'దళిత బంధు' అనే నాటకం కోసం రుణమాఫీ నిధులు తరలిస్తున్నారు: విజయశాంతి

21-09-2021 Tue 16:39
advertisement

రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. 2018 ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రూపాయల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని... అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత, కేవలం కొంతమంది రైతులకు రూ. 25 వేలు మాత్రమే రుణమాఫీ చేశారని చెప్పారు.

దీంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వకపోవడమే కాకుండా, ఉన్న రుణానికి వడ్డీ కట్టించుకుంటూ రెన్యూవల్ చేస్తున్నాయని తెలిపారు. పంట రుణమాఫీ కోసం రైతన్నలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఎన్నికలను అడ్డం పెట్టుకొని ఇదిగో రుణమాఫీ, అదిగో రుణమాఫీ అంటూ ఓట్లు దండుకొని, గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచారని మండిపడ్డారు.

ఇప్పుడు మళ్లీ హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనైనా రుణవిముక్తి కలుగుతుందని సంబరపడ్డ రైతుల కళ్ల వెంబడి కన్నీళ్లు కారేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆగస్ట్ 1న జరిగిన కేబినెట్ మీటింగులో రైతు రుణమాఫీకి రూ. 2,006 కోట్లు అవసరమని ప్రతిపాదన చేసి, స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రూ. 50 వేల లోపు ఉన్న రుణాలకు రుణ విముక్తి కల్పిస్తామని ప్రకటన చేశారని గుర్తు చేశారు.

ఆగస్టు 16 నుంచి 31వ తేదీ లోపున వేస్తామని ఆశ పెట్టి... ఆగస్ట్ 26 వరకు కొంతమంది రైతులకు మాత్రమే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వేశారని చెప్పారు. ఆగస్ట్ 26 తర్వాత 4.97 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ. 1,682 కోట్లకు గాను.. ఒక్క రూపాయి కూడా వేయకపోవడంతో తెలంగాణ రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా మారిందని మండిపడ్డారు.

గత సంవత్సరం, ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి, మినుము, వరి పంటలు దెబ్బతినగా... ఇప్పుడు రుణమాఫీ జరగక, రాయితీ విత్తనాలు ఇవ్వక, రైతులు అప్పుల బాధతో ఉరి తాడుకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు నుండి తీసుకున్న పంట రుణాల రుణమాఫీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతోందని అన్నారు.

కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుతున్న 'దళిత బందు పథకం' అనే నాటకం కోసం... రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ నిధులు తరలిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా అప్పుల ఊబిలో ఉన్న రైతుల పట్ల... అశ్రద్ధ వహిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. ఇప్పటికైనా యావత్ తెలంగాణ రైతులు ఆలోచించాలని... టీఆర్ఎస్ సర్కార్ ఆడుతున్న కపట నాటకాన్ని గమనించి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement