'దొరసాని' మూవీ రివ్యూ

పేదవాడు ప్రేమించకూడదు .. కలవారి అమ్మాయివైపు కన్నెత్తి చూడకూడదనే దొరతనానికీ, ప్రేమంటూ పుట్టాక అది ఎలాంటి అధికారానికి లొంగదనీ .. మనసులు కలిసినవారిని మరణం తప్ప మరేదీ విడదీయలేదని నిరూపించే ఓ ప్రేమ జంటకి జరిగిన పోరాటమే 'దొరసాని'. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో యూత్ ను ఆకట్టుకునే అన్ని అంశాలు పుష్కలంగా కనిపిస్తాయి.

Movie Name: Dorasani
Release Date: 12-07-2019
Cast: Shivathmika, Anand Devarakonda, Vinay Varma, Kishor, Saranya Pradeep
Director: KVR Mahendra
Producer: Yash Rangineni, Madhura Sridhar reddy
Music: Prashanth R Vihari
Banner: Madhura Entertainment, Big Ben Cinemas
Advertisement

ప్రేమకి మరణం లేదు .. దానికి ఆస్తులు .. అంతస్తుల భేదం తెలియదు. ధైర్యాన్ని కూడదీసుకుని గెలవడమే తప్ప, ఓడిపోవడానికి అది ఎంతమాత్రం ఒప్పుకోదు. పెద్దరికం పేరుతో పెద్దోళ్లు బెదిరించినా మట్టిలో కలిసేవరకూ అది మనసు మార్చుకోదు. ఈ తరహా కథాంశంతో తెలుగు తెరపైకి ప్రేమకథా చిత్రాలు వస్తూనే వున్నాయి. అందుకు కాస్త భిన్నంగా కొన్ని యధార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు కేవీఆర్ మహేంద్ర 'దొరసాని' సినిమాను తెరకెక్కించాడు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు 'గడీ'లు కేంద్రంగా దొరల పాలన సాగింది. ఆ కాలంలో జరిగిన ప్రేమకథగా ఆయన 'దొరసాని'ని తెరపైకి తీసుకొచ్చాడు. చాలా కాలం తరువాత 'గడీ' నేపథ్యంలో వచ్చిన ఈ ప్రేమకథ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

అది తెలంగాణ ప్రాంతంలోని ఓ గ్రామం .. అక్కడి 'గడీ'కి దొరవారు రాజారెడ్డి(వినయ్ వర్మ). తనను ఎదిరించినవారి ప్రాణాలు తీయడానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడడు. ఆయన కూతురే 'దేవకి'(శివాత్మిక). చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న దేవకిని అంతా 'దొరసాని' అనే పిలుస్తుంటారు. బంగారు పంజరం వంటి 'గడీ'లో స్వేచ్ఛగా ఎగరలేని పక్షిలా దేవకి ఉంటుంది. యవ్వనంలోకి అడుగుపెట్టిన దేవకి బయటికి రావడం చాలా అరుదు. అలాంటి దేవకిపై పేదింటి అబ్బాయి అయిన రాజు (ఆనంద్ దేవరకొండ) మనసు పారేసుకుంటాడు. అమ్మమ్మ గారి ఊళ్లో చదువుకుంటోన్న రాజు, సెలవులకి తన ఊరు వచ్చినప్పుడు, తొలిసారిగా బతుకమ్మ పండుగ రోజున దేవకిని చూస్తాడు. అప్పటి నుంచి 'గడీ' చుట్టూనే తిరుగుతూ 'దేవకి' మనసు దోచుకుంటాడు. ఓ రాత్రివేళ ఆమెను గడీ నుంచి తీసుకెళ్లి బయటనున్న అందమైన ప్రపంచాన్ని చూపిస్తాడు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితుల్లో అతనితో కలిసి నడవాలని దేవకి నిర్ణయించుకుంటుంది. పర్యవసానంగా చోటుచేసుకునే అనూహ్యమైన పరిణామాలతో కథ ముందుకు వెళుతుంది.

