తల్లిదండ్రుల్లో ఉన్నట్టుండి ఒకరు మరణిస్తే... ఎదరయ్యేవి ఇవే...

26-07-2017 Wed 16:32

జన్మనిచ్చిన తల్లి లేదా తండ్రి అర్థాంతరంగా తమను వీడితే బాధతో మనసు బరువెక్కుతుంది. దాన్ని దిగమింగుకుని తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెడుతుంటారు. ఈ పనులన్నీ ముగిసిన తర్వాత చూడాల్సిన కీలకమైన ఆర్థిక బాధ్యతలు కూడా చాలా ఉంటాయి. ఆర్థిక బాధ్యతలు అంటే కొంచెం పెద్ద పనే. ఈ కీలక సమయంలో నిర్వహించాల్సిన వాటి గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.


డెత్ సర్టిఫికెట్
ఓ వ్యక్తి మరణం తర్వాత వారి సంబంధీకులు తప్పకుండా తీసుకోవాల్సినది మరణ ధ్రువీకరణ పత్రం. ఖాతాలు మూసివేయాలన్నా, వాటిలోని నిధులను వారసులు పొందాలన్నా, ఆస్తులు, పెట్టుబడుల బదిలీలు, బీమా క్లెయిమ్ లు వేటికైనా డెత్ సర్టిఫికెట్ కీలకం. ఒకటి, రెండు లేదా మూడు కాపీలు సరిపోవంటున్నారు నిపుణులు. వీలైనన్ని కాపీలు తీసుకుని ఉంచుకుంటే అవసరమైన ప్రతీ చోటా సమర్పించేందుకు అవకాశం ఉంటుంది. కనీసం ఓ 10 కాపీలు అయినా తీసుకోవడం అవసరమే. సహజ మరణం అయితే డెత్ సర్టిఫికెట్ సరిపోతుంది. కానీ, సహజ మరణం కానిపక్షంలో శవపరీక్ష నివేదిక, పోలీసు స్టేషన్ నుంచి లెటర్ కూడా తీసుకోవాలి. వ్యక్తి మరణించిన 21 రోజుల్లోపల ఆ సమాచారాన్ని విధిగా అధికారులకు తెలియజేసి డెత్ సర్టిఫికెట్ పొందాలి.

తల్లీ లేదా తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన యెడల నిర్ణీత పత్రంపై పూర్తి పేరు, వయసు, తండ్రి లేదా తల్లి పేరు, చిరునామా వివరాలను స్పష్టంగా పేర్కొని ఆస్పత్రి సిబ్బందికి ఇవ్వాలి. దీన్ని ఆస్పత్రి యాజమాన్యం స్థానిక జనన, మరణ వివరాల నమోదు కేంద్రానికి పంపిస్తారు. పట్టణాల్లో అయితే మున్సిపాలిటీ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి డెత్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో ఫామ్ నింపే ముందు మరణించిన వారి ఆధార్ కార్డును పక్కన పెట్టుకుని అన్ని వివరాలు సరిగ్గానే రాసినదీ, లేనిదీ క్రాస్ చెక్ చేసుకోవాలి. అక్షర దోషాలు, వయసు, ఇలా ఏ రూపంలోనూ తప్పులకు చోటివ్వకూడదు. ఇంటి పేరు, అసలు పేరును పూర్తిగా ఇవ్వాలి. దోషాలు ఉంటే ఆ ప్రక్రియ తిరిగి మొదటికి వచ్చేస్తుంది. దీంతో ఆస్పత్రి, మునిసిపల్ కార్యాలయాల చుట్టూ తిరగడంలో కాలహరణం జరిగిపోతుంది.

representational imageనామినీ, విల్లు, వారసత్వ ధ్రువీకరణ పత్రం
మరణించిన వారు అప్పటికే విల్లు రాసి ఉన్నారేమో చూడాలి. ఒకవేళ విల్లు రాసి ఉంటే చాలా ఆర్థిక వ్యవహారాలకు అది కీలక డాక్యుమెంట్ గా మారుతుంది. ఆస్తులను ఎలా పంపిణీ చేయాలి, ఎవరికి అన్నది అందులో వివరంగా రాసి ఉంటారు. ఇలా రాసి ఉంటే బ్యాంకు ఖాతాలు, ఇన్వెస్ట్ మెంట్లు వంటి చరాస్తులను సులభంగా పంపిణీ  చేసేందుకు వీలుంటుంది. ఒకవేళ నామినీ అయితే, వారికి చట్టబద్ధమైన హక్కులు ఉండవు. వారసుల తరఫున వారు ప్రతినిధులు మాత్రమే అవుతారు. పేరెంట్ విల్లు రాయకుండా మరణిస్తే వారసత్వ సర్టిఫికెట్ ను జిల్లా కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ చరాస్తులకు మాత్రమే. స్థిరాస్తులైన రియల్ ఎస్టేట్ వంటివి చట్ట ప్రకారం వారసుల మధ్య పంపిణీ జరగాల్సి ఉంటుంది. ఒకవేళ స్థిరాస్తుల్లో తమకు వాటా వద్దనుకుంటే దాన్ని తండ్రి లేదా తల్లి పేరు మీదకు మార్చవచ్చు. రిలీజ్ డీడ్ పై సంతకం చేస్తే సరిపోతుంది. తల్లిదండ్రులు విల్లు రాయడం వల్ల వారి తదనంతరం చట్టపరంగా వారసుల మధ్య విభేదాలు తలెత్తకుండా, న్యాయపోరాటం పేరుతో కాలహరణం జరగకుండా నివారించినట్టవుతుంది.

representational imageపత్రాలను సంపాదించాలి
తల్లిదండ్రులకు సంబంధించి అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో చూడాలి. వారికి ముందే అవగాహన ఉంటే అన్నింటినీ ఒక్క చోటే క్రమపద్ధతిలో పెట్టి ఉంటారు. లేదంటే వాటిని ఎక్కడున్నదీ గుర్తించాలి. కొన్ని సందర్భాల్లో అన్నీ లభ్యం కాకపోవచ్చు. షేర్లకు సంబంధించి ఫిజికల్ పత్రాలున్నాయనుకోండి. వాటిని ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవాలి. ఒకవేళ స్టాక్స్ ఉండీ పత్రాలు లేకుంటే నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని పత్రాలను సమీకరించిన తర్వాత ఆస్తులు, అప్పులు, వ్యయాలు, రావాల్సిన ఆదాయం ఇలా నాలుగు వర్గీకరణలు చేయాలని నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకు ఖాతాల పాస్ పుస్తకాలు, డిపాజిట్లు, ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, బీమా పాలసీ డాక్యుమెంట్లు, స్టాక్స్ ఉంటే డ్యీమాట్ ఖాతా వివరాలు, మ్యూచువల్ ఫండ్స్, పెద్దల పొదుపు పథకం, ఎన్ఎస్ సీ, ఫిక్స్ డ్ డిపాజిట్లు, యుటిలిటీ బిల్లులు (ఎలక్ట్రిసిటీ, నీరు, గ్యాస్, ఫోన్, ఇంటర్నెట్) ఆస్తుల పత్రాలు, రుణాలు తీసుకుని ఉంటే ఆ వివరాలు అన్నింటినీ సేకరించాలి. ఒకవేళ మరణించిన వారు అప్పటి వరకూ ఉద్యోగంలో ఉండుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించాలి. సంబంధిత ప్రభుత్వ విభాగం లేదా ప్రైవేటు కంపెనీని సంప్రదించి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ఉద్యోగులకు సాధారణంగా బీమా ఉంటుంది. దీన్ని క్లెయిమ్ చేసుకోవడం ద్వారా తక్షణ ఆర్థిక అవసరాలు కొంత మేర తీరతాయి.

