రుణం కావాలంటే సిబిల్‌ రిపోర్ట్‌లో తప్పులుండకూడదు... ఉంటే సరిచేసుకోండి ఇలా...!

10-10-2016 Mon 14:18

రుణం లభించాలంటే సిబిల్‌ స్కోరు కీలకమన్న విషయం తెలిసే ఉంటుంది. కానీ, చాలా మంది తమ స్కోర్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపరు. కారణం దానికున్న ప్రాధాన్యం వారికి తెలియకపోవడమే. మీకు అర్హత ఉన్నంత మాత్రాన రుణం వస్తుందనుకోవద్దు. సిబిల్ స్కోరు చక్కగా ఉండాలి. సిబిల్ నివేదిక కూడా స్వచ్ఛంగా ఉండాలి. లేకుంటే రుణం రాదు. అందుకే క్రమం తప్పకుండా సిబిల్ రిపోర్ట్ ను ఒకసారి సరిచూసుకోండి. తప్పులుంటే సరిచేసుకోండిలా...

సిబిల్ అనేది పౌరుల రుణ చరిత్ర వివరాలను నిర్వహించే ప్రైవేటు సంస్థ. దేశంలోని అన్ని ఆర్థిక సంస్థలు, బ్యాంకులు క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సిబిల్‌)కు రుణదాతల వివరాలను అప్‌డేట్‌ చేస్తుంటాయి. ఆ వివరాలను సిబిల్‌ సంబంధిత వ్యక్తుల రుణచరిత్రలో చేరుస్తుంది. ఇలా అప్‌డేషన్‌ సమయంలో తప్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. లేదా సకాలంలో సిబిల్‌కు సమాచారం చేరకపోవడం వల్ల కూడా సిబిల్ రిపోర్ట్ బలహీనంగా ఉండవచ్చు. కారణమేదైనా సిబిల్‌ రిపోర్ట్‌లో తప్పులుంటే రుణ అవకాశాలు సన్నగిల్లినట్టే.

చరణ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. రుణంపై విల్లా కొనుగోలు చేయాలనుకున్నాడు. రుణానికి అర్హత ఉందా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు సిబిల్‌ రిపోర్ట్‌ తెప్పించుకున్నాడు. పరిశీలించగా అందులో తప్పులు కనిపించాయి. దాంతో రుణం రాదని అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి..? ఇందుకు ఓ పద్ధతి ఉంది. అదేంటో తెలుసుకుందాం.

representative image

సిబిల్‌ రిపోర్ట్‌ అంటే..?

బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకునే ప్రతీ వ్యక్తికి సంబంధించిన ఆర్థిక వివరాలను నిర్వహించే సంస్థే సిబిల్. కస్టమర్ల అభ్యర్థనపై సిబిల్ సంస్థ రిపోర్ట్ జారీ చేస్తుంటుంది. అప్పటి వరకు ఆ వ్యక్తికి సంబంధించి రుణ వివరాలు అందులో వివరంగా ఉంటాయి. ఒక వ్యక్తికి రుణాలు జారీ చేయాలా? వద్దా?... గతంలో తీసుకున్న రుణాలు ఏంటి, వాటిని సకాలంలో తీర్చివేశారా? ఈ సమాచారం ఆధారంగా ప్రస్తుతం రుణం ఇవ్వవచ్చా, ఇస్తే తీర్చగలడా? అనే విషయాలను నిర్ధారించుకునేందుకు బ్యాంకుల సిబిల్ రిపోర్ట్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

రుణాలకు సంబంధించి చెల్లింపులు, క్రెడిట్‌ కార్డు లావాదేవీల వివరాలు సిబిల్‌ రిపోర్ట్‌లో చోటు చేసుకుంటాయి. ఈ వివరాలను బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ప్రతి నెలా సిబిల్‌కు సమర్పిస్తాయి. ఆ వివరాలను తన రికార్డుల్లో అప్‌ డేట్‌ చేసుకుంటుంది. రుణం ఇచ్చే ముందు ప్రతీ సంస్థ తప్పనిసరిగా సంబంధిత వ్యక్తి పాన్‌ నంబర్‌ ఆధారంగా సిబిల్‌ రిపోర్ట్‌ తెప్పించుకుంటుంది. రుణ చరిత్ర బాగుంటేనే రుణ అభ్యర్థనను ఆమోదిస్తాయి. అందుకే రుణం లభించాలంటే సిబిల్‌ రిపోర్ట్‌ స్వచ్ఛంగా ఉండాలి. ఇందుకోసం ఆర్జించే ప్రతీ వ్యక్తీ సిబిల్‌ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా తెప్పించుకుంటూ పరిశీలిస్తూ ఉండాలి. సిబిల్‌ రిపోర్ట్‌లో 300 నుంచి 900 వరకు స్కోర్‌ ఉంటుంది. 750కి పైన ఉంటే ఆరోగ్యకరమైన స్కోర్‌ కిందకు వస్తుంది. స్కోర్‌ ఎక్కువ ఉంటే రుణం ఇచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని అర్థం. రుణాలు తీసుకుని ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించేవారి స్కోరు 750కుపైనే ఉంటుంది.

బ్యాంకులు ఏ సమాచారాన్ని పంపిస్తాయి?

పేరు, చిరునామా, పుట్టిన తేదీ, పాన్, టెలిఫోన్‌ నంబర్, ఆదాయం వివరాలను సిబిల్‌కు పంపిస్తాయి. దీంతో సిబిల్‌ సంబంధిత వ్యక్తి పేరిట ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేస్తుంది. అందుకే మీ వ్యక్తిగత వివరాలన్నీ సరైనవి ఇవ్వడం ఎంతో అవసరం. ఇచ్చిన వివరాలన్నీ ప్రొఫైల్‌లో సరిగానే ఉన్నాయా? అన్నది కూడా చెక్‌ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. తప్పులుంటే వెంటనే సిబిల్‌ దష్టికి తీసుకెళ్లాలి.

సిబిల్‌ రిపోర్ట్‌లో ఎటువంటి తప్పులు

మీకు సంబంధించినది కాని సమాచారం వచ్చి మీ సిబిల్‌ రిపోర్ట్‌ లో చేరడానికి అవకాశం ఉంది. పొరపాటుగా మరొకరి ఆర్థిక చరిత్రను మీ ఖాతాకు లింక్‌ చేసే అవకాశం ఉంది. బ్యాంకులు మీ రుణ చరిత్రకు సంబంధించి పొరపాటుగా తప్పుడు రిమార్క్ ను పంపే అవకాశం కూడా ఉంది. ఇక రుణం ఏ టైప్, రుణం మొత్తం, జారీ చేసిన తేదీ, ప్రస్తుతం మిగిలి ఉన్న బకాయి.. ఇలా ఏ విషయంలోనయినా తప్పిదం చోటు చేసుకోవచ్చు.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నెలకోసారి రుణాలు, క్రెడిట్‌ కార్డు వివరాలను సిబిల్‌కు పంపిస్తాయి. ఉదాహరణకు సెప్టెంబర్‌ 5న వ్యక్తిగత రుణాన్ని పూర్తిగా తీర్చివేశారు. కానీ, బ్యాంకు మీ రుణానికి సంబంధించిన తాజా వివరాలను సెప్టెంబర్‌ 1నే సిబిల్‌ కు పంపించి ఉంటాయి. కనుక సిబిల్‌ రిపోర్ట్‌లో మీ రుణం తీరిపోయినట్టు కనిపించదు. ఇది సిబిల్‌లో అప్‌డేట్‌ అవడానికి 30 నుంచి 45 రోజులు పడుతుంది. అప్పటికీ రుణ బకాయి ఉన్నట్టుగానే చూపిస్తే తప్పిదాన్ని సరిచేయాలని కోరాల్సి ఉంటుంది.

representative image

ఎర్రర్స్‌ను ఆన్‌లైన్‌లో సరిచేసుకుందాం

ఇందుకు 30 రోజుల సమయం తీసుకుంటుంది. సిబిల్ వద్ద ఖాతా వివరాలు తెలుసుకోవడం లేదా రిపోర్ట్ పొందడం, తప్పులు సరిచేయడం ఇలా వీటిలో ఏక కాలంలో ఒకటే రిక్వెస్ట్ కు అవకాశం ఉంటుంది. ఒకవేళ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల ద్వారా మీ చేతికి వచ్చిన రిపోర్ట్ లో తప్పులున్నా సిబిల్‌ను సంప్రదించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో సిబిల్‌ పోర్టల్‌కు వెళ్లి డిస్పూట్‌ రిజల్యూషన్‌ (పరిష్కారం) విభాగంలో ఆన్‌లైన్‌లోనే ఫామ్‌ పూర్తి చేసి సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ సిబిల్‌ రిపోర్ట్‌ను సిబిల్‌ నుంచి నేరుగా పొంది ఉంటే సిబిల్‌ పోర్టల్‌లో https://www.cibil.com/dispute/ మై సిబిల్‌ కింద లాగిన్‌ అయి ‘రేజ్‌ ఏ డిస్పూట్‌’ను క్లిక్‌ చేసి దేనికి సంబంధించి పరిష్కారం కావాలో సెలక్ట్‌ చేసుకుని, వేల్యూ ఇచ్చి సబ్‌మిట్‌ చేస్తే చాలు. తర్వాత సిబిల్ లెండర్లను సంప్రదించి అసలు విషయాలను, వివరాలను ధ్రువీకరించుకుంటుంది. ఫిర్యాదు దారుడు లేవనెత్తిన అంశాలతో లెండర్ కూడా ఏకీభవిస్తే సిబిల్ వాటిని సరిచేస్తుంది. ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత మెయిల్‌ రూపంలో తెలియజేస్తుంది. తప్పిదాన్ని సరిచేసిన తర్వాత అప్‌డేటెడ్‌ రిపోర్ట్‌ను కూడా పంపిస్తుంది. ఇందుకు 30 నుంచి 45 రోజుల సమయం తీసుకుంటుంది.

గమనించాల్సినవి

కస్టమర్లు కోరినంత మాత్రాన సిబిల్‌ తనంతట తాను ఎర్రర్స్‌ను సరిచేయదు. ఆయా అంశాలపై అప్‌డేటెడ్‌ సమాచారాన్ని రుణం ఇచ్చిన బ్యాంకు లేదా ఫైనాన్స్‌ సంస్థ సిబిల్‌కు పంపించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ ఎర్రర్స్‌ను సరిచేస్తుంది. అందుకే రుణం తీసుకుని తీర్చివేసిన తర్వాత దానికి సంబంధించిన తప్పిదాలు గానీ, ఎర్రర్స్‌ కానీ కనిపిస్తే వాటిని సరిచేయాలని సంబంధిత బ్యాంకులను కోరేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు బ్యాంకులు పంపే తాజా సమాచారం ఆధారంగా సిబిల్‌ వివరాలు సరిచేస్తుంది. మరో 45 రోజుల తర్వాత సిబిల్‌ రిపోర్ట్‌ తెప్పించుకుని పరిశీలించాలి. అప్పటికీ పాత బాకీ తీరలేదని కనిపిస్తే మీ బ్యాంకు శాఖ తాజా సమాచారాన్ని సిబిల్‌కు పంపించలేదని అర్థం చేసుకోవాలి. లేదా ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్థం.

ఇది గమనించండి...

అభినవ్‌ ఇటీవలే సిబిల్‌ రిపోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అందులో వివరాలు చూసి అవాక్కయ్యాడు. 2009లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు రిపోర్ట్‌లో ఉంది. కానీ నిజానికి అభినవ్‌ రుణం కోసం దరఖాస్తు చేయలేదు. ఖాతాదారులు ఇచ్చిన వివరాల్లో పొరపాటు దొర్లొచ్చు. లేదా బ్యాంకులు సిబిల్‌కు పంపిన సమాచారంలో తప్పులు ఉండవచ్చు. లేదా వివరాలు సరిగా ఉన్నా సిబిల్‌లో ఎంటర్‌ చేసే ఉద్యోగి కూడా తప్పు చేయవచ్చు. మీ డాక్యుమెంట్లను దుర్వినియోగం చేసి వేరెవరైనా మోసం చేసినా సిబిల్‌ రిపోర్ట్‌లో చేరే అవకాశం ఉంది. సిబిల్‌ దగ్గర ఫిర్యాదు దాఖలైన తర్వాత సిబిల్‌ రుణదాతలను సంప్రదించి తాజా సమాచారాన్ని కోరుతుంది. రుణదాతలు స్పందిస్తే వారిచ్చిన సమాచారం ఆధారంగా వివరాలను అప్‌డేట్‌ చేస్తుంది. సమస్య పరిష్కారానికి రోజుల నుంచి నెల వరకు పట్టవచ్చు. కానీ 45 రోజులు ఆగి చూసుకోవడం మంచిది.  

ఉదాహరణకు ఓ లోన్‌ తీసుకుని తీర్చివేశారు. రిపోర్ట్‌లో రిటన్‌ ఆఫ్‌ అని ఉంది. అంటే మాఫీ చేసినట్టు. రుణం తీర్చినట్టు కాదు. ఇలాంటప్పుడు సిబిల్‌ వద్ద ఫిర్యాదు నమోదు చేయాల్సి ఉంటుంది. రుణం పూర్తిగా తీర్చలేదని, ఆలస్య రుసుములు, వడ్డీ బాకీలు ఉన్నాయని, అందుకే తర్వాత దాన్ని రిటన్‌ఆఫ్‌ చేసినట్టు సమాధానం వినిపిస్తే అప్పుడు రుణం ఇచ్చిన బ్యాంకును సంప్రదించాలి. సిబిల్‌ వ్యవహారాలు చూసే అధికారిని కలసి సిబిల్‌ రిపోర్టు జిరాక్స్‌ కాపీని సమర్పించి బాకీలు ఏవైనా ఉంటే తీర్చివేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి బాకీ లేకపోయినా బ్యాంకు వైపు నుంచి తప్పిదం ఉన్నా సరిచేయాలని కోరవచ్చు. బ్యాంకు అధికారి స్పందించకుంటే అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించవచ్చు.

ఒకవేళ ఎక్స్‌ అనే వ్యక్తి రుణం తీసుకుని పూర్తిగా తీర్చలేని పరిస్థితుల్లో కొంత మేర చెల్లించి బ్యాంకుతో ఓ అంగీకారినికి వచ్చి దాన్ని ముగించాడనుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్స్‌కు చెందిన సిబిల్‌ రిపోర్ట్‌లో సెటిల్డ్‌ లేదా రిటన్‌ ఆఫ్‌ అని కనిపించవచ్చు. ఇలా ఉంటే మళ్లీ రుణం పుట్టడం కష్టమే. వై అనే వ్యక్తి ఓ రోజు ఏసీ కొనుగోలు చేయడం కోసం ఓ ప్రైవేటు సంస్థ నుంచి డ్యురబుల్‌ లోన్‌ పొందాడు. అన్ని ఈఎంఐలను సక్రమంగా చెల్లించి చివరి ఈఎంఐ మాత్రం చెల్లించలేదు. ఓ రోజు ఫైనాన్స్‌ సంస్థ నుంచి కాల్‌ వచ్చింది. ఆ వెంటనే మిగిలి ఉన్న ఈఎంఐ కూడా చెల్లించేశాడు. కానీ సిబిల్‌ రిపోర్ట్‌ లో మాత్రం రిటన్‌ ఆఫ్‌ అనే వచ్చింది. దాన్ని సరిచేయాలని సిబిల్‌ను కోరాడు. 45 రోజుల తర్వాత చూసుకుంటే రిటన్‌ ఆఫ్‌ కాస్తా... పోస్ట్‌ రిటన్‌ ఆఫ్‌ సెటిల్డ్‌ అని వచ్చింది. దీని గురించి ఫైనాన్స్‌ సంస్థను విచారిస్తే రిటన్‌ఆఫ్‌ దశలో బకాయి తీర్చారు కాబట్టి స్టాటస్‌ అలానే ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో రుణదాతను మరోసారి సంప్రదించి అవసరమైతే ఆలస్య రుసుము ఏమైనా ఉంటే చెల్లిస్తానని కోరడం ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.

రిపోర్ట్ లో డిఫాల్టర్ అని ఉంటే...?

సమాచారంలో తప్పు దొర్లితే సిబిల్ కు ఫిర్యాదు చేయడం ద్వారా సరిచేయించుకోవచ్చు. వివరాలు మీకు సంబంధించినవి కాకపోతే వెంటనే మీరు రుణం తీసుకున్న బ్యాంకు లేదా సంస్థను సంప్రదించి (ఎందుకంటే సిబిల్ కు వివరాలు పంపించేవి అవే కాబట్టి) వివరాలను సరిచూసుకోవాలి. తప్పులు పంపించినట్టు ఉంటే వాటిని అప్ డేట్ చేయాలని కోరవచ్చు. ఇక ఆలస్యంగా చెల్లింపులు, ప్రతికూల స్కోరు, లోన్ డిఫాల్ట్ సమస్యలుంటే బ్యాంకులను సంప్రదించాలి. సెటిల్ చేసుకుని ఆ లేఖను సిబిల్ కు సమర్పిస్తే రిపోర్ట్ లో డిఫాల్టర్ కు బదులు సెటిల్డ్ డిఫాల్టర్ గా మారుస్తుంది.

ఏటా ఓ సారి సిబిల్ రిపోర్ట్ ఫ్రీ

ఏడాదికోసారి సిబిల్ రిపోర్ట్ ను ఉచితంగా ఇవ్వాలని కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అంటే దీని ప్రాముఖ్యత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉచిత రిపోర్ట్ ను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా తప్పులుంటే సరిచేసుకోవడం వెంటనే చేయాల్సిన పని.  సిబిల్‌ వెబ్‌సైట్‌లో https://www.cibil.com/creditscore/ వివరాలు సమర్పించి, ఫీజు చెల్లించడం ద్వారా ప్రస్తుత స్కోర్, రిపోర్ట్‌ పొందవచ్చు. పీడీఎఫ్ రూపంలో మెయిల్ కు వస్తుంది.

వివరాలకు సిబిల్ ను ఈ నంబర్లలో సంప్రదించవచ్చు.

1800 - 224 - 245, 022 6638 4600, 022 817788, 

Email ID: info@cibil.com

రుణం చిటికెలో కావాలా.. అయితే సిబిల్ స్కోర్ చూడండి!

సిబిల్ స్కోర్ ఉచితంగా ఇలా తెలుసుకోవచ్చు...


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
1 year ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
3 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
3 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
3 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
3 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
3 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
3 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
3 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
3 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
3 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
3 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
3 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
3 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
3 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
3 years ago
..more