మీకు ఈ లక్షణాలున్నాయా...? ఒక్కసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోరూ...!

04-08-2017 Fri 19:37

థైరాయిడ్ గ్రంధి మన శరీరంలో జీవ క్రియలకు అత్యంత అవసరమైనది. ఇది బాగుంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. దీని పనితీరు సరిగా లేకుంటే ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. ప్రతి ఒక్కరూ దీని పనితీరు గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో తేడా వస్తే మన శరీరం ఎన్నో లక్షణాల ద్వారా దాన్ని మనకు తెలియజేస్తుంది. అవేంటన్నది తెలుసుకుంటే థైరాయిడ్ ను జాగ్రత్తగా చూసుకుంటూ హెల్దీగా ఉండొచ్చు.


representational imageగొంతు ముందు భాగంలో...
థైరాయిడ్ గ్రంధి కేవలం రెండు అంగుళాలంత పరిమాణంలో మన గొంతులో ముందు భాగంలో ఉంటుంది. అచ్చం సీతాకోక చిలుక మాదిరిగా ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే స్వరపేటిక కింద ఉంటుంది. థైరాయిడ్ గ్రంధి తల్లిగర్భంలో ఉన్న శిశువులో 14వ వారం నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది. మనకు ఆక్సిజన్ ఎలా ప్రాణావసరమో, థైరాయిడ్ గ్రంధికి కూడా ఐయోడిన్ అంతే అవసరం. తల్లి గర్భంలోని శిశువులో ఈ గ్రంధి తొలుత నాలుక వెనుక భాగంలో అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత దానంతట అదే బిడ్డ ఎదుగుతున్న కొద్దీ స్వరపేటిక కింది భాగంలోకి వెళ్లిపోతుంది. తల్లి గర్భం నుంచి భూమ్మీదకు వచ్చేనాటికి పూర్తిగా మెడ ముందు భాగంలోకి వచ్చేయాలి. చాలా అరుదైన సందర్భాల్లో ఇది నాలుక వెనుక భాగంలోనే ఆగిపోవడం లేదా మెడ పై భాగంలో నిలిచిపోవడం జరుగుతుంది. అలాగే అరుదుగా ఇది ఛాతీ భాగం వరకూ వెళ్లిపోతుంది.  

పనితీరు ఇలా...
మనం తీసుకునే ఐయోడిన్ ఉప్పు సహా పలు ఆహార పదార్థాల నుంచి అందే అయోడిన్ సాయంతో థైరాయిడ్ గ్రంధి పనిచేస్తుంటుంది. ఇది పనిచేయాలంటే అయోడిన్ తప్పనిసరి. ఈ గ్రంధి ఐయోడిన్ ను గ్రహించి దాన్ని థైరాయిడ్ హార్మోన్లగా మారుస్తుంది. థైరాక్సిన్ (టీ4), ట్రై అయోడోథైరాయిన్ (టీ3) అన్నవి థైరాయిడ్ హార్మోన్లు. మన శరీరంలో థైరాయిడ్ కణాలు ఐయోడిన్ తోపాటు అమైనో యాసిడ్ అయిన టైరోసిన్ సాయంతో టీ3, టీ4ను ఉత్పత్తి చేస్తాయి. ఈ టీ3, టీ4 రక్త ప్రవాహం ద్వారా శరీరమంతటా వ్యాప్తిస్తాయి. దాంతో ఇవి జీవక్రియలను నియంత్రిస్తాయి. కేలరీలను శక్తిగా మార్చేందుకు ఇవి చాలా అవసరం. ప్రొటీన్, ఫ్యాట్, కార్బొహైడ్రేట్లను టీ3, టీ4 నియంత్రిస్తాయి. ఓ కణం ఎంత మేరకు శక్తిని తీసుకోవాలన్నది వీటిపైనే ఆధారపడి ఉంటుంది.  

representational imageథైరాయిడ్ హార్మోన్ల స్థాయులను బట్టే కణాలు జీవక్రియలను నియంత్రించడం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా థైరాయిడ్ గ్రంధి 80 శాతం టీ4ను, 20 శాతం టీ3ని ఉత్పత్తి చేస్తుంది. టీ4 కంటే టీ3 నాలుగు రెట్ల అధిక శక్తిమంతం. ఇక పిట్యూటరీ గ్రంధి నియంత్రణలో థైరాయిడ్ గ్రంధి పనిచేస్తుంటుంది. పిట్యూటరీ గ్రంధి వేరుశనగ గింజ పరిమాణంలో మెదడులో ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్లు టీ3, టీ4 మరీ తక్కువ స్థాయికి పడిపోయినప్పుడు పిట్యూటరీ గ్రంధి థైరాయిడ్ ఉత్ప్రేరక హార్మోన్ (టీఎస్ హెచ్) ను విడుదల చేస్తుంది. అప్పుడు థైరాయిడ్ గ్రంధి మరింతగా హార్మోన్లను ఉత్పత్తి చేసేలా టీఎస్ హెచ్ ప్రేరేపిస్తుంది. టీఎస్ హెచ్ ఇచ్చిన బూస్ట్ తో థైరాయిడ్ గ్రంధి టీ3, టీ4 హార్మోన్లను మరింతగా విడుదల చేస్తుంది. థైరాయిడ్ గ్రంధి తిరిగి టీ3, టీ4 హార్మోన్ల ఉత్పత్తిని పెంచిన తర్వాత ఆ విషయాన్ని పిట్యూటరీ గ్రంధి గ్రహించి టీఎస్ హెచ్ విడుదలను తగ్గించేస్తుంది. రక్తంలో టీ3, టీ4 స్తాయులు అధిక స్థాయికి చేరాయని గుర్తిస్తే పిట్యూటరీ గ్రంధి టీఎస్ హెచ్ విడుదలను తగ్గిస్తుంది. ఇక పిట్యూటరీ గ్రంధిని మెదడులోని హైపోథాలమస్ అనే గ్రంధి నియంత్రిస్తుంది. ఇది టీఎస్ హెచ్ ను విడుదల చేయడానికి అవసరమైన టీఆర్ హెచ్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ టీఆర్ హెచ్ సాయంతో పిట్యూటరీ గ్రంధి టీఎస్ హెచ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఏదైనా వ్యాధి లేదా పిట్యూటరీ గ్రంధిలో గడ్డలు ఏర్పడితే అది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తుంది.

జీవ క్రియల్లో కీలకం
శ్వాసతీసుకోవడం, గుండె రేటు, శరీర బరువు, కండరాల బలం, రుతుచక్రం, శరీర ఉష్ణోగ్రత, కొలెస్టరాల్ (కొవ్వు) స్థాయులుు, కేంద్ర నాడీ వ్యవస్థల పనితీరును థైరాయిడ్ గ్రంధి నియంత్రిస్తుంది. టీ3, టీ4 హార్మోన్లు రక్తం ద్వారా శరీరంలోని ప్రతీ కణాన్ని చేరతాయి. తద్వారా జీవక్రియల వేగాన్ని నియంత్రిస్తాయి. ఉదాహరణకు గుండె ఎంత వేగంతో కొట్టుకోవాలి, తీసుకున్న ఆహారాన్ని జీర్ణవ్యవస్థ ఎంత వేగంగా ప్రాసెస్ చేయాలి అనేవి థైరాయిడ్ హార్మోన్లు అయిన టీ3, టీ4 పైనే ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఈ జంట థైరాయిడ్ హార్మోన్ల స్థాయులు తగ్గాయనుకోండి... గుండె రేటు కూడా సాధారణం కంటే తక్కువకు పడిపోతుంది. మలబద్దకం, బరువు పెరగడం ఇలా ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. అదే టీ3, టీ4 అధిక స్థాయులకు చేరితే గుండె రేటు పెరిగిపోతుంది. డయోరియా, బరువు కోల్పోతారు. కేలరీలు ఏ స్థాయిలో ఖర్చవ్వాలన్నది ఇవే నిర్ణయిస్తాయి. కేలరీల వినియోగాన్ని బట్టే బరువు పెరగడం, తరగడం ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. మన దేశంలో ప్రతీ 10 మందిలో ఒకరు థైరాయిడ్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.

representational imageటీ3, టీ4 పెరిగితే (హైపర్ థైరాయిడిజం)
ఆందోళన, చిరాకు, మూడీగా ఉండడం, అధికంగా చెమట పట్టడం, గుండె స్పందనల వేగం పెరిగిపోవడం (పాల్పిటేషన్స్), అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేని సున్నితత్వం, చేయి వణకడం, బరువు తగ్గడం, జుట్టు రాలడం, నెలసరి క్రమం తప్పడం లేదా రుతుచక్రాలు చిన్నవిగా మారడం వంటివి థైరాయిడ్ హార్మోన్లు తగ్గితే కనిపిస్తాయి. థైరాయిడ్, కార్డియో వాస్కులర్ వ్యవస్థలకు సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే థైరాయిడ్ హార్మోన్ల వ్యవస్థ గతితప్పితే వెంటనే గుండెపై ప్రభావం చూపిస్తుంది. హైపర్ థైరాయిడిజం సమస్యను నివారించేందుకు థైరాయిడ్ అధిక ఉత్పత్తిని నివారించే మందులను వైద్యులు సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ కేన్సర్, గొంతు కేన్సర్లలో రేడియేషన్ థెరపీ కారణంగా థైరాయిడ్ గ్రంధిని పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. సర్జరీ ద్వారా థైరాయిడ్ గ్రంధిని పాక్షికంగా, లేదా పూర్తిగా తొలగించే అవకాశం లేకపోలేదు.

టీ3, టీ4 స్థాయులు తగ్గితే (హైపో థైరాయిడిజం)
నిద్రకు సంబంధించిన సమస్యలు, అలసిపోవడం, ఏకాగ్రత లోపించడం లేదా దృష్టి నిలపలేకపోవడం, డ్రై స్కిన్ లేదా హెయిర్, ఒత్తిడి, శీతల వాతావరణం పడకపోవడం, తరచుగా, అధిక రక్తస్రావంతో కూడిన రుతుచక్రాలు, కీళ్ల, కండరాలలో నొప్పులు సమస్యలు ఎదురవుతాయి. అలాగే, జుట్టు రాలడం, జ్ఞాపకశక్తి క్షీణించడం, గుండె రేటు తగ్గడం, మలబద్దకం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీనికి చికిత్సగా థైరాక్సిన్ హార్మోన్ సింథటిక్ డ్రగ్ ను వైద్యులు సూచించొచ్చు. ఇలా మందులు సూచిస్తే జీవిత కాలం పాటు వాడాల్సి ఉంటుంది. సాధారణంగా పురుషుల కంటే మహిళలపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య ఇది. ఐయోడిన్ లోపం వల్ల రావచ్చు. లేదా రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించి హషిమోటోస్ థైరాయిడైటిస్ వల్ల కూడా కావచ్చు. ఇందులో బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పించాల్సిన యాంటీబాడీలు థైరాయిడ్ గ్రంధిని బయటి శక్తిగా పొరపడి దానిపై దాడి చేయడం వల్ల పనితీరు దెబ్బతింటుంది.

representational imageగర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి
శిశువుకు కావాల్సిన ఐయోడిన్ తల్లి నుంచే వెళ్లాలి. శిశువు మెదడు సాధారణంగా అభివృద్ధి చెందాలంటే అందుకు థైరాయిడ్ హార్మోన్లు అవసరం. అందుకే గర్భిణులు తమ ఆహారంలో నిర్ణీత పరిమాణం మేర అయోడిన్ అందేలా చూసుకోవాలి. అప్పుడే శిశువులో థైరాయిడ్ హార్మోన్ పరంగా సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. ఒక్క థైరాయిడ్ హార్మోన్ ఎన్నో రకాల ఎదుగుదలకు కీలకం. గర్భిణుల్లో థైరాయిడ్ హార్మోన్లు తగ్గితే అంటే హైపోథైరాయిడిజం కారణంగా శిశువుకు ఐక్యూ సమస్యలతోపాటు మానసిక ఎదుగుదల లోపం కూడా ఎదురుకావచ్చని పలు వైద్య పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే గర్భంతో ఉన్నవారు తన కోసం, తన గర్భంలోని శిశువు కోసం తగినంత మోతాదులో ఐయోడిన్ అందేలా చూసుకోవాలి. శిశువు ప్రసవించిన తర్వాత మొదటి 30 నిమిషాల్లోపలే వారిలో టీఎస్ హెచ్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. అయినప్పటికీ తల్లిలోని థైరాయిడ్ హర్మోన్ వారికి రక్షణనిస్తుంది. కానీ ప్రతీ 4000 మందిలో ఒక శిశువు కంజెన్షియల్ హైపోథైరాయిడిజం (పుట్టుకతో) సమస్యతో జన్మిస్తారు. థైరాయిడ్ గ్రంధి డెవలప్ కాకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీంతో థైరాయిడ్ హర్మోన్లు ఉత్పత్తి కాకపోవడం లేదా ఐయోడిన్ లోపం వల్ల ఇలా జరగడానికి అవకాశం ఉంది. చికిత్స ద్వారా దీన్ని నయం చేయవచ్చు. దీన్ని గుర్తించకుండా, చికిత్స చేయకుండా వదిలేస్తే హైపో థైరాయిడిజం వల్ల చిన్నారిలో ఎదుగుదల లోపం, శాశ్వత మేధోపరమైన సామర్థ్యలోపానికి దారితీస్తుంది. అందుకే నేడు ఆస్పత్రుల్లో ప్రసవానంతరం ప్రతీ శిశువుకు టీఎస్ హెచ్ టెస్ట్ చేయడం తప్పనిసరిగా అమలు చేస్తున్నారు.

representational imageయుక్తవయసుపై
థైరాయిడ్ సమస్య ఉంటే యక్తవయసు రాక ఆలస్యమవుతుంది. మన శరీరంలో వయసుకు తగ్గ మార్పులు వస్తుంటాయని తెలుసు. ఉదాహరణకు యవ్వన దశలో స్త్రీలలో రుతుచక్రం ప్రారంభం అవుతుంది. పునరుత్పత్తి వ్యవస్థ తన పనితీరును ప్రారంభించేది ఈ దశలోనే. దానికి తగ్గట్టు శరీరంలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. మరి వీటన్నింటికీ థైరాయిడే కీలకం. ఇది లోపిస్తే యవ్వనదశ ప్రారంభం ఆలస్యం అవుతుంది. లేదా బలహీనంగా ఆలస్యంగా మొదలవుతుంది. ఇది తదుపరి శారీరక నిర్మాణం, సామర్థ్యంపైనా ప్రభావం చూపిస్తుంది. నెలసరి క్రమ పద్ధతి లోపించడం, అధిక రక్తస్రావం కావడం వంటివి కనిపిస్తాయి.

representational imageపెద్ద వయసులో
60 ఏళ్లు దాటిన వారిలో థైరాయిడ్ సమస్యలు కనిపిస్తుంటాయి. పెద్ద వయసు కావడంతో హార్మోన్ ఉత్పత్తిలో తేడా రావడం, పలు మందుల దుష్ప్రభావాలు, గుండె, గ్యాస్ట్రోఇంటెస్టినల్, నరాల సంబంధిత సమస్యల వల్ల కూడా ఇలా జరుగుతుంది. అయితే, పెద్ద వయసు వారిలో థైరాయిడ్ సమస్య ఉందని గుర్తించడం మామూలుగా కష్టం. ఈ తరహా సమస్యలుంటే రక్తపరీక్ష చేయించుకుని చికిత్స తీసుకుంటే ఆరోగ్యంతో కూడిన ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
2 years ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
4 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
4 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
4 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
4 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
4 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
4 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
4 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
4 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
4 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
4 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
4 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
4 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
4 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
4 years ago
..more