దేశ రోజువారీ కేసుల్లో 31 శాతం కేరళలోనే.. ఇవీ కారణాలు!

10-07-2021 Sat 12:51
advertisement

కరోనా మహమ్మారి మొదలైనప్పటి మాట.. కరోనా కట్టడిలో దేశంలోనే ముందుంది కేరళ. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది. అంతెందుకు కేరళను అన్ని రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకోవాలంటూ డబ్ల్యూహెచ్ వో కితాబునిచ్చింది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కోటి మందికిపైగానే టీకాలు వేసినా.. మిగతా రాష్ట్రాల్లో కట్టడిలోకి వస్తున్నా.. అక్కడ మాత్రం కరోనా కంట్రోల్ లోకి రావట్లేదు. కరోనా కేసులకు అభికేంద్రంగా ఉన్న మహారాష్ట్రను మించి కేసులు నమోదవుతున్నాయి. దేశంలో రోజూ వస్తున్న కేసుల్లో ఆ రాష్ట్రానివే 31.7 శాతమంటే అక్కడ కరోనా తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజువారీ మరణాల్లోనూ 15.6 శాతం కేరళవే. మరి, దానికి కారణాలేంటి?

ఏప్రిల్ 18 నుంచి ఏనాడూ కేసులు 10 వేల కన్నా తక్కువ నమోదు కాలేదు. ఈ వారంలో రోజూ సగటున 12,633 కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న 13,563 కేసులొచ్చాయి. రోజువారీ కేసుల్లో కేరళ వాటా 31.7 శాతం. వాస్తవానికి దేశ సగటు కేసులు 2.2 లక్షల నుంచి 42 వేలకు పడిపోయినా.. కేరళలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇటు మరణాలూ సగటు మరణాలు 21 నుంచి 127కి పెరిగాయి. అదే దేశంలో 1,226 నుంచి 803కి పడిపోయాయి.

వాస్తవానికి ఈ ఏడాది మార్చిలో కరోనాను ఆ రాష్ట్రం బాగానే కట్టడి చేసింది. రోజువారీ సగటు కేసులను 1,054 వద్దే ఉంచింది. పాజిటివిటీ రేటు కూడా 2.54 శాతంగానే నమోదైంది. కానీ, రెండు నెలలు తిరిగే సరికి పరిస్థితి మొత్తం తిరగబడింది. మే 12 నాటికి పాజిటివిటీ రేటు 29.75 శాతానికి పెరిగింది. ఆ తర్వాత పాజిటివిటీ రేటు తగ్గినా.. కేసులు మాత్రం 10 వేలకు తక్కువగా నమోదు కాలేదు. ప్రస్తుతం టెస్ట్ పాజిటివిటీ రేటు 11 శాతం దాకా ఉంది. అదే సమయంలో మేలో దేశ పాజిటివిటీ రేటు 22.77 శాతం ఉండగా.. ఇప్పుడు అది 2.32 శాతానికి తగ్గింది.

ఇవీ కారణాలు..

జనసాంద్రత: రాష్ట్రంలో జనసాంద్రత ఎక్కువగా ఉండడం, ప్రజలు బయట తిరగడం ఎక్కువ కావడం వంటి కారణాల వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ సుల్ఫి నూహ్ అన్నారు. అక్కడి ప్రజలు దగ్గరదగ్గరగానే నివసిస్తారని, ఒకరికొకరు రోజూ పలకరించుకోవడం, వారిని కలవడం వల్ల వ్యాప్తి ఎక్కువగా ఉంటోందన్నారు.

టెస్టింగ్: వాస్తవానికి దేశంలో రోజువారీ సగటు టెస్టులు 20.8 లక్షల నుంచి ప్రస్తుతం 18.2 లక్షలకు తగ్గాయి. కానీ, కేరళలో మాత్రం 1.15 లక్షల నుంచి 1.21 లక్షలకు పెరిగాయి. ఎక్కువ టెస్టులు చేస్తుండడం వల్ల కూడా కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయని కేరళ కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రాజీవ్ జయదేవన్ అంటున్నారు. అయితే, పీక్ లో గానీ, ఇప్పుడు గానీ బెడ్లు, ఆక్సిజన్ కొరత ఏర్పడింది లేదని చెబుతున్నారు. అయితే, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల్లోనూ దాదాపు అన్నే టెస్టులు చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో లక్షన్నరకుపైగానే పరీక్షలు జరుగుతున్నాయి.

శైలజ టీచర్: వాస్తవానికి కరోనా ప్రారంభంలో నాటి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజకే ఎక్కువ మార్కులు వెయ్యాలి. ఆమె ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్షలు చేశారు. అధికారులను అప్రమత్తంగా ఉంచారు. ఆది నుంచి టెస్టులు, ట్రేసింగ్, ట్రీట్మెంట్ పై దృష్టి సారించారు. దీంతో అప్పుడు కరోనా కట్టడిలో కేరళ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కానీ, వరుసగా రెండో ఏడాది అధికారంలోకి వచ్చిన సీపీఎం.. ఆమెను పక్కనపెట్టింది. ఆమె స్థానంలో వీణా జార్జ్ ను ఆరోగ్య మంత్రిగా నియమించింది.

ఆర్ వాల్యూ: ప్రస్తుతం కేరళలో ఆర్ వాల్యూ (ఒకరి నుంచి ఇతరులకు కరోనా వ్యాపించే రేటు) ఆందోళన కలిగిస్తోంది. ఆ విలువ ఒకటి కన్నా తక్కువగా ఉంటే మహమ్మారి తగ్గుముఖం పడుతున్నట్టు లెక్క. కొన్ని నెలల క్రితం రాష్ట్రంలో ఆర్ విలువ 0.7గా ఉండేది. కానీ, ఇప్పుడది 1.05కి పెరిగింది. అదే సమయంలో దేశ ఆర్ విలువ 0.85గా ఉంది. కాగా, కేరళలో ఇప్పటికే 31 శాతం మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ వేశారు. గత వారం వరకు రోజూ సగటున 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తే.. ఇప్పుడది లక్షకు పడిపోయింది. అదీ ఒకరకంగా కరోనా కేసులు పెరగడానికి కారణమవుతోంది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement