చేతికొచ్చిన పంట దొంగ వచ్చి కొట్టుకు పోయినట్టుగా మన కష్టాన్ని బీజేపీ తన్నుకుపోయింది: రేవంత్ రెడ్డి

07-12-2020 Mon 18:08
advertisement

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోరపరాజయంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైదొలగిన సంగతి తెలిసిందే. అయితే, పీసీసీ రేసులో ఎంపీ రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో, రేవంత్ రెడ్డి తన మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ కార్పారేటర్ అభ్యర్థుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గత ఆరేళ్లుగా కాంగ్రెస్ చేసిన పోరాట ఫలం కాస్తా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తన్నుకుపోయిందని అన్నారు. చేతికొచ్చిన పంట దొంగ వచ్చి కొట్టుకు పోయినట్టుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైందని అభివర్ణించారు. అయితే అదేమీ పెద్ద నష్టం కాదని, మనం మళ్లీ పుంజుకుంటాం అని రేవంత్ పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం కలిగించే ప్రయత్నం చేశారు. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేసేవాళ్లు ఎవరు, పనిచేయని వాళ్లు ఎవరు అనేదానిపై ఓ స్పష్టత వచ్చిందని తెలిపారు.

"అవకాశం రానివాళ్ల బాధను అర్థం చేసుకోవచ్చు. కానీ మీకు పనిచేసే అవకాశం వచ్చింది... అలాంటప్పుడు ప్రజల కోసం పనిచేయక దానికి అర్థం ఉండదు. అంతకంటే ఘోరతప్పిదం మరొకటిలేదు. మీకు నేనున్నా... ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమయంలోనైనా నూటికి నూరు శాతం మీరందరూ నా కుటుంబ సభ్యులు, నేను మీ కుటుంబ సభ్యుడ్ని. మీ కష్టాల్లో, మీ సుఖాల్లో, మీ సమస్యల్లో మీకు అండదండగా నేనుంటా. ఎవరూ అధైర్య పడవద్దు. మనకు ఓట్లు వేయని వాళ్లను వదిలేస్తే కనీసం మనకు ఓట్లు వేసిన వాళ్ల గురించైనా పట్టించుకోవాలి. పదవి లేదన్న బాధ వద్దు... పనిచేయడానికి పదవితో సంబంధం లేదు. మనందరం కలసికట్టుగా పనిచేస్తే ఎవరిపైన అయినా ఒత్తిడి పెంచవచ్చు" అని స్పష్టం చేశారు.

వాజ్ పేయి పాలన సమయంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, ఇక ఈ పార్టీ ఉంటుందా అని అన్నారని, కానీ యూపీఏ-1, యూపీఏ-2 ద్వారా కాంగ్రెస్ పాలించిందన్న విషయం మరువరాదని కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం నూరిపోశారు. చిన్న రాష్ట్రానికి సీఎంగా ఉన్న మోదీ ఇప్పుడు ప్రధాని అయ్యారని అన్నారు.

అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుకు ఎదురులేదని, ఆయన అపరచాణక్యుడని అనుకున్నారని, కానీ 2004 వచ్చేసరికి రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారని రేవంత్ రెడ్డి వివరించారు. 2009లో కేసీఆర్ పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్పొరేటర్లు కూడా దొరకలేదని, అదే కేసీఆర్ 2014లో సీఎం అయ్యారని తెలిపారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement