ఆర్టీసీ డిమాండ్ల పరిశీలనకు ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీని నియమించిన తెలంగాణ ప్రభుత్వం!
Advertisement
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కోసం సీనియర్ ఐఎఎస్ అధికారులతో కమిటీ వేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ముగ్గురు ఐఎఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తగు సూచనలు చేసేందుకు, ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను పరిశీలించేందుకు శాశ్వత ప్రాతిపదికన మంత్రివర్గ ఉప సంఘాలను నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విధానం, పౌల్ట్రీ పాలసీ రూపొందించాలని కేబినెట్ నిర్ణయించింది.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో జరిగింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయిన సమావేశం వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.

ఆర్టీసీ కార్మికులు వివిధ డిమాండ్లతో సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో, వారి డిమాండ్లు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణ రావు, సునిల్ శర్మ సభ్యులుగా సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీ బుధవారం ఆర్టీసీ కార్మికులతో చర్చిస్తుంది. వారి డిమాండ్లను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వానికి వీలైనంత తొందరలో నివేదిక ఇస్తుంది. అధికారులు ఇచ్చే నివేదికను అనుసరించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

పేద ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. అధికారుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆర్టీసీ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి మండలి నిర్ణయించింది.

ఆర్టీసీ ఇప్పటికే ఆర్థికంగా నష్టాల్లో ఉన్నందున, సమ్మె యోచన విరమించుకుని సహకరించాలని కార్మికులకు రాష్ట్ర మంత్రి మండలి విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే తమ డిమాండ్లు చెప్పారని, ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీతో చర్చించాలని కేబినెట్ సూచించింది. డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా సంస్థను కాపాడాలనే కృతనిశ్చయంతో ఉందని కేబినెట్ స్పష్టం చేసింది. ఈ సమయంలో సమ్మెకు పోయి కార్మికులు సొంత సంస్థనే నష్టపరచవద్దని విజ్ఞప్తి చేసింది. కూర్చున్న కొమ్మనే నరుక్కోవద్దని మంత్రి మండలి కోరింది. ప్రజలంతా పండుగలకు తమ సొంతూర్లకు పోయే సందర్భంలో సమ్మెకు పోయి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని కార్మికులను మంత్రి మండలి కోరింది.

ప్రభుత్వ కార్యక్రమాలు మరింత పకడ్బందీగా అమలయ్యేందుకు, ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు, ప్రభుత్వానికి తగు సూచనలు చేయడానికి శాశ్వత ప్రాతిపదికన మంత్రివర్గ ఉప సంఘాలను నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఈ కింది కమిటీలను నియమించింది.

1. వైద్య, ఆరోగ్య కమిటి: 

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ అధ్యక్షతన, మంత్రులు కెటి రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్ సభ్యులుగా వైద్య, ఆరోగ్య కమిటీ ఏర్పాటైంది. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వివిధ సీజన్లలో వచ్చే అంటువ్యాధులు, ఇతరత్రా వ్యాధులు, ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

2. గ్రామీణ పారిశుధ్య కమిటి: 

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ సభ్యులుగా ప్రభుత్వం గ్రామీణ పారిశుధ్య కమిటీని నియమించింది. ప్రస్తుతం అమలవుతున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలునూ, భవిష్యత్తులో గ్రామాల్లో పారిశుధ్య పనులను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అవసరమైన కార్యాచరణను అమలు చేసే విషయంలో ఈ కమిటీ అప్రమత్తంగా ఉంటుంది.

3. పట్టణ పారిశుధ్య కమిటి: 

మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు అధ్యక్షతన మంత్రులు టి. హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా పట్టణ పారిశుధ్య కమిటిని ప్రభుత్వం నియమించింది. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అమలు చేసే కార్యాచరణను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

4. వనరుల సమీకరణ కమిటి: 

ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అధ్యక్షతన మంత్రులు కెటి రామారావు, శ్రీనివాస గౌడ్ సభ్యులుగా వనరుల సమీకరణ కమిటిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర స్థాయిలో వనరులను సమీకరించుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడం తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

5. పచ్చదనం కమిటి: 

అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు కెటి రామారావు, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా పచ్చదనం కమిటిని ప్రభుత్వం నియమించింది. తెలంగాణలో పచ్చదనం పెంచడం, అడవులు కాపాడడం, కలప స్మగ్లింగును అరికట్టడం తదితర కార్యక్రమాలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది.

6. వ్యవసాయ కమిటి:

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు  గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యులుగా వ్యవసాయ కమిటి ఏర్పాటైంది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, కల్తీలను నిరోధించడం, వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను అమలు చేయడం, విత్తనాలను, ఎరువులను సేకరించడానికి ఒక సమగ్ర విధానం రూపొందించడం తదితర కార్యక్రమాలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడం తదితర కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తుంది.

7. పౌల్ట్రి కమిటి:

పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మంత్రులు శ్రీనివాస గౌడ్, ఈటల రాజెందర్, నిరంజన్ రెడ్డి సభ్యులుగా పౌల్ట్రి కమిటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో చాలా మంది ఆధార పడిన పౌల్ట్రి పరిశ్రమను పటిష్ట పరచడానికి అవసరమైన పౌల్ట్రి పాలసీ తీసుకురావడంతో పాటు, పౌల్ట్రీ అభివృద్ధికి తీసుకునే చర్యలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది. మంచి పౌల్ట్రీ పాలసీ ఉన్న రాష్ట్రాల్లో పర్యటించి ఈ కమిటీ అధ్యయనం కూడా చేస్తుంది.

8. సంక్షేమ కమిటి:

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ సభ్యులుగా సంక్షేమ కమిటిని ప్రభుత్వం నియమించింది. వివిధ వర్గాల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది.

రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ రంగ పరిస్థితిని మంత్రివర్గ సమావేశం విస్తృతంగా చర్చించింది. వర్షాకాలంలో పండిన అన్ని రకాల పంటలను ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయడానికి పౌర సరఫరాల సంస్థతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు సన్నద్ధం కావాలని మంత్రి మండలి కోరింది. వేసవి కాలం పంటకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను ముందుగానే సమీకరించుకోవాలని సూచించింది. దీనికి అవసరమైన విధానం రూపొందించుకోవాలని చెప్పింది.

10న మంత్రులు, కలెక్టర్ల సమావేశం: 

గ్రామాల్లో ప్రస్తుతం అమలవుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై చర్చించడానికి ఈ నెల 10న ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులు, కలెక్టర్లతో హైదరాబాద్ లో విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి డిపిఓలను, డిఎల్పివోలను కూడా ఆహ్వానించారు. గ్రామాల్లో పారిశుధ్యం కాపాడడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు, భవిష్యత్తులో చేయాల్సిన పనులపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
Wed, Oct 02, 2019, 09:45 AM
Advertisement
2020-01-24T16:46:25+05:30
2020-01-24T16:09:37+05:30
2020-01-24T16:02:06+05:30
2020-01-24T15:43:43+05:30
2020-01-24T15:38:35+05:30
2020-01-24T09:55:05+05:30
2020-01-23T20:49:45+05:30
2020-01-23T20:41:53+05:30
2020-01-23T19:50:50+05:30
2020-01-23T19:46:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View