కామెర్లే అని తేలిగ్గా తీసుకోవద్దు... ప్రాణాంతకమవుతుంది!

25-09-2017 Mon 14:04

హెపటైటిస్ ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారిన వ్యాధుల్లో ఒకటి. మన దేశంలో 5.2 కోట్ల మంది దీర్ఘకాలిక హెపటైటిస్ తో బాధపడుతున్నవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరుడు విడుదల చేసిన నివేదిక తెలియజేస్తుంది. 4 కోట్ల మంది హెపటైటిస్ బితో, 60 లక్షల నుంచి 1.2 కోట్ల వరకు హెపటైటిస్ సితో బాధపడుతున్నట్టు తెలిపింది. భారత్ లో వైరల్ హెపటైటిస్ తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా గుర్తించింది. 2014 లో దీని వల్ల లక్ష  మంది ప్రాణాలు కోల్పోయినట్టు వ్యాధుల నియంత్రణ జాతీయ కేంద్రం గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఒక శాతం జనాభాకు హెపటైటిస్ సి ముప్పు ఉందని గుర్తించారు.  


కాలేయం (లివర్) వాపునకు గురై ఎర్రగా మారిపోయే స్థితిని హెపటైటిస్ గా చెబుతారు. వైరల్ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఈ సమస్యకు దారితీస్తుంది. అలాగే, కొన్ని రకాల డ్రగ్స్, ఔషధాలు, టాక్సిన్లు, ఆల్కహాల్ సేవనం వల్ల కూడా హెపటైటిస్ వ్యాధికి గురి కావచ్చు. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటూ మరొకటి ఉంది. వ్యాధికారక సూక్ష్మజీవులు, వైరస్ ల నుంచి శరీరానికి రక్షణ కల్పించాల్సిన యాంటీబాడీలు పొరపాటుగా కాలేయ కణజాలంపై దాడి చేయడం వల్ల ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో హెపటైటిస్ అనేది ఫైబ్రోసిస్, సిర్రోసిస్, లివర్ కేన్సర్ లకు దారి తీసే అవకాశాలున్నాయి.  

representational imageమన శరీరంలోకి ప్రవేశించిన హానికారక రసాయనాలు, విష పదార్థాలను రక్తం నుంచి తొలగించడం కాలేయం చేసే పని. అలాగే తీసుకున్న ఆహారాన్ని శరీరానికి అవసరమైన పోషకాలు, శక్తిగా మారుస్తుంది. అదనంగా ఉన్న వాటిని నిల్వ చేస్తుంది. శరీరానికి అవసరమైనప్పుడు విడుదల చేస్తుంది. హెపటైటిస్ కారణంగా కాలేయం వాపునకు గురవడంతో ఈ పనులన్నీ కష్టతరమవుతాయి. ఫలితంగా తీవ్ర అనారోగ్యం కలుగుతుంది.

హెపటైటిస్ ఎన్ని రకాలు
హెపటైటిస్ లో ప్రధానంగా ఐదు రకాలున్నాయి. ఏ(హెచ్ఏవీ), బీ(హెచ్ బీవీ), సీ(హెచ్ సీవీ), డీ(హెచ్ డీవీ), ఇ(హెచ్ఈవీ). వీటి లక్షణాలు దాదాపు ఒకే మాదిరిగా ఉంటాయి. బీ, సీ, డీ అన్నవి దీర్ఘకాలిక వ్యాధులు. వీటి బారిన పడితే తిరిగి బయటపడడానికి సమయం తీసుకుంటుంది. హెపటైటిస్ ఏ, ఇ రకాలు తీవ్రత కలిగినవి. అయితే వీటి నుంచి తక్కువ కాలంలోనే బయటపడొచ్చు. హెపటైటిస్ రాకకు పలు కారణాలున్నాయి. వాటిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరస్ ల సమూహం (ఏ,బీ,సీ,డీ,ఇ) ప్రధానమైనవి. వీటి వల్ల హెపటైటిస్ బారిన పడడం జరుగుతుంది. ఇవి శరీరంలోకి చొరబడిన తర్వాత కాలేయంపై దాడి చేస్తాయి. హెపటైటిస్ అన్నది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. హెపటైటిస్ వైరస్ లు  ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కొన్ని వారాల నుంచి కొన్ని నెలల పాటు వీటి ప్రభావం కొనసాగుతుంది. కొందరిలో హెపటైటిస్ ఉన్నప్పటికీ లక్షణాలు కనిపించవు. దీర్ఘకాలం తర్వాత బయటపడుతుంది. ఈ లోపు వీరి నుంచి ఇది మరింత మందికి వ్యాపించే ప్రమాదం ఉంటుంది.

హెపటైటిస్ ఏ
representational imageహెపటైటిస్ ఏ తరహా వైరస్ (హెచ్ఏవీ) వల్ల ఏర్పడే సమస్య. ఇప్పటికే ఈ ఇన్ఫెక్షన్ బారిన పడిన వారి మలం వల్ల కలుషితమైన నీరు, ఆహారం తీసుకున్న వారికి ముప్పు ఉంటుంది. అత్యంత సూక్ష్మ స్థాయిలో వైరస్ బారిన పడిన వారి శరీర వ్యర్థాలు కలిసినా సరే దీని బారిన పడతారు. మురుగునీటి ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువ. అలాగే వైరస్ వచ్చిన వారు శుభ్రత పాటించకుండా కూరగాయలు, పండ్లను క్యారీ చేసినా వాటి ద్వారా ఇతరులకు వ్యాపించే ముప్పు ఉంది. వైరస్ బారిన పడిన వారితో సన్నిహితంగా ఉన్నవారికీ ఇది వస్తుంది. జ్వరం, ఆకలి తగ్గిపోవడం, వికారం, డయేరియా, కామెర్లు సమస్యను తెలియజేసే లక్షణాలు. హెపటైటిస్ ‘ఏ’కు చికిత్స రోగి వ్యాధి తీవ్రత ఆధారంగా మారిపోతుంది. లివర్ ఫెయిల్యూర్ అయితే ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది.

హెపటైటిస్ బి
హెపటైటిస్ బి ( హెచ్ బీవీ) వైరస్ అన్నది తీవ్రమైన ఇన్ఫెక్షన్. ప్రాణాంతాక లివర్ వ్యాధికి లేదా లివర్ క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉంటుంది. బి వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. ఒకరికి వాడిన సూదినే మరొకరికి ఉపయోగించడం, టూత్ బ్రష్, రేజర్లు ఒకరివి మరొకరు వాడడం, ఇన్ఫెక్షన్ ఉన్న వారితో లైంగిక చర్య వల్ల హెచ్ బీవీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భంతో ఉన్న వారికి ఈ వైరస్ వస్తే, పుట్టే పిల్లలకు కూడా ఇది విస్తరిస్తుంది. కడుపులో నొప్పి, వికారం, వాంతులు, ఆకలి కోల్పోవడం, కామెర్లు, కీళ్లలో నొప్పులు, తీవ్రమైన అలసట లక్షణాలు బయటకు కనిపిస్తాయి.

తీవ్రమైన హెపటైటిస్ బి సమస్యలో ద్రవ పదార్థాలను అందించడం ద్వారా రోగిని కాపాడే ప్రయత్నం చేస్తారు. మందులతో వైరస్ ను తొక్కి పెట్టడం ద్వారా లివర్ కేన్సర్, సిర్రోసిస్ బారిన పడే అవకాశాలను తగ్గిస్తారు. అందుకే హెపటైటిస్ బి బారిన పడిన వారు మందులతో చికిత్స తీసుకోవడం మొదలు పెడితే జీవితాంతం కొనసాగించాల్సి వస్తుంది.

హెపటైటిస్ సి
representational imageఇది కూడా హెపటైటిస్ బి మాదిరిగానే ఇన్ఫెక్షన్ గురైన వారి శరీర వ్యర్థాలు, వారితో లైంగిక సాన్నిహిత్యం వల్ల వస్తుంది. జ్వరం, అలసట, ఆకలి తక్కువగా ఉండడం, వాంతులు, వికారం, కడుపులో అసౌకర్యం, కీళ్ల నొప్పి, కామెర్లు తదితర లక్షణాలు హెచ్ సీవీ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కనిపిస్తాయి. 20-30 శాతం మందిలో తీవ్రమైన అనారోగ్యం, 75-85 శాతం మందికి దీర్ఘకాలిక అనారోగ్యం కలిగే అవకాశాలుంటాయి.సాధారణంగా శరీరంలోని రోగ నిరోధక శక్తి ఇన్ఫెక్షన్ ను బయటకు పంపిస్తుంది. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ లోనూ కాలేయం దెబ్బతినడం అన్నది అరుదుగా జరుగుతుంది. వైరస్ ఏ జాతికి చెందినది అనే అంశం ఆధారంగా హెచ్ సీవీ నయం అవుతుందా, లేదా అన్నది నిర్ధారిస్తారు. ఇటీవలి కాలంలో వస్తున్న మందులతో సమస్యను 95 శాతం వరకు నయం చేసే అవకాశాలు మెరుగయ్యాయి. కానీ, చికిత్స ఖరీదైనవి. పరిశుభ్రత పాటించడం ద్వారా సమస్య రాకుండా చూసుకోవచ్చు. ఇంజెక్షన్ల సమయంలో ఒకరికి వాడినవి మళ్లీ ఇంకొకరికి వాడకుండా జాగ్రత్త తీసుకోవడం (వాడిన తర్వాత నిర్వీర్యం చేయడం), డ్రగ్స్ కు దూరంగా ఉండడం, సురక్షితమైన లైంగిక అలవాట్లు కలిగి వుండడం వల్ల వైరస్ ముప్పును తగ్గించుకోవచ్చు.

హెపటైటిస్ డి
హెపటైటిస్ డి హెపటైటిస్ బి వైరస్ బాధితుల్లోనే వస్తుంది. దీన్నే డెల్టా హెపటైటిస్ అని అంటారు. ఇది ప్రాణాంతక లివర్ వ్యాధి. హెపటైటిస్ బి వైరస్ లక్షణాలను హెపటైటిస్ డి తీవ్రతరం చేస్తుంది. అలాగే, ప్రాణాంతక సిర్రోసిస్, ఫైబ్రోసిస్ లకు దారితీస్తుంది. అదీ అతి తక్కువ వ్యవధిలోనే. తీవ్రమైన దీర్ఘకాలిక హెపటైటిస్ డి సమస్యకు చికిత్సా మార్గాలు పరిమితం. అయితే, పెగిలేటెడ్ ఇంటర్ ఫెరాన్ ఆల్ఫా అనే ఔషధం మాత్రం ప్రభావవంతంగా పనిచేస్తుంది. చికిత్స ఏడాది పాటు కొనసాగుతుంది.

అయితే, దీని బారిన పడి చికిత్స తీసుకుని, దాన్ని నిలిపేసిన తర్వాత చాలా మందిలో తిరిగి సమస్య ఎదురయ్యే అవకాశాలున్నాయి. కాలేయ మార్పిడి ఈ సమస్య నివారణకు ఒకానొక ప్రధాన చికిత్స. హెపటైటిస్ బి బారిన పడకుండా జాగ్రత్త పడితే హెపటైటిస్ డి రాదు. అలాగే, ఒకరు వాడిన సూదులను వాడకుండా ఉండడం, రక్తమార్పిడి విషయంలో కచ్చితంగా వ్యాధుల నిర్ధారణ జరిగిందా? లేదా? అన్నది చూసుకోవాలి. డ్రగ్స్ వాడకాన్ని కూడా నిలిపివేయడం అవసరం.

హెపటైటిస్ ఇ
ఇది హెపటైటిస్ 'ఎ' రకం వైరస్ ను పోలి ఉంటుంది. వైరస్ కలుషిత నీరు, పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల వ్యాపిస్తుంది. వారం నుంచి ఆరు వారాల వరకు ఉంటుంది. దీనివల్ల ప్రాణానికి వచ్చే ముప్పు చాలా తక్కువ. వ్యాధి తీవ్రంగా మారిన కొందరిలో లివర్ వైఫల్యం చెంది ప్రాణాంతకం అవుతుంది. జ్వరం, వికారం, వాంతులు, కడుపులో నొప్పి, దురద, కీళ్లలో నొప్పులు, కామెర్లు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాల ఆధారంగా హెపటైటిస్ 'ఇ'ని గుర్తించొచ్చు. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం సాధారణంగా ఎదురు కాదు. లివర్ వైఫల్యం చెందితే ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది. దీని బారిన పడకుండా ఉండాలంటే తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. మురుగు నీటి వ్యవస్థ నిర్వహణ తీరు, వ్యక్తిగత శుభ్రత కీలకం. బయట ఐస్ కలిపే ఏ పదార్థాన్నీ తీసుకోకపోవడం మంచిది.

అన్ని రకాల హెపటైటిస్ లలో కనిపించే లక్షణాలు
representational imageహెపటైటిస్ రకం ఏదన్న దానితో సంబంధం లేకుండా వాటి బారిన పడిన వారిలో జ్వరం, అలసట, ఆకలి చాలా వరకు క్షీణించడం, వికారం, కడుపులో నొప్పి (కుడివైపు డొక్క కింద కాలేయం చుట్టూ), మూత్రం ముదురు రంగులోకి మారిపోవడం, మట్టి రంగులో మలం ఉండడం, కీళ్లలో నొప్పి, కామెర్లు (కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారిపోవడం) లక్షణాలు కనిపిస్తుంటాయి. అందరిలో ఇవన్నీ కనిపించాలనేమీ లేదు. కొందరిలో కొన్నే బయటపడొచ్చు. కొందరిలో అసలు ఏవీ బయటకు కనిపించకపోవచ్చు. హెపటైటిస్ 'ఏ'లో దాదాపుగా అందరూ రెండు నుంచి ఆరు నెలల్లో పూర్తిగా రికవరీ అవుతారు. హెపటైటిస్ బిలో కొంత మందిలో మాత్రం దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. పిల్లల్లో అయితే ఈ ముప్పు 90 శాతం వరకు, పెద్దల్లో అయితే 6-10 శాతం వరకు ఉంటుంది. 70 శాతం మందిలో దీర్ఘకాలిక కాలేయ వ్యాధి కింద మారుతుంది. 5-20 శాతం మందిలో సిర్రోసిస్ ఏర్పడొచ్చు. 1-5 శాతం వరకు సిర్రోసిస్ లేదా లివర్ కేన్సర్ కారణంగా ప్రాణం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ లక్షణాల్లో ఏవి కనిపించినా, హెపటైటిస్ ఉన్నట్టు సందేహం కలిగినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. లక్షణాలు, రక్త, మూత్ర పరీక్షల ద్వారా వైద్యులు సమస్య ఏంటన్నది తేలుస్తారు.

హెపటైటిస్ చికిత్సా వ్యయం
హెపటైటిస్ సి, బి, డి వ్యాధుల్లో చికిత్సా వ్యయం వేల రూపాయల స్థాయికి వెళుతుంది. వ్యాధి తీవ్రమైతే చికిత్సా వ్యయం భారీ స్థాయికి వెళుతుంది. అందుకే హెపటైటిస్ కు కవరేజీనిచ్చే ఆరోగ్య పాలసీ తీసుకోవడం క్షేమకరం. వైద్య బీమాతోపాటు హెపటైటిస్ కు కవరేజీనిచ్చే క్రిటికల్ ఇల్ నెస్ రైడర్ కూడా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల అనారోగ్యం పాలైనప్పుడు ఆర్థికంగా కుదేలవకుండా చూసుకోవచ్చు.

హెపటైటిస్ బారిన పడకుండా ఉండాలంటే?
వ్యాక్సిన్లు వేయించుకోవడం వల్ల రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా చిన్నారులకు టీకాలు తప్పనిసరిగా వేయించాలి. బాత్ రూమ్ లేదా టాయిలెట్ కు వెళ్లొచ్చినా, పిల్లల డయాపర్లు మార్చినా, ఆహారానికి ముందు సోప్ తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. సురక్షిత లైంగిక విధానాలనే ఆశ్రయించాలి. అరక్షిత శృంగారం వల్ల హెచ్ ఐవీ కంటే హెపటైటిస్ బి వచ్చే ముప్పు 50 నుంచి 100 రెట్లు ఎక్కువ ఉంటుందని తేలింది. ఒకరు ఉపయోగించిన వ్యక్తిగత టూల్స్ అంటే, సిరంజీలు, సూదులు, రేజర్లు వంటివి వాడొద్దు. గర్భిణులు అయితే మరింత శ్రద్ధతో ఉండాలి.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
2 years ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
4 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
4 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
4 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
4 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
4 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
4 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
4 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
4 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
4 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
4 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
4 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
4 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
4 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
4 years ago
..more