పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డిని సన్మానించిన ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా

08-06-2021 Tue 16:45
advertisement

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా సన్మానించారు. మంత్రిగా రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా మేకపాటిని గౌరవిస్తూ ఆమె శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి మెరుగైన పనితీరు కనబర్చారని రోజా కొనియాడారు. ఈ సందర్భంగా రోజాకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కరోనా పరిస్థితుల్లోనూ 1.5 శాతం వృద్ధిరేటు నమోదు చేశామని గౌతమ్ రెడ్డి వెల్లడించారు. సంక్షేమ పథకాలు, దీర్ఘకాలిక ప్రణాళికలతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఆక్వా, ఫార్మా, ఖనిజ రంగాల్లో దేశంలోనే మనది అగ్రస్థానమని పేర్కొన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణంపై దృష్టి సారించామని మంత్రి చెప్పారు. జులైలో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మలివిడతలో మరిన్ని ఫిషింగ్ హార్బర్లు వస్తాయని వివరించారు.

కర్నూలు విమానాశ్రయాన్ని ఇప్పటికే జాతికి అంకితం చేశామని, భోగాపురం విమానాశ్రయం కూడా త్వరితగతిన నిర్మాణం పూర్తిచేసుకోనుందని తెలిపారు. తమది ఒప్పందాలు మాత్రమే చేసుకునే ప్రభుత్వం కాదని, కార్యాచరణకు కృషి చేసే ప్రభుత్వమని మేకపాటి గౌతమ్ రెడ్డి ఉద్ఘాటించారు. కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ క్లస్టర్ కూడా రాబోతోందని వెల్లడించారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఎస్సార్ స్టీల్స్ ముందుకు వచ్చిందని వివరించారు.

2014-19 మధ్య కాలానికి సంబంధించి పరిశ్రమలకు చెందిన రూ.1,032 కోట్ల బకాయిలు చెల్లించామని చెప్పారు. కరోనా సంక్షోభం నెలకొన్నప్పటికీ రెండేళ్ల వ్యవధిలో 14 వేల ఎంఎస్ఎంఈలు స్థాపించామని, తద్వారా రూ.4,300 కోట్ల మేర పెట్టుబడులు సాధించామని తెలిపారు. ఎంఎస్ఎంఈల స్థాపనతో 88 వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారని మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో త్వరలోనే 30 నైపుణ్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధిలో ఏపీకి అసోచామ్ ప్రథమ ర్యాంకు ఇచ్చిందని అన్నారు. రాష్ట్రంలో బంగారు గనులకు అనుమతిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. విశాఖ గంగవరం పోర్టులో ప్రమోటర్లు మాత్రమే మారుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి వాటా ఏమాత్రం మారడంలేదని స్పష్టం చేశారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement