సినిమా టికెట్ల ధరల పెంపుపై త్వరలోనే నిర్ణయం: మంత్రి తలసాని

03-12-2021 Fri 20:36

హైదరాబాద్: సినిమా టికెట్ ల ధరల పెంపు పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు దిల్ రాజు, సూర్యదేవర రాధాకృష్ణ(చిన్నబాబు), సునీల్ నారంగ్, డీవీవీ దానయ్య, రాధాకృష్ణ, ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి, భీమ్లా నాయక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, పుష్ప ప్రొడ్యూసర్ నవీన్, వంశీ, బాలగోవింద రాజు, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తదితరులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

 అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది ఉపాధి పొందే చిత్ర పరిశ్రమ గడిచిన 2 సంవత్సరాల నుండి కరోనాతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, ఇప్పుడిప్పుడే తిరిగి తేరుకుంటుందని చెప్పారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలని, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలమని చెప్పారు. థియేటర్ ల యాజమాన్యాలు కూడా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య, భీమ్లా నాయక్ వంటి భారీ బడ్జెట్ లో నిర్మించిన చిత్రాలు విడుదలకు సిద్దం అవుతున్నాయని వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సినీ ప్రముఖులు సినిమా నిర్మాణ వ్యయాలు అత్యధికంగా ఉన్నాయని, థియేటర్ ల నిర్వహణ ఖర్చు గతంలో కన్నా అనేక రెట్లు పెరిగిందని వివరించారు.

కరోనా వల్ల సుమారు 2 సంవత్సరాలకు పైగా పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకపోయిందని, ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయని, తెలియజేస్తూ టికెట్ ధరల పెంపుపై ఒక తుది నిర్ణయం తీసుకొని ధరలను పెంచి సినీమారంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలలో అమలు అవుతున్న టికెట్ ల ధరలపై అధ్యయనం చేసి ఎగ్జిబిటర్ లకు కానీ, నిర్మాతలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో FDC ED కిషోర్ బాబు తదితరులు ఉన్నారు.


More Press Releases
..more