‘టీ’ ఎన్ని రకాలు? దీని తయారీ ఎలా?

11-07-2017 Tue 12:07

భోజనం చేయకపోయినా ఫర్వాలేదు కానీ ఓ కప్పు టీ తాగందే పూట గడవని ప్రియులు ఎంతో మంది ఉన్నారు. నిత్య జీవితంలో భాగంగా మారిన టీలో ఎన్నో రకాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.


టీ పొడిలో కొన్ని పలుకుల్లా, కొన్ని మెత్తటి పొడిలా, మరికొన్ని ఆకుల్లా ఉండడం గమనించే ఉంటారు. మనం వినియోగించే టీపొడి, తేయాకు కెమెల్లియా సైనెసిస్ అనే మొక్క నుంచి వస్తున్నాయి. ఈ మొక్క ఆకులను ప్రాసెస్ చేసి, తుదిగా బ్లెండ్ చేసే విధానాన్ని బట్టి టీలో పలు రకాలు ఏర్పడతాయి. టీ ప్రాసెస్ సుమారు ఏడు రకాలుగా ఉంటుంది. ఇందులో కీలకమైనది ఆక్సిడేషన్. టీ వెరైటీని బట్టి వేర్వేరు స్థాయుల్లో ఆక్సిడేషన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎండబెడతారు. ఆకుల్లో తేమ లేకుండా ప్రాసెస్ చేస్తారు. లేదంటే టీ ఆకులపై ఫంగస్ వృద్ధి చెందుతుంది. ప్రతీ టీ రకానికి భిన్నమైన రుచి, పరిమళం వుంటాయి.

తేయాకు ప్రాసెస్
తెంపడం: అటొక ఆకు, ఇటొక ఆకు మధ్యలో మొగ్గ ఉన్న భాగాలను (కొమ్మ చివర్లో) తెంపుతారు. ఏటా వసంత కాలం, వేసవి కాలం ప్రారంభంలో రెండు సార్లు ఇలా టీ ఆకులను సేకరిస్తుంటారు. టీ నాణ్యంగా ఉండాలంటే చేతులతోనే తెంపాల్సి ఉంటుంది. మెషిన్ తో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ పంటను కోసేయడానికి అవకాశం ఉన్నప్పటికీ దీనివల్ల నాణ్యత తగ్గే అవకాశం ఉంది.

representational imageఆరబోయడం: టీ ఆకులను తెంపిన తర్వాత అందులో తేమ శాతాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అలాగే, రుచిని పెంచాల్సి ఉంటుంది. ఇందుకోసం వాటిని ఆరబెడతారు. ఆరుబయట, షెడ్లలోనూ ఈ పనిచేస్తారు. ఈ ప్రక్రియలో ఆకుల్లో తేమను 30 శాతానికి తగ్గిస్తారు. దీనివల్ల ఆకుల బరువు పావు శాతం తగ్గిపోతుంది.

ఆక్సిడేషన్: టీ ఆకులను ఆక్సిడేషన్ చేయడం కీలకమైన ప్రక్రియ. ఉష్ణోగ్రత సమంగా ఉండే గదిలో వాటిని ఉంచడం వల్ల నల్లగా మారతాయి. దీనివల్ల ఆకుల్లోపల ఉండే క్లోరోఫిల్ విచ్చిన్నం అవుతుంది. దీన్ని ఫెర్మెంటేషన్ అని కూడా చెబుతారు. క్వాలిటీ ఏ స్థాయిలో ఉండాలన్నది దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 'ఊలాంగ్ టీ'లో ఆక్సిడేషన్  5-40 డిగ్రీల స్థాయిలో ఉంటుంది. డార్కర్ ఊలాంగ్ టీలో 60-70 శాతం, బ్లాక్ టీలో 100 శాతం గా ఉంటుంది. రుచి, పరిమళానికి ఆక్సిడేషన్ కీలకం. టీ ఆకులను మోస్తరుగా వేడి చేయడం ద్వారానూ ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

representational imageరోలింగ్: టీ ఆకులను ఒక అంచు నుంచి మడుస్తారు. చేత్తో లేదా రోలింగ్ మెషిన్ల ద్వారా ఈ ప్రక్రియను నిర్వహిస్తారు.  

ఎండబెట్టడం: తేమ ఉంటే ఫంగస్ వస్తుంది. అందుకే టీ పొడి తయారీ దశలోనే దానిలోని తేమను తొలగిస్తారు. ఎండబెట్టడం వల్ల తేయాకులో తేమ 1 శాతానికంటే తక్కువకు పడిపోతుంది. దీంతో తేయాకు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. తక్కువ వేడిపై వాటిని వేయించడం ద్వారానూ తేమను తీసేస్తారు. ఇది చాలా కీలకమైన ప్రక్రియ. కొంచెం అటూఇటు అయితే తేయాకు నాణ్యత దెబ్బతింటుంది. చేదు వస్తుంది.

ఈ విషయం తెలుసా?
కొన్ని రకాల తేయాకును చైనాలో ఏళ్ల తరబడి నిల్వ ఉంచుతారు. పాత వైన్ కు డిమాండ్ ఉన్నట్టే పాత తేయాకుకు కూడా డిమాండ్ ఉంది.  

ఎన్ని రకాలు
representational imageవైట్ టీ: ఇది ప్రాసెస్ చేయని తేయాకు. లేత టీ బడ్స్ (కొమ్మ చివర్లో ఉండే భాగం) నుంచి తయారు చేస్తారు. ఇతర రకాలతో పోలిస్తే ధర అధికం. కాకపోతే చైనా తయారీకి, ఇతర దేశాల తయారీకి మధ్య వైవిధ్యం ఉంది.

representational imageగ్రీన్ టీ: చాలా తక్కువ స్థాయిలో ఆక్సిడేషన్ చేస్తారు. జపాన్ లో వేడి నీటి ఆవిరిలో తేయాకులను ఉంచుతారు. చైనాలో వేడి పెనంపై వేడి చేయడం ద్వారా ఆక్సిడేషన్ చేస్తారు. ఆ తర్వాత ఆకులను మడత పెడతారు. చివరగా ఎండబెడతారు. గ్రీన్ టీ అన్నది ప్రపంచ వ్యాప్తంగా చాలా పాప్యులర్. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే దీన్ని ఆరోగ్యప్రదాయినిగా భావిస్తుంటారు. తేయాకులకు కొన్ని పరిమళాలు జోడించి తయారు చేస్తారు. ఒరిజినల్ గ్రీన్ టీ అనేది పరిశుభ్రంగా, రుచికరంగా ఉంటుంది.

ఎల్లో టీ: గ్రీన్ టీ తరహాలోనే ఎల్లోటీ ప్రాసెసింగ్ జరుగుతుంది. దీని తయారీకి ఎక్కువ సమయం పడుతుంది. సహజ సిద్ధంగా ఆక్సీకరణం చెందేలా చేస్తారు. కావాల్సిన రుచి, ఫ్లావర్ వచ్చే వరకు ఈ ప్రక్రియను తిరిగి కొనసాగిస్తుంటారు. ఇందులో కెఫైన్ తక్కువ.

representational imageఇంకా ఊలాంగ్ టీ, బ్లాక్ టీ రకాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేద మూలికలను తేయాకుకు కలపడం ద్వారా హెర్బల్ టీ, మసాలా టీ వంటివీ ఉన్నాయి. మూలికలను వేడి నీటి ఆవిరిలో ఉంచడం ద్వారా ఆ సుగుణాలు తేయాకుకు అంటుకునేలా చేసే ప్రక్రియ కూడా ఉంది. అసలు తేయాకు లేకుండా తయారుచేసే హెర్బల్ టీ రకాలు రూబాస్, మేట్ టీ కూడా ఉన్నాయి. రూబాస్ టీ దక్షిణాఫ్రికాలో రెడ్ బుష్ అనే మొక్క నుంచి తయారవుతుంది. దీన్ని రెడ్ టీ అని కూడా అంటారు. వేడిగానూ లేదా ఐస్ గానూ దీన్ని తీసుకుంటుంటారు. అర్జెంటీనాలోని వైల్డ్ ష్రబ్ అనే మొక్క నుంచి మేట్ టీ తయారు చేస్తారు. ఇది కాఫీ మాదిరిగా ఉంటుంది.

నాణ్యత
మన దేశంలో టీ నాణ్యతను ‘టీ బోర్డ్ ఆఫ్ ఇండియా’ పర్యవేక్షిస్తుంటుంది. రుచి, పరిమళం, రంగు, ఆకు రూపం తదితర అంశాల ఆధారంగా ఇది జరుగుతుంది. పైగా టీ నాణ్యత పరంగా ఒక తోటలో పెరిగే ఆకుకు మరో తోటలో పెరిగే ఆకుకు మధ్య తేడా ఉంటుంది. ఇక పర్యావరణం (ఉష్ణోగ్రత, తేమ, సూర్యరశ్మి, వర్షపాతం), భూసారం, వృక్ష జాతి, ప్రాసెసింగ్ ను బట్టి కూడా నాణ్యత మారిపోతుంది. ఎరువులు, టీ ఆకులను సేకరించడం కూడా కీలకమే.

ఏ మూడ్ లో ఏ టీ?
బ్లాక్ టీలోని స్ట్రాంగ్ ఫ్లావర్ మానసికంగా శక్తినిచ్చేలా చేస్తుంది. తాజాదనం కోరుకునే వారికి వైట్ టీ మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఫ్లావర్ లైట్ గా ఉంటుంది. ఒత్తిడి నుంచి రిలీఫ్ కావాలంటే గ్రీన్ టీ చక్కని ఆప్షన్. బాగా దాహంతో ఉంటే ఊలాంగ్ లేదా బార్లీ టీ తాగాలి.

మన దేశంలో టీ పండించే ప్రాంతాలు
డార్జిలింగ్, అసోం, దూర్స్, తెరాయ్, కంగ్రా, నీల్ గిరి, అన్నామలై, వేనాడ్, కర్ణాటక, మున్నార్, ట్రావెన్ కోర్.

representational imageడార్జిలింగ్ టీ
అంతర్జాతీయ మార్కెట్లో డార్జిలింగ్ టీకి మంచి ప్రాచుర్యం ఉంది. కారణం ఇక్కడి తేయాకు ముస్కాటెల్ ఫ్లావర్ కలిగి ఉండడమే. అంతేకాదు, ఇక్కడ పండే వెరైటీ ప్రపంచంలో మరెక్కడా సాగవడం లేదు. అందుకే ధర కూడా ఎక్కువే.

అస్సాం టీ
అసోంలోని ఉత్తర బ్రహ్మపుత్ర వ్యాలీ, కాబ్రి, కచ్చర్ హిల్స్, బరాక్ వ్యాలీ వ్యాప్తంగా టీ తోటలున్నాయి. ఒకేచోట అత్యధిక విస్తీర్ణంలో తేయాకు సాగవుతున్న ప్రాంతం ప్రపంచంలో ఇదే.

దూర్స్, తెరాయ్
1862లో పశ్చిమబెంగాల్ రాష్ట్రం తెరాయ్ ప్రాంతంలోని చంప్టాలో టీ సాగును బ్రిటిషర్లు ప్రారంభించారు. దూర్స్ రీజియన్ లోని గజెల్ దుబిలో తొలిసారిగా టీ తోటలు మొదలయ్యాయి. ఏటా ఇక్కడ 22.6 కోట్ల కిలోల టీ ఉత్పత్తి అవుతోంది. మన దేశ టీ ఉత్పత్తిలో 25 శాతం ఇక్కడి నుంచే వస్తోంది.

కంగ్రా టీ
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కంగ్రా జిల్లాలో 1829లో టీ తోటలు మొదలయ్యాయి. చైనా నుంచి టీ రకాలను ఇక్కడికి తీసుకొచ్చి సాగు చేశారు. కంగ్రా వ్యాలీ అంతటా టీ తోటలు సేంద్రీయ పద్ధతుల్లో సాగవుతుంటాయి. గ్రీన్ టీ, బ్లాక్ టీకి ఈ ప్రాంతం అంతర్జాతీయంగా ప్రసిద్ధి.

representational imageనీల్ గిరి టీ
తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నీలగిరి పర్వత ప్రాంతాలు తేయాకు తోటలకు ప్రసిద్ధి. 1853లో కెట్టి వ్యాలీలో తొలిసారిగా సాగు మొదలైంది. వాతావరణ అనుకూలతలతో ఇక్కడి టీ రుచి విషయంలో మెరుగ్గా ఉంటుంది. దేశ టీ ఉత్పత్తిలో ఈ ప్రాంతం వాటా 10 శాతం.

కర్ణాటక టీ
కర్ణాటక కాఫీ సాగుకు ప్రసిద్ధి. టీ సైతం ఏటా 50 లక్షల కిలోల మేర ఉత్పత్తి అవుతోంది. చిక్ మగుళూర్ ప్రాంతంలో తోటలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
2 years ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
4 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
4 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
4 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
4 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
4 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
4 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
4 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
4 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
4 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
4 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
4 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
4 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
4 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
4 years ago
..more