బకాయిలు, ఇత చెల్లింపులు
రుణాలు ఏవైనా ఉంటే వాటి గురించి పరిశీలించాలి. కొన్నింటికి ఈసీఎస్ ద్వారా బ్యాంకు ఖాతా నుంచే ఆటోమేటిక్ గా చెల్లింపులు జరుగుతుంటాయి. మరి అటువంటివి ఏవైనా ఉన్నాయా? వాటికి సంబంధించిన వాయిదాలకు సరిపడా ఖాతాలో బ్యాలన్స్ ఉందా? అన్నది చూసుకోవాలి. కొన్నింటికి తక్షణమే చెల్లింపులు చేయాల్సి రావచ్చు. వీలైతే వెంటనే చెల్లించడం లేదంటే గడువు తీసుకోవడం చేయాలి. మరీ ముఖ్యంగా క్రెడిట్ కార్డుపై రుణాలు తీసుకుని ఉంటే తక్షణమే చెల్లించడం మంచిది. లేదంటే భారీగా వడ్డీ భారం పడుతుంది. ఇవి కాకుండా నెలవారీ బిల్లులకు కూడా చెల్లింపులు చేయడం, ఇన్వెస్ట్ మెంట్స్ కు సంబంధించి నెలవారీ సిప్ ఉంటే వాటిని కొనసాగించడం లేదా ఆపేయడం చేయొచ్చు.

representational imageసమాచారం
తల్లి లేదా తండ్రి మరణానంతరం వారి పేరిట బ్యాంకు ఖాతాలు, బీమా పాలసీలు ఉంటే ఆ సమాచారం ఆయా సంస్థలకు తెలియజేయాల్సి ఉంటుంది. పెట్టుబడులు పెట్టి ఉంటే ఆ సంస్థలకు కూడా సమాచారం అందించాలి. రుణాలు తీసుకుని ఉంటే ఇచ్చిన సంస్థలకూ లిఖితపూర్వకంగా సమాచారం చేరవేయాలి. బ్యాంకు ఖాతాలు, పెట్టుబడుల ఖాతాలు మరణించిన వ్యక్తి పేరిటే ఉంటే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. జాయింట్ ఖాతాలైతే జీవించి ఉన్న మరొకరి పేరు మీదకు బదిలీ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాకు లాకర్ ఉండి ఉంటే దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తారు. చట్టబద్ధమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాతే నామినీ లేదా వారసులకు లాకర్ యాసెస్ కు అనుమతిస్తారు. పెన్షన్ ప్లాన్లు ఉండి ఉంటే ఆ సంస్థలకు కూడా తెలియజేయాలి. వారు ఉద్యోగం చేసి ఉంటే ఆ సంస్థలకు కూడా సమాచారం అందించాలి. ప్రతీ సంస్థకు నిర్ణీత విధానం ఉంటుంది. దాని ప్రకారం ఈ ప్రక్రియలను పాటించాలి.

బ్యాంకు ఖాతా
జాయింట్ ఖాతా ఉమ్మడిగా ఉండుంటే అందులోనూ రకాలున్నాయి. బ్యాంకు అధికారులను సంప్రదించి జీవించిన ఉన్న పేరెంట్ దాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉందో, లేదో కనుక్కోవాలి. ఉంటే కొనసాగించడం లేదంటే ఖాతాను క్లోజ్ చేసేయాలి. జీవించి ఉన్న పేరెంట్ కు అప్పటికే సొంతంగా ఖాతా ఉంటే సరే. లేదంటే ఖాతా తెరవాల్సిన అవసరం ఉంటుంది. జాయింట్ ఖాతా క్లోజ్ చేస్తే మిగిలిన జాయింట్ హోల్డర్ కు అందులోని బ్యాలన్స్ చెల్లిస్తారు. లేదంటే నామినీ అయినా పొందొచ్చు. ఇందుకోసం డెత్ సర్టిఫికెట్, నామిని లేదా మరో జాయింట్ హోల్డర్ గుర్తింపు, నివాస చిరునామా ధ్రువీకరణగా ఆధార్, పాన్ కార్డులు ఉంటే సరిపోతుంది. సింగిల్ ఖాతానే అయి ఉండి నామినీగా ఎవరి పేరైనా ఉంటే వారు ఖాతా క్లోజ్ చేసి అందులోని బ్యాలన్స్ ను క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. నామినీ లేకుంటే చట్టబద్ధమైన వారసులకే క్లెయిమ్ కు అవకాశం ఇస్తారు.

లైఫ్ ఇన్సూరెన్స్
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే పరిహారం కోరుతూ నామినీ క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం డెత్ సర్టిఫికెట్, నామినీ చిరునామా, నివాస ధ్రువీకరణలు అవసరం. జీవిత బీమా పరిహార దరఖాస్తుల ఆమోదానికి 45 రోజుల నుంచి ఆరు నెలల వరకు సమయం తీసుకుంటుంది. అందుకని వీలైనంత ముందే క్లెయిమ్ ప్రక్రియ మొదలు పెట్టాలి.

వైద్య బీమా
ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ పాలసీ ఉన్నవారు మరణించిన వ్యక్తి పేరును రెన్యువల్ సమయంలో తీసేయించాలి. దీంతో జీవించి ఉన్న తల్లి లేదా తండ్రి పేరు మీద తిరిగి పాలసీ జారీ అవుతుంది. ఇందుకోసం డెత్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది.

వాహనాలు
తల్లిదండ్రుల్లో మరణించిన వారి పేరిట వాహనం ఉంటే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి వారసులు తమ పేరిట మార్చుకోవాల్సి ఉంటుంది. చట్టబద్ధమైన వారసులు, డెత్ సర్టిఫికెట్, తమ ఆధార్, పాన్ కార్డు, ఇతర ధ్రువీకరణలతో రవాణా శాఖా కార్యాలయానికి వెళ్లి తమ పేరిట మార్చాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్యాస్, టెలిఫోన్
మరణించిన వారి పేరిట ఎల్జీజీ గ్యాస్ కనెక్షన్, టెలిఫోన్ కనెక్షన్, ఇతరత్రా ఏవైనా ఉంటే వాటికి సంబంధించి కూడా పేరు మార్చుకోవాలి. ఇందుకోసం డెత్ సర్టిఫికెట్, తమ ధ్రువీకరణ పత్రాలతో వారసులు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.

representational imageపెట్టుబడులు
పెట్టుబడులు ఉంటే వాటిలో కచ్చితంగా నామినీ పేరు ఉంటుంది. నామినీగా ఉన్న వారు తమ ధ్రువీకరణ, చిరునామా పత్రాలతో వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా చనిపోయిన వారి డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం తప్పనిసరి. నామినీ లేకపోతే చట్టబద్ధమైన వారసులు క్లెయిమ్ చేసుకోవాలి. వారు కూడా తమ గుర్తింపు ధ్రువీకరణ లేదా, వారసులుగా ధ్రువీకరించిన అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.

ఐటీ రిటర్నులు
తల్లి లేదా తండ్రి మరణించి ఉంటే వారికి చట్టబద్ధమైన ప్రతినిధులు ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆదాయం పన్ను పరిధిలో ఉంటేనే. 60ఏళ్లలోపు వయసు వారైతే రూ.2.5 లక్షలు, 60-80 మధ్య వయసు వారు రూ.3 లక్షలు, 80 ఏళ్లు దాటిన వారికి రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను ఉండదు, రిటర్నులు కూడా ఫైల్ చేయక్కర్లేదు. ఇంతకు మించితే రిటర్నులు దాఖలు చేయడం తప్పనిసరి. ఇందుకోసం మరణించిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్, పాన్ కార్డు, చట్టబద్ధమైన వారసుల పాన్ కార్డు, వారసత్వ ధ్రువీకరణ సర్టిఫికెట్, నోటరీతో కూడిన అఫిడవిట్ ను కూడా రిటర్నులకు జత చేయాలి. తర్వాత మరణించిన వ్యక్తి పేరుతో ఉన్న పాన్ కార్డును ఐటీ కార్యాలయానికి వెళ్లి క్యాన్సిల్ చేయించాలి. ఇందుకు డెత్ సర్టిఫికెట్ కూడా జతచేయాలి.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
2 years ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
4 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
4 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
4 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
4 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
4 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
4 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
4 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
4 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
4 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
4 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
4 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
4 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
4 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
4 years ago
..more