ఆబ్కారీ శాఖపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

08-05-2021 Sat 19:53

హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆబ్కారీ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్, అందుబాటులో ఉన్న గౌడ సామజిక శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ఆబ్కారీ శాఖ అధికారులతో చర్చించారు. సీఎం కేసీఆర్ గీత కార్మికులకు ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత అంగ వైకల్యం చెందిన వారికి అందించే ఎక్స్గ్రేషియా 2 లక్షల నుండి 5 లక్షల రూపాయలకు పెంచటం జరిగింది. పెంచిన ఎక్స్గ్రేషియాను రైతులకు అందిస్తున్న రైతు బీమా మాదిరిగా వెంటనే గీత కార్మికుల కుటుంబానికి అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రమాదవశాత్తు గీత కార్మికులు చనిపోయిన, శాశ్వత అంగవైకల్యం చెందిన కార్మికుల సమాచారం 24 గంటల వ్యవధిలో సేకరించి వారం రోజులలో విచారణ పూర్తి చేసి రాష్ట్ర ఆబ్కారీ శాఖ కమిషనర్ కు అందించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. చనిపోయిన, శాశ్వత అంగవైకల్యం పొందిన గీత కార్మికులకు చెల్లించే ఎక్స్గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన నీరా ఉత్పత్తిని గీత వృత్తిదారులు (గౌడ కులస్తులు) మాత్రమే ఉత్పత్తి చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకంమన్నారు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై నిర్మిస్తున్న నీరా కేఫ్ పనుల పురోగతి పై చర్చించారు. నీరా కేఫ్, నందనం లో నీరా మరియు దాని ఉప ఉత్పత్తల తయారీ కేంద్రాలు నిర్మాణ పనులు వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఎక్సైజ్ నర్సరీలను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నర్సరీలలో హైబ్రిడ్ తాటి, ఈత, ఖర్జుర, గిరక తాళ్ల చెట్లు (డాలర్ ట్రీ) మొక్కలను తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ నర్సరీల పనులు ఈ వర్షాకాలంలోనే ప్రారంభం కావాలని మంత్రి అధికారులను కోరారు. సొసైటీ సభ్యులకు, TFT లైసెన్సు దారులకు గుర్తింపు కార్డులను వెంటనే జారిచేయాలన్నారు. అనుమతి లేకుండా తాటి, ఈత చెట్లును అక్రమంగా నరికివేసే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, కఠిన శిక్షలు పడేలా ఆబ్కారీ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

అర్హులైన ప్రతి గీత కార్మికులకు గీత కార్మికులకు పెన్షన్లు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా అందేలా చూడాలని ఆబ్కారీ శాఖ అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. గీత వృత్తికి సంబంధం లేని వారు గీత వృత్తితో భాగస్వామ్యం లేనివారు కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను కోరారు. జిల్లాలో తాటి, ఈత చెట్లకు నెంబర్లు వేసి వాటిని సంరక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్, MLA లు ప్రకాష్ గౌడ్, వివేక్, ఆబ్కారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆదనపు కమిషనర్ అజయ్ రావు, ఉన్నతాధికారులు ఖురేషి, చంద్రయ్య, రఘురామ్, గణేష్, ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు.


More Press Releases
..more