దర్శకుడు కేవీఆర్ మహేంద్ర ఒక మంచి ప్రేమకథను తెరపై ఆవిష్కరించాడు. ఒకప్పటి గ్రామీణ వ్యవస్థలో దొరతనానికీ .. పేదరికానికి మధ్య గల గీతను ఆయన చాలా స్పష్టంగా చూపించాడు. సాధ్యమైనంతవరకూ కథను సహజత్వంతో నడిపించడానికి ఆయన ప్రయత్నించాడు. స్నేహితులను ఎక్కించుకుని సైకిల్ తొక్కుతుండగా హీరో పాత్రను .. బతుకమ్మ పండుగ రోజున హీరోయిన్ పాత్రను సింపుల్ గా ప్రవేశపెట్టడాన్ని ఇందుకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సందర్భానికి తగినట్టుగా మాటలు .. పాటల అమరికలోను ఆయన తన ప్రతిభను చూపించాడు.

కథ చిక్కబడుతున్న కొద్దీ పాత్రలను ఆయన మలుస్తూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. 'దేవకి' గడీ దాటి వెళ్లి రాజును కలుసుకునే సన్నివేశాన్నీ .. రాజు 'గడీ' దాటి దేవకి గదికి వచ్చే సన్నివేశాన్ని ఆయన చాలా ఆసక్తికరంగా చిత్రీకరించాడు. ఇంటర్వెల్ సమయానికి రాజు - దేవకి రహస్య ప్రేమాయణం 'గడీ' కంట్లో పడేలా చేసి, అక్కడి నుంచి  స్క్రీన్ ప్లే పరంగా మరింత 'బిగి'తో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతూ వెళ్లిన తీరు గొప్పగా వుంది. మధ్యలో నక్సలైట్ల ప్రస్తావన ఉన్నప్పటికీ అది కథలో కలిసిపోయి కనిపిస్తుందే తప్ప .. కథకి అడ్డుపడదు. ఇక క్లైమాక్స్ విషయంలో మాత్రం ఆయన చాలా పెద్ద సాహసమే చేశాడు. అదేమిటనేది తెరపై చూస్తేనే బాగుంటుంది.

నటీనటుల విషయానికొస్తే, 'దేవకి' పాత్రలో దొరసానిగా శివాత్మిక బాగా చేసింది. ఆమెకి ఇది తొలి సినిమానే అయినా, ఎక్కడా తడబాటు పడకుండా చక్కగా చేసింది. రాజును సిద్ధయ్య కొట్టేసి కట్టేసిన సన్నివేశంలోనూ, తను రాజును రహస్యంగా కలుసుకున్నప్పుడు తండ్రి చూసే సన్నివేశంలోను, రాజు కోసం పోలీస్ స్టేషన్ కి పరిగెత్తుకొచ్చే సీన్ లోను శివాత్మిక మంచి నటనను కనబరిచింది.

ఇక ఆనంద్ దేవరకొండ విషయానికొస్తే 'రాజు' పాత్రకి ఆయన సరిగ్గా సరిపోయాడు. అమాయకంగా నవ్వుతూ స్నేహితులను వెంటేసుకుని తిరిగే పల్లెటూరి అబ్బాయిలా, ప్రేమ కోసం ధైర్యంగా 'గడీ'లోకి అడుగుపెట్టే కుర్రాడిలా అతని నటన ఆకట్టుకుంటుంది. తొలిసారిగా దొర ఎదురుగా నిలబడే సీన్ లోను .. సున్నితంగానే అయినా దొరను ఎదిరించే సీన్ లోను బాగా చేశాడు. ఇక 'దొర' పాత్రలో వినయ్ వర్మ ఒదిగిపోయాడు. తన లుక్ .. బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ బాగున్నాయి. తొలిసారి తన ఎదురుగా రాజు వచ్చినప్పటి సీన్ లోను .. 'దేవకి'ని పట్నానికి పంపించే సీన్ లోను ఆయన నటన హైలైట్ గా అనిపిస్తుంది. ఇక నక్సలైట్ శంకర్ గా కన్నడ కిషోర్ .. దొరవారి పనిమనిషిగా శరణ్య ప్రదీప్ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు.

ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం,రామజోగయ్య శాస్త్రి .. గోరెటి వెంకన్న సాహిత్యం ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. ఫస్టాఫ్ లో వచ్చే 'నింగిలోని పాలపుంత' .. 'కళ్లల్లో కలవరమే' పాటలు, సెకండాఫ్ లో వచ్చే 'ఆడిపాడే దొరసాని' పాట హృదయాలకి హత్తుకునేలా వున్నాయి. చిన్మయి పాడిన 'కళ్లల్లో కలవరమే' పాట అన్నిటిలోకి ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. సన్నీ కూరపాటి ఫొటో గ్రఫీ బాగుంది. వర్షం నేపథ్యంలోని 'గడీ' సన్నివేశాలు .. ఓ రాత్రివేళ రాజు - దేవకి ఒక కొండపైకి వెళ్లిన సీన్ మరింత బాగా అనిపిస్తాయి. నవీన్ నూలి ఎడిటింగ్ కి కూడా మంచి మార్కులు ఇచ్చేయ్యొచ్చు. ఎక్కడా అనవసరమైన సీన్ గానీ .. షాట్ గాని లేకుండా ఆయన తన పనితనాన్ని చాలా పట్టుగా నడిపించాడు.

హీరో హీరోయిన్లు కొత్తవాళ్లయినా అదో లోపంగా అనిపించదు. ముఖ్యమైన పాత్రల్లో పెద్దగా తెలుసున్న ఆర్టిస్టులు లేకపోయినా అదో వెలితిగా కనిపించదు. అందుకు కారణం సహజత్వం చుట్టూ అల్లబడిన కథాకథనాలే అనుకోవాలి. తక్కువ బడ్జెట్లో ఎక్కువ అవుట్ పుట్ ను రాబట్టుకున్న చిత్రాల జాబితాలో ఈ సినిమా చేరుతుందని చెప్పాలి. ఇలా బలమైన కథాకథనాలు .. సందర్భానికి తగిన మాటలు .. ఆకట్టుకునే పాటలు .. సహజత్వానికి దగ్గరగా మలచిన పాత్రలు .. అందంగా ఆవిష్కరించిన దృశ్యాలతో ఈ 'దొరసాని' యూత్ హృదయాలను దోచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 
Review By: Peddinti
Fri, Jul 12, 2019, 03:47 PM
Advertisement
'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' మూవీ రివ్యూ
'మిస్ మ్యాచ్' మూవీ రివ్యూ
'90 ఎంఎల్' మూవీ రివ్యూ
'రాజావారు రాణిగారు' మూవీ రివ్యూ
'అర్జున్ సురవరం' మూవీ రివ్యూ
'తోలుబొమ్మలాట' మూవీ రివ్యూ
'రాగల 24 గంటల్లో' మూవీ రివ్యూ
'జార్జి రెడ్డి' మూవీ రివ్యూ
'విజయ్ సేతుపతి' మూవీ రివ్యూ
'యాక్షన్' మూవీ రివ్యూ
Advertisement
'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' మూవీ రివ్యూ
'తిప్పరా మీసం' మూవీ రివ్యూ
'ఏడు చేపల కథ' మూవీ రివ్యూ
'ఆవిరి' మూవీ రివ్యూ
'మీకు మాత్రమే చెప్తా' మూవీ రివ్యూ
'తుపాకి రాముడు' మూవీ రివ్యూ
'ఖైదీ' మూవీ రివ్యూ
'విజిల్' మూవీ రివ్యూ
'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' మూవీ రివ్యూ
'రాజుగారి గది 3' మూవీ రివ్యూ
..more
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View