ఇది మా సెంటిమెంట్ కు సంబంధించిన విషయం: విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సీఎం జగన్

09-03-2021 Tue 13:41
CM Jagan once again wrote PM Modi

విశాఖ ఉక్కు కర్మాగారంలో కేంద్రం వాటాలను 100 శాతం వెనక్కి తీసుకుంటామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ స్పందించారు. విశాఖ ఉక్కు అంశంపై ఆయన ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాశారు. ఈ అంశంపై సీఎం జగన్ ఫిబ్రవరి 6న తొలి లేఖ రాశారు. కానీ కేంద్రం ఆయన లేఖను పరిగణనలోకి తీసుకోలేదన్న విషయం నిన్న నిర్మల సమాధానంతో వెల్లడైంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ మరోసారి లేఖ రాశారు.

"విశాఖ ఉక్కు కర్మాగారంలో 100 శాతం పెట్టుబడులు వెనక్కి తీసుకుని ప్రైవేటీకరణ చేసేది తథ్యమని పార్లమెంటులో ఈ నెల 8న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. ఈ నేపథ్యంలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి సమస్యను వివరిద్దామని భావిస్తున్నాను. అంతేకాకుండా నా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని వెల్లడించాలనుకుంటున్నాం.

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్య సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను నష్టాల బారినుంచి ఎలా గట్టెక్కించవచ్చో గత నెల 6వ తేదీన నేను రాసిన లేఖలో స్పష్టం చేశాను. పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ, అనేక పరిష్కార మార్గాలను విశదీకరించాను. స్టీల్ ప్లాంట్ ను నష్టాల నుంచి బయటికి తీసుకువచ్చి ఆర్థికంగా ఎలా బలోపేతం చేయవచ్చో వివరించాను. అయినప్పటికీ, అవేవీ పట్టించుకోకుండా.... కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లేందుకే తాము సిద్ధమని పార్లమెంటులో నిన్న ప్రకటించారు. తద్వారా ప్రైవేటీకరణపై తమ నిర్ణయం మారబోదని స్పష్టం చేశారు.

ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకువచ్చేది ఏంటంటే...  విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రధానంగా ఆంధ్రుల మనోభావాలకు సంబంధించిన విషయం. ఎంతో మంది త్యాగాల ఫలితం ఈ స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమ స్థాపన కోసం జరిగిన ఉద్యమంలో 32 మంది ఆత్మబలిదానం చేశారు. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' పేరిట దశాబ్దకాలం పాటు తీవ్ర పోరాటం చేసిన అనంతరం... 1970 ఏప్రిల్ 17న నాటి ప్రధాని విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఇప్పుడు దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం అంటోంది. దీన్ని లాభాల భాటలో నడిపించాలనుకుంటే అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాతృసంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఓ నవరత్న కంపెనీ. విశాఖ నగరంలో ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా 20 వేల మంది ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు. మరెంతో మంది పరోక్షంగా లబ్ది పొందుతున్నారు. భారతదేశంలో తీరప్రాంతంలో ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్లలో ఇది మొదటిది. పొడవైన ఉక్కు ఉత్పత్తులు రూపొందించడం ఇక్కడి స్టీల్ ప్లాంట్ ప్రత్యేకత. ఇక్కడ తయారైన ఉక్కును నిర్మాణ, మౌలిక సదుపాయాలు, తయారీ, ఆటోమొబైల్ రంగాల్లో విరివిగా ఉపయోగిస్తారు.

2002-2015 మధ్యకాలంలో ఈ సంస్థ నికర లాభాలు ఆర్జించింది. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ కు 19,700 ఎకరాల భూమి ఉంది. ఇది నగరప్రాంతంలో ఉండడం వల్ల దీని భూమి విలువే లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులు కాగా, ప్లాంట్ విస్తరణ కోసం భారీగా రుణాలు తీసుకోవడం జరిగింది. అయితే 2014-15 కాలంలో అంతర్జాతీయంగా ఉక్కు ధరల సంక్షోభం తలెత్తడంతో ఇక్కడి ప్లాంట్ కు కూడా నష్టాలు తప్పలేదు. ఓవైపు రుణభారం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ ప్లాంట్ కు సొంతంగా గనులు లేకపోవడం లాభాలపై తీవ్ర ప్రభావం చూపింది.

ఇలాంటి పరిస్థితుల్లో వైజాగ్ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం కంటే కేంద్రం ప్రభుత్వం కొంత సహకారం అందిస్తే చాలు... మళ్లీ లాభాల బాటలో పయనిస్తుందని గట్టిగా చెప్పగలను. అందుకు చేయాల్సిందల్లా... ఉక్కు కర్మాగారంలో నిరంతరం కార్యకలాపాలు కొనసాగించాలి. సొంత గనులు ఏర్పాటు చేస్తే పెట్టుబడి వ్యయం అదుపులోకి వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యర్థి సంస్థలకు సొంతంగా గనులు ఉన్నందువల్లే అవి మెరుగైన స్థితిలో ఉన్నాయి.

దీర్ఘకాలిక, స్వల్ప కాలిక రుణాలను వెంటనే ఈక్విటీలోకి మార్చాలి. తద్వారా మళ్లీ మళ్లీ చెల్లింపులు, వడ్డీల భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. అత్యధికంగా రూ.22 వేల కోట్ల రుణం ఉండగా, దానిపై వడ్డీరేటే 14 శాతం ఉంటుంది. బ్యాంకులు కూడా వడ్డీలను తొలగించి, రుణాలను ఈక్విటీలోకి మార్చాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను స్టాక్ ఎక్చేంజిలో లిస్టింగ్ చేయాలి. తద్వారా వాటాల అమ్మకంతోనూ కొంత ఒత్తిడి తగ్గుతుంది.

ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్య సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు 7 వేల ఎకరాలు నిరుపయోగ భూములు ఉన్నాయి. ఈ భూముల అమ్మకం కొంత ఆర్థిక వెసులుబాటు కలిగిస్తుంది. ఈ భూముల విక్రయానికి కావాల్సిన అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ నిర్ణయం కచ్చితంగా సంస్థను సుసంపన్నం చేస్తుంది. ఈ అంశాలన్నీ మీకు నేరుగా వివరించేందుకు అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోరుతున్నాను" అంటూ సీఎం జగన్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.


More Telugu News
Nobody can scare chandrababunaidu by throwing stones says nara lokesh
Punjab Kings posts huge total against Rajastan Royals
TDP leaders tries to meet Governor
Prakash Raj latest comments on Pawan Kalyan
Mamata banerjee will sit in Dharna against ECs decision of ban
Vakeel Saab unit clarifies about rumors
Chandrababu tries to enter SP Office in Tirupati
Corona effect Unemployment rate is increasing Again
Ambati Rambabu comments on Chandrababu protest in Tirupati
Mamata banerjee banned from campaigning for 24 hrs
Chandrababu protests against stone pelting at TDP rally in Tirupati
CM KCR conveys Ugadi wishes to Telangana people
Night curfew in haryana
NTR new movie with Koratala Siva announced
Covid cases in poll bound states increasing like anything
..more