విదేశీ విద్య కోసం రుణాలు... ఏ బ్యాంకు బెస్ట్?

14-03-2016 Mon 20:35

మంచి ప్రతిభ ఉంది... విదేశాల్లో చదవాలన్న కోరిక అంతకంటే బలంగా ఉంది. కానీ, అందుకు సరిపడా ఆర్థిక స్తోమత లేదు. మరెలా…? ఆ కలను సాకారం చేసుకునేందుకు విద్యా రుణం మార్గం కల్పిస్తుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు విద్యా రుణాలను అందిస్తున్నాయి. వడ్డీ రేట్లలో స్వల్ప తేడాలు మినహాయిస్తే దాదాపుగా అన్నీ ఒకే విధమైన అర్హత నిబంధనలను పాటిస్తుంటాయి. 

ప్రయాణ ఖర్చులు ఉంటే చాలులే… విదేశానికి వెళ్లిన తర్వాత పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకుని సంపాదించగా వచ్చిన దాంతో ట్యూషన్ ఫీజులు, నివాస వ్యయం చెల్లించవచ్చులే! పైగా స్కాలర్ షిప్ అవకాశాలు కూడా ఉన్నాయి… రుణం ఎందుకులే... అన్న భావనతో ఉంటే దాన్నుంచి బయటకు రండి. స్కాలర్ షిప్ ద్వారా అందే ఆర్థిక సాయం విదేశీ విద్యకయ్యే ఖర్చు అంతటినీ తట్టుకునేంత స్థాయిలో ఉండదు. చదువుకుంటూ చేసే పనితో వచ్చే ఆదాయం కూడా తక్కువే. కనుక విద్యా రుణాన్ని సమకూర్చుకుని వెళ్లితే నిశ్చింతగా చదువుకోవచ్చు. 

రుణం కావాల్సినంత ఇస్తారా…?

ట్యూషన్ ఫీజు, పరీక్షా ఫీజులు, లైబ్రరీ, లేబరేటరీ, హాస్టల్ వసతి, బుక్స్, ఎక్విప్ మెంట్, ఇనుస్ట్రుమెంట్స్, యూనిఫామ్, విదేశం వెళ్లేందుకు అయ్యే రవాణా ఖర్చులు, కాషన్ మనీ, ప్రాజెక్టు వర్క్, స్టడీ టూర్లకు విద్యా రుణం వర్తిస్తుంది. అంటే వీటికి అయ్యే మొత్తాన్ని బ్యాంకు రుణంగా మంజూరు చేస్తుంది. పేరొందిన విద్యా సంస్థల్లో చదువుకునేందుకు అడ్మిషన్ లభిస్తే.. బ్యాంకు రుణం సులభంగానే పొందవచ్చు. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల వంటి పూర్తి స్థాయి కోర్సులకే విద్యా రుణం లభిస్తుంది.

రుణానికి కావాల్సిన అర్హతలు ఏమిటి? 

4 లక్షల రూపాయల రుణం వరకు హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే సహ దరఖాస్తు దారుడిగా తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామిలో ఒకరిని చేర్చాల్సి ఉంటుంది. 4 లక్షల నుంచి  7.5 లక్షల రూపాయల్లోపు రుణం కావాలంటే మాత్రం మరొకరి ష్యూరిటీ ఇవ్వాలి. 7.5 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో రుణానికి దరఖాస్తు చేసుకుంటే స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను బ్యాంకులు అడుగుతాయి. అలాగే, విద్యార్థి పేరు మీద ఎల్ఐసీ పాలసీని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 4 లక్షల రూపాయలకు పైబడిన రుణాల్లో 15 శాతం మొత్తాన్ని బ్యాంకుల వద్ద మార్జిన్ మనీగా ఉంచాల్సి ఉంటుంది. 

representational image

ఉద్యోగం వచ్చాకే...

కోర్సు ముగిసిన అనంతరం ఆరు నెలల తర్వాత నుంచి రుణాన్ని వాయిదాల రూపంలో తీర్చాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఉద్యోగం వచ్చే వరకూ వాయిదాలు చెల్లించే పని లేకుండా వెసులుబాటు కల్పిస్తున్నాయి. రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే హమీదారుడి నుంచి బ్యాంకు ఆ మొత్తాన్ని రాబట్టుకునేందుకు చర్యలు ప్రారంభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థి చదవబోయే విద్యా సంస్థ పేరు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు, కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు, విద్యార్థి తిరిగి చెల్లించగలడా? తదితర విషయాలను బ్యాంకు అధికారులు రుణం మంజూరు చేసేముందు పరిగణనలోకి తీసుకుంటారు. 

ఏ బ్యాంకు నుంచి తీసుకోవాలి...?

ప్రైవేటు బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల వడ్డీ రేటు కొంచెం తక్కువగా ఉంటుంది. వివిధ బ్యాంకులను సంప్రదించడం ద్వారా వడ్డీ రేటు, నిబంధనల వెసులుబాటును చూసి ఓ నిర్ణయానికి రావచ్చు. ఒకే బ్యాంకును నమ్ముకోకుండా పలు బ్యాంకుల వద్ద రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. ఒకటి రెండు చోట్ల తిరస్కరణకు గురైనా, ఏదో ఒక్కచోట అయినా తప్పకుండా రుణం లభిస్తుందని వారి విశ్లేషణ.  

ఉదాహరణకు...

20 లక్షల రూపాయల వరకు రుణాలపై వడ్డీ రేటును చూస్తే... బ్యాంక్ ఆఫ్ బరోడా 11.40 శాతం వడ్డీ (వార్షికంగా)కి విద్యా రుణం అందిస్తోంది. కెనరా బ్యాంకు కూడా ఇదే రేటుకు రుణాన్ని అందిస్తుండగా... ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంకుకు వచ్చేసరికి వడ్డీ రేటు 16.10 శాతంగా ఉంది. హెడ్ డీఎఫ్ సీ బ్యాంకు కూడా 13.5 శాతం వడ్డీ రేటుకే రుణాలను ఆఫర్ చేస్తోంది. ఎస్ బీఐ రూ.7.5 లక్షల వరకు రుణాన్ని 11.15 శాతం వడ్డీకి ఆఫర్ చేస్తోంది. కెనరా, విజయా బ్యాంకులు సైతం ఈ స్థాయి రేట్లకే రుణాలను అందిస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లు అంచనా కోసం మాత్రమే. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. తీసుకునే సమయానికి అమల్లో ఉన్న రేట్లే వర్తిస్తాయి. తాజా వడ్డీ రేట్లను బ్యాంకు వెబ్ సైట్ల నుంచి తెలుసుకోవచ్చు.

ఏ పత్రాలు సమర్పించాలి…?

ఇటీవలే పూర్తి చేసిన కోర్సుకు సంబంధించిన మార్కుల షీట్, విదేశీ విద్యా సంస్థ నుంచి అడ్మిషన్ ధ్రువీకరణ పత్రం (అమెరికా యూనివర్సిటీలు I- 20 ఇస్తాయి), కోర్సుకు అయ్యే వ్యయం అంచనా, బ్యాంకు అకౌంట్ స్టేట్ మెంట్, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు, ఆస్తులు, అప్పుల వివరాలు, ఇలా అన్ని రకాల పత్రాలను బ్యాంకులు అడగవచ్చు. అయితే రుణానికి సంబంధించి అగ్రిమెంట్ ను పూర్తిగా చదివి సంక్లిష్టమైన నిబంధనలు ఏమైనా ఉన్నాయా? లేవా? అని చూసుకుని అన్నీ ఓకే అనుకున్న తర్వాతే సంతకం చేయడం మంచిది. ముఖ్యంగా కాల వ్యవధి, వడ్డీ రేటు, రుణాన్ని తిరిగి ఎప్పుడు చెల్లించాలి, ఉద్యోగం రాకపోతే మరికొంత కాలం పాటు వాయిదాలు చెల్లించకుండా కోరడానికి వీలుందా, ఉద్యోగం వచ్చిన తర్వాత స్వల్ప కాలంలోనే రుణాన్ని తీర్చివేస్తే ఏవైనా రుసుములు చెల్లించాల్సి ఉంటుందా? అన్న వివరాలను తప్పక తెలుసుకోవాలి. 


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
1 year ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
3 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
3 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
3 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
3 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
3 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
3 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
3 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
3 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
3 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
3 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
3 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
3 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
3 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
3 years ago
..more