స్వయంగా అరకదున్నిన మంత్రి జగదీష్ రెడ్డి

24-06-2021 Thu 20:13

సూర్యాపేట: ఎకరం పొలంలో చేసే సాగుకు ఆదాయం లక్ష రూపాయలు దాటించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన ప్రణాళికలు అమలు పరుస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. లాభసాటి వ్యవసాయం వైపు రైతాంగాన్ని మళ్లించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని అందుకు తగినట్లుగా రైతులు నిర్ణయం తీసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రతి ఏటా జ్యేష్టపౌర్ణిమ రోజున జరుపుకునే ఏరువాక పౌర్ణమిని ఆయన గురువారం రోజున సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్పహాడ్ మండలం గాజుల మొల్కాపురం గ్రామంలో ప్రారంభించారు. కృషి విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో సుమారు వందకు పైగా నాగళ్ళతో మొదలైన ఏరువాక కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా నాగలి దున్ని ప్రారంభించారు.

అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ సాంప్రదాయలకు అనుగుణంగా ప్రతి ఏటా జ్యేష్టపౌర్ణమి రోజున రైతులు ఒక పర్వదినంగా జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి అని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ఏర్పడ్డ అనుకూల పరిస్థితులలో యావత్ రైతాంగం ఈ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నారని ఆయన చెప్పారు. భారతీయ సనాతన సంస్కృతి, జీవన విధానానికి వెన్నెముక వ్యవసాయం అని ఆయన అన్నారు. అటువంటి వ్యవసాయం చేయడం మహా యజ్ఞం అని దీనికి ప్రధాన పనిముట్టు నాగలి ముఖ్యమైన వనరు వర్షం అని ఆయన చెప్పుకొచ్చారు.

అటువంటి వర్షం కురిసే కాలంలో రైతు కృతజ్ఞతతో జరుపుకునే వేడుకే హాలపౌర్ణిమ లేదా కృషి పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమిగా పిలుచుకుంటారన్నారు.అటువంటి పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకునే మహాభాగ్యం ఇక్కడి ప్రజలకు తెలంగాణ ఏర్పడ్డాకే జరుపుకునే అవకాశం దక్కిందన్నారు. 2014 కు ముందు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు వరుస కరువులు, ఆకలి చావులు, ఆత్మహత్యలతో ఈ ప్రాంతం దుర్భిక్షంగా మారిందన్నారు. అటువంటి రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సుభిక్షంగా మార్చారన్నారు.మూడేండ్ల వ్యవధిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారన్నారు.

యావత్ భారతదేశంలో వరి దిగుబడిలో మొదటిస్థానం లో ఉన్న పంజాబ్ ను మించి తెలంగాణ రికార్డ్ సృష్టించిందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమే కారణమని ఆయన కొనియాడారు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ నందించడంతో పాటు, కోటి ఎకరాల మాగాణాన్ని సాగులోకి తెచ్చామన్నారు. అంతే గాకుండా ఋణమాఫీ ని ఒకవైపు అమలు పరుస్తూనే వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడిని రైతుబందు పధకం కింద అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని టి ఆర్ యస్ ప్రభుత్వం అని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత నే ప్రధాన కారణమని ఆయన చెప్పారు.

అటువంటి మహానేత కేసీఆర్ ఇప్పుడు రైతు ఒక్కో ఎకరానికి లక్ష రూపాయలు ఆర్జించాలనే సంకల్పంతో ఉన్నారన్నారు.మూస పంటలకు స్వస్తి పలికి వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపగలిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్నట్లుగా ఎకరాకు లక్ష రూపాయలు సంపాదించడం తెలంగాణ రైతుకు కష్ట సాధ్యం కాబోదని మంత్రి జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, పెన్పహాడ్ యం పి పి నెమ్మాది బిక్షం, స్థానిక జడ్ పి టి సి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉప్పల లలితా ఆనంద్, జడ్ పి వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


More Press Releases
..more