కశ్మీర్లో కలవరం రేకెత్తిస్తున్న 'అతికించే బాంబులు'

28-02-2021 Sun 20:26
advertisement

ఉగ్రవాదుల కార్యకలాపాలు అధికంగా ఉండే కశ్మీర్ లో భద్రతా బలగాలకు ఇప్పుడో కొత్త సవాలు ఎదురవుతోంది. ఆఫ్ఘనిస్థాన్ లో తీవ్ర విధ్వంసానికి కారణమవుతున్న ఈ అతికించే బాంబులు (స్టికీ బాంబులు) ఇప్పుడు కశ్మీర్లోనూ కలకలం రేపుతున్నాయి. ఈ బాంబులు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. వీటిని ఓ అయస్కాంతం సాయంతో వాహనాలకు, ఇతర లోహపు వస్తువులకు అతికించవచ్చు. దూరంగా ఉండి వీటిని పేల్చవచ్చు. తద్వారా అధిక బీభత్సం సృష్టించడమే కాకుండా, ఉగ్రవాదులు క్షేమంగా తప్పించుకునే వీలుంటుంది.

గత కొన్నినెలలుగా జమ్మూ కశ్మీర్ లో జరిపిన అనేక సోదాల్లో ఈ అతికించే బాంబులు లభ్యమయ్యాయని సీనియర్ భద్రతాధికారులు వెల్లడించారు. ఇవి చాలా చిన్నవిగా కనిపించే ఐఏడీ బాంబులని, కానీ ఎంతో శక్తిమంతమైనవని కశ్మీర్ లోయ పోలీస్ చీఫ్ విజయ్ కుమార్ వివరించారు. ఈ తరహా బాంబులు కశ్మీర్లో భద్రతా బలగాల కదలికలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ తిరుగుబాటుదారులు ప్రారంభించిన ఈ అతికించే బాంబులు క్రమంగా భారత్, పాక్ సరిహద్దులకు చేరాయి. ఆఫ్ఘనిస్థాన్ లో అతికించే బాంబులు ఉపయోగించి భద్రతా దళాలను, జడ్జిలను, ప్రభుత్వ అధికారులను, సామాజిక ఉద్యమకారులను, పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. ఈ బాంబులను పాకిస్థాన్ నుంచి డ్రోన్లు, సొరంగ మార్గాల ద్వారా కశ్మీర్ కు తరలిస్తున్నట్టు విజయ్ కుమార్ తెలిపారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement