ఇప్పట్లో 'మహాసముద్రం' రానట్టే!

19-07-2021 Mon 18:39
advertisement


అజయ్ భూపతి పేరు వినగానే 'ఆర్ ఎక్స్ 100' సినిమా గుర్తుకు వస్తుంది. రొమాన్స్ పాళ్లు ఎక్కువగా కలిసిన ఈ కథకి యూత్ నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిసింది. కథానాయకుడిగా ఈ సినిమా కార్తికేయను నిలబెట్టేసింది. అలాంటి ఈ సినిమా తరువాత అజయ్ భూపతి తయారు చేసుకున్న కథనే 'మహాసముద్రం'. ఇది మల్టీస్టారర్ సినిమా కావడంతో, హీరోలను సెట్ చేసుకోవడానికి ఆయనకి చాలానే సమయం పట్టింది. మొత్తానికి శర్వానంద్ - సిద్ధార్థ్ లతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.

విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాలో నాయికలుగా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనున్నారు. భారీ బడ్జెట్ తో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను, ఆగస్టు 19వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల వలన షూటింగును ఇంకా పూర్తిచేసుకోలేదు. త్వరలో గుమ్మడికాయ కొట్టనున్నారని అంటున్నారు. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. కొంతకాలంగా హిట్ మాట వినని శర్వానంద్ కి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement