'మన్మథుడు 2' మూవీ రివ్యూ

వయసు ముదిరిపోతున్న కొడుకుని పెళ్లికి ఒప్పించాలని తపించే తల్లి ఒక వైపు .. పెళ్లి చేసుకోకుండా లైఫ్ ను ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వున్న తనయుడు ఒక వైపు. ఆయన ప్లాన్ ను అమలు పరచడానికి అడుగుపెట్టిన ఓ యువతి, ఆయన తల్లి ముచ్చటను ఎలా తీర్చిందనే కథతో రూపొందిన చిత్రమే 'మన్మథుడు 2'. కథా కథనాల పరంగా .. సంగీతం పరంగా గతంలో వచ్చిన 'మన్మథుడు'కి ఈ సినిమా చాలా దూరంలో ఉండిపోయిందనే చెప్పాలి.

Movie Name: Manmadhudu 2
Release Date: 09-08-2019
Cast: Nagarjuna, Rakul, Lakshmi, Vennela Kishore, Rao Ramesh, Jhansi, Devadarshi
Director: Rahul Ravindran
Producer: Nagarjuna
Music: Chaithan Bharadwaj
Banner: Annapurna Studios
Advertisement
తెలుగు తెరపై రొమాంటిక్ హీరోగా ఎక్కువ మార్కులు కొట్టేసిన కథానాయకులలో నాగార్జున ఒకరు. రొమాంటిక్ హీరోగా ఆయన చేసిన సినిమాల్లో 'మన్మథుడు' ముందు వరుసలో కనిపిస్తుంది. నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ఒకటిగా ఇది నిలిచింది. అలాంటి సినిమాకి సీక్వెల్ గా కాకపోయినా, ఆ టైటిల్ కి కొనసాగింపుగా నాగార్జున 'మన్మథుడు 2'ను ఈ రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి ఈ సినిమా 'మన్మథుడు'ను గుర్తుచేస్తుందా .. ఆ సినిమాను తలపిస్తుందా అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ పోర్చుగల్ లో మొదలవుతుంది. చాలా కాలం క్రితం అక్కడ స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తిగా సాంబశివరావు (నాగార్జున) కనిపిస్తాడు. అంతా ఆయనను 'సామ్' అని పిలుస్తూ వుంటారు. అందమైన అమ్మాయిల ముద్దు ముచ్చట్లతో గడిపేస్తూ, పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చేస్తాడు. సామ్ తల్లి (లక్ష్మి), ఇద్దరు అక్కయ్యలు (ఝాన్సీ - దేవదర్శిని), చెల్లెలు శ్వేత కలిసి ఆయన పెళ్లి చేసుకోవలసిందేనని పట్టుపడతారు. తను పెళ్లి చేసుకోకూడదు .. తన తల్లి ముచ్చట తీర్చాలి ఎలా? అని సామ్ ఆలోచిస్తాడు. తనని ప్రేమిస్తున్నట్టుగా నటించి .. పెళ్లి చేసుకుంటానని చెప్పి పీటలవరకూ రాగానే తన జీవితంలో నుంచి తప్పుకోమని అవంతిక (రకుల్)తో ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఆ విధంగా చేయడం వలన ఇంట్లో వాళ్లెవరూ తన పెళ్లి మాట ఎత్తరని భావిస్తాడు. తనకి అత్యవసరంగా డబ్బు అవసరం ఉండటంతో, అందుకు అంగీకరించిన అవంతిక, ఆయన చెప్పినట్టుగానే నటించి చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తుంది. పీటలపై కొడుకు పెళ్లి ఆగిపోవడంతో సామ్ తల్లి కుప్పకూలిపోతుంది. అవంతికను తీసుకొస్తేనే తల్లి బతుకుతుందని సామ్ తో అక్క చెల్లెళ్లు చెబుతారు. అప్పుడు సామ్ ఏం చేస్తాడు? ఆయన నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనే ఆసక్తికరమైన మలుపులతో కథ ముందుకు వెళుతుంది.

తెలుగు తెరపై 'మన్మథుడు' సినిమా నుంచి ఇప్పటి వరకూ నాగార్జున మన్మథుడుగానే పిలిపించుకుంటూ వస్తున్నాడు. రొమాంటిక్ హీరోగా ఒకప్పుడు తనకున్న క్రేజ్ ను ఉపయోగించుకుని, మళ్లీ ఆ తరహా పాత్రలో అలరించడానికి ఆయన ప్రయత్నించాడు. అయితే వయసు మీద పడిన కారణంగా ఆయన ఈ విషయంలో కొంతవరకే సక్సెస్ అయ్యాడు. ఫిట్ నెస్ పై ఆయన శ్రద్ధ పెట్టినప్పటికీ, ఫేస్ విషయానికొచ్చేసరికి ఏజ్ ను కవర్ చేయడం కుదరలేదు. అక్కడక్కడా ఆయన ఫేస్ చాలా డల్ గా కనిపించింది. అయినా అది తెలియనీయకుండా ఆయన తనదైన జోరు చూపించడానికి ట్రై చేశాడు. సామ్ పాత్రలో రొమాన్స్ ను .. ఎమోషన్ ను పండించాడు.

సామ్ తల్లి పాత్రలో లక్ష్మి చాలా సహజంగా చేసింది. కొడుకుని ఒక ఇంటివాడిని చేయాలనే బలమైన కోరిక కలిగిన తల్లిగా .. ఆ కుటుంబానికి పెద్దగా ఆమె తన పాత్రలో జీవించింది. అవంతికను కోడలిగా చేసుకుందామనుకుంటే తన మనసునే విరిచేలా ఆమె ప్రవర్తించినప్పుడు లక్ష్మి నటన హైలైట్ గా నిలిచింది. ఇక అవంతిక పాత్రలో ఒదిగిపోవడానికి రకుల్ తనవంతు కృషి చేసింది. డబ్బుకోసం నాటకమాడటానికి సిద్ధపడిన యువతిగా .. నిజమైన బంధాల ఎదుట నటించలేకపోయిన యువతిగా ఆమె బాగా చేసింది. అయితే కొన్ని చోట్ల ఆమె లుక్ ఆకట్టుకోలేకపోయింది. ఇక సామ్ మేనమామ పాత్రలో రావు రమేశ్ 'ఎక్కడో కొడతాంది చిన్నా' అనే డౌట్ ను వ్యక్తం చేస్తూ మెప్పించాడు. సామ్ పీఏ కిషోర్ గా వెన్నెల కిషోర్ మొదటి నుంచి చివరివరకూ కనిపిస్తాడు. శృంగార పురుషుడిగా తన బాస్ లీలా విశేషాలను చూసి తట్టుకోలేకపోయే పీఏ పాత్రలో వెన్నెల కిషోర్ సందడి చేశాడు. ఒక రకంగా ఆడియన్స్ ను నవ్వించే బాధ్యతను ఆయనే ఎక్కువగా మోశాడు. ఇక కీర్తి సురేశ్ .. సమంత సింగిల్ సీన్ లో మెరిశారు.

రాహుల్ రవీంద్రన్ కి దర్శకుడిగా వున్న అనుభవంతో నాగార్జున వంటి సీనియర్ స్టార్ ను హ్యాండిల్ చేయడం అంత తేలికైన పనికాదు. పైగా ఆయనకున్న రొమాంటిక్ హీరో క్రేజ్ తో ఒకప్పుడు హిట్ అయిన 'మన్మథుడు' దారిలో మరో అడుగు ముందుకు వేయడం సాహసమనే చెప్పాలి. అలాంటి సాహసానికి పూనుకున్న రాహుల్ రవీంద్రన్ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడనే చెప్పాలి. బలమైన కథను .. ఆసక్తికరమైన కథనాన్ని రాహుల్ సిద్ధం చేసుకోలేకపోయాడు. పాటలు .. మాటల విషయంలోను పెద్దగా శ్రద్ధ పెట్టినట్టుగా కనిపించదు.  రావు రమేశ్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ను పూర్తిగా ఉపయోగించుకోలేదు. ఒక సీన్లో సమంతను .. ఒక సందర్భంలో కీర్తి సురేశ్ మెరిసేలా చేయడం సినిమాకి ఏ విధంగానూ హెల్ప్ అయ్యేలా చేయలేకపోయాడు. రకుల్ కుటుంబ నేపథ్యాన్ని ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుకోలేకపోయాడు. అసలు నాగ్ - రకుల్ మధ్య కెమిస్ట్రీ కుదరలేదనిపిస్తుంది.

చైతన్ భరద్వాజ్ సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తుంది. సుకుమార్ ఫొటోగ్రఫీ బాగుంది. పోర్చుగల్ లోని లొకేషన్స్ ను తెరపై అందంగా ఆవిష్కరించాడు. ఎడిటింగ్ కూడా ఓ మాదిరిగానే అనిపిస్తుంది. ఒకటి రెండు చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ వున్నాయి .. అలాగే ఒకటి రెండు డైలాగ్స్ మాత్రమే మనసుకు హత్తుకునేవి వున్నాయి. గతంలో నాగార్జున చేసిన 'మన్మథుడు' కథాకథనాల పరంగాను .. మాటల పరంగాను మంచి మార్కులు దక్కించుకుంది. పాటల పరంగా చూసుకుంటే మ్యూజికల్ హిట్ గా నిలిచింది. అటు కామెడీకి .. ఇటు ఫ్యామిలీ ఎమోషన్స్ కి సమతూకంగా నిలిచింది. ఈ విషయాలన్నింటిలోను  'మన్మథుడు 2' బలహీనంగా కనిపిస్తుంది. పాత 'మన్మథుడు' సినిమాను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి వెళితే మాత్రం నిరాశే ఎదురవుతుంది.                                         
Review By: Peddinti
Fri, Aug 09, 2019, 05:04 PM
Advertisement
'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' మూవీ రివ్యూ
'మిస్ మ్యాచ్' మూవీ రివ్యూ
'90 ఎంఎల్' మూవీ రివ్యూ
'రాజావారు రాణిగారు' మూవీ రివ్యూ
'అర్జున్ సురవరం' మూవీ రివ్యూ
'తోలుబొమ్మలాట' మూవీ రివ్యూ
'రాగల 24 గంటల్లో' మూవీ రివ్యూ
'జార్జి రెడ్డి' మూవీ రివ్యూ
'విజయ్ సేతుపతి' మూవీ రివ్యూ
'యాక్షన్' మూవీ రివ్యూ
Advertisement
'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' మూవీ రివ్యూ
'తిప్పరా మీసం' మూవీ రివ్యూ
'ఏడు చేపల కథ' మూవీ రివ్యూ
'ఆవిరి' మూవీ రివ్యూ
'మీకు మాత్రమే చెప్తా' మూవీ రివ్యూ
'తుపాకి రాముడు' మూవీ రివ్యూ
'ఖైదీ' మూవీ రివ్యూ
'విజిల్' మూవీ రివ్యూ
'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' మూవీ రివ్యూ
'రాజుగారి గది 3' మూవీ రివ్యూ
..more
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View