రైతులకు పండుగలా మారిన రాష్ట్ర వ్యవసాయరంగం

23-06-2022 Thu 12:49

హైదరాబాద్: 23, జూన్,2022: రైతును రాజుగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయమునకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా, రైతుబందు, సాగునీటి వనరులు పెంపు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు సరఫరా, మార్కెటింగ్ తదితర రైతు సంక్షేమ పధకాలను అమలుచేస్తున్నది. 2014 తో పోల్చితే సాగు విస్తీర్ణం, ఉత్పాదికత గణనీయంగా పెరిగింది. గత 8 ఏండ్లలో వ్యవసాయ ఉత్పత్తి 8 రెట్లు పెరిగింది. తెలంగాణ రైతులకు వ్యవసాయం నేడొక పండుగలా మారింది. రాష్ట్ర జీ డీ పీ లో వ్యవసాయ రంగం వాటా 20 శాతంగా ఉంది. 2013-14 లో రూ.1లక్షా 12 వేలుగా ఉన్న తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ప్రస్తుతం రూ 2లక్షల 28, వేలకు పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తులకు మరింత విలువను సమకూర్చేందుకు 33 జిల్లాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది.

*ఆదాయంతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు, వేడుకలు నిర్వహణలో అభిరుచులు మారుతున్నాయి. దేశవిదేశాల నుంచి దిగుమతి అవుతున్న పండ్లు,పూలు, కూరగాయలకు మన రాష్ట్రంలో విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ కు అనుగుణంగా పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తి వైపు మన రైతులను మళ్ళించుటకు "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" పేరున రెండు క్షేత్ర ప్రదర్శనశాలలను ప్రభుత్వం నెలకొల్పింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ములుగు లోని తెలంగాణ ఉద్యానవన విశ్వావిద్యాలయం ఆవరణలో వివిధ రకాల పండ్ల సాగుపై 53 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల సాగు కేంద్రాన్ని నెలకొల్పింది.

ములుగు ప్రదర్శన క్షేత్రంలో 30 ఎకరాలలో 9 రకాల పండ్ల జాతులకు చెందిన 49 ఎంపిక చేయబడిన వండడాలకు చెందిన 17,915 మొక్కలను దేశంలో ప్రసిద్ది గాంచిన పరిశోధన తెప్పించి నాటడం జరిగింది. వీటీలో 11 ఎకరాలలో మామిడి, 8 ఎకరాలలో నిమ్మ , బత్తాయి, 3.20 ఎకరాలలో జామ, 2.20 ఎకరాలలో దానిమ్మ, ఒక ఎకరము లో ఖర్జూర, 1.10 ఎకరములో చింత, 2.36 ఎకరాలలో సీతాఫలం, 0.25 ఎకరములో అల్లనేరేడు , డ్రాగన్ ప్రూట్ మొక్కలను పెంచడం జరుగుతున్నది. పండ్ల మొక్కలతో పాటు అగ్రోఫారెస్ట్రీ జాతులైన శ్రీగంధం, వెదురు మొక్కలను కూడా కొద్ది భూమీలో నాటారు. అలాగే అంతర్గతదారుల వెంట సరుగుడు (10284), పనస (200), అల్లనేరేడు (200) , కొబ్బరి (200), శ్రీగంధం (720) మొక్కలను ప్రదర్శన నిమిత్తం నాటారు.

ములుగు ప్రదర్శన క్షేత్రంలో అత్యాదునిక సాంకేతిక సేధ్య పద్దతులను ప్రభుత్వం రైతులకు పరిచయం చేస్తున్నది. సూక్ష్మ సేధ్యం, యాంత్రీకరణ, నీటి నిల్వ, నీటి సంరక్షణ, కొమ్మల కత్తిరింపులు, కోత అనంతర యాజమాన్య పద్దతులతో ఎగుమతి ప్రమాణాలు కలిగిన పండ్లను పండించుటలో నూతన యాజమాన్య పద్దతులను అమలు చేస్తున్నారు. నీటి యాజమాన్య నిర్వహణలో భాగంగా నీటి ఇంకుడు గుంతలు, కందకాలు నిర్మించారు.

తెలంగాణ భూములు, వాతావరణమునకు అనువైన చీడపీడలను తట్టుకుని అధికదిగుబడులు, అధికఆదాయాన్నిచ్చే పలు పండ్ల రకాల వంగడాలను ఈ ఎక్సలెంట్ సెంటర్ లో అభివృద్ధి చేస్తున్నారు. ఆ పండ్ల వంగడాల గురించి తెలుసుకుందాం.

1)మామిడి
*మామిడిలో అత్యధిక ఆదరణ పొందిన 16 ప్రముఖ రకాలు :- హిమాయత్, కేసర్, బెనిషాన్, దశేరి, దశేరి-35, మహాముదా, హైదర్ సాహెబ్, తోతపురి, అలఫోన్స, సింధు, ఆమ్రపాలి, సువర్ణరేఖ, రత్న, రాయల్ స్పెషల్ తో పాటు పచ్చడికి వినియోగించే అమిని, జలాల్ రకాల మొక్కలను 11 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు.వీటిలో 6 రకాలను సంగారెడ్డిలోని ఫల పరిశోదన కేంద్రం నుంచి, 4 రకాలను మహారాష్ట్రలోని దశేరి కృషి విద్యాపీట్ నుంచి తెప్పించారు.
2)బత్తాయి, నిమ్మ, కమలా 
*ఈ పండ్లకు చెందిన 8 రకాల వంగడాలను నాగపూర్, జలగాం, దపోలి లతో పాటు  నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లి పరిశోదన కేంద్రాల నుంచి తెప్పించి అభివృద్ధి చేస్తున్నారు.
3)జామ
*ఈ కేంద్రంలోని 3.5 ఎకరాల విస్తీర్ణంలో లక్నో, బెంగళూరు, రాయచూర్ ల నుంచి 5 రకాల జామ మొక్కలను అభివృద్ధి చేస్తున్నారు.
4)దానిమ్మ
*రెండున్నర ఎకరాలలో మృదుల, బగువ, సూపర్ బగువ రకాల దానిమ్మ రకాలను పూణే, సోలాపూర్ ల నుంచి తెప్పించి అభివృద్ధి చేస్తున్నారు.
5)సీతాఫలం
*సీతాఫలం సాగును వ్యాపార సరళిలో ప్రోత్సాహించుటకు దీర్ఘకాలం నిల్వకు అనుకూలంగా వుండే NMK-1 రకమును మహారాష్ట్ర నుంచి తెప్పించి 10 గుంటలలోను, బాలానగర్ రకమును 2 ఎకరముల 10 గుంటలలో నాటారు.
6)ఖర్జురా
*గుజరాత్ నుంచి 5 రకాల ఖర్జుర టిష్యూ కల్చర్ మొక్కలను తెప్పించి నాటారు.
7)చింత
*అనంతపురం పరిశోదన కేంద్రం నుంచి అనంతరుధిర,తెట్టు అమాలిక వంగడాలను తెప్పించి 1.1 ఎకరములో నాటారు.
8)అల్లనేరేడు
*అధిక దిగుబడి నిచ్చే బాహాడోలి అల్లనేరేడు వంగడమును మహారాష్ట్రలోని దాపోలి నుంచి తెచ్చి నాటారు.
9)డ్రాగన్ ఫ్రూట్
*విధేశీ పండు అయిన డ్రాగన్ ఫ్రూట్ రకాలను ప్రదర్శన నిమిత్తం నాటారు.

అలాగే 5 ఎకరాల్లో షేడ్ నెట్ పందిళ్లకింద శ్రీ గంధం మొక్కల నర్సరీని నెలకొల్పారు.

సంవత్సరానికి 80 లక్షల కూరగాయలు నారు ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఫ్లగ్ టైప్ నర్సరీని ఈ కేంద్రంలో నెలకొల్పారు. టమాటో, వంకాయ, మిరప, క్యాబేజి, కాలిప్లవర్, కాప్సికం మొదలగు నారు ఇక్కడ పెంచుతున్నారు.

దీనితో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలో కూరగాయలు, పూలు సాగుపై సెంటర్ ఆఫ్ ఎక్షలెన్స్ కేంద్రాన్ని ఉద్యానవన యూనివర్సిటీ  ఏర్పాటు చేసింది.రైతులకు పండ్ల తోటల పెంపకంపైన మంచి శిక్షణ ఇచ్చి, మేలైన పండ్ల మొక్కల అంట్లను తయారుచేసి అందించడమే ఈ కేంద్రం ఏర్పాటు ఉద్దేశ్యం.అందులో భాగంగా 30 ఎకరాల ప్రదర్శన క్షేత్రంలో 11 ప్రధాన పండ్లకు సంబందించిన 52 రకాలకి చెందిన 17,915 మొక్కలను నాటారు. అగ్రిఫారెస్ట్రీకి సంబందించిన 5 జాతులకు చెందిన 14,747 మొక్కలు నాటారు. వీటితో పాటు మునగ, కరివేపాకు, మల్బరి మొక్కలను కూడా నాటారు.

రైతులు, విద్యార్థులు, పర్యటకులకు రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీ ములుగు, జీడిమెట్లలో నెలకొల్పిన "సెంటర్ ఆఫ్ ఎక్షలెన్స్" ల సందర్శన ఒక మధుర జ్ఞాపకంగా నిలుస్తుంది. పండ్లు, కూరగాయలు, పూలు సాగులో ఆధునిక యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంచి,ఆసక్తి కలిగిస్తుంది.  


More Press Releases
..more