కొత్త సచివాలయం నిర్మించుకోవడమే ఉత్తమం: ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక
Advertisement
ప్రస్తుతమున్న సెక్రటేరియట్ భవనం ఉపయోగించడానికి వీలు లేకుండా ఉన్నందున, సెక్రటేరియట్ కోసం కొత్త భవనం నిర్మాణమే సముచితమని నిపుణుల కమిటీ, కేబెనెట్ సబ్ కమిటీ తేల్చింది. తెలంగాణ రాష్ట్ర కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. సాంకేతిక అంశాలన్నింటినీ పరిశీలించి, నివేదిక ఇవ్వాల్సిందిగా కేబినెట్ సబ్ కమిటీ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన నలుగురు ఇఎన్సీలతో మరొక నిపుణుల కమిటీని నియమించింది.

ఇప్పుడున్న సెక్రటేరియట్ భవనంలో మార్పులు, చేర్పులు చేసి కొనసాగించాలా? కొత్త భవనం నిర్మించాలా? అనే అంశంపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీని కేబినెట్ సబ్ కమిటీ కోరింది. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ తో నిపుణుల కమిటీ విస్తృతంగా చర్చించింది. నిపుణుల కమిటీ అన్ని విధాలా అధ్యయనం చేసి, సెక్రటేరియట్ భవన సముదాయం ప్రాంగణాన్ని సునిశితంగా పరిశీలించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక సమర్పించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదకను పరిశీలించిన కేబినెట్ సబ్ కమిటీ, తన అభిప్రాయాలతో కూడిన నివేదికను నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కు సమర్పించింది. ఈ నివేదికపై గురువారం రాత్రి ముఖ్యమంత్రి కేబినెట్ సబ్ కమిటీకి నేతృత్వం వహించిన ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డితో చర్చించారు.

నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

- ప్రస్తుతమున్న సెక్రటేరియట్ భవనం మార్పులు చేర్పులు చేసి కొనసాగించడానికి అనువుగా లేదు
- ప్రస్తుత భవన సముదాయంలోని ఎ,బి,సి,డి,జి, హెచ్ నార్త్, జె, కె బ్లాకుల్లో ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే, దాన్ని ఆర్పడానికి అగ్నిమాపక వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. మార్పులు చేసినప్పటికీ ఫైర్ ఇంజన్ పోవడం కుదరదు
- చాలా భవనాలు 50-60 సంవత్సరాలు మాత్రమే వినియోగించడానికి వీలుగా డిజైన్ చేయబడ్డాయి. డి మరియు హెచ్ బ్లాకులు తప్ప, మిగతావన్నీ కాల పరిమితి ముగిసినవే
- ఆర్.సి.సి. నిర్మాణాలు 50-60 సంవత్సరాలు మాత్రమే వినియోగించడానికి అవకాశం ఉంది. మంచినీటి పైపులు, విద్యుత్ వైర్ల జీవితకాలం 25 సంవత్సరాలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణకు అప్పగించిన భవనాల్లో మంచినీటి పైపులు, విద్యుత్ వైర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిని పునరుద్దరించడం కూడా సాధ్యం కాదు
- గడిచన నాలుగు సంవత్సరాల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల సెక్రటేరియట్ ప్రస్తుత భవనాల్లో మూడు అగ్ని ప్రమాదాలు జరిగాయి
- డి బ్లాకులో తప్ప మరే బ్లాకులో కూడా మంటలను ఆర్పే ఏర్పాట్లు లేవు
- ప్రస్తుతమున్న భవనాలను ఎంత ఖర్చు పెట్టి తీర్చిదిద్దినప్పటికీ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను అందుకోవడం సాధ్యం కాదు
- ప్రస్తుతమున్న భవనాలను కొనసాగిస్తే, నిత్యం వాటిని మరమ్మతులు చేస్తూ ఉండాలి. మౌలిక వసతులు కూడా చాలా కాలం క్రితం ఏర్పాటు చేసినవి. పాత విద్యుత్ వైర్ల వల్ల ఎక్కువ విద్యుత్ శక్తి వినియోగం జరిగి, సంవత్సరానికి ఐదు కోట్లు చెల్లించాల్సి వస్తున్నది
- ప్రస్తుతం సెక్రటేరియట్ ప్రాంగణంలో పార్కింగ్ స్థలం లేదు. మంత్రులు, ఐఎఎస్ అధికారులు, సందర్శకుల వాహనాల భవనాల చుట్టూ ఎట్ల పడితే అట్ల పార్క్ చేస్తున్నారు
- ఒకే భవనం నిర్మిస్తే, ఎక్కువ ఖాళీ స్థలం ఉండడం వల్ల పార్కింగ్ పద్దతి ప్రకారం చేయడం సాధ్యమవుతుంది
- ప్రస్తుతమున్న సెక్రటేరియట్ లో భవనాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. మంత్రులు, అధికారులు ఒక భవనం నుంచి మరొక భవనానికి వెళ్లడానికి, ఫైళ్లు తీసుకెళ్లడానికి ఎండలు, వర్షాలు తదితర కారణాల వల్ల ఇబ్బంది కలుగుతున్నది
- ప్రస్తుతం సీఎంవో, మంత్రులు, అధికారులు వేర్వేరు బ్లాకుల్లో ఉంటున్నారు. అత్యంత రహస్య డాక్యుమెంట్లు, ఫైళ్లు వివిధ బ్లాకులకు తిప్పాల్సి వస్తున్నది. దీనివల్ల అధికార రహస్యాలు బహిర్గతమవుతున్నాయి
- ఒకే బ్లాకులో సెక్రటేరియట్ నిర్మిస్తే, సీఎంవో, మంత్రులు, అధికారులు ఒకే భవనంలో ఉండి, ఒకరికొకరు ఇంటర్ కనెక్టివిటీ కలిగి ఉంటారు
- ఎండ, వాన, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందరూ ఒకే చోట ఉండి విధులు నిర్వర్తించడం సాధ్యమవుతుంది
- ప్రస్తుత సెక్రటేరియట్ లో కనీసం 150 మందితో సమావేశం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మంత్రులు, సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, కార్యదర్శులు, హెచ్ఓడీలు, కార్పొరేషన్ల చైర్మన్లు అందరితో కలిసి సమావేశం పెట్టుకోవడానికి కనీసం 500 మందికి సరిపోయే విధంగా కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోరో లో నిర్మించడం సాధ్యమవుతుంది
- ప్రస్తుత సెక్రటేరియట్ లో రిసెప్షన్ ప్లేస్ లేదు. విదేశీ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సెక్రటేరియట్ సందర్శించినప్పుడు వారికి స్వాగత ఏర్పాట్లు చేయడానికి అనువైన స్థలం లేదు
- ప్రస్తుతమున్న సెక్రటేరియట్ లో ఉద్యోగుల పిల్లల కోసం క్రష్ లేదు. సిబ్బందికి భోజనహాలు లేదు. సందర్శకుల గది లేదు. కొత్త భవనం కడితే ఇవన్నీ సమకూర్చడం సాధ్యమవుతుంది
- ప్రస్తుతమున్న సెక్రటేరియట్లో వివిఐపి, విఐపిలకు భద్రత సరిగా లేదు. వివిఐపి, విఐపి, అధికారులకు, సందర్శులకు అందరికీ ఒకే ఎంట్రన్స్, ఒకే ఎగ్జిట్ ఉంది. ఆయా బ్లాకుల్లో కూడా ఒకే ఎంట్రన్స్, ఒకే ఎగ్జిట్ ఉంది. ఇది భద్రతకు ఏమాత్రం క్షేమకరం కాదు.
పైన పేర్కొన్న కారణాల నేపథ్యంలో ఇప్పుడున్న భవనానికి మార్పులు, చేర్పులు చేయడం సాధ్యం కాదు. కొత్త భవనం నిర్మించాలని నిపుణులు కమిటీ గట్టిగా కోరింది. అగ్ని ప్రమాదాలను సులభంగా నివారించడానికి అనువుగా ఉండే, నేషనల్ బిల్డింగ్ కౌన్సిల్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేట్టు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచే విధంగా కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మించాలని నిపుణుల కమిటీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నివేదిక సమర్పించింది.
Fri, Sep 06, 2019, 09:26 AM
Advertisement
2020-02-22T08:32:02+05:30
2020-02-20T14:58:09+05:30
2020-02-19T16:52:45+05:30
2020-02-19T16:46:51+05:30
2020-02-19T15:00:57+05:30
2020-02-19T14:51:16+05:30
2020-02-19T10:22:49+05:30
2020-02-19T09:58:57+05:30
2020-02-19T09:24:11+05:30
2020-02-17T18:51:58+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View