గజ్వేల్‌కు ఎట్ల వస్తవో అంటివి కదా కేసీఆర్.. ఇప్పుడు కనిపించిందా బొమ్మ: సీతక్క

18-09-2021 Sat 09:45
advertisement

గజ్వేల్‌లో కాంగ్రెస్ నిన్న నిర్వహించిన దళిత, గిరిజన దండోరా సభ విజయవంతం కావడంపై కాంగ్రెస్ నేత సీతక్క ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. సభకు వచ్చిన జనం వీడియోను పోస్టు చేసిన ఆమె..  రేవంత్‌ను గజ్వేల్‌కు ఎట్ల వస్తవో అంటివి కదా.. ఇప్పుడు కనిపించిందా బొమ్మ’ అని ట్వీట్ చేశారు.

కాగా నిన్నటి సభలో తెలంగాణ ప్రభుత్వంపైనా, కేసీఆర్‌పైనా రేవంత్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వంపై ధర్మయుద్ధాన్ని ప్రకటించారు. నిరుద్యోగ యువత ఆకాంక్షల పరిరక్షణే లక్ష్యంగా అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు ప్రత్యేక కార్యాచరణ ఉంటుందన్నారు. తుది దశ తెలంగాణ ఉద్యమానికి రెడీ కావాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందని అన్నారు.

కల్వకుంట్ల కుటుంబం నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కల్పించాలన్న రేవంత్.. కుటుంబానికి సెలవు పెట్టి బూత్‌కు 9 మంది కార్యకర్తల చొప్పున పనిచేయాలని పిలుపునిచ్చారు.  నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణలో దుర్మార్గపు పాలన నడుస్తోందన్నారు. ఉద్యమం చేసినందుకు కేసీఆర్ కుటుంబానికి మూడు పదవులు దక్కితే 12 శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవీ దక్కలేదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చకుండా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడానికి కేసీఆర్ కారణమయ్యారని మండిపడ్డారు. 

తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దెదింపకపోతే తమకొచ్చిన నష్టం ఏమీలేదని తమకు ఆస్తులు ఉన్నాయని అన్నారు. తమ పిల్లలను విదేశాలకు పంపి చదివించే స్తోమత ఉందని, కానీ తమ ఆవేదనంతా తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసమేనని రేవంత్ అన్నారు. సైదాబాద్ ఘటన తనకు ఏడుపు తెప్పించిందని రేవంత్ అన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు నేరెళ్ల దళిత బిడ్డలను దారుణాతిదారుణంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర అడిగిన మిర్చి రైతులకు బేడీలు వేసి నడిరోడ్డులో నడిపించారని అన్నారు. కేసీఆర్‌కు కనీస మానవత్వం లేదని విమర్శించారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement