'విజిల్' మూవీ రివ్యూ

రౌడీగా చెలామణి అవుతున్న రాజప్ప, తన తనయుడు మైఖేల్ జాతీయస్థాయిలో ఫుట్ బాల్ ఆటగాడిగా కప్పు గెలుచుకురావాలని కలలు కంటాడు. అయితే కప్పు అందుకోవలసిన మైఖేల్, చివరి నిమిషంలో కత్తి పట్టుకోవలసి వస్తుంది. తండ్రి కోరిక నెరవేర్చడం కోసం కోచ్ గా మారిన ఆయనకి ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా అధిగమించాడు? అనేదే కథ. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎక్కువై వినోదం పాళ్లు తగ్గిన ఈ సినిమా, గతంలో విజయ్ - అట్లీ కాంబినేషన్లో వచ్చిన 'తెరి' .. 'మెర్సల్' స్థాయిని అందుకోలేకపోయిందనే చెప్పాలి. 

Movie Name: Whistle
Release Date: 25-10-2019
Cast: Vijay, Nayanatara, Jackie Shroff, Kathir, Vivek, Yogi Babu, Anand Raj, Priyadarshini    
Director: Atlee Kumar  
Producer: Mahesh Koneru 
Music: A.R.Rehman 
Banner: East Coast Productions
Advertisement
తెలుగు తెరపైకి క్రీడా నేపథ్యంతో కూడిన సినిమాలు చాలానే వచ్చాయి. క్రీడా రంగంలోని రాజకీయాలు ప్రతిభావంతులకు ఎంతగా అడ్డంకిగా మారుతున్నాయనేది చూపించాయి. అదే తరహాలో ఫుట్ బాల్ క్రీడా నేపథ్యాన్ని తీసుకుని, ఒక వైపున రాజకీయం .. మరో వైపున రౌడీయిజం .. ఇంకో వైపున ఆశయం అనే త్రెడ్స్ ను కలుపుతూ దర్శకుడు అట్లీ కుమార్ 'విజిల్' సినిమాను తెరకెక్కించాడు. సందేశానికి వినోదాన్ని మేళవించడంలో ఆయన ఎంతవరకూ సక్సెస్ అయ్యాడనేది ఇప్పుడు చూద్దాం.

విశాఖపట్నంలోని ఒక మురికివాడలో రాజప్ప (విజయ్) రౌడీయిజాన్ని చెలాయిస్తుంటాడు. మరో గ్యాంగ్ లో లీడర్ అయిన అలెక్స్ .. రాజప్పని అంతం చేసే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. రాజప్ప తన తనయుడైన మైఖేల్ (విజయ్) ను రౌడీయిజానికి దూరంగా పెంచుతాడు. ఫుట్ బాల్ క్రీడాకారుడిగా ఎదుగుతున్న మైఖేల్, జాతీయస్థాయిలో కప్పు గెలుచుకు రావాలనేది రాజప్ప కోరిక. మైఖేల్ విజేతగా తిరిగిరాగానే, ఆయన మనసిచ్చిన ఏంజిల్ (నయనతార)తో వివాహం జరిపించాలని రాజప్ప నిర్ణయించుకుంటాడు. జాతీయస్థాయి పోటీలకు బయల్దేరిన మైఖేల్, చివరి నిమిషంలో కత్తి పట్టాల్సి వస్తుంది. అందుకు కారణమేమిటి? పర్యవసానంగా చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది.

కోలీవుడ్లో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా అట్లీ కుమార్ కి మంచి పేరు వుంది. యాక్షన్ తో పాటు ఎమోషన్ ను మిక్స్ చేస్తూ ఎంటర్టైన్ చేయడం ఆయన ప్రత్యేకత. అయితే ఈ సారి మాత్రం యాక్షన్ .. ఎమోషన్ మోతాదును ఎంటర్టైన్ మెంట్ అందుకోలేకపోయింది. ఫుట్ బాల్ స్టేడియం బయట యాక్షన్ .. లోపల ఎమోషన్ అన్నట్టుగా ఈ కథ సాగుతుంది. యాక్షన్ సీన్స్ చిత్రీకరణ .. ఫుట్ బాల్ మ్యాచ్ ల చిత్రీకరణ వరకు మాత్రం ఆయనకి ఎక్కువ మార్కులు పడిపోతాయి.  

తండ్రీ కొడుకులుగా విజయ్ ను డిఫరెంట్ లుక్స్ తో చూపించడంలో అట్లీ కుమార్  సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా మైఖేల్ పాత్రలో విజయ్ ను చాలా స్టైలీష్ గా చూపించాడు. అయితే చాలా పవర్ఫుల్ రోల్ అయిన రాజప్ప పాత్రకి 'నత్తి' పెట్టడమనేది దర్శకుడు చేసిన పొరపాటుగా అనిపిస్తుంది. అలాగే జాకీ ష్రాఫ్ వంటి ఆర్టిస్టును ఒక రేంజ్ విలన్ గా చూపిస్తున్నప్పుడు, ఆ స్థాయిని కాపాడుతూనే ఆ పాత్రను చివరివరకూ నడిపించాలి. కథ మధ్యలోనే ఆయనను వాష్ రూమ్ లో పడేసి కొట్టడం .. అండర్ వేర్ తో రోడ్లపై పరిగెత్తించడం ఆ పాత్ర పవర్ ను తగ్గించేస్తాయి .. క్లైమాక్స్ లో ఆయన ఏదో చేస్తాడనే ఆసక్తి కూడా ఆడియన్స్ కి ఉండదు. ఇవన్నీ తప్పనిసరి అనుకుంటే ఆ పాత్రకి జాకీ ష్రాఫ్ అవసరం లేదు.

ఇక విజయ్ - నయనతార పాత్రల పరిచయం .. ప్రేమ .. రొమాన్స్ కి సంబంధించిన ట్రాక్ ను దర్శకుడు సరిగ్గా రాసుకోలేదు. ఈ కాంబినేషన్లో వచ్చిన ఒక్క సీన్ కూడా పండలేదు. విజయ్ హీరో కనుక నయనతార ఓకే అనుంటుంది. లేకపోతే నామ మాత్రంగా అనిపించే ఈ పాత్రను ఆమె ఒప్పుకుని వుండేదికాదేమో. అలాగే వివేక్ .. యోగిబాబు .. ప్రియదర్శిని వంటి మంచి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కామెడీపాళ్లను కథలో కలపలేకపోయాడు. పాటలపై కూడా పెద్దగా శ్రద్ధ పెట్టలేదనే  విషయం మనకి అర్థమైపోతుంది.

రాజప్పగా .. మైఖేల్ గా విజయ్ రెండు పాత్రల్లోను ఎంతో వైవిధ్యాన్ని కనబరిచాడు. తన స్టైల్ ను మిక్స్ చేసి యాక్షన్ సీన్లలో విజిల్స్ వేయించాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లోను మెప్పించాడు. నయనతార పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు .. ఈ సినిమాలో ఆమె అంత ఆకర్షణీయంగాను లేదు. ఇక నయనతారకి ఇచ్చిన వాయిస్ కూడా ఆమెకి అస్సలు సెట్ కాలేదు. జాకీ ష్రాఫ్ చేసిన శర్మ పాత్ర ఆయన స్థాయికి తగినది కాదు .. ఆయన ఒప్పుకోకుండా వుంటేనే బాగుండేదేమో. ఇక వివేక్ .. యోగిబాబు ప్రేక్షకులు నవ్వు ముఖం పెట్టేలా మాత్రమే చేయగలిగారు.

ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, 'నీతోనే అడుగువేయనా' అనే మెలోడీ సాంగ్ మాత్రమే ఆకట్టుకుంటుంది. ఆయన అందించిన నేపథ్య సంగీతం మాత్రం ప్రేక్షకులను మూడ్ లోకి తీసుకెళుతుంది. విష్ణు ఫొటోగ్రఫీ ఆకట్టుకునేలా వుంది. నైట్ ఎఫెక్ట్ సీన్లు .. ఫైట్ సీన్లు .. ఫుట్ బాల్ మ్యాచ్ ఎపిసోడ్స్ ను ఆయన గొప్పగా ఆవిష్కరించాడు. ఎడిటర్ గా రూబెన్ తన కత్తెరకి మరింత పని చెప్పుంటే, ఈ సినిమా నిడివి ఇంత ఎక్కువగా ఉండేది కాదేమో. ఇంట్రడక్షన్ సీన్ .. రైల్వేస్టేషన్లో రాజప్పపై దాడి జరిగే సీన్ ను .. యాసిడ్ బాధితురాలి ఎపిసోడ్ ను .. గాయత్రి అనే ఇల్లాలి ఎపిసోడ్ ను ట్రిమ్ చేయవలసింది. ఫైట్స్ ను డిజైన్ చేసిన తీరు .. వాటిని అట్లీ కుమార్ చిత్రీకరించిన విధానం బాగున్నాయి.

దర్శకుడు అట్లీ కుమార్ స్పోర్ట్స్ డ్రామాగానే ఈ సినిమాను తెరకెక్కించాడు గనుక, అంతవరకూ న్యాయం చేసినట్టే. అయితే నాయకా నాయికల నుంచి ఆడియన్స్ ఆశించే లవ్ .. రొమాన్స్ .. సాంగ్స్ పూర్తిగా నిరాశ పరుస్తాయి. ఇక యాక్షన్ సీన్స్ కి .. ఫుట్ బాల్ ఎపిసోడ్స్ కి మధ్య కామెడీ అనేది కనిపించదు. ఫస్టాఫ్ లో అక్కడక్కడా మెరిసిన కామెడీ, సెకండాఫ్ లో ఎమోషన్ పాళ్లు పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతూ వచ్చింది. మాస్ డైరెక్టర్ అయిన అట్లీ కుమార్ నుంచి .. మాస్ హీరో అయిన విజయ్ నుంచి వచ్చిన ఈ సినిమాలో, మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు తక్కువే. ఫుట్ బాల్ మ్యాచ్ లు .. కోచ్ లు .. గోల్స్ .. సెలక్షన్స్ .. బోర్డు అభ్యంతరాలు ఇవి సాధారణ ప్రేక్షకులకు అంతగా అర్థం కాకపోవచ్చు. సందేశంతో పాటు సమానంగా వినోదాన్ని నడిపించని కారణంగా, ఈ సినిమా తమిళ ప్రేక్షకులచే విజిల్స్ వేయిస్తుందేమోగానీ, తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఓ మాదిరిగానే అనిపిస్తుంది.              Review By: Peddinti
Fri, Oct 25, 2019, 05:23 PM
Advertisement
'డిస్కోరాజా' మూవీ రివ్యూ
'ఎంత మంచివాడవురా' మూవీ రివ్యూ
'అల వైకుంఠపురములో' మూవీ రివ్యూ
'సరిలేరు నీకెవ్వరు' మూవీ రివ్యూ
'దర్బార్' మూవీ రివ్యూ
'తూటా' మూవీ రివ్యూ
'మత్తు వదలరా' మూవీ రివ్యూ
'ఇద్దరి లోకం ఒకటే' మూవీ రివ్యూ
'రూలర్' మూవీ రివ్యూ
'ప్రతిరోజూ పండగే' మూవీ రివ్యూ
Advertisement
'వెంకీమామ' మూవీ రివ్యూ
'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' మూవీ రివ్యూ
'మిస్ మ్యాచ్' మూవీ రివ్యూ
'90 ఎంఎల్' మూవీ రివ్యూ
'రాజావారు రాణిగారు' మూవీ రివ్యూ
'అర్జున్ సురవరం' మూవీ రివ్యూ
'తోలుబొమ్మలాట' మూవీ రివ్యూ
'రాగల 24 గంటల్లో' మూవీ రివ్యూ
'జార్జి రెడ్డి' మూవీ రివ్యూ
'విజయ్ సేతుపతి' మూవీ రివ్యూ
..more
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View