మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం: ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి

19-07-2021 Mon 14:35
advertisement

ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో నేడు ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. దీనిపై ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రివిలేజ్ కమిటీ పారదర్శక రీతిలో కార్యకలాపాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సభలో 174 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ పైనా విమర్శలు చేస్తున్నారని, కొందరు సభ్యుల వైఖరిని ఆధారాలు సహా ప్రశ్నించినా వారి నుంచి స్పందన కరవైందని తెలిపారు. ఆశించిన రీతిలో స్పందించని సభ్యులను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినట్టు వెల్లడించారు.

టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ సరిగా లేదని, అందుకే ఆయనను మరోసారి వివరణ కోరగా, ఏమాత్రం బదులివ్వలేదని ఆరోపించారు. అందుకే ఆయనను వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరామని వివరించారు. శాసనసభ్యుల హక్కులు కాపాడడం తమ కర్తవ్యం అని కాకాణి పేర్కొన్నారు. ఎవరు ఎవరిపై వ్యాఖ్యలు చేసినా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

అటు, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కూడా హాజరు కావాలని కోరితే, ఆయన కరోనా నేపథ్యంలో రాలేనని జవాబిచ్చారని, ఆయనపై ఆగస్టు 10న జరిగే తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కాకాణి వెల్లడించారు.

ఈ సమావేశంలో మొత్తం 9 అంశాలపై చర్చించామని తెలిపారు. ఎమ్మెల్యేల ప్రోటోకాల్ అంశం కూడా అందులో ఉన్నట్టు వెల్లడించారు. కొన్ని అభివృద్ధి పనుల వద్ద శిలాఫలకాల్లో ఎమ్మెల్యేల పేర్లు ఉండకపోవడం, వాటిపై అధికారుల నుంచి సరైన వివరణ రాకపోవడం, శాసనసభ్యులకు సముచిత గౌరవం ఇవ్వకపోవడం, ఇతర ప్రోటోకాల్ ఉల్లంఘనలపై చర్చించినట్టు కాకాణి వివరించారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement