విజయవాడ పోలీసులకు చిక్కిన నరహంతక ముఠా

25-06-2021 Fri 06:54
advertisement

జల్సాల కోసం ఆధారాలు లేకుండా హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న నరహంతకముఠాకు విజయవాడ పోలీసులు బేడీలు వేశారు. గత తొమ్మిది నెలల్లో ఆరుగురిని హత్య చేసిన ఈ ముఠా మరో 12 మందిని టార్గెట్ చేసింది. అయితే అంతలోనే అనూహ్యంగా పోలీసులకు చిక్కారు.

 పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 12న విజయవాడ శివారు పోరంకిలోని ఏటీఎంలో కొందరు యువకులు చోరీకి యత్నించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి తాడిగడపకు చెందిన ఆటోడ్రైవర్ చక్రవర్తిని అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా చోరీకి యత్నించినట్టు అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో ముఠాలోని మిగిలిన యువకులనూ అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వేలిముద్రలను పరిశీలించగా గతేడాది కంచికచర్లలో జరిగిన వృద్ధ దంపతుల హత్యకేసులో నమోదైన నిందితుల వేలిముద్రలతో సరిపోలాయి. దీంతో పోలీసులు తమ శైలిలో విచారించగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. పోరంకి, తాడిగడప, కామయ్యతోపు ప్రాంతాలకు చెందిన ప్రభుకుమార్, గోపీరాజు, చక్కవర్తి, నాగదుర్గారావు ఆటో డ్రైవర్లు. ఫణీంద్ర కుమార్ పెయింటర్. వ్యసనాలకు బానిసలైన వీరందరూ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఉదయం  ఆటో నడుపుతూ, కూరగాయలు అమ్ముతూ రెక్కీ నిర్వహించేవారు. ముఖ్యంగా కాలనీలకు దూరంగా ఉంటున్న ఒంటరి వృద్ధులను లక్ష్యంగా చేసుకునేవారు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి హత్య చేసి అందినంత దోచుకునేవారు.

గతేడాది అక్టోబరులో పోరంకి విష్ణుపురం కాలనీకి చెందిన నళిని (58)ని హత్య చేసి దోచుకున్నారు. ఈ విషయం బయటకు రాకపోవడంతో మరింతగా చెలరేగిపోయారు. ఇలా తొమ్మిది నెలల్లో ఆరుగురిని హత్య చేసి డబ్బు, బంగారు నగలను దోచుకున్నారు. అనంతరం బాధితుల ఇళ్లపై నిఘా పెట్టి చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నారు? పోలీసులు వచ్చారా? అన్న విషయాలు తెలుసుకునేవారు.

ఆ తర్వాత అంత్యక్రియల వరకు అక్కడే గడిపేవారు. తాజాగా, మరో 12 మందిని హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారు. ఇప్పుడు వీరు పోలీసులకు చిక్కడంతో వారందరూ బతికిపోయారు. హత్యలని తెలియకుండా ఊపిరాడకుండా చంపేయడం ఈ ముఠా ప్రత్యేకతని పోలీసులు తెలిపారు. హత్యలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 40 తులాల బంగారం దొంగిలించి వాటిని తాకట్టు పెట్టి జల్సాలు చేశారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement