ఈ తరహా స్టాక్స్ కొంటే లాభాల పంటే!

19-04-2017 Wed 14:30

షేర్లలో పెట్టుబడులు పెట్టాలన్న ఆసక్తి ఎంతో మందిలో కనిపిస్తుంటుంది. కానీ, స్టాక్ మార్కెట్ గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. అందులోనూ మంచి పరిజ్ఞానం కలిగిన వారు కొద్ది మందే ఉంటారు. ఇటువంటి వారు ఏ తరహా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాలో తెలుసుకునేందుకు సులభమైన మార్గం ఒకటుంది. తల పండిన ఇన్వెస్టర్లు అనుసరించే సూత్రాలను ఆచరించడమే. అవేంటన్నది చూద్దాం.

సూత్రం నంబర్ 1
representational imageకొన్న షేరు దీర్ఘకాలం పాటు అట్టిపెట్టుకునేదై ఉండాలి. వాస్తవ విలువ కంటే తక్కువలో లభిస్తూ ఉండాలి. కంపెనీ ఆదాయాలు, లాభాల్లో తేడా లేకపోయినా... మార్కెట్ల పతనం, దేశీయ, అంతర్జాతీయ అంశాల కారణంగా ఒక్కోసారి షేర్లు బాగా పతనం అవుతుంటాయి. అప్పుడు చాలా తక్కువ పీఈల వద్దే అవి లభిస్తుంటాయి. ఒక్కోసారి షేరు వారీ పుస్తక విలువ కంటే తక్కువకే కోట్ అవుతుంటాయి. అలాంటివి సొంతం చేసుకోవాలి.

 పైగా నిరంతరం డివిడెండ్ పంపిణీ చేస్తుండాలి. ఒకవేళ వాస్తవ విలువ కంటే తక్కువ ధరకు కోట్ అవుతున్నా, కంపెనీ డివిడెండ్ చెల్లించకుంటే తెలివైన ఇన్వెస్టర్ల దృష్టిలో అది కొనుగోలుకు పనికిరానట్టే. ప్రధానంగా డివిడెండ్ చెల్లించే షేరే వీరి కొనుగోలుకు ప్రామాణికం. డివిడెండ్ చెల్లించాలంటే కంపెనీ లాభాలను ఆర్జించాలి. డివిడెండ్ క్రమం తప్పకుండా చెల్లిస్తూ, ఏటేటా ఆ డివిడెండ్ మొత్తాన్ని పెంచుకుంటూ పోతే ఆ షేరు బంగారమే.

సూత్రం నంబర్ 2
ఈపీఎస్ (ఒక్కో షేరుకు వచ్చిన ఆదాయం) లో ఎదుగుదల ఉండాలి. కంపెనీ మొత్తం లాభాన్ని ఉన్న వాటాలకు పంచగా, ఒక్కో వాటా(షేరు)కు వచ్చే ఆదాయాన్నే ఈపీఎస్ అంటారు. ఈపీఎస్ గత పదేళ్ల కాలంలో ఏ విధంగా పెరుగుతూ వచ్చిందన్నది పరిశీలించాలి. వృద్ధి ఉంటే అది కొనుగోలుకు పనికివస్తుంది. ఒకవేళ ఈపీఎస్ లో ఎదుగూ బొదుగూ లేకపోతే ఆ షేరు ఇన్వెస్ట్ మెంట్ కు ఎంత మాత్రం తగినది కాదు. అలాగే, ఒక ఏడాదిలో ఈపీఎస్ రూ.10 ఉందనుకోండి. మరుసటి ఏడాది అది అంతకంటే తక్కువకు పడిపోయి, ఆ తర్వాత ఏడాది అనూహ్యంగా పెరిగిందనుకోండి. ఈ తరహా షేర్లు ఇన్వెస్ట్ మెంట్ కు అనువుకానివే.  

సూత్రం నంబర్ 3
representational imageస్టాక్ మార్కెట్లో ఇటీవలే లిస్ట్ అయిన షేరు పెట్టుబడులకు అనువైనది కాదన్నది తెలివైన ఇన్వెస్టర్ల సూత్రం. అది ఎంత గొప్ప కంపెనీ అయినా కానీయండి. వీరు ఈ సూత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తారు. ఇలా కొత్తగా లిస్ట్ అయిన కంపెనీకి పైన చెప్పుకున్న లక్షణాలు అన్నీ ఉన్నా కూడా పెట్టుబడులు పెట్టరు. ఎందుకంటే ఏ కంపెనీ అయినా పెట్టుబడులు పెట్టాలంటే గత కొన్నేళ్లలో ఆ కంపెనీ పనితీరు ఎలా ఉందీ అన్నది తెలిసి ఉండాలి. ఆదాయాలు, లాభాల్లో, ఈపీఎస్ లో వృద్ధి చరిత్ర తెలుసుకోగలగాలి. అప్పుడే ఆయా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాలా, వద్దా? అన్నది నిర్ణయించుకోవచ్చు.

సూత్రం నంబర్ 4
పోటీ ఉండకూడదు. మార్కెట్ ను శాసించేలా ఉండాలి. అటువంటి స్టాక్స్ లో కళ్లు మూసుకుని పెట్టుబడులు పెట్టేయవచ్చు. తీవ్రమైన పోటీని ఎదుర్కొనే కంపెనీలు లాభాలను కొంత మేర త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో షేరు ధర పతనం అయ్యే ప్రమాదం ఉంటుంది. లాభాలు పెరుగుతుంటేనే కంపెనీ డివిడెండ్ చెల్లించగలదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే పోటీ అన్నది పెద్దగా లేకుండా పెట్టుబడులకు ఎంచుకునే షేరు ఆ రంగంలో రారాజు అయి ఉండాలి.

సూత్రం నంబర్ 5
representational imageపెద్దగా తెలియని ఉత్పత్తులు, సేవలు, వ్యాపారంతో కూడిన షేర్లు పెట్టుబడులకు అంతగా అనువైనవి కావు. ఎందుకంటే ఉదాహరణకు ఓ కొత్త కంపెనీ పళ్ల రసాల మార్కెట్లోకి ప్రవేశించిందనుకోండి. ఆ కంపెనీ మార్కెట్ వాటాను సొంతం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. నాణ్యతతో వినియోగదారులకు చేరువై వారి మనసు గెలుచుకోవాలి. అప్పుడే ఆ ఉత్పత్తి క్లిక్ అవుతుంది. అలా వినియోగదారుల ఆదరణ చూరగొన్న షేర్లలోనే పెట్టుబడులు పెట్టడం తెలివైన ఇన్వెస్టర్ల విధానం. వీరు రిస్క్ తీసుకోరు. పెట్టుబడులకు ఎంపిక చేసుకునే ఏ షేరు అయినా గానీ ఆ కంపెనీ ఉత్పత్తులు లేదా సేవల గురించి ఇన్వెస్టర్ గా కచ్చితంగా తెలిసి ఉండాలి. ఉదాహరణకు ఐటీసీ షేరు తీసుకోండి. సిగరెట్ల మార్కెట్లో ఈ కంపెనీది అగ్ర స్థానం. ఎఫ్ఎంసీీజీ, ఆహారోత్పత్తులు ఇలా ఎన్నో రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్న ఈ కంపెనీ గురించి చాలా మందికి తెలుసు. ప్రజాదరణ కలిగిన ఉత్పత్తులను విక్రయించే కంపెనీల వ్యాపారం ఎప్పుడూ పుష్కలంగానే ఉంటుంది. ఎందుకంటే అవి విరివిగా అమ్ముడుపోతుంటాయి గనుక. అందుకే ఇన్వెస్ట్ మెంట్ చేసే ముందు ఇది కూడా చూడాలి.  

సూత్రం నంబర్ 6
ఓ కంపెనీ స్టాక్ లో పెట్టుబడి పెట్టే ముందు చూడాల్సిన అంశాల్లో మరో ముఖ్యమైనది ఆ కంపెనీకి అప్పులు ఎన్ని ఉన్నాయని. కంపెనీ మూలధనంతో పోలిస్తే అప్పులు ఎన్ని రెట్లు ఉందీ లెక్కవేయాలి. మూలధనానికి మించి ఎన్నో రెట్లు అధిక రుణ భారాన్ని మోస్తున్న కంపెనీ షేరులో పెట్టుబడులకు దూరంగా ఉంటారు తెలివైన ఇన్వెస్టర్లు. ఏ కంపెనీకి అయినా వ్యాపార అవసరాల దృష్ట్యా అప్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే, మూలధనంతో పోలిస్తే ఈ రుణాల శాతం తక్కువగా ఉండాలి. అప్పుడే దానిపై వడ్డీ చెల్లింపులు తక్కువగా ఉంటాయి. ఎక్కువైతే లాభాల్లో గణనీయమైన వాటా అప్పులపై వడ్డీల చెల్లింపులకు వెళుతుంది. కనుక తక్కువ రుణభారం కలిగిన కంపెనీ పెట్టుబడులకు అనుకూలం.

సూత్రం నంబర్ 7
లాభాల మార్జిన్లు తక్కువగా ఉండరాదు. కొన్ని రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలు చాలా తక్కువ లాభాలకే పరిమితం కావాల్సి వస్తుంది. ఉదాహరణకు విమానయానం, టెలికం రంగాలు. అధిక పోటీతో కూడిన ఈ రంగాల్లో లాభాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఇన్వెస్టర్లు ఈ కంపెనీలకు దూరంగా ఉంటారు.

సూత్రం నంబర్ 8
representational imageసరైన సమయంలో షేరు కొనాలి, సరైన సమయంలో విక్రయించాలి. అంటే తక్కువ విలువ వద్ద కొనుగోలు చేయడం, గరిష్ఠ స్థాయులకు చేరగానే అమ్మడం ద్వారా మంచి లాభాలను కళ్లజూడొచ్చు. క్షణికావేశం, సానుకూల వార్తలను చూసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. స్టాక్ మార్కెట్ పెరుగుతుందని కొనడం కానీ, స్టాక్ మార్కెట్ పడిపోతుందని విక్రయించడం కానీ సరికాదు. అలాగే, ఇతరులు పోటీ పడి కొంటున్న షేరు వెంటా పరుగులు పెట్టకూడదు. కంపెనీ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండాలి, పైన చెప్పుకున్న అన్ని క్వాలిటీలు ఉండాలి.

సూత్రం నంబర్ 9
ఓ స్టాక్ కొనుగోలుకు ముందు అసలు ఎందుకు కొంటున్నామని ప్రశ్నించుకోవాలి. వచ్చే సమాధానం పైన చెప్పుకున్న సూత్రాలకు సరిపోలేట్టు ఉంటే కొనుగోలుకు ముందుకు వెళ్లొచ్చు.

సూత్రం నంబర్ 10
representational imageమంచి యాజమాన్యం ఓ కంపెనీ ఎదుగుదలకు ఎంతో అవసరం. అంటే పారదర్శకత, నిజాయతీ, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న ప్రమోటర్ల నుంచి అత్యధిక శాతం కేసుల్లో విజయాలనే ఆశించొచ్చు.

వారెన్ బఫెట్ సూత్రం
ఇతరులు భయంతో ఉన్నప్పుడు షేర్ల కొనుగోలుకు ఆసక్తి చూపాలి. ఇతరులు ఆసక్తిగా ఉన్నప్పుడు షేర్ల విక్రయానికి మొగ్గు చూపాలన్నది స్టాక్ మార్కెట్ పండితుడిగా చెప్పుకునే వారెన్ బఫెట్ అనుసరించే సూత్రం. అందరూ కొనుగోళ్లకు పరుగులు తీస్తున్న సమయంలో విక్రయించాలని, అందరూ విక్రయ బాట పడుతున్న సమయంలో కొనాలన్నది ఆయన అనుభవపూర్వకంగా నేర్చుకున్న సూత్రం.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
1 year ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
3 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
3 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
3 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
3 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
3 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
3 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
3 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
3 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
3 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
3 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
3 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
3 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
3 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
3 years ago
..more