పులుల సంరక్షణ పర్యావరణ పరిరక్షణలో కీలకం: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

27-09-2021 Mon 14:16

హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 27: జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మ‌నంద‌రిపై ఉంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. సోమ‌వారం అర‌ణ్య భ‌వ‌న్ వ‌ద్ద పులుల సంరక్షణ కోసం జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ' (ఎన్టీసీఏ ) చేపట్టిన ఇండియా ఫర్ టైగర్స్ - ఏ ర్యాలీ ఆన్  వీల్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం టైగర్ రిజర్వు సిబ్బందితో కూడిన వాహనం, అమ్రాబాద్ నుంచి వచ్చిన వాహనాలు ర్యాలీగా కవ్వాల్ వెళ్లాయి. అంత‌కుముందు పులుల సంరక్షణకు పాటు పడతామంటూ ప్రతిజ్జ చేశారు.
 
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్- వేడుకల్లో భాగంగా దేశంలోని అన్ని టైగర్ రిజర్వ్ లను కలుపుతూ పులుల సంరక్షణ కోసం జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ' (ఎన్‌టీసీఏ) ఇండియా ఫర్ టైగర్స్ - ఏ ర్యాలీ ఆన్ వీల్స్ ను అనే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింద‌న్నారు. పెద్ద‌ పులుల‌ను సంర‌క్షణ‌పై ప్ర‌జ‌ల‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు వారిని భాగ‌స్వామ్యం చేయాల‌నే ఉద్దేశ్యంతో ఎన్టీసీఏ ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింద‌ని పేర్కొన్నారు. పులుల ఆవాసాల ర‌క్ష‌ణ‌, విస్త‌ర‌ణ‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని, పులుల సంర‌క్ష‌ణ గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి ఇలాంటి కార్య‌క్ర‌మాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతాయని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణలో త్రికోణ అగ్రభాగాన నిలిచిన పులులను సంరక్షించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందన్నారు. అడవుల్లో జీవ వైవిధ్యానికి పెద్దపులులే కీలకం కాబట్టి జీవ వైవిధ్యం సమతూకంలో కొనసాగాలంటే.. అడవుల్లో పెద్ద పులుల సంత‌తి వృద్ధి చేందేలా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.

పులుల సంర‌క్ష‌ణ, వాటి సంత‌తి వృద్ధి కోసం కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు మ‌న తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటుందని వెల్ల‌డించారు. పులుల సంరక్షణ పట్ల తెలంగాణ ప్ర‌భుత్వం అంకితభావంతో ప‌ని చేస్తుందన్నారు. తెలంగాణ‌లోని రెండు టైగ‌ర్ రిజ‌ర్వ్ ల‌లో పులుల సంఖ్య పెర‌గ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నమ‌ని పేర్కొన్నారు.

పులుల సంరక్షణతోనే అడవుల రక్షణ సాధ్యం అవుతుందని పీసీసీఎఫ్ ఆర్. శోభ అన్నారు. పులుల మ‌నుగ‌డ‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని తెలిపారు. జీవ‌వైవిధ్యంలో పులులు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఎన్టీసీఏ ఈ ర్యాలీ చేప‌ట్టింద‌న్నారు. ఇక్కడి నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఈ ప్రాంతం వరకు కొనసాగుతుందని వెల్ల‌డించారు. అక్కడి నుంచి మహారాష్ట్ర.. ఇలా ఒడిషాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ వద్ద ర్యాలీ ముగుస్తుందని చెప్పారు.
 
ఈ కార్యక్ర‌మంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు అటవీ సంరక్షణ అధికారి (వైల్డ్ లైఫ్) సిద్దానంద్ కుక్రేటీ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.


More Press Releases
..more