మాస్కు ధరించమని చెప్పినందుకు.. తుపాకీతో కాల్చి చంపిన వ్యక్తి!

21-09-2021 Tue 15:27
advertisement

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వ్యాక్సిన్ తీసుకున్నా సరే మాస్కు ధరించాలని ప్రభుత్వాలు ఓపక్క మొత్తుకుంటున్నాయి. అదే సమయంలో కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు నిరసనలు తెలుపుతున్నారు. ఇలా కరోనా నిబంధనలు నచ్చని ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తనను మాస్కు ధరించాలని అడిగినందుకు ఒక షాపులో క్యాషియర్‌ను కాల్చి చంపేశాడు. జర్మనీలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇడార్-ఓబర్‌స్టైన్ అనే టౌన్‌లో ఈ ఘోరం జరిగింది.

స్థానికంగా ఉన్న పెట్రోల్ బంకులోని షాపులో ఒక స్టూడెంట్ పార్ట్‌టైం క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో బీర్ కొనుక్కోవడానికి 49 ఏళ్ల ఒక వ్యక్తి వచ్చాడు. అతను మాస్కు వేసుకోలేదు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం మాస్కు ధరించడం తప్పనిసరి. ఇదే విషయాన్ని చెప్పి కస్టమర్‌ను మాస్కు ధరించాలని సదరు క్యాషియర్ చెప్పాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే ఆ కస్టమర్ బయటకు వెళ్లిపోయాడు.

కాసేపటికి మాస్కు ధరించి వచ్చిన ఆ కస్టమర్ ఒక బీర్ల కేస్ కొనుక్కున్నాడు. డబ్బులు చెల్లించే సమయంలో మళ్లీ మాస్కు తొలగించాడు. ఆ సమయంలో మళ్లీ వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతే కోపంతో జేబులో నుంచి తుపాకీ తీసి క్యాషియర్‌ తలకు గురిపెట్టి కాల్చాడు సదరు కస్టమర్. ఆ మరుసటి రోజు పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కరోనా నిబంధనల వల్ల తన హక్కులు కోల్పోతున్నట్లు ఫీలయ్యానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఈ హత్యపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement