నోరూరించే పరాటాలు... రోజుకో వెరైటీ ఇలా చేసేయండి!

15-07-2017 Sat 21:44

పరాటా అంటే చాలా మంది లైక్ చేస్తారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే, ఎప్పుడూ ఒకే రకం పరాటా తినాలంటే ఎవరికైనా అంత ఆసక్తి ఉండదు. అందుకే రోజుకో రుచికరమైన పరాటా తినాలనుకునే వారు వాటిని ఏ విధంగా చేసుకోవచ్చన్నది తెలుసుకుందాం.


representational imageఆలూ పరాటా
కావాల్సినవి: బంగాళా దుంపలు రెండు నుంచి నాలుగు వరకు ఉడికించుకోవాలి. పచ్చి మిరపకాయలు రెండింటిని సన్నగా తరుగుకోవాలి. అలాగే, ఒకటి రెండు ఉల్లిపాయలను సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఒక కప్పు గోధుమ లేదా మైదా పిండి, కారం టీస్పూన్, ధనియాల పొడి చిటికెడు, నెయ్యి లేదా నూనె కొంత (కాల్చుకునేందుకు), కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్, కోరుకుంటే మసాలా పొడి సిద్ధంగా ఉంచుకోవాలి.

తయారీ: గోధుమ లేదా మైదా పిండిని ఓ పళ్లెంలో వేసుకుని, కొంత నీరు పోసి చపాతీ పిండి చేసుకున్నట్టు కలుపుకోవాలి. పరాటా రకం ఏదైనప్పటికీ అన్నింటికీ ఇది కామన్ గా అవసరం. తర్వాత స్టవ్ మీద కడాయి ఉంచి చెంచా నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసి మగ్గేలా చేసుకోవాలి. కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర వేసి ఓ నిమిషం తర్వాత దించేయాలి. ఇందులో ఉడికించిన బంగాళా దుంపలను వేసి కలుపుకోవాలి. గోధుమ లేదా మైదా పిండిని బాల్స్ లా చేసుకున్న తర్వాత ఒక్కో బాల్ ను చపాతీ లేదా పూరీ మాదిరి వత్తాలి. ఆలూ మిశ్రమాన్ని దానిపై ఉంచి చుట్టూ కప్పేసి ఉండల్లా చేసుకుని మళ్లీ కర్రతో వత్తాలి. పెనంపై కాస్తంత నెయ్యితో రెండువైపులా కాల్చుకోవాలి. దాంతో ఆలూ పరాటా రెడీ.

మటర్ (గ్రీన్ పీస్) పరాటా
పచ్చి బఠానీలను కొంచెం ఉప్పు నీటిలో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత గ్రైండర్ లో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. దీనికి కావాలంటే ఎండు కారం లేదా పచ్చిమిర్చి, ఉప్పు, కోరుకంటే కొత్తిమీర కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పైన చెప్పుకున్న మాదిరిగా గోధుమ లేదా మైదా పిండి కలుపుకుని ఆ పిండిలో ఈ మిశ్రమాన్ని ఉంచుకుని పరాటాల్లా వత్తి కాల్చుకుంటే వంటకం సిద్ధమైపోయినట్టే. ఇక ఆలూ, గ్రీన్ పీస్ పరాటా కోరుకునే వారు... ఆలూ పరాటా తయారీలో చెప్పుకున్నట్టు ఉడికించిన ఆలూ మిశ్రమానికి ఉడికించిన గ్రీన్ పీస్ ను కలుపుకుంటే సరిపోతుంది.

representational imageమెంతి పరాటా
మెంతికి ఔషధ గుణాలు ఎక్కువ. ఆరోగ్య సంరక్షణి. ఇంట్లో కూరల్లో భాగంగా మెంతిని వాడుతూనే ఉంటాం. ఈ మెంతి కూరతో పరాటాలను కూడా చేసుకోవచ్చు.

కావాల్సినవి: రెండు కప్పుల గోధుమ లేదా మైదా పిండి, ఒక కప్పు మెంతి ఆకులు, రెండు పచ్చిమిరపకాయలు చక్కగా తరుగుకున్నవి, రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు, రెండు చెంచాల నూనె, అర కప్పు నీరు, ఉప్పు, వేయించుకునేందుకు నూనె లేదా నెయ్యి.

తయారీ: మెంతి కూర ఆకులను నీటిలో బాగా కడిగేసుకుని, వాటిని తరుగుకుని పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండిలో ఉప్పు వేసుకుని, దానికి తరిగిన మెంతి కూర, పచ్చిమిరపకాయ తరుగు, వెల్లుల్లి మిశ్రమాన్ని కలుపుకోవాలి. కొంచెం నీరు పోసుకుని అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల మాదిరిగా వత్తాలి. సన్నని మంటపై పెనం పెట్టి నెయ్యి లేదా నూనెతో వేయించుకుంటే సిద్ధమైనట్టే. రెండువైపులా మార్చుకుంటూ మంచిగా కాల్చుకుంటే రుచి వస్తుంది. దీనికి పచ్చడి లేదా పెరుగు కలుపుకుని తినొచ్చు.

పాలక్ పరాటా
పాలకూర పరాటా తయారీ అచ్చం మెంతి కూర పరాటా మాదిరే. కాకపోతే మెంతికూరకు బదులు పాలకూర తీసుకుంటే సరిపోతుంది.

మిక్స్ డ్ వెజిటబుల్ పరాటా
పోషకాల పరంగా, రుచి పరంగా ఇదో చక్కని పరాటా. ఓ సారి తప్పక ట్రై చేయాల్సిందే!

కావాల్సినవి: మీకు నచ్చిన కూరగాయలు మూడు లేదా నాలుగింటిని సిద్ధం చేసుకోవాలి. రెండు ఆలుగడ్డలు, నెయ్యి లేదా నూనె, ఉప్పు, చెంచాడు కారం, రెండు పచ్చి మిరపకాయలు సన్నగా తరిగి ఉంచుకోవాలి, ఒక ఉల్లిగడ్డ అవసరం. ఇష్టాన్ని బట్టి ధనియాల పొడి, జీలకర్ర మసాలా పొడిని కూడా కలుపుకోవచ్చు.

తయారీ: గోధుమ పిండి లేదా మైదా పిండిని చపాతీ పిండిలా మంచిగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. కూరగాయలను ఆలుగడ్డలతో కలిపి ఉడికించుకోవాలి. తర్వాత వాటిని ఓ కప్పులోకి తీసుకుని ఉప్పు, పచ్చిమిరపకాయల తరుగు లేదా కారం, పసుపు చిటికెడు, ఉల్లిపాయల తరుగు కలుపుకోవాలి. గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్ మాదిరిగా చేసుకోవాలి. ఒక్కో ముద్దను కొంచెం వత్తి దానిపై కూరగాయల మిశ్రమాన్ని కొంచెం ఉంచి తిరిగి బాల్ మాదిరిగా చేసుకుని చపాతీల మాదిరిగా వత్తాలి. నెయ్యి లేదా నూనెతో పెనంపై కాల్చుకోవాలి.

representational imageగోబి (క్యాలీ ఫ్లవర్) పరాటా
గోబీ పరాటా కోసం కావాల్సినవి: క్యాలీఫ్లవర్ కొంత మేర. నూనె కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకటి లేదా రెండు ఉల్లిపాయలు తరిగి ఉంచుకోవాలి. ఉప్పు, పసుపు, రెండు పచ్చిమిరపకాయలు తరుగుకోవాలి. ఇక పరాటాలన్నింటికీ కామన్ గా గోధుమ పిండి లేదా మైదా పిండి అవసరం.

తయారీ: క్యాలీఫ్లవర్ ను నీటిలో మంచిగా కడిగేయాలి. ఓ కడాయి తీసుకుని దానిలో నూనె వేసి మధ్యస్థ సెగలో వేడి చేయాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కొన్ని నిమిషాల పాటు ఉడికించాలి. ఉల్లిపాయల అసలు రూపం మారుతున్నప్పుడు తరిగి ఉంచుకున్న మిర్చి, క్యాలీఫ్లవర్ ముక్కలు, చిటికెడు పసుపు, కారం వేసుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత కొత్తి మీర కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గోధుమ పిండి లేదా మైదా పిండి ముద్దల్లో ఉంచి చపాతీ మాదిరిగా వత్తాలి. తర్వాత పెనంపై కాల్చుకుంటే గోబీ పరాటా రెడీ.

కోకోనట్ పరాటా
తురిమిన కొబ్బరి, దానికి వెల్లుల్లి మిశ్రమం, కాస్తంత ఉప్పు వేసి అన్నీ కలుపుకోవాలి. దీన్ని కడాయిలో నూనె వేసి నాలుగైదు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఈ మిశ్రమాన్ని గోధుమ పిండి లేదా మైదా పిండి ముద్దలో ఉంచి చపాతీల మాదిరిగా వత్తాలి. ఒక్కోదాన్ని పెనంపై కాల్చుకుంటే కోకోనట్ పరాటా సిద్ధమైనట్టే.  

డ్రైఫ్రూట్ పరాటా
కావాల్సినవి: బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, కొత్తి మీర, ఎండు కారం, ఉప్పు. దీనికి అదనంగా గోధుమ లేదా మైదా పిండి.

representational imageతయారీ: డ్రైఫ్రూట్స్ ను మిక్సర్ లో పిండిలా చేసుకోవాలి. ఈ పిండిని ఓ కప్పులో తీసుకుని కాస్తంత నీరు, కొత్తి మీర, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గోధుమ లేదా మైదా పిండి బాల్స్ లో ఉంచుకుని పరాటాల్లా వత్తాలి. తర్వాత పెనంపై రెండువైపులా మంచిగా కాల్చుకోవాలి.

స్వీట్ కార్న్ పరాటా
కావాల్సిన పదార్థాలు; స్వీట్ కార్న్ ఓ కప్పు, గ్రీన్ పీస్ ఒక కప్పు, ఉప్పు, చిటికెడు పసుపు, ఎండు కారం లేదా పచ్చిమిర్చి తురుము, ఆవాలు కొన్ని, ఉల్లిపాయలు రెండు, నూనె.

representational imageతయారీ: స్టవ్ పై కడాయి ఉంచి అందులో నూనె వేసి బేబీ కార్న్, గ్రీన్ పీస్ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులో పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, కాస్తంత ఉప్పు, పసుపు వేసి ఒకటి రెండు నిమిషాలు అలానే పొయ్యి మీద ఉంచి దించేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని గోధుమ పిండి లేదా మైదా పిండి బాల్స్ లో ఉంచి చపాతీల మాదిరిగా వత్తుకోవాలి. వాటిని పెనంపై కాల్చుకోవాలి.

జాగరీ (బెల్లం) పరాటా 
కొంత మంది తియ్యగా ఉన్న వంటకం అంటేనే ఇష్టపడతారు. అటువంటి వారికి జాగరీ పరాటా అనువైనదని చెప్పుకోవచ్చు. ఇది చాలా సులువైన వంటకం.

representational imageతయారీ: తగినంత బెల్లం తురుముకుని ఉంచుకోవాలి. కోరుకుంటే బాదం లేదా పిస్తా డ్రై ఫ్రూట్స్ ను సన్నని పీస్ లుగా కోసుకుని ఉంచుకోవాలి. తర్వాత గోధుమ లేదా మైదా పిండిలో చిటికెడు ఉప్పు వేసి నీరు పోసి ముద్దలా కలుపుకోవాలి. చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవాలి. ఒక్కో బాల్ ను చేత్తో తీసుకుని దాని మధ్యలో వేలితో గుంట పెట్టి అందులో బెల్లం తురుము కొంచెం చొప్పున ఉంచుకుని దానిపై డ్రై ఫ్రూట్ పీసులు కొన్ని వేసి పిండితో మూసేయాలి. ఈ ముద్దను పరాటాలా వత్తి పెనంపై కాల్చుకోవాలి.
 
ఎగ్ పరాటా
కావాల్సినవి: హోల్ వీట్ లేదా మైదా పిండి ఒక కప్పు. ఉల్లిగడ్డ ఒకటి, గుడ్లు రెండు, కొత్తి మీర, ఉప్పు, నూనె లేదా నెయ్యి, కారం లేదా పర్చిమిరపకాయలు

తయారీ విధానం: ముందుగా గోధుమ లేదా మైదా పిండికి నీటిని చేర్చి ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి. గుడ్లను బ్రేక్ చేసి లోపలి పదార్థాన్ని ఓ కప్పులోకి తీసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కారం, పచ్చిమిరప ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. చపాతీ పిండిని పరాటాల్లా వత్తి పెనంపై వేసి ఒకవైపు కాల్చుకోవాలి. దీనిపై గుడ్ల మిశ్రమాన్ని స్పూన్ తో పోసి అంతా విస్తరించేలా చేయాలి. రెండు నిమిషాల తర్వాత దాన్ని బోర్లా తిప్పేసి అడుగువైపు ఆమ్లెట్ మాదిరిగా కాల్చుకుంటే వంటకం సిద్ధమైనట్టే.

పెసర పరాటా
కావాల్సినవి: గోధుమ లేదా మైదా పిండి ఒక కప్పు, పెసర పప్పు అర కప్పు లేదా పెసర్లు అరకప్పు, పచ్చిమిరప కాయలు రెండు, చెంచాడు కారం, ఉప్పు, నూనె, జీలకర్ర

తయారీ: పెసర్లు లేదా పెసరపప్పును స్టవ్ పై ఉడికించి ఉంచుకోవాలి. మరోవైపు గోధుమ లేదా మైదా పిండిని చపాతీ పిండిలా కలిపి ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి. కావాలంటే దీనికి ఉల్లిపాయ ముక్కల్నీ జోడించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కాస్తంత నూనె వేసి అది వేడెక్కాక అందులో జీలకర్ర, పెసర్లు లేదా పెసరపప్పు, కారం, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంతసేపు వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని పరాటా పిండి ముద్దల్లో పెట్టుకుని వత్తుకుని పొయ్యిపై కాల్చుకోవాలి.

representational imageపరాటాల కోసం ఓ టేస్టీ కర్రీ
కావాల్సినవి: బంగాళాదుంపలు రెండు, శనగలు ఒక కప్పు, ఉల్లిగడ్డ ఒకటి, పచ్చిమిర్చి మూడు, నూనె, జీలకర్ర, ఉప్పు, పసుపు, కోరుకుంటే ఒక టమాటా, ధనియాల పొడి, జీలకర్ర.

తయారీ విధానం: పరాటా చేసుకోవడానికి ఒక పూట ముందే శనగలను నానబెట్టి ఉంచుకోవాలి. వంటకం చేసుకోవడానికి ముందు ఆలుగడ్డలను ఉడికించుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాను ముక్కలుగా తరుగుకోవాలి. స్టవ్ పై కడాయి ఉంచి నాలుగు చెంచాల నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలను వేసుకుని దోరగా వేయించుకోవాలి. జీలకర్ర, ధనియాల పొడిని విడిగా ఓ కడాయిలో వేయించుకుని వీటిలో శనగలు వేసి కొద్ది సేపు ఉడికించాలి. ఉడికించిన ఆలుగడ్డలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా తరుగు జోడించి ఉప్పు కారం వేసి కొద్ది సేపు ఉడికించుకోవాలి. తర్వాత దించేసి కొంచెం కొత్తిమీర కలుపుకుని పరాటాలో కలుపుకుని తింటే చక్కని రుచి ఉంటుంది.

నోట్: ఇక్కడ అన్ని పరాటాలకు హోల్ వీట్ లేదా మైదా పిండి మిశ్రమం అవసరం. ఇక వీటి స్థానంలో బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
2 years ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
4 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
4 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
4 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
4 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
4 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
4 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
4 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
4 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
4 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
4 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
4 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
4 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
4 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
4 years ago
..more