దేశ సమగ్రతను కాపాడే యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దుతాం: జనసేన
Advertisement

దేశ సమగ్రతను కాపాడేలా యువతను ఒక శక్తిలా రూపుదిద్దాలని జనసేన పొలిట్ బ్యూరో నిర్ణయించింది. శుక్రవారం మధ్యహ్నం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో సమవేశం అయిన పొలిట్ బ్యూరో సుమారు ఐదుగంటల పాటు సుధీర్ఘంగా వివిధ అంశాలపై చర్చించింది. సమావేశానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహించారు. పొలిట్ బ్యూరోలో సభ్యులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాపిశెట్టి రామమోహనరావు, విద్యావేత్త, జనసేన మైనారిటీ విభాగం కన్వీనర్ అర్హంఖాన్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరో సభ్యులు రాజు రవితేజ యూరప్ పర్యటనలో ఉన్నందున ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు.

దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతున్న సందర్భంలో జనసేన పార్టీ ఆవిర్భవించింది. జాతీయ ధృక్పదంతో ప్రాంతీయతను అర్ధం చేసుకుని జాతి సమగ్రతను కాపాడడమే లక్ష్యంగా జనసేన ఆవిర్భావం జరిగిందని సమావేశం గుర్తు చేసింది. 192 ఏళ్ల పాటు జరిగిన మేధోమథనంతో రెండున్నర సంవత్సరాల అవిరళ కృషితో మన త్యాగ మూర్తులు మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. ఒక దేశం ఒకే తాటిపై నిలబడాలన్నా, అభివృద్ధిపదంలో ముందుకు వెళ్లాలన్నా బలమైన రాజ్యాంగం కావాలి. విభిన్న జాతులు, మతాలు, కులాలు, భాషలు, ఆహార్యాలతో అలరారే భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచడానికి మన రాజ్యాంగ నిర్మాతలు అనేక కోణాలలో ఆలోచించి మన రాజ్యాంగాన్ని రూపుదిద్దారు.

మన రాజ్యాంగం మన జాతి పూజించ దగ్గ పవిత్ర గ్రంధమని జనసేన భావిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మన రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లడానికి జనసేన పార్టీ నడుంకట్టాలని సమావేశం నిర్ణయించింది. రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన హక్కులు, విధులు, బాధ్యతలను యువతరానికి తెలియచేయడానికి తద్వారా దేశ సమగ్రతను కాపాడే సందేశాన్ని ఈ తరానికి అందించడానికి మేధావులతో మేధోమథనం నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది.

రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు, సెమినార్ లు తదితర కార్యక్రమాలను నిర్వహించాలని సమావేశం నిర్ణయం తీసుకుంది. ఆనాటి నాయకులు దేశం కోసం ఎటువంటి త్యాగాలు చేశారో, ఎటువంటి కష్టాలను అనుభవించారో ఈ నాటి తరానికి తెలిసేలా ఈ కార్యక్రమాలను రూపొందించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ఇప్పుడు మొదలుపెట్టి నిరంతరంగా కొనసాగించాలని తీర్మానించింది.

*యువతకు నాయకత్వ శిక్షణ

జనాభా పెరిగిపోయి వనరులు తరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో నిస్వార్ధంగా దేశం కోసం పని చేసే యువతను గుర్తించి వారిని నాయకులుగా తీర్చిదిద్దాలని సమావేశం నిర్ణయం తీసుకుంది. రాజకీయ విలువలు పెంపొందించడం, సమాజంలో అసమానతలు తొలగించి కుల, ప్రాంతీయ, వర్గ బేధభావాలను తగ్గించడం వీరి లక్ష్యాలుగా ఉండాలని సమావేశం అభిప్రాయపడింది. 

*ఆర్టికల్ 370 రద్దు మంచిదే

జమ్మూ కశ్మీర్ ను జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్య ఆ ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుందన్న అభిప్రాయాన్ని సమర్ధిస్తూ  పొలిట్ బ్యూరో తీర్మానించింది. ఈ చర్య ఆ ప్రాంత ప్రజల అభివద్ధికి ఉపయోగపడాలని సమావేశం ఆకాంక్షించింది. జమ్మూకశ్మీర్ లో శాంతి సామరస్యం వెల్లివిరియాలని, ఆ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని సమావేశం ఆశాభావం వ్యక్తం చేసింది.

*దేశ ఆర్ధిక పరిస్థితిపై సమీక్ష

దేశంలో నెలకొన్న ఆర్ధిక మాంద్యంపై చాలా లోతుగా పోలిట్ బ్యూరో చర్చించింది. ఎటువంటి చర్యలను చేపడితే ఆర్ధిక మాంద్యం నుంచి బయటపడడానికి గల అంశాలపై సమావేశం దృష్టి పెట్టింది. సరళమైన మార్గంలో వ్యాపారం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) చేసుకునే అవకాశాలు కల్పించాలని సమావేశం అభిప్రాయపడింది. ఇందుకు మూడు అంశాలను సమావేశం ప్రభుత్వానికి సూచించింది. 1) రోడ్డు పక్కన జరిగే చిన్న వ్యాపారం నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు సులభతరమైన పద్దతుల్లో అనుమతులు లభించే విధంగా వ్యవస్థకు రూపకల్పన చేయాలని సమావేశం సూచించింది. 2) అనుమతుల కోసం సింగిల్ విండో విధానం. 3) ఆర్ధిక సహాయం(కేపిటల్ సపోర్ట్). ఈ మూడు అంశాల ఆధారంగా ఆర్ధిక వ్యవస్థను రూపొందించాలని ఇందుకుగాను సెమినార్లు, సింపోజియంలు పార్టీ పరంగా నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. 

