'రాహు' మూవీ రివ్యూ

29-02-2020 Sat 11:08
Movie Name: Raahu
Release Date: 2020-02-28
Cast: Abhiram Varma, Kriti Garg, Kalakeya Prabhakar, Sathyam Rajesh, Subbu Vedula, Chalaki Chanti 
Director: Subbu Vedula 
Producer: A.V.R. Swami, Sri Shakthi, Raja 
Music: Praveen Lakkaraju  
Banner: Sri Shakthy Swaroop Movie Creations

అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ భార్గవ్, గ్యాంగ్ స్టర్ గా అరాచకాలకు పాల్పడుతున్న నాగరాజును జైలుకు పంపిస్తాడు. భార్గవ్ ఒక్కగానొక్క కూతురు భానుని చంపుతానని నాగరాజు శపథం చేస్తాడు. ఒకానొక సందర్భంలో జైలు నుంచి తప్పించుకున్న నాగరాజు, ఒక రహస్య స్థావరంలో తలదాచుకుంటాడు. 'రాహు' దోషం కారణంగా ఆపదలో చిక్కుకున్న భాను, ఆ స్థావరంలోకి అడుగుపెడుతుంది. అక్కడ ఏం జరిగిందనేదే కథ. ఫస్టాఫ్ లో పేలవమైన సన్నివేశాలు, సెకండాఫ్ లో పసలేని ట్విస్టుల కారణంగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. 

Advertisement 2

పోలీస్ ఆఫీసర్స్ కి వృత్తిపరమైన శత్రువులు ఏర్పడుతుంటారు. ఆ కుటుంబం పై పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. ఇక బాగా తెలివైన అమ్మాయిలు కూడా, అవతల వ్యక్తిని చాలా తేలికగా నమ్మేసి ప్రేమలో పడుతుంటారు. తాము పడింది ప్రేమలో కాదు .. చిక్కుల్లో అనే విషయం వాళ్లకి అర్ధమయ్యేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. అలాంటి రెండు కోణాల్లో సాగే కథగా 'రాహు' కనిపిస్తుంది. దర్శకుడిగా సుబ్బు వేదుల తొలి ప్రయత్నం ఎంతవరకూ ఫలించిందనేది ఇప్పుడు చూద్దాం.

భార్గవ్ (సుబ్బు వేదుల) అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తుంటాడు. భార్యను కోల్పోయిన ఆయన, కూతురు భాను (కృతి గార్గ్)ను జీవితంపట్ల ఒక లక్ష్యంతో పెంచుతాడు. రక్తాన్ని చూస్తే కొంత సేపటివరకూ కళ్లు కనిపించని వ్యాధితో ఆమె బాధపడుతూ ఉంటుంది. ఆ వ్యాధితోనే ఆమె పెరిగి పెద్దదవుతుంది. ఈ నేపథ్యంలోనే గ్యాంగ్ స్టర్ గా అరాచకాలకు .. అక్రమాలకు పాల్పడుతున్న నాగరాజు (కాలకేయ ప్రభాకర్)ను భార్గవ్ జైలుకు పంపిస్తాడు. భానుని చంపుతానని భార్గవ్ తో శపథం చేసి మరీ నాగరాజు జైలుకు వెళతాడు.

టీనేజ్ లోకి అడుగుపెట్టిన భాను, శేషు(అభిరామ్)ప్రేమలో పడుతుంది. అతణ్ణి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, తండ్రికి పరిచయం చేస్తుంది. భార్గవ్ అతని జాతకం చూపించగా, శేషుకి 'రాహు'దోషం ఉందనీ, అతణ్ణి పెళ్లాడితే నెల రోజుల్లోనే భాను ప్రాణాలకి ప్రమాదం ఏర్పడుతుందని చెబుతారు. దాంతో వాళ్ల పెళ్లికి భార్గవ్ నిరాకరిస్తాడు. అయితే శేషుని వదులుకోలేని భాను, తండ్రికి తెలియకుండగా అతణ్ణి పెళ్లి చేసుకుంటుంది. నెల రోజుల తరువాతనే తండ్రికి ఈ విషయం చెప్పాలనుకుంటుంది.

శేషు .. భాను రహస్యంగానే వైవాహిక జీవితాన్ని గడుపుతుంటారు. 30 రోజులు పూర్తవుతుండగా, భాను కిడ్నాప్ కి గురవుతుంది. ఈ నేపథ్యంలోనే నాగరాజు జైలు నుంచి తప్పించుకుని, ఓ రహస్య స్థావరంలో తలదాచుకుంటాడు. కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకున్న భాను, ప్రాణాలను దక్కించుకోవడం కోసం, నాగరాజు స్థావరంలోకే అడుగుపెడుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? 'రాహు' దోషం భానుని బలి తీసుకుంటుందా? ప్రాణాలతో అక్కడి నుంచి ఆమె బయటపడుతుందా? అనేదే మిగతా కథ.

దర్శకుడు సుబ్బు వేదుల మంచి కథనే తయారు చేసుకున్నాడు. కానీ సరైన సీన్స్ ను రాసుకోలేకపోయాడు .. స్క్రీన్ ప్లే ను పట్టుగా మలచలేకపోయాడు. పెర్ఫెక్ట్ అవుట్ పుట్ ను రాబట్టలేకపోయాడు. హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ప్రభావం ఆయన మీద వున్నట్టుగా సెకండాఫ్ లోని కొన్ని సన్నివేశాలు చెబుతాయి. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ను బాగానే తీశాడు. ఈ సినిమా నిర్మాణంలోను భాగస్వామి అయిన ఆయన నిర్మాణ విలువల విషయంలోనూ రాజీ పడలేదు. కథకి తగిన లొకేషన్స్ నే ఎంచుకున్నాడు. అయితే దర్శకుడిగా ఆయన అనుభవలేమి .. స్క్రీన్ ప్లే పరంగా మ్యాజిక్ చేయలేకపోవడం ఈ సినిమా ఆకట్టుకోకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఆరంభంలో వచ్చే యాక్షన్ సన్నివేశం చూడగానే దర్శకుడి అనుభవలేమి అర్థమవుతుంది.

కథను కీలకమైన మలుపు తిప్పే కిడ్నాప్ ను చలాకీ చంటి వాటి కమెడియన్స్ తో చేయించడం అనుభవలేమిలోని భాగమే. ఈ కారణంగానే చలాకీ చంటి ట్రాక్ ద్వారా ప్రేక్షకుడికి ఎలాంటి వినోదం అందదు. ఏదో జరుగుతుందని ఊహించుకుంటే, ఏమీ జరగకుండానే ఆ ట్రాక్ ముగిసిపోతుంది. ఇక చైల్డ్ ఆర్టిస్టుల నుంచి ఎక్స్ ప్రెషన్స్ తీసుకోకుండా డైలాగ్స్ చెప్పించడం .. నేపథ్యంలో వచ్చే పాటకి హీరో పెదాలను కదిలించడం వంటి కారణంగా ప్రేక్షకులు ఇన్వాల్వ్ కాలేకపోయారు.

శేషు పాత్రలో అభిరామ్ వెంటనే ప్రేక్షకులకు కనెక్ట్ కాడు. నటనలో కొత్తదనానికి ఆయన అలవాటు పడుతూ వెళ్లిన తీరు కనిపిస్తుంది. తన పాత్రలోని వేరియేషన్స్ తో మెప్పించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. ఇక యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన భాను పాత్రని కృతి గార్గ్ చాలా బాగా చేసింది. మంచి ఫిట్ నెస్ తో ఆమె కుర్రకారును ఆకట్టుకుంది. నాగరాజు పాత్రలో కాలకేయ ప్రభాకర్ తన మార్క్ చూపించాడు. అయితే ఆయనను పూర్తిస్థాయి విలన్ గా చూపించి వుంటే కథ వేరేలా వుండేది. ఫారెస్ట్ ఆఫీసర్ గా సత్యం రాజేశ్ కనిపించింది కాసేపే అయినా గుర్తుండిపోతాడు. ఇక మిగిలినవన్నీ అంతంత మాత్రం పాత్రలే.    
 
ప్రవీణ్ లక్కరాజు అందించిన సంగీతం ఫరవాలేదు. పాటల్లో 'ఏదో ఏదో ..' ఫీల్ తో ఆకట్టుకుంటుంది. రీ రికార్డింగ్ అక్కడక్కడ మాత్రమే బాగుందనిపించింది. కెమెరా పనితనం బాగుంది. నైట్ ఎఫెక్ట్ సీన్స్ .. ఫారెస్ట్ సీన్స్ .. ఛేజింగ్ సీన్స్ .. మంచుకొండల్లోని పాటలను చాలా గొప్పగా చిత్రీకరించాడు. అమర్ రెడ్డి ఎడిటింగ్ కూడా ఓకే. 'రాహు' అనే టైటిల్ .. గ్రహణం పట్టిన రాత్రి పోస్టర్స్ చూసిన వారు ఇది హారర్ థ్రిల్లర్ అనుకుంటారు .. కానీ ఇది సస్పెన్స్ థ్రిల్లర్. ఒక చిన్న సినిమాకి, ఒక మీడియం బడ్జెట్ కి తగిన కంటెంట్ వుంది .. కానీ సరైన ట్రీట్మెంట్ లేదు. ఈ కారణంగానే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు.    

Advertisement 3

More Movie Reviews
Advertisement 4
..more