తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

09-06-2021 Wed 15:48

నల్లగొండ: ఇకపై గుండె జబ్బులకూ ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యం అందించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ ఆసుపత్రిలలో గుండె జబ్బులకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు సంబంధించిన సిబ్బంది నియామకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో 60 రకాల పరీక్షల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నాస్టిక్ సెంటర్ ను,మొబైల్ క్రిటికల్ కేర్ అంబులెన్స్ తో పాటు అక్సిజన్ ప్లాంట్ లను మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేన్సర్ మహమ్మారిని నిలువరించేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలను సిద్ధం చేశారని ఆయన చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో కేన్సర్ నిర్దారణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెరిగిందని ఆయన అన్నారు. అందుకు అనుగుణంగానే 60 రకాల పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలలో నిర్వహించేందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ఆసుపత్రిలలో డయాగ్నిస్టిక్ కేంద్రాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారన్నారు. అంతే గాకుండా అందుకు సంబంధించిన సిబ్బందిని, వైద్యుల నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని ఆయన చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనాను నిలువరించే ప్రయత్నంలో తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది కృషి ఆమోఘమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కే. వి.రామారావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డియంహెచ్ఓ కొండల్ రావు, ఆసుపత్రి సూపరెండేంట్ జైసింగ్ రాథోడ్, డిసిహెచ్ డాక్టర్ మాతృ తదితరులు పాల్గొన్నారు. 


More Press Releases
..more