ఈ సెమినార్ లలో ఆర్ధిక శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, విదేశాలలో విజయాలు సాధిస్తున్న వ్యాపారవేత్తలు, నిపుణులు, తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర ప్రాంతాల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను భాగస్వాముల్ని చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ గడ్డ మీద పుట్టి, ఉన్నత విద్యను అభ్యసించి విదేశాలలో పరిశ్రమలు, వ్యాపారాలను స్థాపించి అక్కడ సంపద సృష్టిస్తూ అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న మన భారతీయులు విజయాలు సాధిస్తుండగా, ఇక్కడ ఆ పని ఎందుకు చేయలేమని సమావేశం అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంపై మరింత లోతైన ఆలోచన చేయాలని సమావేశం నిర్ణయించింది.

 *పర్యావరణం-పరిరక్షణ

మానవ నివాసానికి ఇతర గ్రహాలలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేదా అన్న విషయాల మీద అన్వేషణ జరపడానికి ప్రపంచ దేశాలు బిలియన్, ట్రిలియన్ డాలర్లను ఒక పక్క ఖర్చు చేస్తూ ఉంటే, మరో పక్క నివాసానికి ఎంతో యోగ్యంగా ఉన్న మన పుడమితల్లి భవితను మనమే చేజేతులా నాశనం చేస్తున్నాం. మన ఆలోచనాధోరణి మారవలసిన తరుణం ఆసన్నమైంది. ఇతర గ్రహాలలో నీరు, ఖనిజాలు ఉన్నాయో లేదో తెలియదు గానీ మన భూమిపై అవి పుష్కలంగా లభిస్తున్నాయి. అటువంటి పుడమి తల్లిపై పర్యావరణాన్ని పరిరక్షించడమే జనసేన ఆశయం.

రాజకీయ పార్టీలు తమ భావజాలంలో పర్యావరణానికి చోటు కల్పించినవి ప్రపంచం మొత్తం మీద రెండో మూడో ఉన్నాయి. అందులో జనసేన పార్టీ ఒకటి. జనసేన పార్టీ ఏడు మూలసూత్రాలలో “ పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం” ఒక సూత్రం. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. వాతావరణం, నదులు, చిన్ననీటి వనరులు కాలుష్యం భారినపడకుండా కాపాడే విధంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించాలని సమావేశం నిర్ణయించింది.

అడవులు అంతరించిపోతున్నాయి. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు సరిపడినంతగా లేవు. వృక్షో రక్షితి రక్షిత: అని మన పురాణాలు, వేదాలు చెబుతున్న సారం ఆధారంగా పర్యావరణం, మన సంస్కృతిని పరిరక్షించే విధంగా కార్తీకమాసంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని సమావేశం తీర్మానించింది. జనసేన పొలిట్ బ్యూరో సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై విస్తృత చర్చ చేపట్టారు. 

*తెలంగాణ సీఎం స్వయంగా పరిష్కరించాలి  

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై చర్చించారు. పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభంలోనే ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు ఆర్టీసీ కార్మికులకు నివాళులు అర్పించారు. ఆ రెండు కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వానికి పొలిట్ బ్యూరో సూచించింది. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్త సమ్మెకు మద్దతు తెలిపింది.

ఈ సమ్మెను శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహించాలని కార్మిక సంఘాలకు, పార్టీ శ్రేణులకు స్పష్టం చేసింది. సమ్మెలో పాల్గొంటున్న 48 వేలమందిని తొలగిస్తామన్న ప్రకటన మూలంగా కార్మికుల కుటుంబాల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఈ సమావేశం అభిప్రాయపడింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ సమ్మెకు తెరదించేలా పరిష్కరించాలని కోరింది. 

*యురేనియం కాలుష్యం ఆందోళనకరం 

పూర్వ నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని నల్లమల అటవీ ప్రాంతాల్లోని యురేనియం తవ్వకాల మూలంగా నెలకొనే కాలుష్యం, నష్టాలపై జనసేన చేపట్టిన అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. యురేనియం తవ్వకాల మూలగా జరిగే పర్యావరణ విధ్వంసం, ప్రజలకు జరిగే నష్టాలు ఆందోళనకరమైనవనీ, వీటిపై అందరికీ అర్థమయ్యేలా జనసేన కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి చెప్పాలని నిర్ణయించారు.

ఈ విషయాలను ప్రజల్లోకి లోతుగా తీసుకువెళ్తారు. జనసేన నాయకులు శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డిలు, కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావుతోపాటు నల్గొండ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో యురేనియం అన్వేషణ, తవ్వకాల మూలంగా జన జీవనానికి ఎంతటి నష్టం, జల, వాయు కాలుష్యాలు కలుగుతాయో తెలిపే అవగాహన సమావేశాలు నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీ బలోపేతం చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని నిర్ణయించారు.

*ఇసుక కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి 

కొత్త ఇసుక విధానం పేరుతో నిర్మాణ రంగాన్ని, అందుకు అనుబంధంగా అన్ని వ్యవస్థల్ని తిరోగమన దిశలోకి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువెళ్ళింది అని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఇల్లు కట్టుకోవాలన్నా, ఉన్న ఇంటికి చిన్నపాటి మరమ్మతు చేయించుకోవాలన్నా ఇసుక లేక ఇబ్బందులుపడుతున్నారనే విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. ఇసుక లేకపోవడంతో రాష్ట్రంలో 35 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని పొలిట్ బ్యూరో ఆవేదన చెందింది. అందుబాటులో ఉన్న ఇసుకను సైతం భారీ ధరలకు అమ్మడంతో నిర్మాణదారులు తమ నిర్మాణాలను నిలుపుదల చేసుకొనే పరిస్థితి నెలకొన్న విషయాన్ని గ్రహించింది.

గృహ నిర్మాణంతోపాటు, ఇన్ఫ్రా రంగం, వాటికి అనుబంధమైన వ్యాపారాలు దెబ్బ తినడంతో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది అని ఈ సమావేశం గుర్తించింది. రాష్ట్రానికి రావాల్సిన రాబడులు కోల్పోతూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడితే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమని పొలిట్ బ్యూరో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వైసీపీ ప్రభుత్వం లోపభూయిష్టమైన మద్యం విధానంతో భారీస్థాయి అవినీతికి తెర తీసిందని ఈ సమావేశం అభిప్రాయపడింది. ఈ నెల 1 వ తేదీ నుంచి మొదలైన సర్కారీ మద్యం షాపుల నిర్వహణ అంశంపై చర్చించారు. మద్యం విధానంపై సమగ్రంగా చర్చించాలని నిర్ణయించారు. 

* రాష్ట్ర రాజధానిని పిల్లి కాపురంలా మార్చేస్తున్నారు 

ఆంధ్ర ప్రదేశ్ ను శాశ్వత రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టి ప్రజలకు పాలనాపరమైన సౌలభ్యం లేకుండా చేయడమే ప్రభుత్వ విధానంలా ఉంది అని పొలిట్ బ్యూరో అభిప్రాయం వ్యక్తం చేసింది. రాజధానికి అనువైన ప్రదేశం అన్వేషణ, నిపుణుల కమిటీ పరిశీలన అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని గుర్తించింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో వ్యూహాత్మకంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు అని తప్పుబట్టింది. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుంది... కానీ ఆంధ్ర ప్రదేశ్ కు అనేక రాజధానులు చేస్తారా? అని ప్రశ్నించింది. పిల్లి కాపురంలో పిల్లల్ని ఆరు చోట్లకు మార్చిందన్న చందాన రాజధాని అక్కడ ఇక్కడ అంటూ చివరకు ఏమీ లేకుండా చేస్తారేమో అనే ఆందోళన వ్యక్తం చేసింది.

* యూపీఎస్సీ మార్గదర్శకాలను అనుసరించాలి

గ్రామ సచివాలయ నియామకాల్లో చోటు చేసుకున్న గందరగోళాలు, నియామకాల్లో తప్పిదాల మూలంగా ప్రతిభావంతులైన నిరుద్యోగ యువతలో నిరాశానిస్పృహలు నెలకొన్నాయి అని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఇప్పుడు ఏపీపీఎస్సీలో మార్పులు పేరుతో రాత పరీక్షతోనే నియామకాలు అంటే - పేపర్ లీకేజ్ లాంటి అక్రమాలు తలెత్తితే ప్రతిభావంతులు అన్యాయం అయిపోతారనే ఆందోళన యువతలో నెలకొంది అని గుర్తించింది. ఉద్యోగ నియామకాల్లో యూపీఎస్సీ మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేసింది. 

* రాజకీయ వ్యవహారాల కమిటీ విస్తృతం  

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పోటీకి సన్నద్ధమే అని పొలిట్ బ్యూరో స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై డా.పాపిశెట్టి రామమోహన రావు గారి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ రూపొందించిన నివేదిక పొలిట్ బ్యూరోకి అందచేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సంఖ్యను విస్తృతపరచాలని పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది.

Sat, Oct 19, 2019, 09:17 AM
Advertisement
2020-01-20T11:54:36+05:30
2020-01-20T09:15:38+05:30
2020-01-20T08:57:07+05:30
2020-01-18T21:14:34+05:30
2020-01-18T15:50:02+05:30
2020-01-18T13:22:15+05:30
2020-01-18T12:52:23+05:30
2020-01-18T10:44:29+05:30
2020-01-18T10:36:00+05:30
2020-01-18T10:29:40+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View