నా బిడ్డ ఇక్కడే ఉంటాడు, ఈ ఊళ్లోనే ఉంటాడు... మంచు విష్ణుకు, అతని ప్యానెల్ కు ఓటేయండి: మోహన్ బాబు

08-10-2021 Fri 15:55
advertisement

టాలీవుడ్ లో మా ఎన్నికల కోలాహలం తారస్థాయికి చేరిన నేపథ్యంలో సీనియర్ నటుడు మోహన్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎల్లుండి (అక్టోబరు 10) మా ఎన్నికల పోలింగ్ జరగనుండగా, తన కుమారుడు మంచు విష్ణుకు, అతని ప్యానెల్ కు ఓటేయాలని మోహన్ బాబు ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

తాను అందరిలో ఒకడ్నని, నటుడ్ని, నిర్మాతను, దర్శకత్వశాఖలోనూ పనిచేసినవాడ్ని, ఇండస్ట్రీకి కష్టం వచ్చిన ప్రతిసారి నేనున్నాను అంటూ ముందు నిలిచే దాసరి నారాయణరావు అడుగుజాడల్లో నడుస్తున్నవాడ్ని అంటూ వివరించారు. చేసిన సాయం, ఇచ్చిన దానం ఎవరికీ చెప్పకూడదంటారని, కానీ ఇవాళ చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయని తెలిపారు.

1982లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అనేక చిత్రాలు నిర్మిస్తూ, ఎంతోమంది కళాకారులను, నూతన టెక్నీషియన్లను పరిచయం చేశానని వెల్లడించారు. టాలీవుడ్ లోని 24 క్రాఫ్ట్స్ కు చెందినవారి పిల్లలకు, స్వర్గస్థులైన ఎంతోమంది సినీ కళాకారుల పిల్లలకు తమ విద్యాసంస్థల్లో ఉచితంగా చదువు చెబుతున్నానని, వాళ్లు గొప్పస్థాయికి చేరేలా చేశానని మోహన్ బాబు వివరించారు. ఆ ఒరవడి ఇకముందు కూడా కొనసాగిస్తానని తెలిపారు.

తాను మా అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో వృద్ధాప్య పెన్షన్లు ప్రవేశపెట్టానని, ఇలా తాను చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. మా అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదని, అదొక బాధ్యత అని మోహన్ బాబు స్పష్టం చేశారు.

"ఈసారి మా ఎన్నికల్లో నా కుమారుడు మంచు విష్ణు పోటీ చేస్తున్నాడు. క్రమశిక్షణలోనూ, కమిట్ మెంట్ లోనూ నా వారసుడు మంచు విష్ణు. నా బిడ్డ ఇక్కడే ఉంటాడు... ఈ ఊళ్లోనే ఉంటాడు... ఏ సమస్య వచ్చినా మీ పక్కన నిలబడి ఉంటాడని మాటిస్తున్నా. అందుకే మీ ఓటును మంచు విష్ణుకు, అతని ప్యానెల్ కు వేసి పూర్తిస్థాయిలో ఒక సమర్థవంతమైన పాలనకు సహకరించాలని కోరుతున్నా" అంటూ మోహన్ బాబు తన ప్రకటనలో పేర్కొన్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement