశమైనా కానీయండి...  ఫోన్ బాగా వెడెక్కిందంటే వెంటనే దాన్ని వాడడం ఆపేయాలి. వేడి ఎక్కువ ఉన్నా పట్టించుకోండా అలా వాడుతూ వెళితే ఆ వేడికి చిప్ దెబ్బతింటుంది. ఫోన్ ను అధికంగా వాడుతున్న సందర్భాల్లో వేడి పెరిగిపోతే కొద్ది సేపు విరామం ఇవ్వడం మంచిది.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
2 years ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
4 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
4 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
4 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
4 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
4 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
4 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
4 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
4 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
4 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
4 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
4 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
4 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
4 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
4 years ago
..more